హాంగ్ కాగ్ ట్రబుల్డ్ వాటర్స్ లో పశ్చిమ చేపలవేట -ఫోటోలు


ఏదో ముతక సామెత చెప్పినట్లు హాంగ్ కాంగ్ లో కొనసాగుతున్న ‘ఆక్యుపై సెంట్రల్’ ఉద్యమం చూసి పశ్చిమ దేశాలు, పత్రికలు ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నాయి. చైనాలో ప్రజాస్వామ్యం(!) కోసం జనం ఏ కాస్త ఆందోళన చేసినా పశ్చిమ పత్రికల్లో రంగురంగుల ఊహాలు, అల్లికలు ప్రత్యక్షం అవుతాయి. అదే అమెరికాలో నల్లవారిపై పోలీసుల దాష్టీకంపై ఆందోళనలు జరిగినా, ఐరోపాలో పొదుపు విధానాలకు వ్యతిరేకంగా నెలలతరబడి ఆందోళనలు జరుగుతున్నా, ప్రభుత్వాల తీవ్ర అణచివేతలపై దృష్టి పెట్టడం అటుంచి ప్రజల ఆందోళనలే ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రచారం చేసి పెడతాయి.

హాంగ్ కాంగ్ లో కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున జనం వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనల్లో యువతరం అధికంగా పాల్గొంటోంది. హాంగ్ కాంగ్ ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ ముందు ఉన్న విశాలమైన మైదానంలో బైఠాయించి పలువురు ఆందోళనకారులు ‘ఆక్యుపై సెంట్రల్’ ఉద్యమం నిర్వహిస్తున్నారు. 1997లో హాంగ్ కాంగ్, చైనాలో విలీనం అవుతున్న సందర్భంగా చైనా ఇచ్చిన హామీల నుండి వెనక్కి మళ్లిందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. హామీ ఇచ్చినట్లుగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

చైనా ఇప్పటికీ తమ దేశంలో సోషలిస్టు వ్యవస్ధ ఉందని తన ప్రజలకు చెబుతుంది. (భారత దేశంలో కొన్ని కమ్యూనిస్టు పార్టీలు కూడా అదే చెబుతాయి.) మావో జెడాంగ్ పట్ల ప్రజల్లో ఇప్పటికీ ఉన్న ఆదరణ, గౌరవం వల్ల సోషలిజాన్ని తాము ఎప్పుడో త్యజించిన సంగతి వివిధ పదాడంబరాల మాటున దాచి పెడుతుంది. కానీ విదేశాల్లో అమెరికా, ఐరోపా రాజ్యాలతో వాణిజ్య కార్యకలాపాల సందర్భంగా తమది మార్కెట్ ఎకానమీ అని చైనా అధికారులు చెబుతారు. వాళ్ళు విదేశాల్లో చెప్పేదే నిజం.

1997లో ఇప్పటి స్ధాయిలో చైనా ఇంకా మార్కెటీకరణ చెందలేదు. అప్పటికి చైనా ఆర్ధిక శక్తి కూడా కాదు. కానీ మార్కెట్ ఆర్ధిక సంస్కరణలను శరవేగంగా అమలు చేస్తోంది. 1997 వరకు హాంగ్ కాంగ్ బ్రిటన్ ఆధీనంలో ఉండేది. లీజు ఒప్పందం ముగియడంతో హాంగ్ కాంగ్ ను బ్రిటన్, చైనాకు వెనక్కి ఇచ్చేసింది. ఆ సందర్భంలో ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. బ్రిటన్ ఎలాగూ మార్కెట్ ఎకానమీయే. చైనాలో కూడా మార్కెట్ ఎకానమీ ప్రవేశం పూర్తయింది. కానీ జనానికి మాత్రం సోషలిజమే అమలు చేస్తున్నామని చెబుతున్నారు. ఈ పరిస్ధితుల్లో హాంగ్ కాంగ్ లో మార్కెట్ ఎకానమీని సోషలిజంగా చెప్పడం చైనా పాలకులకు సాధ్యం కాదు. చైనాలో విలీనం అయ్యాక హాంగ్ కాంగ్ లోని మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధను ఏం చేయాలి అన్న ప్రశ్న దేశం ముందుకు వచ్చింది.

