తమిళనాడు ప్రజల పురచ్చి తలైవి జైలు పాలు కావడంతో ఆమె నియమించిన మంత్రివర్గం రాజీనామా చేసింది. జయలలితకు నమ్మినబంటుగా పేరు పడి సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని ఒకసారి అధిష్టించి జయలలిత విడుదల కాగానే తిరిగి ఆమె పీఠాన్ని ఆమెకు అప్పగించిన పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కొత్త మంత్రివర్గమూ కొలువుతీరింది.
పేరుకు కొత్త మంత్రివర్గమే గానీ పాత మంత్రివర్గాన్నే పన్నీర్ సెల్వం కొనసాగించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రులు, ఎమ్మేల్యేలు వ్యవహరించిన తీరు ఓ విచిత్ర వాతావరణాన్ని అక్కడ సృష్టించింది. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు దాదాపు ప్రతిఒక్క మంత్రీ కన్నీరు పెట్టుకుంతూ ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి గారే భోరున ఏడుస్తూ కన్నీరు కాల్వలు కట్టించినపుడు ఇక ఇతర మంత్రులు ఏడ్వకపోతే తప్పవుతుంది. దాంతో బహుశా ఏడుపు రానివారు కూడా బలవంతంగా దుఃఖాన్ని కూడదీసుకుని, ప్రపంచం తల్లకిందులైపోయిందన్న భావాన్ని ఒలికిస్తూ ఆ నాలుగు ప్రమాణ పూర్వక మాటలు చెప్పి జైలు పాలయిన తమ నేతకు సహానుభూతి ప్రకటించారు.
మంత్రులందరూ వరసబెట్టి ఏడుస్తుంటే పాపం గవర్నర్ రోశయ్యగారికి ఏమీ పాలుపోలేదు. అప్పటికీ ఆయన మంత్రుల భుజం తడుతూ ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ ఓదార్చగానే కన్నీళ్లు ఆపేస్తే సీన్ రక్తి కట్టదు అనుకున్నారేమో, మంత్రులు తమ దుఖపూరిత ప్రమాణాన్ని కొనసాగించారు. ఏడుస్తూ ప్రమాణం పూర్తి చేసిన పన్నీర్ సెల్వం, పూర్తయ్యాక కూడా కళ్ళు తుడుచుకోవడం మానలేదు. దానితో ఇతర ఆహూతులు సైతం దిగాలు మొఖం పెట్టుకుని తలలు కిందికి వాల్చి తామూ దుఃఖంలో ఉన్నామని తెలిపారు.
ప్రమాణం అయ్యాక జైలుకెళ్లి జయలలితను పలకరించేందుకు అందరూ బెంగుళూరు ప్రయాణమై వెళ్లారు. కానీ జయలలిత వారిని కలవడానికి నిరాకరించారు. మంత్రివర్గం రాష్ట్రాన్ని పాలించాలి గాని ఇక్కడేం పని అన్నట్లుగా సందేశం ఇచ్చి పంపేశారు. ఆ విధంగా జయలలిత ప్రతిష్ట తమిళజన హృదయాల్లో ఒక మెట్టు పైకి ఎగబాకగా, ఆమె సహచర నేతల ప్రొఫైల్ ఒక మెట్టు దిగజారింది. వెరసి ఎ.ఐ.ఏ.ఎం.కె పార్టీలో అధినేత్రి ఏకఛత్రాధిపత్యం గ్యారంటీ చేయబడింది. ముఖ్యమంత్రి, మంత్రుల దుఃఖాన్ని కింద ఫొటోల్లో చూడవచ్చు.
కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గం బాధ్యత తమిళనాడును పాలించడం. ఆ పని మాని మంత్రులు జయలలిత జైలీకరణపై దుఃఖించడంలో మునిగిపోయారని కార్టూన్ వెక్కిరిస్తోంది.
అవి ఏడుపులు కాదు, దొంగ కన్నీళ్ళు.
ఎంతైనా ఉప్పుతిని మరిచి పోతారా? తిన్నైంటి వాసాలు లీక్కపెట్టే రకం కాదులెండి! అందుకే కదా ఆయన్ని నియమించుకున్నది? 🙂