ఈ పెద్దాయనను ఎలా అర్ధం చేసుకోవాలి?


Kalyanasundaram

పై ఫోటోలో సూటు బాబుల మధ్య వినమ్రంగా నిలబడ్డ పెద్దాయన పేరు కళ్యాణ సుందరం. ఆయన గురించి తెలుసుకుంటే ఆశ్చర్యంతో నోట మాట రాక స్ధాణువులమై పోతాం. తన సర్వస్వం అవసరంలో ఉన్నవారి కోసం ధారపోసిన కళ్యాణ సుందరం లాంటి పెద్ద మనుషుల్ని చూస్తే మనమూ మనుషులమైనందుకు కాస్త గర్విస్తాం. ఆయనతో ఏదో విధంగా సంబంధం కలుపుకుని ఇంకా గర్వించడానికి ప్రయత్నిస్తాం. ఈయన తెలుగు వారై ఉంటే కాస్త ఎక్కువ గర్వపడదాం అనుకున్నాను. తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు గనక మన పక్క రాష్ట్రం వారే అన్న గర్వంతో సరిపుచ్చుకున్నాను.

ఇంతకీ ఆయన ఏం చేశారు?

ఈ ప్రశ్న కంటే ‘ఏం చేయలేదు?’ అని అడగడం ఉత్తమం.

కళ్యాణ సుందరం గారు ఒక లైబ్రేరియన్. భారత దేశంలో అత్యుత్తమ లైబ్రేరియన్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించి మెచ్చిన గొప్ప లైబ్రేరియన్. ఆయన తన 35 సంవత్సరాల సర్వీసులో ప్రతి ఒక్క నెల వేతనంలో ప్రతి ఒక్క పైసాను అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఇచ్చేశారు. తాను రిటైర్ అయ్యాక రు 10 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే ఆ మొత్తాన్ని కూడా అవసరం ఉన్నవారికి ఇచ్చేశారు. ప్రపంచంలో తన సంపాదన మొత్తాన్ని సంపూర్ణంగా పరుల కోసం వినియోగించిన ఏకైక వ్యక్తి ఈయనేనట.

కళ్యాణ సుందరం గారి సేవలను గుర్తించిన అమెరికా ప్రభుత్వం ‘మేన్ ఆఫ్ ద మిలీనియం’ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఈ అవార్డు కింద ఆయనకు రు. 30 కోట్ల రూపాయలు ముట్టింది. ఆ మొత్తాన్ని కూడా యధావిధిగా ఛారిటీ కార్యకలాపాలకే ఖర్చు చేశారు. ఈయన గురించి తెలుసుకుని తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ గారు తన తండ్రిగా దత్తగత తీసుకున్నారుట. ఆయనకు పెళ్లి కాలేదు. కాదు, ఆయన పెళ్లి చేసుకోలేదు.

మరి ఎలా బతికారు? తన పొట్టగడవడానికి లైబ్రేరియన్ విధుల అనంతరం ఆయన అనేక చిన్న చిన్న పనులు చేశారు. చాలాకాలం పాటు సర్వర్ గా పని చేసి ఆ మొత్తంతో కడుపు నింపుకున్నారని తెలిస్తే అర్జెంటుగా వెళ్ళి ఆయన కాళ్ళకు దండం పెట్టాలనిపిస్తుంది. తన కార్యకలాపాలకు ఆయన ఇచ్చిన వివరణ చాలా సామాన్యమైనది. పెద్ద పెద్ద సిద్ధాంతాలేమీ ఆయన చెప్పలేదు.

ఏదో ఒక విధంగా మనం సమాజానికి ఎంతో కొంత ఇవ్వనిదే మొదట మనల్ని మనం పోషించుకోలేము. సామాజిక మంచి కోసం ఒక్కరైనా సరే, తనవంతు కృషి తాను చేస్తే సమాజంలో ఎంతో కొంత మార్పు వస్తుందని నేను గట్టిగా నమ్ముతాను.

