భూమికి దూరంగా… గాలిలో తేలుతూ… -ఫోటోలు


విమానాలు సరే! ఉన్నచోటనే గాలిలో తేలిపోయే ఆటలు, ఆట వస్తువులు మనిషికి ఇప్పుడు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి ఆటలు, ఆట వస్తువులు ఉనికిలోకి రావడానికి కారణం ఏమిటో తెలుసుకుంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది.

భారీ ఉత్పత్తులు తీయగల యంత్రాలను కనిపెట్టాక ఆర్ధిక పిరమిడ్ లో అగ్రభాగాన తిష్ట వేసిన కలిగిన వర్గాలకు తీరికే తీరిక! ఈ తీరిక సమయం క్రమంగా మానసిక జబ్బులకు దారి తీయడం మొదలైంది. ఈ ప్రమాదాన్ని తప్పించడానికి వారికి అత్యంత తీవ్ర స్ధాయి ఆనందాలను, ఒక్కోసారి పర్వెర్టెడ్ ఆనందలను కూడా, అందించే పరికరాలు అవసరం అయ్యాయి.

సాహసం, ఉత్సాహం, యవ్వనోద్రేకం… ఇలా అనేక బూటకపు సహజత్వాలతో వాటి అవసరాలను సమర్ధించుకున్నారు. వీటిలో కొన్ని సాహసత్వాన్ని ప్రదర్శించడం నిజమే అయినా అది అవసరం లేని సాహసత్వం. కొని తెచ్చుకున్న సాహసత్వం. మనిషిని ఉత్తి పుణ్యానికి ప్రమాదం అంచుకు తీసుకెల్లే సాహసత్వం. అజారుద్దీన్ తనయుడు హైద్రాబాద్ ఔటర్ రింగు రోడ్డులో ద్విచక్ర వాహనాల పందెంలో ప్రాణాలు కోల్పోవడం ఈ కోవలోనిదే.

ఈ కింది ఫోటోలు అలాంటి సాహస క్రీడలకు చెందినవే. వీటిలో అత్యధిక సాహస దృశ్యాలు అత్యంత ఖరీదైనవి. సామాన్య మానవుడికి ఏ మాత్రం అందుబాటులోకి రానివి. కలిగిన వర్గాలలోని ఒకడి ముల్లెని మరొకడి ముల్లెగా క్షణాల్లో మార్చే క్రీడలివి.

మొదటి ఫోటో ఎలా సాధ్యం అయిందో నాకు ఒక పట్టాన అర్ధం కాలేదు, ఇప్పటికీ. రెడ్ బుల్ X-ఫైటర్స్ వరల్డ్ టూర్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా రాజధాని ప్రిటోరియాలో స్పానియార్డ్ మైకేల్ మేలేరో సాధన చేస్తున్నాడని ఫోటో కాప్షన్ లో చెప్పారు. కానీ ఆ సాధన ఎలా చేస్తున్నారో, అసలీ ఫోటో ఎలా సాధ్యపడిందో వివరం లేదు. ఎవరికన్నా తెలిస్తే చెప్పండి.

రెండో ఫోటో గ్రీసు లోని ఒక టూరిస్టు స్పాట్ వద్ద డ్రీమ్ వాకర్ గ్రూపు సభ్యుడు రోప్ జంపింగ్ చేస్తున్న దృశ్యం. ప్రపంచంలో 80 అద్భుతమైన చోట్లలో గాలిలో నుండి జంప్ చేయడం డ్రీమ్ వాకర్ గ్రూప్ లక్ష్యం అట. ఈ లక్ష్యానికి కాస్తన్నా అర్ధం ఉందా? ఎక్కువైపోయిన డబ్బు తగలేయడం తప్ప!

అదే స్పాట్ లో (నవాగీయో బీచ్, గ్రీసు) అదే సాహసికుడు కిందకు పడుతూ పైన నిలబడ్డవారిని ఫోటో తీస్తున్న దృశ్యం మూడో ఫోటో. హాలికాప్టర్ నుండి తాళ్ళతో వేలాడ దీసిన కార్పెట్ పైన కూర్చొని జర్మనీ పియానిస్టు ఒకరు పియానో వాయిస్తున్న దృశ్యం ఆ తర్వాతది. అక్కడ కూర్చొని పియానో వాయిస్తే విని తరించే మహాత్ములెవరో ఆ పియానిస్టుకి తెలియాలి. ఇదంతా ‘ఆరంజ్ పియానో టూర్’ లో భాగంట!

