మా వ్యతిరేక కూటమిలో ఇండియా చేరదు -చైనా


Xi Jinping in India

భారత ప్రధాని నరేంద్ర మోడి అమెరికా పర్యటన ముగిసిన నేపధ్యంలో పర్యటన అనంతర పరిస్ధితిని చైనా ప్రభుత్వ అధికార పత్రిక పీపుల్స్ డెయిలీ సమీక్షించింది. అమెరికా తన నేతృత్వంలో తలపెట్టిన చైనా వ్యతిరేక కూటమిలో ఇండియా చేరే అవకాశం లేదని మోడి అమెరికా పర్యటన ద్వారా గ్రహించవచ్చని పత్రిక పేర్కొంది. తమ అవగాహనకు కారణాలను పత్రిక వివరించింది. భారత విదేశీ విధానం పునాదులు అలీన ఉద్యమంలో ఉన్నందున ప్రపంచ ధృవ పోటీల్లో ఇండియా ఒక పక్షం వహించబోదని ఆశాభావం వ్యక్తం చేసింది.

బారక్ ఒబామా అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం ‘పివోట్ టు ఆసియా’ వ్యూహాన్ని అమెరికా ప్రకటించింది. ఈ వ్యూహం కింద అమెరికా తన మిలట్రీ వ్యూహ కేంద్రాన్ని ఆసియాకు తరలించనున్నట్లు తెలిపింది. ఆర్ధికంగా భారీ అంగలతో దూసుకెళ్తున్న చైనాను నిలువరించడానికే అమెరికా ఈ వ్యూహాన్ని ప్రకటించింది. నిజానికి బారక్ ఒబామా అధికారంలోకి రాక మునుపే అమెరికా తన ప్రపంచాధిపత్య మిలట్రీ వ్యూహ కేంద్రాన్ని ఆసియాకు తరలించే ఏర్పాట్లలో మునిగింది. మధ్య ప్రాచ్యంను యుద్ధ జ్వాలలలో రగుల్చుతూ ఆ జ్వాలలను ఆసియాకు విస్తరించే వ్యూహాన్ని అమెరికా స్ధిరంగా అనుసరిస్తోంది.

9/11 దాడుల సాకుతో ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేయడం, బిన్ లాడెన్ తో సంబంధం ఉందనీ, సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయని సాకు చూపుతూ ఇరాక్ ను దురాక్రమించడం, లిబియాలో శత్రుశేషాన్ని నిర్మూలించి ఆ దేశాన్ని టెర్రరిస్టుల కార్ఖానాగా మార్చడం, సిరియాలో కిరాయి తిరుగుబాటును ప్రవేశపెట్టి తద్వారా ఇరాన్ ను కబళించడం, అంతర్జాతీయ వేదికలపై తన వ్యూహానికి అడ్డు వస్తున్న రష్యాను లొంగదీసుకునేందుకు ఉక్రెయిన్ లో ప్రజాస్వామికంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని కూలదోసి విధ్వంసక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నిలపడం, నాటో కూటమిని రష్యా సరిహద్దులకు విస్తరించడం… ఇవన్నీ అమెరికా ప్రకటించిన పివోట్-టు-ఆసియా వ్యూహంలో భాగమే.

తన వ్యూహంలో భాగంగా ఇండియాను తన మిత్రదేశంగా చేర్చుకోవాలని అమెరికా సంకల్పించింది. అందుకే దశాబ్దాలుగా ఇండియాపై అమలు చేస్తున్న అణు ఆంక్షలను పాక్షికంగా ఎత్తివేస్తూ ‘పౌర అణు ఒప్పందం కుదుర్చుకుంది. ఆసియాలో చైనాను ఎదిరించి సమస్యలు సృష్టించే దేశంగా ఇండియాను నిలపాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే ఈ వ్యూహంలో ఇండియా భాగస్వామి కాబోదని చైనా పత్రిక పీపుల్స్ డెయిలీ, మోడి అమెరికా పర్యటన అనంతరం విశ్లేషించింది. ఈ విశ్లేషణ ఇండియా పాలకులను ఆకర్షించడానికా లేక నిజంగానే అది చైనా అవగాహనా అన్నది చర్చనీయం. తన అవగాహనకు పత్రిక ప్రధానంగా మూడు కారణాలు చెప్పింది.

మొదటిది ఇండియా అలీన నేపధ్యం. అలీన విదేశాంగ విధానంలో పునాదులు కలిగి ఉన్న ఇండియా చైనా స్నేహాన్ని కాలదన్నుకుని అమెరికాతో స్నేహంవైపు పూర్తిగా మొగ్గు చూపే పనికి పూనుకోదన్నది పీపుల్స్ డెయిలీ అభిప్రాయం. ఈ అంచనా నిజం అయితే అది ఇండియాకు అత్యంత ప్రయోజనకరం అనడంలో సందేహం లేదు. అమెరికాతో స్నేహం చేసి బాపుకున్న బలహీన దేశం ప్రపంచంలో లేనే లేదు. అమెరికా స్నేహంలో సమానత ఉండదు. అమెరికా చెప్పినట్టల్లా చేస్తేనే స్నేహం, లేదంటే శత్రుత్వమే. అమెరికా చెప్పింది వినడం అంటే దేశ ఆర్ధిక, రాజకీయ సార్వభౌమాధికారాన్ని అమెరికాకు పాదాక్రాంతం చేయడం. కనుక అమెరికాకు ఎంత దూరంగా ఉంటే ఏ దేశానికైనా అంత మంచింది. ముఖ్యంగా ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అది ఇంకా నిజం.