చాలా సామాన్యంగా ఉంది కదా ఆయన చెప్పింది! నిన్ను నువ్వు నిలుపుకోవాలంటే పక్కవాడిని నిలబట్టాలన్నదే ఆయన సిద్ధాంతానికి కేంద్ర బిందువు. ఇది ఒక నిత్య సత్యం. మనిషి స్వతహాగా సంఘ జీవి. సంఘ జీవితం, శ్రమ చేసే గుణం ఈ రెండు లక్షణాలే మనిషిని జంతువు నుండి వేరు చేశాయి. సంఘజీవితంలోని ప్రధాన లక్షణం ఉమ్మడి శ్రమతో అవసరాలు తీర్చుకోవడం. మనం గడపదాటి కాలు బైట పెట్టాలంటే అనేక వస్తువులను మన ఒంటిపై ధరించి, అనేక ఆహార పదార్ధాలను భుజించిగాని కదలలేము. మన ఒంటిపై ఉండే బట్ట, వాచీ, పెన్ను, కాగితం, కళ్ళజోడు, నూనె… ఇలా సమస్త వస్తువులు మన తోటి మనిషి తయారు చేసినదే తప్ప అన్నీ మనం చేసుకున్నవి కావు. ప్రతి ఒక్కరూ తాను స్వయంగా తయారు చేసుకున్న వస్తువును మాత్రమే వినియోగించాలి అని షరతు పెడితే ఎవ్వరూ బతకలేరు. కళ్యాణ సుందరం గారు చెబుతున్నది కూడా ఇదే. కాకపోతే ఆయన వేరే మాటల్లో చెప్పారు. ‘సమాజానికి మనం ఎంతో కొంత చేయనిదే మనల్ని మనం నిలుపుకోలేము’ అని.

Mr. Kalayanasundaramకళ్యాణ సుందరం గారు తాను విద్యార్ధిగా ఉన్న కాలం తప్పితే మిగిలిన కాలం అంతా సంఘ సేవలోనే గడిపారు. అనగా 45 యేళ్లుగా ఆయన సంఘసేవలో ఉన్నారు. లైబ్రెరీ సైన్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన సుందరం గారు లైబ్రేరియన్ గా వినూత్న పద్ధతులను ఆవిష్కరించి చదువరులకు పుస్తకాలను సులభంగా అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేశారట. ట్యుటి కోరిన్ జిల్లాలోని శ్రీ వైకుంఠంలో కుమార్ కూరుపర ఆర్ట్స్ కాలేజీ లోని లైబ్రెరీలో 35 యేళ్లపాటు లైబ్రేరియన్ గా పని చేశారు. జీత భత్యాలన్నీ సంఘ సేవకు ఇవ్వడంతో పాటు తన శరీర భాగాలను కూడా ఆయన డొనేట్ చేశారు.

‘భారత దేశపు అత్యుత్తమ లైబ్రేరియన్’గా భారత ప్రభుత్వం గుర్తించి సత్కరించింది.  ‘ప్రపంచంలో అతి గొప్ప 10 మంది లైబ్రేరియన్ లలో ఒకరు’గా కూడా ఆయన గుర్తింపు పొందారు. కేంబ్రిడ్జిలోని ద ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ అనే సంస్ధ ఆయనను ప్రపంచంలో అత్యంత ఉదాత్తమైన వ్యక్తిగా (One of the noblest of the world) గుర్తించింది. ఐక్యరాజ్య సమితి ఆయనను 20 వ శతాబ్దపు విశిష్ట వ్యక్తులలో (One of the Outstanding people of the 20th Century) ఒకరిగా గుర్తించింది. పైన చెప్పినట్లు అమెరికా సంస్ధ ఒకటి ‘మేన్ ఆఫ్ ద మిలీనియం’ గా గుర్తించి అవార్డు ప్రదానం చేసింది. సుందరం గారు ‘పాలం’ అనే సంక్షేమ సంస్ధను స్ధాపించి నిర్వహిస్తున్నారు. దాతలకు, దానం గ్రహీతలకు మధ్య వారధిగా ఈ సంస్ధ పని చేస్తుంది.

ఇంతకీ ఆయన ఇంత కఠినమైన, అద్భుతమైన జీవితాన్ని ఎలా, ఎందుకు ఎంచుకున్నారు?