ఈ సమస్య పరిష్కారం కోసం చైనా పాలకులు ఒక కొత్త నడమంత్రపు సిద్ధాంతానికి తెర తీశారు. చైనా పెట్టుబడిదారీ సంస్కరణలకు ఆద్యుడయిన డెంగ్ జియావో పింగ్ హయాంలోనే ఈ పనికిమాలిన సిద్ధాంతం వల్లించారు. ‘ఒక దేశంలో రెండు వ్యవస్ధలు’ (One country, two systems) అన్నదే ఆ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం హాంగ్ కాంగ్ చైనాలో వీలీనం అయ్యాక చైనాలో సోషలిస్టు వ్యవస్ధ, హాంగ్ కాంగ్ లో మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధ (పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధ) కొనసాగుతాయని చైనా పాలకులు ప్రజలకు నచ్చజెప్పారు. ఇది అటు చైనాలో సోషలిస్టు సెంటిమెంట్లను, ఇటు హాంగ్ కాంగ్ లో బ్రిటన్ నుండి వారసత్వంగా సంక్రమించిన పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య సెంటిమెంట్లను జోకొట్టడానికి ఉద్దేశించిన సిద్ధాంతం. నిజానికి ఇది సిద్ధాంతం కాదు. సిద్ధాంతం పేరుతో ఇరు వైపులా ఉన్న ప్రజలను మోసం చేసేందుకు ఉద్దేశించిన ఎత్తుగడ.

విలీనం నాటి ఒప్పందమే ‘బేసిక్ లా’ గా హాంగ్ కాంగ్ లో అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఒక దేశంలో రెండు వ్యవస్ధలు 50 సం.ల పాటు కొనసాగుతాయి. ఈ లోపు, ఆ తర్వాత హాంగ్ కాంగ్ ప్రజల స్వేచ్ఛా హక్కులు భద్రంగా కాపాడబడతాయి.

ఈ బేసిక్ లా ఉల్లంఘించి తనకు ఇష్టం వచ్చిన పాలకులను హాంగ్ కాంగ్ పై రుద్దేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్నాయి. హామీ ఇచ్చినట్లు Universal Sufferage అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2017లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను మొదట చైనా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుందని ఇటీవల చైనా ప్రకటించడంతో ఆందోళనలు మొదలయ్యాయి.

చైనా ప్రకటన వాస్తవానికి బేసిక్ లా ఉల్లంఘన కాదు. ప్రజలందరికీ సమాన ఓటు హక్కు కల్పించడాన్ని Universal Suffrage (సార్వత్రిక ఓటు హక్కు) అంటారు. బేసిక్ లా ప్రకారం పోటీదారులను చైనా మొదట నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత మాత్రమే సార్వత్రిక ఓటు హక్కు అమలవుతుంది. ఎకాఎకిన సార్వత్రిక ఓటుహక్కు అమలు చేస్తామని బేసిక్ లా లో లేదు. కనుక బేసిక్ లా ను ఉల్లంఘించే సమస్యే లేదు.

హాంగ్ కాంగ్ ప్రజల్లో ఒక అసంతృప్తి గూడు కట్టుకుని ఉండడమే ప్రస్తుత ఆందోళనలకు మూల కారణం. ఆ మాటకొస్తే చైనా మెయిన్ ల్యాండ్ ప్రజల్లోనూ అసంతృప్తి పోగు పడి ఉంది. అమెరికా, ఐరోపా, ఇండియా… ఇలా దాదాపు ప్రతి దేశంలోనూ అసంతృప్తి రగులుతూ ఉంది. దానికి కారణం ఏ దేశంలోనూ ప్రజా ప్రభుత్వాలు లేకపోవడమే. ఉన్న ప్రభుత్వాలన్నీ ధనిక వర్గాల ప్రయోజనాల కోసం పనిచేసేవే తప్ప ప్రజల కోసం నికరంగా పని చేసే ప్రభుత్వాలు దాదాపు ఏ దేశంలోనూ లేదు. అసమానతలు ఉన్న వ్యవస్ధల లక్షణమే అంత.

ఇలా గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తి వెల్లడి చేసేందుకు తాజా చైనా ప్రకటన ఒక అవకాశం కల్పించింది. రబ్బరు బుడగ నిండా గాలి బిర్రుగా ఊదితే లోపలి గాలి, ఒత్తిడి వల్ల ఏదో విధంగా బైటపడేందుకు ప్రయత్నిస్తుంది. అది భౌతిక లక్షణం. ఆ ప్రయత్నంలో బుడగ ఉపరితలంలో రబ్బరు పొర ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ చీల్చుకుని గాలి బైటపడుతుంది. ఒకేసారి బైటపడడం వల్ల టప్ అని శబ్దం వస్తుంది.

