ఎన్నికల నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభించిన ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ బి.జె.పికి అచ్చివస్తుందని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. చీపురు చేతబట్టి ఢిల్లీ వీధులను శుభ్రం చేస్తున్న ప్రధాని మోడి ఫోటోలు ఇప్పుడు భారత దేశంలో ఒక ప్రాచుర్య దృశ్యం. ఈ దృశ్య ప్రాచుర్యాన్ని సొమ్ము చేసుకునేందుకు మోడి నడుం బిగించారని కార్టూన్ సూచిస్తోంది.
లేదంటే ప్రభుత్వంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచాయో లేదో అప్పుడే కూటమి పాలనా రోజులకు కాలం చెల్లిందని మోడి ప్రకటించగలరా? ఒకప్పుడు విజయవంతమైన కూటమి యుగానికి ఆద్యురాలు బి.జె.పియే. అంతకుముందు కూడా కూటమి ప్రభుత్వాలు ఏర్పడినా అవి కొద్ది రోజులకే కూలిపోయాయి. ఎన్.డి.ఏ కూటమి ఏర్పాటు చేసి బి.జె.పి 5 యేళ్ళు పాలన పూర్తి చేశాకనే కూటమి రాజకీయాల్లోకి దిగక తప్పని పరిస్ధితి కాంగ్రెస్ కి వచ్చింది. అప్పటివరకూ మూడో ఫ్రంటూ, నాలుగో ఫ్రంటూ, ఐదో ఫ్రంటూ… అంటూ కాంగ్రెస్ కూటమి రాజకీయాలను ఎద్దేవా చేసింది.
మహా రాష్ట్ర ఎన్నికలకు గాను శివసేనతో బంధం తెంచుకున్న బి.జె.పి కూటమి రాజకీయాలకు కాలం చెల్లిందని ప్రకటించడం అత్యుత్సాహమా లేక నిజమా అన్నది ఫలితాలలోనే తేలవచ్చు. కానీ అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బీహార్ లలో ఓట్లు అనేక పార్టీల మధ్య చీలిపోయినందున కొద్ది ఓట్ల శాతంతోనే భారీ సీట్లు సాధించిన వాస్తవాన్ని మోడి అప్పుడే ఎలా మరువగలరు? ఆ సంగతి యు.పి ఉప ఎన్నికల్లో రుజువైంది కదా! బి.ఎస్.పి పోటీలో లేకపోవడంతో పోటీదారుల సంఖ్య తగ్గి మెజారిటీ సీట్లు ఎస్.పి కి దక్కాయి.
బహుశా ఈ ధైర్యంతోనే కూటమి రాజకీయాలకు కాలం చెల్లిందని మోడి ప్రకటించారేమో. ఎందుకంటే మహా రాష్ట్రలో ఇప్పుడు పోటీదారులు ఐదు శిబిరాల్లో ఉన్నారు. కాంగ్రెస్, ఎన్.సి.పి, బి.జె.పి, శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎం.ఎన్.ఎస్) లు బరిలో నిలిచి ఓట్లను ఐదు వైపులా లాగనున్నారు. ఎం.ఎన్.ఎస్ అన్నీ సీట్లకు అభ్యర్ధులను నిలబెట్టకపోవచ్చు. దానివల్ల ఓట్లు నాలుగు పక్షాల మధ్య చీలినా అదీ ఎక్కువే. ఈ అంచనాయే మోడి మంత్ర చీపురుపై వీర విహారం చేయడానికి పురిగొల్పిందా?
కార్టూన్ సూచిస్తున్న మరో విషయం మోడి తలపెట్టిన సుడిగాలి పర్యటన. ప్రచారం ప్రారంభిస్తూ మోడి తన అమెరికా పర్యటనను కూడా గొప్పగా చెప్పుకున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల మోడి సభలు జరగడాన్ని శివసేన విమర్శించడం బట్టి మోడి పర్యటనలు ఆ పార్టీ భయపెడుతున్నట్లే.