(లోక్ సభ ఎన్నికల్లో బి.జె.పి ప్రధాన నినాదాలు అభివృద్ధి, ఉపాధి. అధికారంలోకి వచ్చాక ఈ నినాదాలకు కట్టుబడి ఉండడానికి బదులు సరిగ్గా వ్యతిరేక చర్యలను బి.జె.పి ప్రభుత్వం తలపెడుతోంది. మిలియన్ల మంది గ్రామీణ పేదలకు కాస్తో, కూస్తో వరంగా పరిణమించిన గ్రామీణ ఉపాధి పధకంలో కోత విధించడం ద్వారా మోడి ప్రభుత్వం తన హామీని అడ్డంగా ఉల్లంఘిస్తోంది. ఈ అంశంపై ఈ రోజు హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం ఇది. -విశేఖర్)
ప్రపంచంలో అతి పెద్ద ప్రజా పనుల ఉపాధి కార్యక్రమం -మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) కింద అమలవుతున్న పధకాలు – సామర్ధ్యాన్ని (reach) కత్తిరించడానికి తలపెట్టిన చర్యల వల్ల ఏర్పడే భారీ మానవ ప్రభావాలను నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం పరగణలోకి తీసుకోవాలి. దశాబ్దకాలం నాటి ఈ చట్టం కోత వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని మిలియన్ల మంది నైపుణ్య రహిత కూలీలు చట్టబద్ధంగా కనీస వేతన చెల్లింపులు హామీ ఇవ్వబడిన 100 రోజుల ఉపాధి హక్కును కోల్పోతారు. ఉపాధి సౌకర్యాల కల్పనపై దృష్టి కేంద్రీకరించినందున కూలి చెల్లింపు, సామాగ్రి ఖర్చుల నిష్పత్తిని మొత్తం కేటాయింపుల్లో 60-40 శాతంగా నిర్దేశించారు. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటన ప్రకారం ఈ నిష్పత్తిని 51-49 శాతంకి సవరించబోతున్నారు.
ప్రభుత్వం స్వయంగా అంగీకరించిన గణాంకాల ప్రకారమే సామాగ్రి నిమిత్తం కేటాయించిన మొత్తాన్ని ఖర్చు చేయడంలో భారీ కొరత -గత రెండేళ్లలో కేవలం 27 శాతం కేటాయింపులను మాత్రమే ఖర్చు చేశారు- ఏర్పడి ఉంది. కనుక సామాగ్రి కోసం కేటాయించే మొత్తాన్ని పెంచినట్లయితే అది అనివార్యంగా ఉపాధి హామీ పధకంలోని వేతన కేటాయింపులను హరించివేస్తుంది. ఫలితంగా ఉపాధి సృష్టి తగ్గిపోతుంది. దీనివల్ల గ్రామీణ దారిద్ర్య సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశించబడిన రంగంలో సర్వ భక్షక కాంట్రాక్టర్లది ఇష్టారాజ్యంగా మారిపోతుందన్న కార్యకర్తల ఆందోళనలు పూర్తిగా ఆధార రహితం ఏమీ కాదు. పైగా, పధకాన్ని గిరిజన మరియు వెనుకబడిన జిల్లాలకు మాత్రమే పరిమితం చేస్తామన్న నిర్ణయం ఈ పధకం యొక్క సార్వజనీన స్వభావాన్ని తీవ్రంగా బలహీనపరుస్తుంది. అంతేకాకుండా ఉపాధి హామీ పధకం యొక్క లక్ష్యాన్ని మరింతంగా నీరుగారుస్తుంది.
