తప్పుడు ఆరోపణలు చేస్తూ రష్యాపై అమెరికా, ఐరోపాలు విధించిన ఆంక్షలు తిరిగి వాటి మెడకే చుట్టుకుంటున్నాయి. 2014 సంవత్సరంలో రెండవ త్రైమాసికం (ఏప్రిల్, మే, జూన్) లో ఇప్పటికే జి.డి.పి సంకోచాన్ని నమోదు చేసిన జర్మనీలో ఆగస్టు నెలలో పారిశ్రామిక ఉత్పత్తి మళ్ళీ సంకోచించింది. అనగా పారిశ్రామిక ఉత్పత్తి క్రితం నెలతో పోల్చితే వృద్ధి చెందడానికి బదులు కుచించుకుపోయింది. జర్మనీ ఆగస్టు వ్యాపార ఫలితాలు వెలువడిన వెంటనే అమెరికా, ఐరోపా దేశాల స్టాక్ మార్కెట్ లు నష్టాల్లోకి జారుకున్నాయి.
ఉక్రెయిన్ లో రష్యా జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ అమెరికాతో పాటు జర్మనీ తదితర యూరోపియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి విదితమే. కానీ జర్మనీకి రష్యా అతి పెద్ద వ్యాపార భాగస్వామి. దానితో రష్యాపై విధించిన ఆంక్షలు వెనక్కి వచ్చి జర్మనీ తలుపు తడుతున్నాయి. రష్యన్ గ్యాస్ కంపెనీలపై విధించిన ఆంక్షలు జర్మనీలో పారిశ్రామిక కార్యకలాపాలు మందగించడానికి దారి తీసింది. దానితో పాటు రష్యా విధించిన ప్రతీకార ఆంక్షల వల్ల రష్యాకు వెళ్ళే జర్మనీ ఎగుమతులు పడిపోయాయి. ఫలితంగా జర్మనీ పారిశ్రామిక ఉత్పత్తి ఆగస్టు నెలలో 4 శాతం పడిపోయింది. లేదా -4 శాతం వృద్ధి చెందింది.
జులై నెలలో జర్మనీ పారిశ్రామిక ఉత్పత్తి 1.6% వృద్ధి నమోదు చేసింది. కానీ ఆగస్టు నెలలో ఏకంగా 4 శాతం పడిపోవడంతో మూడో త్రైమాసికంలో నికరంగా -2.4 శాతం పారిశ్రామిక వృద్ధి నమోదు చేసినట్లయింది. సెప్టెంబర్ లో కూడా ఇదే పరిస్ధితి కొనసాగితే, తద్వారా మూడో త్రైమాసికంలో కూడా జర్మనీ ఆర్ధిక వ్యవస్ధ సంకోచం చెందితే ఇక జర్మనీ అధికారికంగా మాంద్యం (రిసెషన్) లోకి జారిపోయినట్లే.
జర్మనీ పారిశ్రామిక ఉత్పత్తి ఒక నెలలో 4 శాతం పడిపోవడం 2009 తర్వాత ఇదే మొదటిసారి. 2009 అంటే ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కాలం. ఆ కాలంలో దేశాలు సంకోచం, మాంద్యం తప్ప వృద్ధి అన్న మాట ఎరుగవు. అలాంటి కష్టకాలం నాటి గణాంకాలను జర్మనీ ఇప్పుడు నమోదు చేస్తోంది. ఐరోపాకు ముఖ్యంగా యూరో ఏరియా (17 దేశాల యూరో కరెన్సీ కూటమి) కు జర్మనీయే ఆర్ధిక నాయకురాలు. జర్మనీని ఐరోపాకు గ్రోత్ ఇంజన్ గా, ఎకనమిక్ ఇంజన్ గా అభివర్ణిస్తారు. అలాంటి జర్మనీ పరిస్ధితి మళ్ళీ కటకట దశకు చేరుకున్న సూచనలు వెలువడడంతో స్టాక్ మార్కెట్లు అప్రమత్తం అయ్యాయి.
