ప్రశ్న: విదేశాల్లో సబ్సిడీలు మనంత లేవా?


Farm subsidies in the U.S.

Farm subsidies in the U.S.

శశిధర్: 

శేఖర్ గారు, మీ బ్లాగ్ లో రెగ్యులర్ గా ఆర్టికల్స్ చదువుతుంటాను. అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణలు చాల బాగా వివరిస్తారు. అలాగె ఆర్థిక సంబంద విశ్లెషణలు కుడా బాగుంటాయి. సబ్సిడీలు వాటి ఆవశ్యకత గూర్చి చదివాను. ఈ మధ్య కాలంలో ట్రెడ్ ఫెసిలిటేషన్ అగ్రీమెంట్ గుర్చి చదివాను.

నా ప్రశ్న: భారత్ లో సబ్సిడిలు అంత ఎక్కువగ ఉన్నాయా? అభివ్రుద్ది చెందిన దేశాల్లో ఇస్తున్న సబ్సిడీల విలువ ఎంత? ఏయే  రంగాలకు సబ్సిడిలు ఎంత మొత్తంలో వెచిస్తున్నారు? మన సామాజిక అర్థిక పరిస్థితులను  బట్టి అవి సరిపొతాయా, ఇంకా పెంచాలా? లేదంటె  దేశంలో జరుగుతున్న సహజవనరుల దోపిడిని అరికడితే సబ్సిడిలు ఇవ్వడం సులువు అవుతుందా? ప్రస్థుతం ఉన్న సబ్సిడిలకు సంబందించి ఏమైన సంస్కరణలు చేయవచ్చా? చేస్తే అవి ఎలా ఉండాలి వివరించగలరు.

సమాధానం:

శశిధర్ గారూ, దేశ, విదేశాల్లోని, సబ్సిడీల గురించి మొత్తం ఒకేసారి చెప్పాలన్నట్లు ఉన్న మీ ప్రశ్న విస్తృతి చాలా పెద్దది. అధ్యయనం అనేది గైడెన్స్ ద్వారా తక్కువే సాధ్యపడుతుంది. స్వయం శ్రమ ద్వారా ఎక్కువ వీలవుతుంది. ఒకవేళ పేజీలకు పేజీలు మెటీరీయల్ రాసి/ముద్రించి మీ చేతుల్లో పెట్టినా, అలా ఎక్కేది తక్కువగానే ఉంటుంది. పైగా అలా చదివింది ఉన్నత పరీక్షల్లో ఉపయోగపడదు.

సబ్సిడీల ఆవశ్యకత గురించి మీకు అర్ధం అయిందని చెప్పారు గదా. దాని ఆధారంగా ఇతర సమాచారాన్ని మీరు సేకరించుకుని అధ్యయనం చేస్తే అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అలా పొందే విజ్ఞానం మీ శ్రమ, మీ సేకరణ, ఆయా వ్యక్తులు… తదితర అంశాలతో బంధించబడి మెదడులో చక్కగా నిక్షిప్తం అవుతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానో అర్ధం అయి ఉండాలి.

ప్రశ్న విషయానికి వస్తే:

ఇండియాలో ప్రజలకు చెల్లించే సబ్సిడీలు చాలా చాలా తక్కువ. భారత పారిశ్రామికవేత్తలకు, ఇతర ధనికవర్గాలకు చెల్లించే రాయితీలు, సబ్సిడీలు పోలిస్తేనే జనానికి చెల్లించేది తక్కువ. ఇక అమెరికా, ఐరోపా లాంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఇంకా ఇంకా తక్కువ.

ఉదాహరణకు ఇండియాలో పారిశ్రామికవేత్తలకు పన్ను రాయితీల ద్వారా ఇచ్చే సబ్సిడీలు 7 లక్షల కోట్ల పై చిలుకు ఉంటుంది. రైతులకు, పేదలకు వివిధ రూపాల్లో ఇచ్చే ఎరువులు, గ్యాస్, చమురు సబ్సిడీలు మొత్తం కలిపితే 2014-15 లో రు. 2,46,000 కోట్లు ఉంటుందని బడ్జెట్ లో అంచనా వేశారు. ఇది అమెరికన్ డాలర్లలో 41 బిలియన్ డాలర్లకు సమానం.