1953లో జన్మించిన కళ్యాణ సుందరం చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. ఆయన పేదలకు సేవ చేసేలా స్పూర్తినిచ్చింది ఆయన తల్లి గారే. ఆయన కాలేజీలో ఉండగా ఇండియా-చైనా యుద్ధం బద్దలయింది. యుద్ధ సాయం నిమిత్తం ఆయన తన బంగారు గొలుసును అప్పటి ముఖ్యమంత్రి కామ రాజ్ కు ఇచ్చారు. అనంతరం ఆనంద వికటన్ పత్రిక ఎడిటర్ బాల సురమణ్యంను కలిశారు. “నువ్వు స్వయంగా సంపాదించింది దానం చేసి నా వద్దకు రా. అప్పుడు నీ గురించి రాస్తాను అని ఆయన నాతో అన్నారు. నేనీ సంగతి ఎవరీ చెప్పలేదు. నేను దానిని సవాలుగా తీసుకున్నాను” అని కళ్యాణ సుందరం చెప్పినట్లు లిస్ లింక్స్ అనే వెబ్ సైట్ తెలిపింది.

ఆ విధంగా ఆయన లైబ్రేరియన్ ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి నెల నుండే వేతనం మొత్తాన్ని అవసరంలో ఉన్నవారికోసం వెచ్చించడం ప్రారంభించారు. ఆయన తనకు తానే సవాలు విసురుకుని దాన్ని నెరవేర్చుతూ వచ్చారు. పెళ్లి చేసుకోనిది ఈ కారణం వల్లనేనేమో తెలియదు గానీ పెళ్లి చేసుకుంటే గనుక ఆయనపై అనివార్యంగా కొన్ని బాధ్యతలు వచ్చిపడి లక్ష్య శుద్ధికి భంగం కలిగి ఉండేది అనడంలో సందేహం లేదు.

1990లో ఆయన రిటైర్ అయిననాటి పాత బాకీలు (ఎరియర్స్) వచ్చాయి. ఆ మొత్తాన్ని ఆయన తిరునల్వేలి జిల్లా కలెక్టర్ సహాయ నిధికి ఇచ్చేశారు. అప్పుడు  ఆ జిల్లా కలెక్టర్ సుందరం గారి నిరసనలను పట్టించుకోకుండా మీటింగు ఏర్పాటు చేసి ఆయన గురించి లోకానికి వెల్లడి చేశారు. అప్పటివరకూ ఆయన దాతృత్వం గురించి ఆయన చుట్టూ ఉన్నవారికి తప్ప ఎవరికీ తెలియదట. ఆయన ఏర్పాటు చేసిన సంస్ధ పాలం, ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల్లో తుఫానులు వచ్చినపుడు సహాయం చేసింది. మహా రాష్ట్ర, గుజరాత్ లలో భూకంపం వచ్చినపుడు బాధితులకు సహాయం చేసింది.

ప్రతి ఒక్కరూ తాను ఎంచుకున్న రంగంలో ఏదో ఒకటి సాధించాలని కళ్యాణ సుందరం గారు చెబుతారు. చెప్పడమే గాకుండా చేసి చూపించారు కూడా. దేశంలో బెస్ట్ లైబ్రేరియన్ గా, ప్రపంచంలో బెస్ట్ లైబ్రేరియన్స్ లో ఒకరిగా గుర్తింపును పొందడంలో ఆయన తన రంగంలో చేసిన కృషి కనిపిస్తుంది. పి.జి కోర్సు చేస్తుండగా లైబ్రెరీ సైన్స్ లో ఆయన సమర్పించిన ధీసిస్ ఆయనకు డిస్టింక్షన్ తెచ్చి పెట్టింది. ఆయన ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారట. ముఖ్యంగా యువకులు, పిల్లలు కొద్ది సేపట్లోనే ఆయనతో స్నేహం చేస్తారట.

సుందరం గారు ఖాదీ దుస్తులనే ధరిస్తారు. లైబ్రేరియన్ గా ఉండగా ఆయన ఒక సారి సభలో గాంధీయిజం గురించి చెప్పవలసి వచ్చిందట. గాంధీ ప్రతిపాదించిన ఖాదీ దుస్తుల ధారణ మంచి ఉద్దేశ్యంతో కూడిందని ఆయన సభలో చెప్పారు. కానీ ఆ మాట చెబుతున్నప్పుడు కాస్త ఖరీదయిన దుస్తులను తాను ధరించి ఉన్నానని ఆయన గుర్తించి అప్పటి నుండి ఖాదీ దుస్తులను మాత్రమే ధరించడం ప్రారంభించారు.