హాంగ్ కాంగ్ లోనూ ఇదే జరుగుతోంది. హాంగ్ కాంగ్ ప్రజల్లోని అసంతృప్తి ఒక అవకాశం చూసుకుని బహిర్గతం అవుతోంది. ముఖ్యంగా హాంగ్ కాంగ్ యువతలో ఈ అసంతృప్తి మెండుగా ఉంది. స్ధానిక యువతరానికీ, విలీనం అనంతరం మెయిన్ ల్యాండ్ నుండి వలస వచ్చిన చైనీయులకు మధ్య అపనమ్మకపు పొర ఒకటి ఏర్పడి ఉంది. హాంగ్ కాంగ్ లో ఏదో బాపుకుందామని కుప్పలు తెప్పలుగా వచ్చిన వాళ్ళు స్ధానికుల ఉద్యోగావకాశాలను కుదించివేశారు. తక్కువ వేతనాలకు పని చేసేందుకు సిద్ధం అవడంతో స్ధానికుల వేతనాలు కూడా పడిపోయాయి. విద్య, వైద్యం, ఉద్యోగం… ఇలా వివిధ రంగాల్లో అవకాశాలు పలచబడ్డాయి. దీనికి ప్రత్యక్ష కారణంగా హాంగ్ కాంగ్ వాసులకు చైనా ప్రధాన భూభాగం నుండి వలస వచ్చినవారే కనిపిస్తున్నారు. ఇలా కుదించుకుపోయిన ఆర్ధిక అవకాశాలు రాజకీయ అసంతృప్తిగా మారి రాజకీయ డిమాండ్ల రూపాన్ని సంతరించుకుంది.

ఈ నేపధ్యంలో తలెత్తినదే ఆందోళనకారుల సార్వత్రిక ఓటు హక్కు డిమాండ్. నిజానికి ఈ డిమాండ్ వల్ల హాంగ్ కాంగ్ ప్రజలకు అదనంగా ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. సార్వత్రిక ఓటు హక్కులు ఉన్న సో కాల్డ్ ప్రజాస్వామ్య దేశాల్లో ఏ మాత్రం ప్రజాస్వామ్యం ఏడ్చింది గనుక హాంగ్ కాంగ్ లో ఏడవడానికి? ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకునే దేశాల్లో వాస్తవంగా అమలులో ఉన్నది బూర్జువా నియంతృత్వం తప్ప ప్రజాస్వామ్యం కాదు. ఓటు హక్కు తమ నెత్తిపై ఎవరు కూర్చోవచ్చో జనం ఎంచుకోవడానికి ఇచ్చిన హక్కు. ఎవరు గెలిచినా వారు కూర్చునేది జనం నెత్తిపైనే. ఇలాంటి హక్కు వల్ల హాంగ్ కాంగ్ ప్రజలకు అదనంగా ఒరిగేది ఏమీ ఉండదు. హాంగ్ కాంగ్ లో బ్రిటన్ ప్రాపకంలో ఉన్న పెట్టుబడిదారీ శక్తులకు మరింత leverage ఇవ్వడానికి మాత్రమే సార్వత్రిక ఓటు హక్కు ఇస్తుంది.

హాంగ్ కాంగ్ ఆందోళనకారుల డిమాండ్ కూ, ‘బేసిక్ లా’ ఒప్పందంలో చైనా అంగీకరించిన దానికి ఒకటే తేడా. చైనా నామినేట్ చేసిన కొందరు వ్యక్తులు మాత్రమే పోటీ చేస్తారని ఒప్పందం చెబుతుంది. చైనా నామినేషన్ ప్రక్రియ ఉండకూడదని ఆందోళనకారుల డిమాండ్. తరిచి చూస్తే ఇది బ్రిటిష్ ప్రాపకంలోని ధనికవర్గాల డిమాండ్ అని అర్ధం అవుతుంది.

హాంగ్ కాంగ్ 1997 నుండి చైనాలో భాగం అయింది. ఆ పరిస్ధితి సార్వత్రిక ఓటు హక్కు వల్ల మారదు. ఆర్ధిక వ్యవస్ధల పరంగా చూస్తే హాంగ్ కాంగ్ లో ఉన్న వ్యవస్ధే చైనా లోనూ ఉంది. కనిపిస్తున్న తేడా కేవలం పైపై ఉపరితలం లోనిదే. అది పునాదిలోని లేదా స్వభావంలోని తేడా కాదు. కనుక హాంగ్ కాంగ్ ప్రజల డిమాండు మరింత ముందుకు వెళ్ళాలి. అది చైనా ప్రజలను కూడా సమానంగా చూడాలి. ప్రజలందరికీ ఉపాధి సౌకర్యం కల్పించే వ్యవస్ధను డిమాండ్ చేయాలి. కొద్దిమంది ధనికుల డిమాండ్లను తమవిగా చేసుకున్నామని హాంగ్ కాంగ్ యువతరం గుర్తెరగాలి. పశ్చిమ ప్రజాస్వామ్య ఎండమావుల్లో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని అది కేవలం జిలుగు వెలుగుల మాయాజలతారు మాత్రమేనని వారు తెలుసుకోవాలి.

