కవి, తెలంగాణ రాష్ట్ర వాసి పైడి తెరేష్ బాబు గారు చనిపోయారని మిత్రుల ద్వారా తెలిసింది. ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. కానీ ఉద్యమ భావజాల సంబంధం వ్యక్తిగత పరిచయాలకు అతీతమైనది. ఆ కారణం వలన ఆయనకు నాకు మధ్య భావాత్మక వారధిగా నిలిచిన ‘విభజన గీత’ను, సంస్మరణ కోసం పునర్ముద్రిస్తున్నాను.
పీడిత జనం ప్రపంచంలో ఏమూల ఉన్నా వారికి కూడా తెలియని ఒక సార్వజనీన ఏకత్వం వారి మధ్య ఏర్పడిపోయి ఉంటుంది. అది ఒక్కోసారి అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి రాకపోనూ వచ్చు. అనుభవంలోకి వచ్చినప్పుడు ఈ ఏకత్వం ఒక శక్తిగా మారుతుంది. వ్యక్తికి బహువచనం శక్తి అని ఎరుకపరుస్తుంది.
తెలంగాణ ఉద్యమం మరుగున పడిన ఎన్నో వజ్రాలను వెలికి తీసి సానపట్టింది. కానీ తెలంగాణ సమాజంలో అభ్యుదయ శక్తులు బలహీనంగా ఉండడంతో ఆ వజ్రాలు అంతిమ ప్రయోజనాన్ని అందుకోలేకపోయాయి. ఆటలు ఆడి, పాటలు పాడి, కవిత్వం రచించి… అనేకమంది తెలంగాణ ఉద్యమానికి చేదోడువాదోడుగా నిలిచారు. ఇంటర్నెట్ లో ఉద్యమానికి ప్రచారం కల్పించినవారిలో బహుశా తెరేష్ బాబు ఒకరై ఉండాలి. అందువలన ఆయన ఇష్టపడి రాసిన విభజన గీతను పునర్ముద్రించడం ఆయనకు తగిన సంస్మరణ కాగలదని భావిస్తున్నాను.
భగవద్గీత శ్లోకాలను అనుకరిస్తూ తెరేష్ బాబు తనదైన గీతను రచించారు. సమైక్యాంధ్ర పేరుతో కొన్ని ధనికవర్గాలు ప్రేరేపించిన బూటకపు సెంటిమెంట్లను తెరేష్ బాబు తన అనుకరణ శ్లోకాలతో తెగనాడారు. ఉద్యమ కార్యకర్తలకు ఉత్సాహం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా హాస్య చతురతతో చేయడం వలన ఈ రచనకు ఒక ప్రత్యేకత వచ్చి చేరింది. గీతను గానం చేసిన ఘంటసాల గొంతులోని గంభీరతను శ్లోక వివరణలోనే పట్టివ్వడం తెరేష్ బాబు ‘గీత’ లోని అనితర సాధ్యమైన ప్రత్యేకత. తెలిసిన నాలుగు మాటలను కలగాపులగం చేస్తూ శ్లోకం రాసిన అనుభూతిని పాఠకులకు ఇవ్వడం మరో ప్రత్యేకత. భాషాపరంగా ఈ శ్లోకాలకు అర్ధం ఉండదు గానీ అర్ధం ఉన్నట్లుగా ధ్వనింపజేస్తాయి.
‘అపార్ధా’ అంటూ సంబోధించడం ఒక చాతుర్యం. శ్రీకృష్ణుడు తన గీతను బోధించింది పార్ధుడికి. అందుకని పార్ధా అని సంబోధిస్తాడు కృష్ణుడు. అపార్ధా అనడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని అపార్ధం చేసుకోవద్దన్న అర్ధం స్ఫురిస్తుంది. అలాగే ఆల్రెడీ అపార్ధం చేసుకున్నవారిని ఎత్తిపొడవడమూ కనిపిస్తుంది. తాను చెప్పేది గీత అన్న సందేశమూ ఇస్తుంది. విభజన గీతలో ప్రధాన అంశం ‘అధిక్షేపణ’. అది గుర్తిస్తే మరొకందుకు ఉడుక్కునే బాధ తప్పుతుంది.