స్వార్ధ రాహిత్యం, సేవాగుణం, చెప్పిన మాట పొల్లు పోకుండా ఆచరించడం, నీతి చెప్పే ముందు మొదట తాను ఆచరించి చూపడం… ఇవన్నీ కళ్యాణ సుందరం గారి సుగుణాలని ఇదంతా చదివాక మనకు అర్ధం అవుతుంది. అయితే అసలు విషయం అది కాదు. ఈ లక్షణాలన్నీ ఒకే ఒక మూల లక్షణం నుండి ఉద్భవించాయి. అది ఆయన ‘ఏదీ తన ఆస్తి కాదు’ అనుకోవడం. అనగా స్వంత ఆస్తి విధానాన్ని ఆయన తిరస్కరించారు. చివరికి తన నెలవారి వేతనం కూడా తనది కాదు అని ఆయన నమ్మారు. ఆ నమ్మకం వల్లనే ఆయన తన వద్దకు వచ్చిన ప్రతి రూపాయినీ చాలా తేలికగా, గడ్డిపోచ లెక్కన అవసరంలో ఉన్నవారికి ఇవ్వగలిగారు.

కమ్యూనిస్టు సిద్ధాంతంలోని ప్రధాన, మూలాంశం ఇదే. స్వంత ఆస్తిని రద్దు చేయడం. సమాజంలో క్రమానుగత మార్పులు తీసుకు వస్తూ చివరికి స్వంత ఆస్తి లేకుండా చేయడం కమ్యూనిస్టు సిద్ధాంత లక్ష్యం. (కానీ అందుకు ఆస్తులు కలవారు ఒప్పుకోరు.) నిజానికి ఎవ్వరైనా తమది అనుకునే ఏ ఆస్తీ వారిది కాదు. సమస్తం ప్రకృతి నుండి వచ్చినదే. ప్రకృతి ఇవ్వకుండా మనిషి అవసరం ఏదీ తీరదు.

ఆ ప్రకృతి మనిషి పుట్టక ముందే ఉనికిలో ఉంది. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వచ్చి అణు వినాశనం వల్ల మనిషి అనేవాడు లేకుండా పోయినా ప్రకృతి మాత్రం నిలిచి ఉంటుంది. ప్రకృతి నుండి ఒకానొక దశలో మనిషి పుట్టినపుడు ప్రకృతి మనిషి ఆస్తి కాదు. శ్రమ చేయడం అనే ప్రత్యేక లక్షణం వల్ల మనిషి క్రాంగా సంఘజీవిగా అవతరించి ప్రకృతిని స్వాధీనం చేసుకుని చివరికి ప్రకృతిని తన ఆస్తులుగా విభజించుకున్నాడు. కనుక స్వంత ఆస్తి లేనంత మాత్రాన మనిషి మనుగడ ఏమీ ఆగిపోదు. పైగా మరింత సమున్నతంగా, అత్యంత ఉన్నత స్ధాయిలో మనిషి బతకగలడు.

కళ్యాణ సుందరం ఈ సత్యాన్ని తన సొంత జీవనం ద్వారా రుజువు చేసి చూపారు. తనకంటూ ఆస్తి లేకపోయినా అణువణువూ స్వార్ధం నిండిన లోకంలో నిస్వార్ధంగా బతుకుతూ ఆస్తి లేని జీవితం ఆచరణ సాధ్యం అని నిరూపించారు.

నాకు వ్యక్తిగతంగా ‘ఆ నలుగురు’ సినిమా అంటే చాలా ఇష్టం. గౌరవం కూడా. అయితే ఆ సినిమాలో హీరో జీవితం ఆదర్శనీయం అనుకున్నానే గానీ ఆచరణ సాధ్యం అని గట్టిగా నమ్మలేదు. స్ధైర్యం, నమ్మకం, నిబద్ధత ఉంటే ఆ జీవితం సాధ్యం అనుకున్నానే గానీ నిజంగా అలాంటి జీవితం, నిజం చెప్పాలంటే ఇంకా ఉన్నతమైన జీవితం గడుపుతున్న వ్యక్తి మానమధ్యనే ఉన్నారని మాత్రం తెలియదు.

వీలయితే కళ్యాణ సుందరం గారిని కలిసి మాట్లాడాలని ఉంది. కానీ దానికంటే ముఖ్యం ఆయన ఆదర్శంలో వెయ్యో వంతయినా సరే పాటించడం!

10 thoughts on “ఈ పెద్దాయనను ఎలా అర్ధం చేసుకోవాలి?