చైనా ప్రభుత్వం వరకు చూస్తే ఇప్పటివరకూ తీవ్రమైన అణచివేత పద్ధలకు దిగలేదు. అమెరికా, ఐరోపా రాజ్యాలు అమలు చేసిన అమానవీయ అణచివేత పద్ధతులకు ఇంకా దిగలేదు. పైగా హాంగ్ కాంగ్ ప్రభుత్వం జరిపించిన భాష్పవాయు ప్రయోగం, పెప్పర్ స్ప్రే ప్రయోగాలను చైనా అధికార పత్రికలు విమర్శించాయి. సంయమనం పాటించాలని హితవు పలికాయి. చైనా జాతీయ సెంటిమెంట్లకు పెట్టింది పేరయిన అధికారిక ఆంగ్ల పత్రిక గ్లోబల్ టైమ్స్ సైతం హాంగ్ కాంగ్ ప్రత్యేక పాలనా ప్రాంత ప్రభుత్వ బలప్రయోగాన్ని విమర్శించింది. ఈ విమర్శల వెనుక పరిస్ధితి చేయిదాటిపోతుందేమోనన్న చైనా పాలకుల ఆందోళన కనిపిస్తోంది.

టియర్ గ్యాస్ ను విస్తృతంగా ప్రయోగించడం వల్ల ప్రయోజనం లేదని, ఓపిక వహిస్తే ఆందోళనకారులు వెనక్కి వెళ్తారని చైనా ప్రభుత్వం ప్రస్తుతానికి భావిస్తోంది. ఒకవేళ అలా జరగకపోతే అణచివేత తీవ్రం చేసినా ఆశ్చర్యం లేదు. ఆందోళనలు అదుపు తప్పితే విరమిస్తామని ఆందోళన నాయకులు ప్రకటిస్తున్నందున ఆ ప్రమాదం లేకపోవచ్చు. అదుపు తప్పితే చూసి తరించాలని మంటల్లో చుట్టలు కాల్చుకునేందుకు అలవాటు పడ్డ పశ్చిమ ప్రజాస్వామ్య ఛాంపియన్లు భావిస్తున్నాయి. వెరసి హాంగ్ కాంగ్ ఆందోళనలు ఒకానొక కోణంలో పశ్చిమ-చైనా శిబిరాల మధ్య ఏర్పడి ఉన్న ప్రపంచ ధృవాత్మక వైరుధ్యాల వ్యక్తీకరణగా కూడా చూడవలసి ఉంటుంది. ఆందోళనల్లో పశ్చిమ పాత్ర ఏ మాత్రం ఉందన్నదానిపై ఆధారపడి ఈ వ్యక్తీకరణ బలం ఆధారపడి ఉంటుంది. అటువంటి సూచనలు ఇంకా స్పష్టంగా వెల్లడి కావలసే ఉంది.

Photos: The Atlantic, CNN

2 thoughts on “హాంగ్ కాగ్ ట్రబుల్డ్ వాటర్స్ లో పశ్చిమ చేపలవేట -ఫోటోలు

  1. sir,
    i see this article much more bisaed towards the chinese domination over the hongkongers and aganist liberal democratic principles.Those people are working for there basic poltical rights which can be attained by decreasing the domination of the auhtoratative and totalatrian maniland chinese governement rule over them.Al though there exists some flaws in the system of democracy as it said to be more or less in the hands of the few capitalists but in my view there exists some kind scope for normal middle class and proletarians to influence the government through various pressure groups.But we cant able to find such kind of environment in communistic chinese type of government who ruthlessely massacarred more than 9000 non violent demonstrators asking for democratic reforms in tinnamen square.But one thing i can tell, we cant able to compare the liberal so called western deomocratic governments to that of the communistic chinese govt ,where some kind of individual rights prevails in the former when compared to later.Always there exists conflicting views between these forms but this is my personal opinion.sir i am requesting u to comment on this post and enlighten me if there is any thing wrong in my way of thinking.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s