తెరేష్ బాబు నిజానికి జన్మతః తెలంగాణ వాసి కాదు. ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లాలో జన్మించిన తెరేష్ కవిగా, గాయకుడిగా ఆలిండియా రేడియోలో తెలంగాణలో ఉద్యోగం సంపాదించి అక్కడికి వెళ్లారు. అనంతరం హైద్రాబాద్ కు బదిలీ అయ్యి అక్కడే నివాసం ఏర్పరుచుకున్నారు. పీడిత జనుల హృదయం తెలిసినవాడు కనుక ప్రాంతానికి అతీతంగా తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు.
*** *** ***
విభజన గీత
పేరెంట్సో జన్మహ పేమెంట్సో విద్యతి! వన్ బై వనేస్య వరసస్య సంభవామి దగే దగే!
ఇంతోహి బతుకు ఇంటెనక మరణస్య! చర్చా ప్రహసనన కరిష్యాం జిల్ జిల్ జిగే!!!!
అపార్థా!
పేరెంట్స్ వలన జన్మము, పేమెంట్స్ వలన చదువు, చదువు వలన ఉద్యోగము, ఉద్యోగము వలన లంచము, లంచము వలన నేరము, నేరము వలన అరెస్టు, అరెస్టువలన బెయిలు,బెయిలు వలన పునర్జన్మము సంభవమగుచున్నవి.
అంతియె కాని ఉద్యోగ సంఘముల సమ్మె వలన సమైక్యాంధ్ర సిద్ధించునని ఎచటయునూ లిఖించబడలేదు. ఇంత బతుకు బతికి గృహము వెనుక మరణించినయట్లు… అను సామెతను అనుసరించి ఇంత సమ్మె జేసి సింపుల్ గా సైలెంటై పోవుట పరువుతక్కువ పనిగా భావించబడుచున్నది.
కనుకనే ముఖ్యమంత్రితో చర్చలు అను ప్రహసనము రచింపబడుచున్నది. చర్చలు జరుగుట , అవి సఫలమైనవని మీడియా ఎదుట పళ్ళికిలించుట, ఒకవేళ ప్రభుత్వం గనక మాట తప్పితే సమ్మెను ఉధృతం చేస్తామని తాళపత్ర ధ్వనులు [తాటాకు చప్పుళ్ళు] సృష్టించుట సహజాతి సహజం.
అనివార్యంబగు ఇట్టి లత్తుకోరు చేష్టలను గాంచి నీవు చింతింపతగదు. పండగ చేసికొనుము.
టిటిటిటిటీం టుట్టూం టుయ్యూం [ఇది విచిత్ర వీణానాదము]
*** *** ***
“బల్బో బస్సాహి సమ్మ్యామ్యహం
దీక్షో భగ్నాయ వినిర్గతీ!!!”
అపార్థా…!
ఆరే ప్రతి బల్బు వెలగక తప్పదు
ఆగే ప్రతి బస్సు కదలక తప్పదు
జరిపే ప్రతి సమ్మె ఆపక తప్పదు
చేసే ప్రతి దీక్ష భగ్నం కాక తప్పదు
ఇవన్నియు ఢిల్లీ వలననే సంభవించుచున్నవి
టీ టిటిటి ట్యూం టుయ్ [ఇది వీణా నాదము]
*** *** ***
కోతోహి చింపాంజీ నక్కస్య గోతో! మంత్రామ్యహి ముఖ్యోతి!
జీవస్య ఎంజీవం ద్రోహోర్మహి!బిల్లేచ పాసేణ ఢిల్లీ చిల్లీశ్యతి!!
అపార్థా…!
కోతుల యందు చింపాంజీ, నక్కల యందు గోతికాడ నక్క, నాయకుల యందు ఎన్జీవో నాయకుడు, మంత్రులలో ముఖ్యమంత్రి, ద్రోహుల యందు తెలంగాణ వ్యతిరేకి ఉత్తములుగా కీర్తింపబడుదురు. అట్టివారిని జూచి నీవు చింతింపవలదు. బిల్లు వచ్చుట ఖాయము. పాసగుట తధ్యము. లేని ఎడల ఢిల్లీ ఛిల్లీ యగుట నిక్కము.
పిపిపిపిపీ ఫ్యూం [ఇది వేణు నాదము]
*** *** ***
చంచలో గూడస్య చర్లపల్లిహి! గుణపాఠో నేర్పిష్యతి!