 1. కానీ ఈ టపా మార్క్సిజంకి విరుద్ధంగా ఉంది. ఉన్నది వదులుకోవడం కమ్యూనిజం అవ్వదు, అది altruism. మనిషిని భౌతిక ప్రయోజనాలే ఎక్కువ ప్రభావితం చేస్తాయని మార్క్సిస్త్‌లందరికీ తెలుసు. భౌతిక ప్రయోజనాలు లేకపోతే ఇక అస్తిత్వం ఎందుకు? నెల జీతానికి లైబ్రేరియన్ ఉద్యోగం చేసేవాడు తన డబ్బుల్ని దానం చెయ్యక్కరలేదు. వంద మంది చేత శ్రమ చెయ్యించి లాభం తానొక్కడే తీసుకునే పెట్టుబడిదారుడే తన ఆస్తిని త్యాగం చెయ్యాలి.

 2. అవును విశేఖర్ గారు. ఇటువంటి మహానుభావులే……మన దేశానికి…ఆ మాటకొస్తే మనిషి అనే పదానికి గర్వకారణం. వ్యక్తిగత ఆస్తి లేకుండా బతకడం ఎలా అనే ప్రశ్నకు….ఈ మహనీయుని జీవితం తిరుగులేని సమాధానం.
  ప్రతి మనిషీ ఈయన నుంచి స్ఫూర్తి పొందాలి. ఇటువంటి వ్యక్తుల జీవితాలు పాఠ్యపుస్తకాల్లో చేర్చి….చిన్నతనం నుంచే పిల్లల్లో నిస్వార్థ గుణం పెంచాలి.

 3. సర్,గొప్ప వ్యక్తిత్వన్ని పరిచయం చేశారు.మొదటనుండి చదువు తున్నప్పుడు “ఆ నలుగురు” చిత్రంలోని రఘురాం పాత్రదారి గుర్తుకు వచ్చారు!కానీ,ఇది అంతకన్న గొప్పది-అది కల్పితం,ఈయనేమో నిజం.కల్పితం కన్నా నిజం(వాస్తవం) ఎప్పుడూ అత్యద్భుతమైనదే!
  చాలా పదాలలో మీరు తడబాటుకు గురైనట్లు నాకు తోచింది.బహుశా ఆనందంతో ఉప్పొంగిన భావోద్వేగంలో అలా జరింగిందని నేను భావిస్తున్నాను!
  నిజమైన మహర్షిని పరిచయం చేసినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు!!!

 4. ఈ altruismని భావవాదులు అభినందిస్తారు కానీ భౌతికవాదులు కాదు. కూరగాయలు కోస్తున్నప్పుడు మన చిటికెన వేలు తెగి రక్తం కారితే మనకి రాత్రంతా నిద్రపట్టకపోవచ్చు. కానీ చైనాలో భూకంపం వచ్చి వేలాది మంది చనిపోతే మనం రాత్రంతా జాగారం చెయ్యడం జరగదు. చైనాలోని భూకంపం కంటే తన చిటికెన వేలికి తగిలిన గాయమే ఒక సగటు యూరోపియన్‌ని ఎక్కువ బాధిస్తుందని ఆదమ్ స్మిత్ అనేవాడు.

  లైబ్రేరియన్ కేవలం ఒక నెల జీతగాడు. అతను పది మంది చేత పనులు చెయ్యించేవాడు కాదు. లైబ్రేరియన్ తన దగ్గర ఉన్నది త్యజించాల్సిన అవసరం లేదు. మనం దానాలు చెయ్యడం వల్ల పేదవాళ్ళకి ఒక రోజు లేదా కొన్ని రోజులు కడుపులు నిండుతాయి కానీ దోపిడీ కోటలు మాత్రం పెచ్చులూడకుండా పదిలంగా ఉంటాయి.

 5. విలాసవంతంగా బతికేవాళ్ళు ఇంత మంది ఉండగా ఒక మధ్యతరగతివాడు తన దగ్గర ఉన్నది త్యజించాలనడం సరి కాదు. ఎంగెల్స్ ఇంగ్లంద్‌లో తన తండ్రికి చెందిన ఫాక్తరీలో మేనేజర్ ఉద్యోగం చేసేవాడు. ఎంగెల్స్ ఇంటిలో అందమైన గుఱ్ఱాలు, ఖరీదైన వైన్ సీసాలు ఉండేవి. కానీ అతను ఎన్నడూ వేశ్యల దగ్గరకి వెళ్ళలేదు, అప్పట్లో డబ్బున్నవాళ్ళందరూ వేశ్యల దగ్గరకి వెళ్ళినా సరే.