చైనా చెప్పిన రెండో కారణం: ఇటీవలే చైనా అధ్యక్షుడు ఇండియా పర్యటించినప్పుడు ఇరు దేశాలు ‘సన్నిహిత అభివృద్ధి భాగస్వామ్యం’ నెలకొల్పుకునేందుకు అంగీకరించడం. ఈ రీత్యా ఇరు దేశాల మధ్య పరిష్కారం కానీ సరిహద్దు భూభాగాల సమస్య ఇరు దేశాల సంబంధ బాంధవ్యాలకు ఆటంకం కాబోవని పీపుల్స్ డెయిలీ అంచనా వేసింది. లడఖ్ లో ఇటీవల తలెత్తిన ఉద్రిక్తతలను ఇరు సైన్యాలు తమ తమ పాత స్ధానాలకు వెనక్కి వెళ్లాలని అంగీకరించడం ద్వారా పరిష్కరించుకున్నాయని కనుక పీపుల్స్ డెయిలీ అంచనా ఈ అంశంలో నిజమే కావచ్చని కొందరు అంతర్జాతీయ విశ్లేషకులు వ్యాఖ్యానించడం విశేషం.

మూడో కారణం, చైనా దృష్టిలో అమెరికా తలపెట్టిన ‘ఆసియా పివోట్’ వ్యూహం, లేదా రీ బ్యాలన్సింగ్ సిద్ధాంతం ప్రధానంగా జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్ లలో ఆవిష్కృతం అవుతుంది తప్ప ఇండియాలో కాదు. జపాన్ లో 40,000 మంది అమెరికా సైనికులు తిష్టవేసి ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఈ సంఖ్య 50,000 దాటడం పరిపాటి. దక్షిణ కొరియాలో 35,000 మంది అమెరికా సైనికులు ఉండేవారు 2008లో బుష్ అధ్యక్షరికంలోని అమెరికాతో కుదిరిన ఒప్పందం మేరకు ఈ సంఖ్యను 28,500 కు తగ్గించారు. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా ఈ సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈ సం. జనవరిలో అదనంగా 800 సైనికులను, అత్యాధునిక ఆయుధాలను పంపేందుకు ఒబామా నిర్ణయించాడు.  ఆసియాలో రీ బ్యాలన్సింగ్ ప్రక్రియలో భాగంగా అదనపు సైనికులను పంపుతున్నామని అమెరికా ప్రకటించింది కూడా.  ఆస్ట్రేలియాలో కనీసం 2,500 మంది సైనికులను రొటేషన్ ప్రాతిపదికన నిలిపే ఒప్పందం ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. వారికి ఆస్ట్రేలియా మిలట్రీ వసతుల్లో ప్రవేశం కల్పించేందుకు ఒప్పందం వీలు కల్పిస్తోంది. అలాగే పెర్త్ లోని నౌకా స్ధావరంలోనూ అమెరికా సైన్యానికి ప్రవేశం ఇవ్వబోతున్నారు. ఫిలిప్పైన్స్ లో పదేళ్లపాటు అమెరికా సైన్యాన్ని తాత్కాలిక ప్రాతిపదికన (అవసరం వచ్చినపుడు) నిలిపే ఒప్పందాన్ని గత ఏప్రిల్ లో ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి.

ఆసియా-పివోట్ వ్యూహానికి ఆర్ధిక అనుబంధంగా అమెరికా అంతర్ పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందానికి రూపకల్పన చేసింది. ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్ షిప్ (టి.పి.పి) గా పిలిచే ఈ ఒప్పందం ప్రాధమిక లక్ష్యం చైనాను ఆర్ధికంగా కూడా నిల్వరించడం. టి.పి.పిలో జపాన్, ఆస్ట్రేలియా, న్యూ జీలాండ్, అమెరికా, కెనడా, పెరు, సింగపూర్, వియత్నాం దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అయితే వియత్నాం, ఫిలిప్పైన్స్ లాంటి ఆగ్నేయాసియా దేశాలు చైనాకు కోపం తెప్పించే పనిని ధైర్యంగా చేసే పరిస్ధితిలో లేవన్నది ఒక వాస్తవం. చైనాతో ఉన్న వ్యాపార సంబంధాలను అవి వదులుకోలేకపోవడం దీనికి కారణం. ఇండియా టి.పి.పి చట్రంలో ఇమిడేందుకు అవకాశమే లేదన్నది చైనా అభిప్రాయం. ఇండియా ప్రధానంగా దేశంలో ఎఫ్.డి.ఐ లను పెంచుకునేందుకే కేంద్రీకరించిందని, ఆర్ధిక వ్యవస్ధను పునరుద్ధరించుకునే ప్రయత్నంలో ఉన్నందున ప్రపంచ స్ధాయి విదేశీ వ్యూహాలపట్ల ఆసక్తి లేదని చైనా భావిస్తోంది.

చైనా అంచనాలు నిజం అయితే అది భారత ప్రజలకు సాపేక్షికంగా ప్రయోజనకరం కాగలదు. ఎందుకంటే వాణిజ్య ఒప్పందాలు, ఎఫ్.డి.ఐ ల విషయంలో అమెరికా విధించే అవమానకర విషమ షరతులను చైనా ఇంతవరకు ఏ దేశం పైనా విధించలేదు.

One thought on “మా వ్యతిరేక కూటమిలో ఇండియా చేరదు -చైనా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s