ఏకాంగ్రేసోపి ఎదిరిష్యతి ! చార్గిషీటో శరణం దుర్గతి!!
అపార్థా…!
కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన వారికి ఎట్టి దుర్గతి సంభవించునో చంచల్ గూడ చర్లపల్లాది జైళ్ళు వివరించుచున్నవి. అధిష్ఠానమును ధిక్కరించి రాజీనామాలు చేసినవారికి చార్జిషీట్లు తప్పవని సీబియయ్యాది సంస్థలు నిరూపించుచున్నవి.
నాకుట, పీకుట, శవాలపై చిల్లర ఏరుకొనుట తప్ప ఇతరములెరుగని కీలుబొమ్మలు రాజీనామాలు చేయుట, స్పీకర్ని కలియుట వంటివి ఒఠ్ఠి బోగస్ విషయములుగా నీవు గుర్తింప వలయును. మీడియా ముందు వారు వేయు కుప్పిగంతులను నీ వినోదార్థము ప్రదర్శించు నాటకములు గా భావించి సంతసింపుము.
భొయ్ భొయ్ భొయ్ భోయ్ య్ య్ య్ [ఇది తీర్థపు తడి ఎరుగని సమైక్య శంఖారావం]
*** *** ***
జేబోహి నతి ఔరంగ జేబస్య!బాబోహి కబాబహం!
సమ్యోహయతి సకలజనహ! మిమిక్రీణాం కరామ్యహం!!
అపార్థా…!
జేబులున్న ప్రతివారూ ఔరంగ జేబు కాజాలరు. బాబులగు ప్రతివారూ కబాబు కాలేరు [పొరపాట్న అశోకబాబు అనుకునేరు] సమ్మెలెన్ని జేసిననూ సకలజనుల సమ్మెకు సాటిరావు. పులిని చూసి వాతలు పెట్టుకున్న నక్కలు చిట్టచివరకు వాడవలసినది జాలిం లోషన్, జిందా తిలిస్మాత్ మరియూ జులాబ్ గోలీలు. ఇది తెర వెనుక దాగిన ఉ’పని’శక్తుల సారాంశము.
ఎంపీపీ డుం డుం డుం ఎంపీ పీ పీ డుం [ఇవి అమంగళ వాద్య విశేషములు]
*** *** ***
తొక్కో తోటకూరస్య పార్లో పిప్పరమెంటస్యచ!
చిప్పోహి చిప్పహ బస్సోపి కొలంబసహ గరీయసి!!
అపార్థా…!
బసులు సిలబసులు చిప్పులు షిప్పులు మాళ్ళు, రుమాళ్ళు పెరుమాళ్ళు బిట్లు హాబిట్లు ద్రవములు ఉపద్రవములు బాబులు రుబాబులు వాడలు బెజవాడలు పిప్పరమెంట్లు పార్లమెంట్లు ఘనములు జఘనములు సర్వము సకలము నాచే సృజించబడినవి. పదముల యందు పేర్లయందు సామ్యమున్నంత మాత్రమున కంప్యూటర్ చిప్ కరకరమని నములు ఆలూ చిప్ కానేరదు. బస్ సిలబస్ గానూ, సిలబస్ కొలంబస్ గానూ మారజాలవు.
నీవెంత గోకి గొడవ చేసి పాకి కిందబడి దొర్లాడిననూ ఏదియును మరియొకదానితో ఏకార్ధమును సాధింపజాలదు. కావున ఏకాభిప్రాయ సాధన తొక్కా తొటకూర వంటి పదబంధములను భవబంధములను విడనాడి విభజన దిశగా పయనించి విముక్తుడవు కమ్ము. ఇక కుమ్ము.
పపంప పంప పాం టటంట టంట టాం [ఇది శాక్సోఫోన్ నాదము]
*** *** ***
భార్యేతి భర్తంచ మధ్యస్య మసీర్హోర్మసి వంటింటిమసి!
ఇరుప్రాంతో సహోదరస్య నిర్భయ నివాస తత్వమసి!!
అపార్థా…!
భార్యా భర్తల మధ్య ఉండవలసింది ఇంటిమసీ యే గాని వంటింటి మసి కాదు. అట్టి విధముననే ఇరుప్రాంతముల వారిమధ్య ఉండదగినది సోదరభావమే గాని ఉదరభావము [పొట్టగొట్టుట యను వినాశకర భావము] కాదు.