స్పెయిన్ లోని ఓ పట్నంలో ‘డెవిల్ జంప్’ అనే పండగలో భాగంగా ఓ వ్యక్తి పిల్లల మీదుగా ‘దెయ్యపు దూకు’ దూకుతున్న దృశ్యం ఐదో ఫోటో. ఈ దూకుడు లో పాల్గొనే పసి పిల్లలు దెయ్యం బారిన పడే ప్రమాదం నుండి తప్పించుకుంటారట. ఇదో పవిత్రమైన దూకుడు అన్నట్లు!

ఆరో ఫోటో కైట్ సర్ఫింగ్ కు చెందిన దృశ్యం. ఒకేసారి పెద్ద సంఖ్యలో కైట్ సర్ఫింగ్ చేస్తున్న బృందంగా గిన్నీస్ రికార్డ్ బుక్ లో స్ధానం కోసం ఇలా చేస్తున్నారు వీళ్ళు. ఇది కూడా స్పెయిన్ లోనిదే. గత రికార్డు 318 మందితో కూడిన కైట్ సర్ఫింగ్ కాగా వీళ్ళు ఆ రికార్డు బద్దలు కొడుతూ 352 మందితో కైట్ సర్ఫింగ్ చేశారు.

7వ ఫోటో ఆట కాదు. మిలట్రీ శిక్షణలో భాగం. చైనా మిలట్రీ సభ్యుడొకరు టాక్టికల్ ట్రైనింగ్ లో భాగంగా ఇలా మండుతున్న చక్రం లో నుండి దూకుతున్నాడు. ఆ తర్వాత ఫోటోలో తుఫాను గాలులతో చెలగాటం ఆడుతున్న సాహసికుడు. ఆస్ట్రేలియా పట్టణం మెల్ బోర్న్ లో సముద్రపు అలలపైన సర్ఫింగ్ చేస్తూ, అతి వేగంగా వీస్తున్న తుఫాను గాలిని ఆసరా చేసుకుని పయర్ మీదుగా దూకుతున్నాడీ సాహసికుడు. ఏ మాత్రం అంచనా తప్పినా చావు తప్పని సాహసం ఇది. కానీ ఏం లాభం? ప్రయోజనం లేని సాహసం.

9వ ఫోటోలో ఇండోర్ ఏర్పాట్లలో స్కై డైవింగ్ లో శిక్షణ పొందుతున్న దృశ్యం. ఓ పెద్ద ఎత్తైన గాలి ఛాంబర్లలో భారీ ఫ్యాన్ లను ఏర్పాటు చేసి ఇలా గాలిలో దూకే శిక్షణ ఇస్తున్నారు, అమెరికా రాష్ట్రం ఇల్లినాయిస్ లో. పారాచ్యూట్ శిక్షణలో భాగం కనుక దీనివల్ల ఉపయోగం ఉంటుంది.

తర్వాత ఫోటోలో స్లోవేకియాకు చెందిన ఏరోబిక్ గ్రూపు వాళ్ళు గ్లైడర్ల సహాయంతో నింగికి పెయింటింగ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అంతర్జాతీయ ఎయిర్ ఫెస్టివల్ లో భాగంగా ఇది చేస్తున్నారు. ఒక ఇజ్రాయెలీ అరబ్బు యువకుడు ఎత్తైన చోటి నుండి మధ్యధరా సముద్రంలో దూకుతున్న దృశ్యం ఆ తర్వాతి ఫోటో.

స్విట్జర్లాండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 100 సం.ల క్రితం ఉపయోగించిన మొట్టమొదటి యుద్ధ విమాన మోడల్ తో ఓ వాయు సైనికుడు ప్రదర్శన ఇస్తున్న దృశ్యం 12వ ఫోటో లోనిది. 13వ ఫోటోలో ఒక జమ్ము కాశ్మీర్ పోలీసు భారత స్వతంత్ర దినం సందర్భంగా శ్రీనగర్ లో ట్యూబ్ లైట్ ల గుండా దూసుకెళ్తూ ప్రదర్శన ఇస్తున్నాడు.

