జయలలిత కెరీర్ ఇక ముగిసినట్లేనా? ముగిసినట్లే అని ఆమె వ్యతిరేకులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆమె అభిమానులు మాత్రం ఇప్పటికీ శోక హృదయులై ఉన్నా, మించిపోయింది ఏమీ లేదన్న ధైర్యంతో ఉన్నారు. చో రామస్వామి లాంటి తమిళ రాజకీయ విశ్లేషకులు ఆమెకు ఇంకా అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.
జయలలిత తన కెరీర్ లో పీక్ దశలో ఉండగా కోర్టు తీర్పు ఆమెకు ఆశనిపాతం అయిందని ది హిందూ లాంటి పత్రికలు సైతం విశ్లేషించాయి. పీక్ దశ అంటే శిఖరాగ్రం అనే. శిఖరాగ్రాన ఉన్నప్పుడూ ఇక పైకి పోయే దారి ఉండదు. ముందుకు పోయే దారీ ఉండదు. ముందుకు కదిలితే ఇక దభేల్ మని అల్లంత ఎత్తునుండి పడిపోవడమే మిగులుతుంది.
శిఖరాగ్రాన చేయవలసిందల్లా జాగ్రత్తగా తన స్ధానాన్ని కాపాడుకోవడమే. అదమరుపుగా ఉంటే ఎవరు వచ్చి తోసేస్తారో తెలియదు. అది రాజకీయ శిఖరాగ్రం అయితే చెప్పనే అవసరం లేదు. ఆ స్ధానంలో ఉన్నవారిని తోసేసి ఆక్రమించడానికి ఎందరో కాచుకుని కూర్చుంటారు. జయలలిత లాంటి మొండి ఘటం వ్యక్తులకైతే శత్రువులకు కొదవ ఎక్కడిది?
జయలలిత ఎవరినైతే తన ఆత్మీయ స్నేహితులుగా భావించి నెత్తిన పెట్టుకుందో సరిగ్గా వారి వల్లనే జైలు ఊచలు లెక్కపెట్టుకునే పరిస్ధితికి చేరుకోవడం గమనార్హం. ఆమె మొదటి సారి ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన కాలంలో ఆమె అనుంగు స్నేహితురాలు శశికళ, ఆమె కుటుంబ సభ్యులు లెక్కలేనన్ని పేపర్ కంపెనీలు పెట్టి ప్రభుత్వ ఆస్తులను కాజేశారు. అవే ఇప్పుడు అక్రమ ఆస్తుల కేసుగా ఆమె మెడకు చుట్టుకుని జైలు గోడల మధ్య నిలిపాయి.
జయలలిత, అవినీతి పరురాలిగా జైలు శిక్ష పడిన మొట్టమొదటి సర్వింగ్ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. చట్టం సరిగ్గా అమలైతే శిక్షా కాలం 4 సం.లు కాకుండా మరో 6 సం.లు ఆమె పోటీకి అనర్హురాలు. అనగా 2024 వరకూ ఆమెకు రాజకీయ జీవితం ఉండకూడదు. కానీ విచిత్రం ఏమిటంటే భారత దేశంలో అవినీతి కేసులో జైలుపాలైతే అపకీర్తికి బదులు సానుభూతి కుప్పలు తెప్పలుగా పోగు పడుతుంది. ఇది కూడా ‘బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ’ అంటారో, పాలితులు తమ పాలకుల భావోద్వేగాలను తమవిగా భ్రమపడడం అంటారో మేడిపండు డెమోక్రసీ ఆరాధకులు చెప్పాలి.
ప్రస్తుతానికి అన్ని మార్గాలు మూసుకుపోయినట్లు కనిపిస్తున్నప్పటికీ రాజకీయ పలుకుబడి, అధికారిక సంబంధాలు ఉన్నవారికి దారులు మూసుకుపోవడం అన్నది కొద్ది రోజులే ఉంటుంది. మహా అయితే కొద్ది నెలలు ఉండవచ్చు. ఈ లోపు జరగవలసిన ఒప్పందాలు జరుగుతాయి. కొన్ని త్యాగాలు చోటు చేసుకోవచ్చు. అంతిమంగా కొండంత సానుభూతిని వెంటపెట్టుకుని మళ్ళీ ఎన్నికల్లో నిలబడే రోజు జయలలితాకు త్వరలో రాకపోతేనే ఆశ్చర్యం! ఎందుకంటే భారత రాజకీయ, ఆర్ధిక, సామాజిక వ్యవస్ధ పని చేసేది కలిగిన వర్గాల కోసమే.
శేఖర్ గారు,
ఇది ఎలా సాద్యమంటారు? దీని వెనుక ఏ కుట్రలు లేవంటారా? అయినా మన న్యాయ వ్యవస్థకు ఇంత ఇండిపెండెన్సి వుందంటారా?
తిరుపాలు గారూ, కుట్రలు లేవు అని చప్పలేము. కానీ ఉన్నాయనడానికి సాక్ష్యం లేదు. కనీసం ఎవరూ ఆ అనుమానం వ్యక్తం చేయలేదు. పాలక గ్రూపుల మధ్య వైరుధ్యాలు ఉభయతారకంగా పరిష్కారం కాకపోతేనే ఇలా కోర్టుల వరకూ వస్తుంది తప్ప, మీరన్నట్లు నిజంగా స్వతంత్రత ఉండి కాకపోవచ్చు. అయినా కొన్నిసార్లు బ్యూరోక్రాట్ అధికారుల మొండి తనం వల్ల కూడా ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి. అసలు విషయం ఏమిటో తెలిసే వరకూ కోర్టులు పని చేశాయని చెప్పుకోవడమే.
ఘనత వహించిన రాం జెఠ్మలానీ గారు ఈ కేసుపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎవరో కొన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకే….న్యాయమూర్తి ఆ తీర్పు ఇచ్చారని అన్నారు. జెఠ్మలాని గారికి న్యాయవ్యవస్థ లోతు పాతులు….అసలు రహస్యాలు చాలా తెలిసే అవకాశం ఉంది. న్యాయవ్యవస్థ గురించి తెలీనీ సాధారణ జనం అనుమానాలు వ్యక్తం చేస్తే…కొట్టి పారేసే అవకాశం ఉంది. కానీ జెఠ్మలాని లాంటి న్యాయఘనాపాఠీలు కూడా…..ఆరోపణలు గుప్పించడంతో అనుమానాలించాల్సి వస్తోంది.
ఈ కేసు భవిష్యత్తు ఏమిటో కూడా ఆయన మాటల్లో లీలామాత్రంగా ద్యోతకమవుతోంది.
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/TELANGANA/2014/09/29/ArticleHtmls/29092014007005.shtml?Mode=1
జఠ్మలానీగారి ఉద్దేశంలో జయలలితకు అనుకూలంగా తీర్పు చెప్పి ఉంటే అది సరిగ్గా ఉండేదనా? ఆయన మాటతీరు అలా ఉంది.