ఈ తత్వమును గుర్తెరిగి, ఇప్పుడున్న పరిస్థితులయందు ఒకరికొకరు సహకరించుకొనుట యనునది అత్యంత ఆవశ్యకమగుచున్నది. ఇది గనుక సంభవమైనచో ఏ ప్రాంత వాసులైననూ ఎక్కడైననూ నిర్భయముగా నిశ్చయముగా ఆచంద్రతారార్కము నివసించ వీలగును. ఇది కష్టాదశ పురాణముల సారాంశము.
లలలూ లలలూ! లలల లలల లలలూ!! [అవునూ!!! ఇది ఏమి నాదము?]
*** *** ***
అల్పపీడనోపి సముద్రస్య కుయ్యోమొర్రో శోకిష్యతి
ఢిల్లీణాం రిమోటహ తిప్పస్య నల్లాం కిం పీకిష్యతి
అపార్థా…!
చిన్న అల్పపీడనమునకే ఎంతటి సముద్రమైననూ కుయ్యో మొర్రో అని దిక్కులు పిక్కటిల్లునటుల మొత్తుకొనును. అట్టి సత్యము గుర్తెరుంగక, ఢిల్లీ రిమోటు తిప్పితే గాని గిద్దెడు నీరుగారని ఒక నల్లా [కుళాయి] ఏకముగా తుఫానునే ఆపుదునని పల్కుట హాస్యాస్పద వ్యాఖ్యగాను కొండొకచో ప్రగల్భము గాను భావించబడుచున్నది.
ప్రజలను బ్రోచు ప్రభువులే ఇవ్విధమున మాటలాడుట వినాశకాలమును సూచించుచున్నది.
మ్యావ్ మ్యావ్ మెమ్మెమ్మె మేడం మై ఢిల్లీ ఆవూం?[ఇది గోడ మీది పిల్లి నాదము]
*** *** ***
నడిచే రైలోహ్యం స్టాపో శక్తి చైనతి మోటారోం సిగ్నలహ
ప్రాణేతి వెంటిలేటరహ సమైక్యవాదోణాం సెక్యూరిటీ హి
అపార్థా …!
రైలును ఆపగల శక్తి చైనుకు, మోటారు వాహనములను ఆపగల శక్తి ట్రాఫిక్ సిగ్నళ్ళకు, పోయే ప్రాణములను ఆపగల శక్తి వెంటిలేటర్లకు ఉన్నట్లే సమైక్యవాదులను అడ్డుకోగల శక్తి ఢిల్లీ పెద్దల సెక్యూరిటీ సిబ్బందికి కలదు.
వారినే ఒప్పించుట చేతకానివారు పెద్దలను ఒప్పించి విభజనను అడ్డుకుంటామని పల్కుట మిక్కిలి హాస్యాస్పదము.
వృం వృం వృం వౄం ం ం [ఇది రివర్సు గేరు నాదము]
*** *** ***
మేఘస్య ఢీం మెరుపంచ జోగీణాం ద్వయం భస్మహ
భజనోపి విభజనేతివ్యతిరేకం మూతస్య దంతహ నష్టహ
అపార్థా…!
మేఘములు రెండు ఢీ కొన్న మెరుపు రాలును. జోగీ జోగీ రాసుకున్న బూడిద రాలును. భజనా తత్పరత విభజన వ్యతిరేకత ఒకేనోట జాల్వారిన కారణమున మూతిపండ్లు రాలుచున్నవని విశ్వసనీయ వర్గములు ఘోషించుచున్నవి.
పిప్పీ పీ! పప్పీ పా !పెప్పెప్పె బెబ్బెబ్బె ![ఇది సన్నాయి నొక్కుల నాదము]
*** *** ***
మ్యాచ్చోహి ఫిక్సింగహ కిం కరిష్యోపి జగద్విదితహతహ
తీర్మాణాం అవిశ్వాసపి రక్షతి ప్రతిపక్షాం అనుభవిష్యతి
అపార్థా!