మరొక స్ధాయిలో చూస్తే, అకడమిక్ పరిశోధనలు నిర్ధారించినట్లుగా, ఉపాధి హామీ పధకం సామర్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలు ప్రజాస్వామిక ప్రక్రియను అనేక విధాలుగా బలీయం కావిస్తున్నాయి. ప్రజా పనులపై విస్తృతంగా సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) నిర్వహిస్తున్న గ్రామ సభలు చైతన్యయుత సంస్ధలుగా తమను తాము రుజువు చేసుకుంటున్నాయి. పాతుకుపోయిన అవినీతిని రూపు మాపాలంటూ చెలరేగిన ఆందోళనలు చెల్లింపులు పోస్ట్ ఆఫీసుల ద్వారానూ, బ్యాంకు ఖాతాల ద్వారాను చేయడానికి దారి తీసాయి. 2009-10 నాటి జాతీయ శాంపిల్ సర్వే ఆధారంగా 2012లో ప్రపంచ బ్యాంకు జరిపిన అధ్యయనం ప్రకారం, అనేక సవాళ్ళ నేపధ్యంలోనూ ఉపాధి హామీ పధకం గ్రామీణ పేదలకు, ముఖ్యంగా మహిళలకు చేరువగా వెళ్లింది.
రోజుకు 1 డాలర్ సంపాదన స్ధాయి కంటే హీనమైన దరిద్రం నుండి మిలియన్ల మంది పేదలను వెలికి తెస్తున్న ఈ పధకం ఫలితాలను అంతర్జాతీయ కార్మిక సంస్ధ సైతం గుర్తించింది. ఉపాధి హామీ పధకాన్ని ప్రారంభించిన యు.పి.ఏ ప్రభుత్వానికి కీలక మద్దతుదారుల్లో ఒకరయిన ఉత్తర ప్రదేశ్ పాలక ప్రభుత్వం ఈ పధకం విజయవంతం కావడంలో చిన్నపాటి ఆసక్తి మాత్రమే కనబరిచే పరిస్ధితిలో లేదు. కనుక ఉత్తర ప్రదేశ్ లోని 7 జిల్లాల్లో ఉపాధి హామీ నిధులను దారి మళ్లించారన్న ఆరోపణలపై కొనసాగుతున్న సి.బి.ఐ విచారణ, సజావుగా కొనసాగేలా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తగిన సౌకర్యాలు కల్పించాలి. అన్నింటికంటే మిన్నగా ఉపాధి హామీ చట్టం కింద అమలవుతున్న పధకాలను ఏ మాత్రం వెనక్కి ఉపసంహరించుకున్నా అది బి.జె.పి ప్రకటిత హామీ అయిన ‘అభివృద్ధి’ నినాదాన్ని తీవ్రంగా కుంటుపరుస్తుంది.
వి శేఖర్ గారు. గతంలో ఎవరో అడిగారు కదా. హిందూ ఆర్టికల్స్ తెలుగు ట్రాన్స్ లేట్ చేయమని…. ఒక్క హిందూ అనే కాదు…..పాఠకులకు ఉపయోగపడే మంచి ఆర్టికల్స్ ట్రాన్స్ లేట్ చేయగలరు మీకు అవకాశాన్ని బట్టి…ఎవరికి వారు చదువుకునే దానికి……మీ అనువాదానికి తేడా ఉంది. నిజం. నేను ఉదయం ఈ ఎడిటోరియల్ చదివాను.కానీ ఇంత లోతుగా అర్థం కాలేదు. బహుశా నాలాంటి వారు ఎందరో. కాబట్టి. వీలైనంత వరకూ హిందూ ట్రాన్స్ లేషన్స్ తో పాటూ…ఓప్-ఎడ్ వ్యాసాలు కూడా అనువాదం అందించగలరు….చాలామందికి ఉపయోగకరం. ప్లీజ్ ఆలోచించరు…..
గ్రామీణ ఉపాధి పథకం అనేది ప్రజలకి ఉపాధి కల్పించేది కనుక ఇది productive కిందకే వస్తుంది. నిజంగా unproductive పథకాలంటే చంద్రబాబు నాయుడు పెట్టిన “దీపం” లాంటివి. గృహ వినియోగదారుల మీద విద్యుత్ చార్జిలు పెంచి రైతులకి ఉచితంగా విద్యుత్ ఇవ్వడం లాంటి ఉత్తుత్తి ఉచిత పథకాలు కూడా ఉన్నాయి. గ్రామీణ ఉపాధి పథకంలో ప్రజలు పని చేసి డబ్బులు తీసుకుంటున్నారు కానీ దీపం పథకంలోలాగ ఉచితంగా తీసుకోవడం లేదు కదా.
అవును