ఈ సబ్సిడీలో అధిక మొత్తం అవసరమైనవారికి లేదా ఉద్దేశించినవారికి చేరకపోవడం ఒక ముఖ్యమైన విషయం. ఉదాహరణకి ఎరువుల సబ్సిడీ దళారీలు, కంపెనీలు దారి మళ్లిస్తాయి. రైతులకు పంపిణీ చేయాల్సిన సబ్సిడీ ఎరువులను దారి మళ్లించి కాంప్లెక్స్ ఎరువుల తయారు చేయడం పెద్ద వ్యాపారం. పాత ముఖ్యమంత్రి బామ్మర్ది ఈ వ్యాపారంలో దొరికిపోయాడు. దొరకని దొంగలకు లెక్కలేదు.

ప్రజా పంపిణీ వ్యవస్ధ కింద పంపిణీ చేయాల్సిన బియ్యం పెద్ద మొత్తంలో దారి మళ్లించి ఇతర వ్యాపారాలకు వినియోగించడం కూడా పెద్ద వ్యాపారం. ఇప్పటి స్పీకర్ గారు తన గోడౌన్లలో భారీ పరిమాణంలో చౌక బియ్యం అక్రమంగా నిలవ చేసి దొరికిపోయిన సంగతి గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఇక గ్యాస్, పెట్రోల్, డీజెల్ సబ్సిడీల వెనుక అనేక ఆర్ధిక రాజకీయాలు నడుస్తుంటాయి. డీజెల్ కార్లు, పెట్రోల్ కార్లు తయారు చేసే కంపెనీలు ఇంధనం సబ్సిడీ వెనుక ఓ ముఖ్యపాత్ర పోషిస్తాయి. వారి మధ్య నడిచే పోటీలు ఈ సబ్సిడీలను ప్రభావితం చేస్తుంటాయి.

కనుక సబ్సిడీలు ఇవ్వడం వాస్తవానికి సమస్య కాదు. అవి దారి తప్పడమే అసలు సమస్య. ఈ సంగతి ప్రభుత్వాలూ అంగీకరిస్తాయి. దారి తప్పుతున్న ఉదాహరణలు లెక్కలేనన్ని బైటపడడంతో అంగీకరించక వాళ్ళకు తప్పలేదు మరి. కానీ సవరించేందుకు వారు ప్రయత్నించరు. వాళ్ళే ప్రభుత్వంలో కూర్చుంటే ఎలా సవరిస్తారు?

ఇలా అధికభాగం దారి తప్పే సబ్సిడీలపై ఏడ్చేవాళ్లు కంపెనీలకు ఇస్తున్న 7,00,000 కోట్ల రాయితీల గురించి నోరెత్తరు. ఇందులో సగం వసూలు చేసినా మన ఫిస్కల్ డెఫిసిట్ చాలా తగ్గుతుంది. ఇవి కాకుండా కంపెనీలకు దాదాపు ఉచితంగా భూములు పంచుతారు. అదేమంటే పారిశ్రామిక వృద్ధి అక్కర్లేదా అని అడుగుతారు. కానీ ఇలా తీసుకున్న భూములు తాకట్టుపెట్టి బ్యాంకుల్లో అప్పులు తీసుకుని వాటినీ ఎగవేయడమే సో కాల్డ్ పారిశ్రామికవేత్తలు చేసే పని. దానివల్ల బ్యాంకుల్లో ఎన్.పి.ఏ లు పెరుగుతాయి. వాటిని వసూలు చేయడం మాని ఒక శుభముహూర్తాన రద్దు చేసేస్తారు. ఎన్.పి.ఏ లు జీరో చేశామని గొప్పగా ప్రకటించేస్తారు. ఆ సొమ్ము ఎవరిది? జనానిది లేదా ప్రభుత్వానిది. ఇలాంటి లీకేజీలు వ్యవస్ధలో అడుగడుగునా కనిపిస్తాయి.