గతమున మేసిన దొంగగడ్డి కారణమున, చిప్పకూడు ఎచట తినవలసి రావచ్చునో యను భయము వలన, కేంద్ర, రాష్ట్ర పాలకపక్షముతో లోపాయికారీ మాచ్ ఫిక్సింగులకు పాల్పడి, శాసనసభయందు అవిశ్వాస తీర్మానము వీగిపోవునటులజేసి, ప్రజాకంటక ప్రభుత్వమును కాపాడిన ప్రధాన ప్రతిపక్షము వారే… మాచ్ ఫిక్సింగుల గురించి నేడు విమర్శించుచున్నారు. ఇది చిత్రములలోకెల్ల భళారే విచిత్రము. రథము దిగి కాస్సేపు పగలబడి నవ్వుకొందము. రమ్ము.
అయ్యో కుయ్యో మొర్రో [ఇది అస్తిత్వవేదనా నాదము]
*** *** ***
ఏకాం హి ద్వయో ఏకహ! ఏకాద్వయో త్రయంబకరాం!
త్రయోదశాంచ ద్వాదశహ! రిమోటాస్త్రాం ప్రయోగామ్యహం !
అపార్థా!
రెండు ఒకట్లు ఒకటి యని, ఒక రెండ్లు మూడు యని, మూడు ఒకట్లు పదమూడున్నర యని, పదమూడు ఒకట్లు పన్నెండుంబాతిక యని దేనికి తోచిన కథనము అది ప్రచురణము, ప్రసారము చేయుచున్నది. ఏ పత్రిక, ఏ చానల్ కథనము ఎట్లేడ్చిననూ బకరా వలె నమ్మక, రెండు ఒకట్లు రెండే యను గణిత సూత్రముననుసరించి రెండు రాష్ట్రముల ఏర్పాటు తప్పదను సత్యమును నీవు విశ్వసింపుము.
కొన్ని పత్రికలకు, చానళ్ళకు రెండో ఎక్కము కూడా సరిగా రాదను వాస్తవమును మరింత బలముగా విశ్వసించి వాటిపై రిమోటాస్త్రము ప్రయోగించు సమయమాసన్నమైనదని గుర్తించుము.
టంగ్ టంగ్ టంగ్ టట్టంగ్ టంగ్ [ఇది ప్రాధమిక పాఠశాల ఘంఠారావము మరియూ పరమశుంఠా నాదము]
*** *** ***
రణాన్నినాదోపి కరామి శంఖనాదస్య హేతుబద్ధహ పరిగణనాం
కారణోపి మూలాంచ విస్మరస్య మూలశంకో నాద వినిపిష్యాం
అపార్థా!
రణమునకు కారణములు, కారణములకు మూల కారణములు ఆధారములగుచున్నవి. ఇరుపక్షములు కలిగిన రణమునందు మ్రోగు శంఖము సమరశంఖారావమగును. మూలకారణములు విస్మరించి ఏక పక్షముగ మ్రోగు శంఖము మూలశంకా రావమగును [మొలలు మున్నగు వ్యాధి విశేషములతో కూడిన మిక్కిలి బాధాకరంబగు ఆర్తనాదము]
కోట్లఖర్చుతో కూడుకొనిన వోట్ల వ్యూహములకు మరికొన్ని నెలల వ్యవధి కలదు. కావున జనసమీకరణములు చేయుట మాని విభజన సమీకరణముల గురించి యోచింపుము. పదమూడు జిల్లాల ప్రత్యేక రాష్ట్రము కొరకు పోరాడుము.
హమ్మా నాయనా దేవుడా తండ్రీ [ఇది మూలశంకా నాదము]
*** *** ***
సమైక్యో జీవిత యపి మొత్తుకస్య విభాజిత పాలనం రహతి
విభజనోపి విముక్తస్య కహే ఏకతాం రహే పాలకానాం దుర్మతి
అపార్థా!
సమైక్యముగా ఉండెదమని మొత్తుకున్నపడు విభజించి పాలింతురు. విభజించి పాలించమని అడిగినపుడు సమైక్యముగా ఉండుడందురు.
కావున, పాలకులెప్పుడైనను దుర్మతులే ననియూ సర్వకాల సర్వావస్థలయందు వారు ప్రజా వ్యతిరేక విధానములనే పాటింతురను సత్యమును నీవు గ్రహించుము. ప్రజానుకూల నిర్ణయము ప్రకటించి అద్దానిని అమలు చేయు విషయమై కాలయాపన చేయుట వెనుక గల స్వార్ధ రాజకీయములను పసిగట్టుము.
టటటటాం టుయ్యుం టుక్కూం [ఇది వి+పరిణీత వీణా నాదము]