మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించవచ్చని శివ సేన నేత, బాల్ ధాకరే కుమారుడు ఉద్ధవ్ కుమార్ ఎంతగానో ఆశ పెట్టుకున్నారు. తన ఆశను ఆయన దాచుకోకుండా బహిర్గతం చేశారు. మహా రాష్ట్రలో తామే ఇచ్చేవారమని, బి.జె.పి తీసుకునే పార్టీ మాత్రమేనని హుంకరించారు. మరిన్ని సీట్లు కావాలన్న బి.జె.పి కోర్కెను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
రాజ్ నాధ్ సింగ్ ఏలుబడి వరకు మహారాష్ట్రలో బి.జె.పి జూనియర్ భాగస్వామిగా మాత్రమే కొనసాగింది. లోక్ సభ ఎన్నికల్లో శివ సేన కంటే 10 సీట్లు బి.జె.పీకి ఎక్కువ రావడంతో బి.జె.పి ధోరణిలో మార్పు వచ్చింది. తామిక ఎంత మాత్రం జూనియర్ భాగస్వామి కాదని, సమాన అధికారానికి అర్హులమని భావించింది. అనుకున్నదే తడవుగా చెరిసగం సీట్లలో సమాన స్ధాయిలో పోటీ చేద్దామంది.
ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన ఉద్ధవ్ బి.జె.పి కోర్కెను అంగీకరిస్తే తన పీఠం ఆశలు నెరవేరడం కష్టం అని గ్రహించారు. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారిదే ముఖ్యమంత్రి పీఠం అన్న బి.జె.పి వాదనతో ఆయన అనుమానం బలపడింది. బి.జె.పి సీట్ల సంఖ్యను కుదిస్తే తప్ప తన ఆశ నెరవేరదని గ్రహించి బి.జె.పికి మరిన్ని సీట్లు ఇవ్వడానికి ససేమిరా నిరాకరించారు.
ఫలితంగా దశాబ్దాల నాటి మిత్రత్వం కొడిగట్టి పోయింది. ముఖ్యమంత్రి పీఠమే మిత్రత్వానికి ఎసరు తెచ్చిందని పత్రికలు కూడా విశ్లేషించాయి. అమిత్ షా నేతృత్వంలోని బి.జె.పి మహా రాష్ట్రలో సమాన లేదా అధిక భాగస్వామ్య పాత్రను కోరుకోవడంతోనే ఉద్ధవ్ ధాకరే ముఖ్యమంత్రి పదవీ ఆశలకు భంగం కలిగిందని కార్టూన్ సూచిస్తోంది. ముఖ్య మంత్రి పదవి అన్న మత్స్య యంత్రాన్ని ఉద్ధవార్జునుడు ఛేదించకుండా ఉండేందుకు కమలం పూలను విసిరేస్తూ సరస్సు లోని నీటిని అపభ్రంశం కావించడంలో బి.జె.పి అమిత్ షా మునిగిపోయారని కార్టూన్ భావం.
ఎన్నికల అనంతరం కొత్త రాజకీయ సమీకరణాలు మొగ్గ తొడగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. బి.జె.పితో దోస్తీ చేసేందుకే తమతో దోస్తీకి ఎన్.ఎస్.పి చెల్లు చెప్పిందన్న కాంగ్రెస్ ఆరోపణను బట్టి ఎన్నికల అనంతరం బి.జె.పికి ముఖ్యమంత్రి పదవి అందించేందుకు, తద్వారా తనకు కావలసింది దక్కించుకునేందుకు ఎన్.సి.పి పధక రచన చేసినట్లు కనిపిస్తోంది. ఆ విధంగా ఉద్ధవ్ ముఖ్యమంత్రి పదవి ఆశలకు గండి కొట్టడంలోనూ, ఆ పదవిని తాను దక్కించుకోవడంలోనూ బి.జె.పి సఫలం అవుతుందా అన్నది వేచి చూడాలి.