2014-15 బడ్జెట్ లో అంచనా వేసిన వ్యయం రు. 17,94,892 కోట్లు. అనగా సబ్సిడీ వ్యయం మొత్తం బడ్జెట్ వ్యయంలో 13.7 శాతం.

ఇప్పుడు ఇతర దేశాల సంగతి చూద్దాం. ఓ.ఇ.సి.డి అని దాదాపు 40 ధనిక దేశాల ఆర్ధిక కూటమి ఉంది. ఓ.ఇ.సి.డి సంస్ధ సేకరించిన వివరాల ప్రకారం కూటమి సభ్య దేశాలు తమ తమ బడ్జెట్ వ్యయాల్లో 30 నుండి 50 శాతం వరకు సబ్సిడీలపైన ఖర్చు పెట్టాయి. 2006లో జర్మనీ, గ్రీసు, ఆస్ట్రియా, ఇటలీ లాంటి దేశాల్లో సబ్సిడీల వ్యయం మొత్తం బడ్జెట్ లో 40 శాతం పైనే ఉంది.

ఈ దేశాల్లో డిఫెన్స్, పబ్లిక్ సెక్టార్ తదితర సామూహిక రంగాల కంటే వ్యక్తిగత సబ్సిడీలకే ఎక్కువ వ్యయం చేసే ధోరణి కూడా ఉంది. ఉదాహరణకి ఓ.ఇ.సి.డి దేశాలు వ్యక్తిగత వ్యయం (ఆరోగ్యం, పెన్షన్, నిరుద్యోగ భృతి, ఇతర సబ్సిడీలు) కోసం జి.డి.పి లో 25 నుండి 35 శాతం వరకు ఖర్చు చేస్తే ఉమ్మడి వ్యయం కోసం జి.డి.పిలో 10 నుండి 20 శాతం ఖర్చు చేశాయి.

అమెరికాలో కేవలం వ్యవసాయ సబ్సిడీలే 20 బిలియన్ల పై చిలుకు. 2012లో అమెరికా పంటల ఇన్సూరెన్స్ కు ఏకంగా 14 బిలియన్ డాలర్లు చెల్లించింది. యూరోపియన్ యూనియన్ లో సగటున సబ్సిడీల మొత్తం జి.డి.పి లో 35 శాతం వరకు ఉంటోందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. 2007 సం.లో చమురు సబ్సిడీ నిమిత్తం అమెరికా ఖర్చు పెట్టిన మొత్తం 49 బిలియన్ల నుండి 100 బిలియన్ల వరకు ఉంటుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేశారు. జులై 2014లో వేసిన అంచనాల ప్రకారం ఒక్క చమురు, గ్యాస్ సబ్సిడీల కోసమే అమెరికా యేటా సగటున 37.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఇది పైపు లైన్ల నిర్మాణం తదితర సబ్సిడీలను కలిపితే ఇది 52 బిలియన్ డాలర్లు ఉంటుందని మరో అంచనా.

సబ్సిడీలను కప్పిపుచ్చడానికి పలు పరోక్ష పద్ధతులను అవలంబించడం వల్ల సబ్సిడీల వాస్తవ మొత్తం ఎంతో అంచనా వేయడం నిపుణులకు ఒక సవాలు అక్కడ!

కనుక సబ్సిడీల విషయంలో ఇండియా చాలా చాలా తక్కువ వ్యయం చేస్తోంది. అందులో కూడా పెద్ద మొత్తం దళారీలకు వెళ్తోంది.

సహజవనరుల దోపిడిని అరికడితే సబ్సిడీలు అవసరం లేదా అన్నది సందర్భ సహితం కాదు. వాస్తవ ఉత్పత్తి ధరలకు, ప్రజల కొనుగోలు శక్తికి మధ్య ఉండే అంతరాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది. ఇలా ఇచ్చే సబ్సిడీల మొత్తం ప్రజల నుండి వసూలు చేసే పన్నుల మొత్తమే తప్ప ఎక్కడినుంచో రాదు. అనగా ప్రజల సొమ్మును తిరిగి ప్రజలకు ఇవ్వడమే. కానీ ఇలా తిరిగి ఇచ్చే మొత్తం లక్ష్యిత వర్గాలకు కాకుండా దోపిడి వర్గాలకు చేరడమే సమస్య. ఈ సమస్యను పరిష్కరిస్తే ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పెరుగుతుంది. అది మళ్ళీ ప్రభుత్వానికే చేరుతుంది. కానీ ధనికవర్గాలు కాజేయడం వల్ల అది నల్ల డబ్బుగానూ, స్విస్ బ్యాంకుల్లోనూ పేరుకుపోతుంది. మళ్ళీ ప్రభుత్వం వద్దకు రాదు.

