గుజరాత్ మారణకాండ: మోడికి అమెరికా కోర్టు సమన్లు


PM USA

9 సం.ల పాటు అమెరికా ప్రభుత్వం నుండి వీసా నిషేధం ఎదుర్కొన్న భారత ప్రధాని నరేంద్ర మోడి తాజాగా అమెరికా కోర్టుల నుండి సమన్లు అందుకోనున్నారు. విదేశీ కోర్టుల నుండి సమన్లు అందుకున్న మొట్టమొదటి భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడి ఖ్యాతి దక్కించుకున్నారు. ఒక పక్క మోడికి రెడ్ కార్పెట్ పరిచామని చెబుతూనే కోర్టుల చేత సమన్లు ఇప్పించడం అమెరికా కపట నీతికి తార్కాణం కావచ్చు గానీ, అందుకు అవకాశం ఇచ్చిన ఘనత మాత్రం మన నేతదే.

న్యూయార్క్ లోని ఫెడరల్ కోర్టు ఒకటి 2002 నాటి గుజరాత్ మారణకాండకు నరేంద్ర మోడి ఆద్వర్యం వహించారని ఆరోపిస్తూ దాఖలయిన పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. అమెరికన్ జస్టిస్ సెంటర్ (ఎ.జె.సి) అనే పేరుగల స్వచ్ఛంద మానవ హక్కుల సంస్ధ ఇద్దరు బాధితుల తరపున ఈ పిటిషన్ దాఖలు చేసింది. అమెరికాలోని అలియెన్ టార్ట్ క్లెయిమ్స్ యాక్ట్ (ATCA), మరియు టార్చర్ విక్టిమ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే రెండు చట్టాల క్రింద నరేంద్ర మోడి నుండి స్పందనను కోరుతూ ఎ.జె.సి పిటిషన్ వేసిందని తెలుస్తోంది.

న్యూయార్క్ దక్షిణ జిల్లాకు చెందిన ఫెడరల్ కోర్టు బాధితుల పిటిషన్ కు సమాధానం ఇవ్వాలని సమన్లు జారీ చేసింది. వాదుల తరపున వాదిస్తున్న లా సంస్ధకు గుర్పత్వంత్ సింగ్ పన్నున్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పిటిషన్ గురించి ది హిందూ పత్రికకు ఈ మెయిల్ ద్వారా వివరించిన పన్నున్, సమన్లు జారీ చేసిన 21 రోజుల లోపల మోడి సమాధానం ఇవ్వాలని తెలిపారు.

ఒకవేళ నరేంద్ర మోడి సమన్లకు స్పందించకపోతే? అప్పుడేమి జరుగుతుందో కూడా సమన్ల పత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. సమన్ల పత్రం ప్రకారం గడువు లోపల ప్రధాని సమాధానం ఇవ్వని పక్షంలో డీఫాల్ట్ జడ్జిమెంట్ ఇవ్వబడుతుంది. ఫిర్యాదులో ఫిర్యాదుదారు డిమాండ్ చేసిన మేరకు ఉపశమనం కలిగించేలా ఈ డీఫాల్ట్ జడ్జిమెంట్ ఉంటుందని ది హిందు తెలిపింది.

28 పేజీల ఫిర్యాదులో ప్రధాని మోడి నుండి నష్టపరిహారం కావాలని, నష్టం కలిగించినందుకు శిక్షా పూర్వక పరిహారం విధించాలని ఫిర్యాదుదారు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడి మానవత వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారని, చట్టాలకు అతీతంగా హత్యలకు పాల్పడ్డారని, చిత్ర హింసలకు గురి చేశారని, బాధితులను మానసిక, శారీరక వేదనలకు గురి చేశారని ఫిర్యాదు పత్రంలో బాధితులు ఆరోపించారు.

డీఫాల్ట్ జడ్జిమెంటు ప్రకటించినట్లయితే పరిణామాలు ఇంకా ఉంటాయని తెలుస్తోంది. ఇదే తరహా కేసుల్లో డీఫాల్ట్ జడ్జిమెంటు ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయని పన్నున్ తెలిపారు. డీఫాల్ట్ జడ్జిమెంటు కింద అమెరికా మరియు అంతర్జాతీయ చట్టాల ప్రకారం, 2002 నాటి గుజరాత్ మారణకాండను ముస్లింలపై జాతి హత్యాకాండ అమలు చేసిన చర్యగా కోర్టు ప్రకటిస్తుంది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించే అవకాశం ఉంది. శిక్షాపూర్వక పరిహారం (punitive damages) చెల్లించాలని కూడా ఆదేశించవచ్చు.

వాది తరపు లా సంస్ధ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఎ.టి.సి.ఎ చట్టం అమెరికాలో 1789 నుండి అమలులో ఉంది. ఈ చట్టం ప్రకారం అమెరికా బయట అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినందుకు గానూ అమెరికా పౌరులు కేసు దాఖలు చేయవచ్చు. ఈ తరహా కేసులను విచారించే న్యాయ పరిధి అమెరికా ఫెడరల్ కోర్టులు కలిగి ఉన్నాయి.

