‘నేను విశ్వ నరుడ్ని’ అని చాటుకున్నారు మహా కవి గుర్రం జాషువా. భారతీయ కుల వ్యవస్ధకు నిరసనగా అది ఆయన చేసిన మానవీయ ప్రకటన. ఈ విశ్వంలో నరులంతా పుట్టుకతో సమానులేననీ, నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధ మనిషి ఏర్పరుచుకున్నదే అనీ ఆయన విశ్వసిస్తూ, కులం లేని విశ్వంలో తన చోటును వెతుక్కున్నారు.
‘డెయిలీ లైఫ్’ శీర్షికన ఫోటోగ్రాఫర్లు విశ్వ వ్యాపిత జీవన దృశ్యాలను సేకరించి ప్రచురించే ఫోటోలు గుర్రం జాషువా ప్రకటనను గుర్తుకు తెస్తాయి. ప్రపంచంలో ఏ చోటికి పోయినా మానవుడి ఈతి బాధలు, సుఖ సంతోషాలు, పొట్ట కూటి వెంపర్లాట… అన్నీ ఒకే విధంగా కనిపిస్తాయి. ఆయా సంస్కృతుల జీవన పద్ధతుల వల్ల తేడాలు కనిపించినా, దండలో దారం లాగా, వాటిలో అంతర్గతంగా కనిపించే మానవుడి జీవన వేదన, తపన, వ్యక్తీకరణలు మాత్రం దాదాపు ఒకటే.
ఈ వాస్తవాన్నే బోస్టన్, ది అట్లాంటిక్ పత్రికలు ప్రచురించిన ఈ కింది ఫోటోలు తెలియజేస్తున్నాయి.