కనుక సమస్య మూలం వ్యవస్ధలోనే ఉంది. ఈ వ్యవస్ధ శ్రామికులను దోచి సంపన్నులను మేపుతుంది. అనగా ఆదాయ పంపిణీ విలోమానుపాతంలో ఉంది. ఆదాయ పంపిణీని సవరించి సక్రమం చేయాలి. లేకపోతే పేద, ధనిక అంతరం అలవిగానంతగా పెరుగుతూ పోతుంది. ప్రజలు స్వయంగా సామూహిక చర్యలకు దిగేవరకూ ఇది కొనసాగుతుంది.

 

7 thoughts on “ప్రశ్న: విదేశాల్లో సబ్సిడీలు మనంత లేవా?

  1. నేను ఇంతకు ముందే ఈ విసయం మీద రాసాను.పరిశ్రమరంగానికి సబ్సిడీలు ఇవ్వడం మంచిదే.కాని సామాన్యప్రజలకు కూడా వారిపై భారం తగ్గించే సబ్సిడీలు ఇవ్వవలసిందే.దానికి అభ్యంతరం చెప్పనక్కర లేదు. ఐతే మీరనుకున్నట్లు పేదలకిచ్చే సబ్సిడీలు,సౌకర్యాలుబాగా దుర్వినియోగమౌతున్నాయని నేననుకోను.మన ఆంధ్రప్రదేశ్ విషయం మాత్రం చెప్పగలను.(ఇతర రాష్ట్రాల)సంగతి తెలియదు.విద్యా,వైద్య రంగాల్లో రాయితీలు,ఉచిత సౌకర్యాలు ఇంకా విస్తృతపరుస్తే మంచిది.

  2. రమణారావు గారూ, మీరూ నేనూ అనుకోవడం కాదు. ప్రభుత్వాలే ఈ సంగతి చెబుతున్నాయి. సబ్సిడీల్లో లీకేజీలు అరికట్టడానికే ఆధార్ కార్డులు అని మంత్రులు ప్రధానులు ఎన్నిసార్లు చెప్పలేదు? ‘డెలివరీ సిస్టం’ లో భారీ లోపాలున్నాయని ఫలితంగా సబ్సిడీలు దారి మళ్లుతున్నాయని చిదంబరం, మన్మోహన్, జైట్లీ తదితర పెద్దలు అనేకసార్లు చెప్పారు. సబ్సిడీలు అవి ఉద్దేశించబడిన నిజమైన లబ్దిదారులకు చేరడం లేదని ముఖ్యమంత్రులు, ఆర్ధిక మంత్రులు ఎప్పుడూ చెప్పేమాట.

    కాబట్టి ఇక్కడ మన ఊహలకు ఏమీ మిగల్లేదు. ఉన్నదంతా ప్రభుత్వాలే చెబుతున్నాయి.

  3. సబ్సిడీలను కప్పిపుచ్చడానికి పలు పరోక్ష పద్ధతులను అవలంబిస్తున్నరు అన్నారు కదా, అవి ఏమిటి? ఏ రూపంలో ఇస్తారు? గ్రీన్ బాక్స్ అంబర్ బాక్స్ గురించి వివరించగలరు.

  4. ఒరిస్సాలో ఎరువుల సబ్సిదీ ఇప్పటికీ ఉంది. ఆంధ్రలో 1998కి ముందు అనుకుంటాను, చంద్రబాబు నాయుడు ఎరువుల సబ్సిదీని రద్దు చేసాడు. విచిత్రమేమిటంటే input subsidy దండగ అని నమ్మిన చంద్రబాబు నాయుడు ప్రజల ఆదాయం ఏమాత్రం పెంచని దీపం లాంటి పథకాలకి డబ్బులు ఖర్చుపెట్టేవాడు.

