ట్విస్టర్లకు అమెరికా పెట్టింది పేరు. పెను తుఫాన్లకు, జల ప్రళయాలకు ఫిలిప్పైన్స్ పెట్టింది పేరు. కాగా జపాన్ అగ్ని పర్వత విస్ఫోటనాలకు పెట్టింది పేరు. గత సెప్టెంబర్ 27 తేదీన మౌంట్ ఒంటకే అనే పేరుగల అగ్ని పర్వతం చెప్పా పెట్టకుండా ఒక్కుమ్మడిగా బద్దలు కావడంతో ప్రమాదం ఊహించని పర్వతారోహకులు పలువురు దుర్మరణం పాలయ్యారు. వారు తలపెట్టిన సాహస యాత్రను మృత్యు యాత్రగా మౌంట్ ఒంటకే మార్చివేసింది.
మౌంట్ ఒంటకే, రాజధాని టోక్యోకు పశ్చిమ దిశలో 125 మైళ్ళ దూరంలో ఉంటుంది. మౌంట్ ఒంటకే పర్వత సముదాయం ట్రెక్కింగ్ చేసే జపనీయులకు ఇష్టమైన కొండలు. ప్రతి యేడూ ఈ కొండలను వందలమంది ట్రెక్కర్లు ఎక్కి దిగుతుంటారు. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ట్రెక్కర్లతో ఈ కొండలు రద్దీగా ఉంటాయి.
మౌంట్ ఒంటకే ట్రెక్కింగ్ కి ఎంతగా పాపులర్ అయిందంటే, ట్రెక్కర్ల కోసం ఈ కొండలపైన లాడ్జిలు, హోటళ్లు వెలిశాయి. పర్వత శిఖరానికి దాదాపు సమీపంలో కూడా లాడ్జింగ్ వసతులు కల్పించడంతో ట్రెక్కర్ల సంఖ్య మరింత పెరిగింది.
జపాన్ ఎలాగూ అగ్ని పర్వతాలకు నిలయం కనుక అక్కడి అగ్ని పర్వతాలను ప్రభుత్వాలు నిత్యం కనిపెట్టుకుని ఉంటాయి. వివిధ అగ్ని పర్వతాల చురుకుదనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి అంచనా వేస్తూ ట్రెక్కర్లకు సలహాలు ఇస్తుంటుంది. వాతావరణ వార్తల తరహాలో వోల్కనో యాక్టివిటీస్ వార్తలు జపాన్ లో సాధారణం. అలాంటి పరిస్ధితిలో కూడా మౌంట్ ఒంటకే విస్ఫోటనాన్ని ముందుగా ఊహించలేకపోయారు.
విస్ఫోటనం సంభవించే సమయానికి దాదాపు 300 మంది వరకు ట్రెక్కింగ్ లో ఉన్నారని తెలుస్తోంది. వారిలో 32 మంది ట్రెక్కర్లు చనిపోగా 50 మందికి పైగా తీవ్ర గాయాలతో బైటపడ్డారు. ఒక్కసారిగా పర్వతం బద్దలు కావడంతో ట్రెక్కర్లు హుటాహుటిన కిందికి దిగడం మొదలు పెట్టారు. ఒక పక్క బూడిద కుప్పలు తెప్పలుగా తమపై కురుస్తుండగా మరోవైపు పెద్ద పెద్ద రాళ్ళు దొర్లి పడుతూ వారిని మరింత కష్టపెట్టాయి.
ఈ రాళ్ళ వల్ల పలువురికి ఎముకలు విరిగి కదల్లేక ఉన్నచోటనే దాపు చూసుకుని ఉండిపోవాల్సి వచ్చింది. అనంతరం జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ బలగాలు హెలికాప్టర్లతో పైకి వెళ్ళి గాయపడినవారిని ఇతరత్రా కిందికి దిగలేకపోయినవారిని కాపాడారు. బూడిద ఎంత దట్టంగా ఎగిసిపడిందంటే హెలికాప్టర్లకు ఎగిరే వీలు లేక ఒక రోజంతా ట్రెక్కర్లు బూడిద, రాళ్ళ వర్షం మధ్య గడపవలసి వచ్చింది. బూడిద విడుదల కొద్దిమేరకు తగ్గిన తర్వాత హెలికాప్టర్లు, బలగాలు కొండమీదికి చేరగలిగాయి.
దేశం నిండా అగ్ని పర్వతాలు ఉన్నా వాటి వల్ల జనం చనిపోవడం అక్కడ చాలా తక్కువ. 1991 తర్వాత అగ్ని పర్వతాల వల్ల చనిపోయినవారు ఒక్కరూ లేరు. అగ్ని పర్వతాల చురుకుదనాన్ని ముందుగానే పసిగట్టి హెచ్చరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం వల్ల ఇది సాధ్యపడింది. అలాంటి జపాన్ పరిజ్ఞానాన్ని మౌంట్ ఒంటకే అపహాస్యం చేసినట్లయింది. ప్రకృతిని దాటి మానవుడు ఎంత ముందుకు వెళ్ళినా అతన్ని సవాలు చేసే శక్తి తనకింకా ఉందని ఆ ప్రకృతి మళ్ళీ మళ్ళీ సవాలు చేస్తూనే ఉంది. 2011 మార్చి 11 నాటి ఫుకుషిమా భూకంపం మరియు సునామీలు కూడా ఈ కోవలోనివే.
ఈ ఫోటోలను ది అట్లాంటిక్, రాయిటర్స్ పత్రికలు అందించాయి.