అమెరికా పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడి తన అదృష్టానికి తాను ఎంతో మురిసిపోయినట్లు ఆయన ప్రకటనల ద్వారా తెలిసింది. ప్రధాని పదవి చేపట్టిన కొద్ది రోజులకే అమెరికా అధ్యక్షుడిని కలిసే అవకాశం తనకు వచ్చిందని మోడి చెప్పుకున్నారు. తనకు వీసా ఇవ్వడానికి నిరాకరించిన అమెరికాయే ప్రధాని పదవి చేపట్టిన కొద్ది రోజులకే, తనకు రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానం పలికిందని ఈ మాటల ద్వారా మోడి ఎత్తి చూపారని చెబుతున్నవారూ లేకపోలేదు.
అమెరికా పర్యటనలో మోడి చెప్పిన మరో మాట ‘ఇండియా, అమెరికా సహజ మిత్రులు’ అని. ఒబామాతో కలిసి వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు రాసిన గెస్ట్ ఎడిటోరియల్ లో మోడి ఈ ప్రస్తావన తెచ్చారు. 2000 సంలో అప్పటి ప్రధాని వాజ్ పేయి చెప్పిన ఈ మాటలను ఒబామా కూడా గతంలో కొన్ని సార్లు చెప్పారు. ఇంతకీ ఇండియా, అమెరికా ఎలా సహజ భాగస్వాములు అవుతారో మోడి, ఒబామా చెప్పలేదు. ఇస్లామిక్ స్టేట్ కు వ్యతిరేకంగా అమెరికా కూడగడుతున్న ప్రపంచ కూటమి దేశాల్లో ఇండియా లేదు. ఇరాన్, సిరియా లాంటి దేశాలు లేకుండా ఐ.ఎస్ వ్యతిరేక కూటమి సాధ్యం కాదని ప్రధాని మోడి చెప్పినట్లు కొన్ని పత్రికలు చెప్పాయి. ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో ఇండియా పాలు పంచుకుంది గానీ దాడిలో కాదు.
ఈ నేపధ్యంలో ఇండియా, అమెరికాలు ఎలా సహజ భాగస్వాములో ఈ కార్టూన్ వివరిస్తోంది. అమెరికాకు ఇప్పుడు ఒక నల్ల జాతి వ్యక్తి అధ్యక్షుడు. మార్టిన్ లూధర్ కింగ్ నల్లజాతి వారి పౌర హక్కుల కోసం పోరాడిన వ్యక్తి. ఇక భారత స్వతంత్రం కోసం పోరాడిన గాంధీ మొదటి యుద్ధరంగం దక్షిణాఫ్రికాలోని శ్వేతజాత్యహంకార ప్రభుత్వమే. గాంధీ, మార్టిన్ ల వారసులుగా మోడి, ఒబామాలు ఇరు దేశాలకు అధినేతలుగా ఉన్న నేపధ్యంలో ఇండియా, అమెరికాలు సహజ మిత్రులేనన్న భావనను మోడి వ్యక్తీకరించారని కార్టూనిస్టు సంకేతాత్మకంగా సూచించారు.
వాస్తవం ఏమిటన్నది తర్వాత సంగతి!