  5. అమెరికన్ కంపెనీలు కరెన్సీ విలువ తక్కువగా ఉన్న ఇందోనేసియా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలలో ఎలెక్త్రానిక్ వస్తువులు తయారు చెయ్యించి, వాటిని దిగుమతి చేసుకుని, వాటి మీద తమ సొంత లేబెల్ వేసుకుని, తిరిగి వాటినే విదేశాలకి అమ్ముతాయి. ఇందోనేసియా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలలో కార్మిక చట్టాలు సరిగా లేకపోవడం కూడా అమెరికాకి కలిసి వచ్చే విషయం. ఈ పేద దేశాల కార్మికులు overtime శ్రమ చేస్తే అమెరికన్ సామ్రాజ్యవాదులు లాభాలు అర్జిస్తారు. ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది దాని ఆర్థిక విధానంపై ఆధారపడి ఉంటుంది. కేవలం సబ్సిదీల వల్ల ఆర్థిక అభివృద్ధి జరగదు. అందుకే నేను సబ్సిదీలు అనవసరం అన్నాను. అంతే కానీ “డబ్బులు చెట్లకి కాయవు” అని మన్మోహన్ సింగ్ లాంటివాళ్ళు చేసే ప్రచారాన్ని నేను నమ్మెయ్యడం కాదు.

  6. క్వింటాల్ ధాన్యం (చవక రకం) రైతు అమ్మే ధరే వెయ్యి రూపాయలు. కెజి లెక్కన అయితే అది పది రూపాయలు. రైతు దగ్గర కెజి పది రూపాయలకి ధాన్యం కొనే రైస్ మిల్లర్ దాన్ని బియ్యంగా ప్రాసెస్ చేసిన తరువాత దాన్ని అంగట్లో కెజి పదిహేను రూపాయలకైనా అమ్మాలి. రీటైలర్ అయితే దాన్ని కెజి ఇరవై రూపాయలకి అమ్మాలి. కానీ సబ్సిడీ బియ్యం కెజి రెండు రూపాయలకి (పద్దెనిమిది రూపాయల నష్టానికి) ఎలా అమ్ముడుపోతుంది? ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నుంచి చేసిన అప్పులతోనే ఆ సబ్సిడీ ఖర్చు భరిస్తోంది. ప్రపంచ బ్యాంక్ అప్పుల వల్ల ద్రవ్యోల్బణం వస్తుందని మార్క్సిస్ట్‌లందరికీ తెలుసనే అనుకుంటాను.

    మా ఊర్లో వ్యవసాయ కార్మికులకి కూలీ ధర నిరుడు యాభై రూపాయలు ఉండేది, ఇప్పుడు ఎనభైకి పెరిగింది. రోడ్డు నిర్మాణ కార్మికులకి కూలీ ధర నిరుడు వంద ఉండేది, ఇప్పుడు నూట యాభైకి పెరిగింది. కూలీలందరూ రోడ్డు నిర్మాణ పనులకి వెళ్ళిపోయి వ్యవసాయ పనులకి రావడం లేదు. ఆ ప్రాంతంలో ఫాక్టరీలు లేవు. ఆ రోడ్లు మావోయిస్ట్‌లని అణచివెయ్యడానికి వేస్తున్నవి తప్ప పారిశ్రామిక ఉత్పత్తిని పెంచడానికి కాదు. రైతులు రెండు వందలు రేట్ ఇచ్చి కూలీలని పిలిచినా, ప్రభుత్వం మూడు వందలకి రేట్ పెంచి ఆ కూలీల చేత రోడ్లు వెయ్యించుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద వేస్తున్న రోడ్లన్నీ ప్రపంచ బ్యాంక్ నిధులతో వేస్తున్నవే. ఫ్రీ స్కీముల వల్ల పారిశ్రామిక ఉత్పత్తి పెరగదు, పైగా దేశం అప్పుల్లో మునుగుతుంది కూడా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s