14వ ఫోటోలో మళ్ళీ స్విట్జర్లాండ్ ఎయిర్ ఫోర్స్ ప్రదర్శనదే. ఎయిర్ ఫోర్స్ విమానం ద్వారా దీపావళి తరహా మతాబాలను గాలిలో ప్రయోగిస్తూ చూపరులకు కనుల విందు చేస్తున్నారు. 15వ ఫోటో: రెడ్ బుల్ ఎయిర్ ఫోర్స్ బృందం వాళ్ళు న్యూయార్క్ నగరంలోని ఫ్రీడం టవర్ మీదుగా గాలిలో ప్రదర్శన ఇస్తున్న దృశ్యం. రెడ్ బుల్ కంపెనీ ఇచ్చే ప్రదర్శనలన్నీ వృధా కార్యక్రమాలే. కంపెనీ ప్రమోషన్ కు తప్ప ఎందుకూ ఉపయోగపడవు.

16వ ఫోటో కూడా నాకు అర్ధం కాలేదు. ఫ్రాన్స్ లో ఫ్లై బోర్డింగ్ చేస్తున్న దృశ్యం అని చెప్పారు గానీ అదేంటో తెలియలేదు.

రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో ప్యాలస్ స్క్వేర్ లో ఉన్న అలెగ్జాండర్ స్తంభం మీదుగా స్నో మొబైల్ వాహనం ద్వారా దూకుతున్న దృశ్యం ఆ తర్వాత ఫోటో. మంచు దేశంలో ఇలాంటి క్రీడలు సహజమే కావచ్చు. 18వ ఫోటోలో వాటర్ వాల్ జంపింగ్ పోటీల్లో ఒక పోటీదారు పాల్గొంటున్న దృశ్యం. ఇది మొదటి అంతర్జాతీయ వాటర్ ఫాల్ జంపింగ్ పోటీ అట. బోస్నియా నగరం జాజ్కే లో జరిగింది.

చైనాలోని షావోలిన్ టెంపుల్ మార్షల్ ఆర్ట్క్స్ కళాకారులు ఒక యుద్ధ విద్యా ప్రదర్శన కోసం రిహార్సల్ వేస్తున్న దృశ్యం ఆ తర్వాత ఫోటో. నాన్ జింగ్ యూత్ ఒలింపిక్స్ లో భాగంగా ఈ విద్యను ప్రదర్శిస్తారు.

చివరి ఫోటో హై డ్రైవింగ్ పోటీలోని ఓ దృశ్యం. కొసోవో దేశంలో జాకోవా నగరంలో ఈ ఫోటీలు జరుగుతాయి. ఒక వంతెన మీది నుండి వివిధ ఆకారాల్లో దూకుతూ పోటీ పడడం ఈ పోటీల లక్ష్యం.

Photos: The Atlantic

 

One thought on “భూమికి దూరంగా… గాలిలో తేలుతూ… -ఫోటోలు

  1. వి శేఖర్ గారు. మొదటి ఫోటో ఫోటో గ్రాఫర్ తెలివిగా చేసిన ట్రిక్ ఫోటోగ్రఫీ. అంతే. చెట్టు పక్కన మోటార్ బైక్ ట్రాక్ పెకి వాలుగా ఉంది చూశారా. అక్కన్నుంచి పైకి జంప్ చేసి ఎదురుగా వాలుగా ఉన్న ట్రాక్ మీద బైక్ కింద పడే లోపు ఒడుపుగా రైడర్ చేస్తున్న విన్యాసం. ఇక ఆ విన్యాసానికి బహుశా బైక్ శబ్దానికి దూరంగా ఉన్న జిరాఫీ భయపడుతోంది. కెమెరా మెన్ తెలివిగా జిరాఫీ బ్యాక్ డ్రాప్ లో ఆ విన్యాసాన్ని బంధించాడు. మనం అభినందించాల్సింది కెమెరామెన్ ఆలోచనకే. ఎందుకంటే అటువంటి బైక్ విన్యాసాలు….ఇప్పుడు పల్లెటూరి జాతరలో కూడా జరుగుతున్నాయి. కెమెరామెన్ సృజనాత్మకత ఒక అద్భుతాన్ని సృష్టించింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s