ప్రముఖ అమెరికన్ వాణిజ్య పత్రిక బ్లూమ్ బర్గ్ ప్రకారం జర్మనీ ఆర్ధిక వ్యవస్ధలో ఊపు (momentum) తగ్గిపోతోంది. రష్యాతో నెలకొని ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆ వెంబడి అనుసరించిన వాణిజ్య ఆంక్షలు, జర్మనీ ఎగుమతులు ఎక్కువగా వెళ్ళే యూరో ఏరియాలో వృద్ధి కనాకష్టంగా ఉండడం… ఈ కారణాల వల్ల జర్మనీ ఆర్ధిక పరిస్ధితి బలహీన పడుతోందని పత్రిక తెలిపింది. యూరో ఏరియాలో ఆర్ధిక స్వస్ధత (recovery) లో ఊపు తేవడానికి భారీ స్టిములస్ ను యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు అమలు చేస్తోందని అయినప్పటికీ జర్మనీ వృద్ధి దిగజారిందని పత్రిక చెప్పడం గమనార్హం. భారీ ఆర్ధిక ఉద్దీపన కూడా జర్మనీ, యూరో జోన్ లను ఆదుకోలేకపోతున్న దన్నమాట!
ఆగస్టులో ఫ్యాక్టరీ ఆర్డర్లు 5.9 శాతం పడిపోయాయని ఇది కూడా 2009 నాటి స్ధాయిలోనే ఉన్నదని పత్రికలు తెలిపాయి. సెప్టెంబర్ నెలలో సైతం జర్మనీ మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి కుచించుకుపోయిందని కొన్ని వాణిజ్య పత్రికల సర్వేలో వెల్లడి అయింది. కొత్త ఆర్డర్లు అతివేగంగా తగ్గిపోతున్నాయని, వ్యాపార విశ్వాసం (బిజినెస్ కాన్ఫిడెన్స్) బాగా సన్నగిల్లిందని సర్వేలు చెబుతున్నాయి. పైగా నిరుద్యోగం వరుసగా రెండో నెలలో పెరుగుదల నమోదు చేసింది.
ఇతర వివరాలను చూస్తే ఆగస్టులో పెట్టుబడి సరుకుల ఉత్పత్తి 8.8 శాతం పడిపోయింది. మధ్యంతర ఉత్పత్తులు 1.9 శాతం తగ్గిపోయాయి. వినియోగ సరుకుల ఉత్పత్తి 0.4 శాతం పడిపోయింది. నిర్మాణ రంగం 2 శాతం క్షీణించింది. కేవలం విద్యుత్ రంగం మాత్రమే ముక్కీ మూలిగి 0.3 శాతం వృద్ధి చెందింది. కార్ల ఉత్పత్తి అయితే 1984 నాటి స్ధాయికి పడిపోయినట్లు తెలుస్తోంది.
జర్మనీ ఫలితాల వెల్లడి అనంతరం డాలర్ తో పోల్చితే యూరో విలువ 0.1 శాతం పడిపోయిందని బ్లూమ్ బర్క్ పత్రిక చెప్పగా ఈ పతనం 0.3 శాతం వరకూ ఉన్నదని రాయిటర్స్ తెలిపింది. అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. డౌ జోన్స్ స్టాక్ సూచిక 87 పాయింట్లు లేదా 0.51 శాతం నష్టపోయింది. ఎస్&పి 500 సూచీ 0.42 శాతం పడిపోయింది. నాస్ డాక్ సూచీ 0.45 శాతం పడిపోయింది.
ఐ.ఎం.ఎఫ్ నుండి కూడా జర్మనీ ప్రతికూల అంచనా ఎదుర్కొంది. జర్మనీ కోసం గతంలో తాను అంచనా వేసిన వృద్ధి రేటును తగ్గిస్తున్నట్లు ఐ.ఎం.ఎఫ్ ప్రకటించింది. 2014లో జర్మనీ 1.9 శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేశామని కానీ ఇప్పుడు దానిని 1.4 శాతానికి తగ్గిస్తున్నామని తెలిపింది. 2015 సం.కి వృద్ధి రేటు 1.7 శాతం నుండి 1.5 శాతానికి తగ్గిస్తున్నామని తెలిపింది.
సర్,నాదో చిన్న సందేహం-జర్మనీ ఆంక్షలవలన,రష్యా తన గాస్ సంభంధిత ఎగుమతుల నిలుపుదల వలన జర్మనీ,తద్వార యూరొపియన్ దేశాలు అటునుండి ఆమెరిక దేశాలలో మంధ్యం తాలూకు లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు! మరి ఇదే విధముగా రష్యాకు ఎటువంటీ ప్రతికూల ప్రభావాలు ఏర్పడలేదా?(ఖచ్చితంగా ఏర్పడి ఉంటాయని నా భావన!) ఏమైనా వివరాలు ఉంటే వీలైతే అందించగలరు!