“ప్రధాని మోడికి వ్యతిరేకంగా దాఖలు చేయబడిన టార్ట్ కేసు మానవ హక్కుల ఉల్లంఘనదారులకు స్పష్టమైన సందేశం ఇస్తోంది. కాలం, స్ధలం, అధికారం… ఇవేవీ న్యాయం పొందడానికి అడ్డు రాబోవని తెలియజేస్తోంది” అని బాధితుల తరపున కేసు దాఖలు చేసిన ఎ.జె.సి డైరెక్టర్ ఒకరు వ్యాఖ్యానించారని ది హిందు తెలిపింది. కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడి చేసేందుకు ఎ.జె.సి ఈ రోజు (సెప్టెంబర్ 26) పత్రికల సమావేశం ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

ఒక పక్క అవకాశాలు ఇస్తున్నట్లు కనిపించడం మరో పక్క కళ్ళెం వేసే ప్రయత్నాలను కొనసాగించడం అమెరికా అనాదిగా అనుసరిస్తున్న ఎత్తుగడ. “మాకు అనుకూలంగా వ్యవహరిస్తేనే అంతా అనుకూలంగా ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా తగిన ఫలితం అనుభవిస్తావు” అన్న బెదిరింపు సందేశంలో భాగంగానే ఒక పక్క రెడ్ కార్పెట్ పరిచి ఎదురుచూస్తున్నామని చెబుతూ మరో వైపు ఫెడరల్ కేసుకు అమెరికా అనుమతి ఇచ్చిందని భావించవచ్చు.

చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ ల అనుమతికి తాము వ్యతిరేకం అని బి.జె.పి విధాన నిర్ణయంగా చెబుతుంది. బ్రిక్స్ కూటమి సభ్య దేశంగా అమెరికా బద్ధ శత్రువులుగా అవతరిస్తున్న రష్యా, చైనాలతో ఇండియా సత్సంబంధాలు కొనసాగిస్తోంది. అమెరికా కరెన్సీ డాలర్ ను అంతర్జాతీయ కరెన్సీ స్ధానం నుండి కూల్చేందుకు చైనా, రష్యాలు సాగిస్తున్న ప్రయత్నాలకు ఇండియా కూడా ప్రయత్నంగానో, అప్రయత్నంగానో లేశమాత్రంగానైనా సహకరిస్తోంది.

దోహా రౌండ్ ప్రపంచ వాణిజ్య చర్చలలో భాగంగా ఉనికిలోకి తెచ్చిన ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ కు ఇండియా మోకాలడ్డుతోంది. భారత ఆహార భద్రతా చట్టానికి ఈ ఒప్పందంలో తగిన స్ధానం కల్పించకుండా ఒప్పందాన్ని అంగీకరించబోమని మోడి ప్రభుత్వం గత నెలలో వెనక్కి తగ్గింది. మధ్య ప్రాచ్యంలో ISIS వంక చూపుతూ సిరియా అధ్యక్షుడిని కూల్చివేసి తద్వారా మధ్య ప్రాచ్య దేశాల సరిహద్దులను తిరగరాయాలని అమెరికా తలపెట్టిన మహా వ్యూహంలో ఇండియా కూడా భాగం కావాలని అమెరికా ఆశిస్తోంది.

తనకు ఎదురవుతున్న ఆటంకాలను తప్పించడానికీ, తనకు కావలసింది సాధించడానికి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు, ఎత్తగడలకు దిగడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. మోడి పై దాఖలయిన ఫెడరల్ కేసు కూడా అందులో భాగమే. చెప్పిన మాట వింటే సరి. వినకపోతే ఈ కేసు అడ్డం పెట్టుకుని ఏదో ఒక రోజు ప్రతీకార చర్య ఎదుర్కోక తప్పదని అమెరికా హెచ్చరించదలుచుకుంది. అంతే తప్ప సిరియా, ఇరాక్, ఆఫ్ఘన్, పాక్ లలో ముస్లింలను ఊచకోత కోయిస్తూ గుజరాత్ ముస్లింల మానవ హక్కులపై వగచడం ఎలా సాధ్యం?

3 thoughts on “గుజరాత్ మారణకాండ: మోడికి అమెరికా కోర్టు సమన్లు

  1. నీవు నేర్పిన విధ్యయే నీరజాక్ష అన్నట్లు దొందు దొందే ఈ వ్యూహాలు ప్రతియూహాలు అమెరికాకు వారిని అనుసరిస్తున్న అధికార మదాందులకు వెన్నతో పెట్టిన విధ్యయే!

  2. ఇందియాలో నేరం చేసి అమెరికాకి పారిపోయినవాణ్ణి అమెరికా పోలీసులు అరెస్త్ చేసి ఇందియాకి పంపిస్తారు కానీ ఇందియాలో ఉన్నవాణ్ణి ప్రాసిక్యూత్ చేసే అధికారం అమెరికాకి ఉండదు. ఏ దేశ సార్వభౌమత్వం ఆ దేశానికి ఉంటుంది. ఇందియాని బ్లాక్‌మెయిల్ చెయ్యడానికి అమెరికా ఈ నాటకం ఆడుతోందనే నా అనుమానం.

  3. ఇంతవరకు ఎన్ని దేశాల సార్వభౌమత్వాన్ని అమెరికా గౌరవించింది? సార్వ బౌమత్వం అనేది మాటల వర కే పరిమితం. మన దేశ సార్వ బౌమత్వాన్ని మనం రక్షించుకోగలుగుతున్నామా? సార్వ బౌమత్వాన్ని రక్షించుకోవాలంటే జాతీయ ప్రభుత్వాలు కావాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s