  కార్ల్ మార్క్స్ విషయానికి వస్తే, జెర్మన్ పాలకవర్గం అతన్ని దేశం నుంచి బహిష్కరించడం వల్ల అతను లందన్‌లో చాలా కాలం వరకు పేదరికంలో బతకాల్సి వచ్చింది. మార్క్స్ ఎలాంటి అనవసర త్యాగాలు చెయ్యలేదు.

  నేను కూడా మధ్యతరగతివాణ్ణి. నేను కార్మికవర్గానికి పెట్టుబడిదారులపై వర్గ పోరాటం చెయ్యమని చెపుతాను కానీ నా దగ్గర ఉన్నవి దానం చెయ్యను. నేను దానాలు చేసినంతమాత్రాన దోపిడీదారులు నన్ను చూసి దానాలు చెయ్యడం నేర్చుకోరు.

  బానిస తన యజమానిని చంపి తనని తాను యజమాని చెర నుంచి విముక్తుణ్ణి చేసుకోవాలి కానీ ఇంకో యజమాని వచ్చి అతన్ని విముక్తుణ్ణి చెయ్యడం జరగదు. విమోచకుడు అనేవాడు ఉండడు అని లెనిన్ అన్నది ఇందుకే.

 6. ఆయన్నెవరు బలవంత పెట్టలేదు కదా- అలా చెయమని. శేఖర్ గారు చెప్పారు “కమ్యూనిస్టు సిద్ధాంతంలోని ప్రధాన, మూలాంశం ఇదే. స్వంత ఆస్తిని రద్దు చేయడం” అని. ఆ మానవత్వమే లేకపోతే మీరు మాట్లాడే ఇజమే ఉండదు. పెట్టుబడిదారి సమాజంలో పెట్టుబడుదారులు చేసే దానధర్మాలు వారి పెట్టుబడిలో ఒక భాగం. అవి కూడా పెట్టుబడీ లాగానే పనిచేస్తాయి. వారి సామాజిక పలుకుబడిని పెంచుకోవాటానికి, ప్రచార సంబందిత విషయాలకు ఉపయోగ పడతాయి. ఈ పెద్దాయన చేస్తున్నది స్వచ్ఛంద సేవ. అది ఆయనకు నచ్చింది ఆయన చేస్తున్నాడు. మార్క్సిజానికి మానవత్వం లేదంటారా? మానవత్వమే దానికి పునాది. మార్క్స్ కు ముందు అనేక మంది యుటోపియనిష్టులు ఇలాగే ఉండేవారు. వ్యక్తుల సేవ వల్ల సమాజానికి ఒరిగేదేమిలేదని ఆ యుటోపియనిజాన్నే గతితార్కిక బౌతికవాదంగా మార్క్స్ మార్చాడు. ఆయనికి ప్రేరణ ఇచ్చిన వాటిల్లో ఇలాంటి యుటొపియనిజం కూడా ఒకటి.

 7. తిరుపాలు గారు, రాబర్త్ ఓవెన్, సెయింత్ సైమన్‌లు పెట్టుబడిదారులకి దానాలు అడిగినా చాలా కాలం వరకు పెట్టుబడిదారులు ఎవరూ దానాలు చెయ్యడానికి ముందుకి రాలేదు. ఈ విషయం మార్క్స్, ఎంగెల్స్‌లకి తెలుసు కాబట్టే వర్గ పోరాటం ద్వారానే సమాజం మారుతుందని అన్నారు. మార్క్స్ మామగారు అయిన లుద్విగ్ వోన్ వెస్త్‌ఫాలెన్ అతని చిన్నప్పుడు అతని తండ్రి స్నేహితుడు. మార్క్స్ వెస్త్‌ఫాలెన్ ఇంటికి వెళ్ళే రోజుల్లోనే అతను రాబర్త్ ఓవెన్, సెయింత్ సైమన్ లాంటి వాళ్ళ గురించి తెలుసుకున్నాడు. కానీ మార్క్స్ ఆ తరువాత వర్గ స్వభావం గురించి కూడా తెలుసుకున్నాడు. అందుకే మార్క్స్ వర్గ పోరాటాన్ని బలపరిచాడు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s