కాంగ్రెస్ పాలనలో భారత దేశం సర్వ రంగాలలోనూ భ్రష్టు పట్టిపోయిందని బి.జె.పి తరచుగా చేసే ఆరోపణ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది ఎంతో ఇష్టమైన విమర్శ. తాము అధికారంలోకి వచ్చాము గనక ఇక నిశ్చింతగా నిద్రపోండి, మిగిలింది మేము చూసుకుంటాం అని వీరు చెప్పబోతారు. ఆలి పుట్టింటి సంగతి మేనమామకు తెలియదా అన్నట్లు దేశాన్ని ఐదేళ్ల పాటు, రాష్ట్రాన్ని 9 సం.ల పాటు ఏలిన నేతల సంగతి జనానికి తెలియకనా, గతి లేక గాని!
కాంగ్రెస్ భ్రష్టు పట్టించిన వ్యవస్ధలను తాను ప్రక్షాళన చేస్తానని ప్రధాని మోడి, ఆయన మంత్రులు శపధాలు లాంటివి అనేకమార్లు చేస్తున్నారు. అధికారం చేపట్టిన కొద్ది రోజులకే గంగా ప్రక్షాళన కోసం అంటూ ఓ కమిటీ వేశారు. పర్యావరణం, రవాణా, టూరిజం, నీటి వనరుల శాఖల కార్యదర్శులను ఈ కమిటీలో సభ్యులుగా చేశారు. అనంతరం యమునా నది ప్రక్షాళన కోసం మరో కమిటీ వేశారు.
అసలు జనమే స్వయంగా తమ నగరాలను, పట్టణాలను, పల్లెలను, కాలనీలను ఎందుకు ప్రక్షాళన చేసుకోగూడదు అని కూడా ప్రధాని కొద్ది రోజుల క్రితం ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ వారంలో కనీసం 2 గంటలు కేటాయిస్తే భారత దేశాన్ని శుభ్రం చేయడం పెద్ద పని కాదని ఆయన వాకృచ్చారు. తాను కూడా స్వయంగా చీపురు పట్టి ఊడ్చడానికి అభ్యంతరం లేదనీ, త్వరలో (అక్టోబర్ 2) ప్రారంభం అయ్యే ‘క్లీన్ ఇండియా’ కార్యక్రమాన్ని తానే చీపురు పట్టి ప్రారంభిస్తానని ప్రధాని చెప్పారు కూడా.
ఇక త్వరలో ప్రధాని మోడి చేతిలో చీపురును భారత ప్రజలు చూడబోతున్నారు. ఢిల్లీ వీధుల్లో చీపురు పట్టడం ద్వారా ప్రధానికి రెండు ప్రయోజనాలు కలగనున్నాయి. సాక్ష్యాత్తు ప్రధాన మంత్రే చీపురు పట్టి ఊడ్చితే ఎంత ప్రతిష్ట! అదొక ప్రయోజనం. రెండోది అతి ముఖ్యమైన ప్రయోజనం. ఢిల్లీ ప్రజలకు ఇప్పటివరకూ చీపురు అంటే గుర్తొచ్చేది అరవింద్ కేజ్రీవాల్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రధాని మోడి ‘క్లీన్ ఇండియా’ కార్యక్రమం కోసం చీపురు పడితే అది కాస్తా కేజ్రీవాల్ కు బదులు మోడీని గుర్తుకు తెచ్చినా ఆశ్చర్యం లేదు.
చీపురు మీదనే ఎన్నో ఆశలు పెట్టుకుని ఢిల్లీ ఎన్నికలకోసం ఎదురు చూస్తున్న కేజ్రీవాల్ మోడి ఇచ్చిన షాక్ తో ఇప్పటికే తీవ్ర అంతర్మధనంలోకి వెళ్ళిపోయి ఉండాలి! అందరూ దూరం పెట్టే చీపురును అగ్ర స్ధానానికి (కనీసం ఢిల్లీ వరకు) చేర్చిన కేజ్రీవాల్ ను దెబ్బతీసేందుకు అదే చీపురును సరికొత్త తరహాలో ఆశ్రయించడం మోడికే చెల్లింది. గుజరాత్ లో వరుసగా మూడు మార్లు బి.జె.పి అధికారం చేపట్టిందంటే మరి పట్టదా?