అమెరికా వ్యాపారులకు మోడి మీద అనుమానాలు!


Make In India

తాను చెబుతున్నట్లుగా ఆర్ధిక సంస్కరణలు అమలు చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోడికి గల నిబద్ధతపై తమకు అనుమానాలు ఉన్నాయని అమెరికా వ్యాపార వర్గాలు తమ అధ్యక్షుడు బారక్ ఒబామాకు మొర పెట్టుకున్నారు. మోడి ప్రభుత్వం పైకి తాము వ్యాపార వర్గాలకి అనుకూల వాతావరణం ఏర్పాటు చేస్తామని చెబుతూ ఆచరణలో భిన్న చర్యలు తీసుకుంటోందని యు.ఎస్.ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు మరో 15 వ్యాపార సంఘాలు ఒబామాకు ఫిర్యాదు చేశాయి. మోడి వస్తున్నారు గనుక ఒత్తిడి తెచ్చి ఆయన ధోరణి మార్చాలన్నది వారి ఫిర్యాదు + డిమాండ్ల సారాంశం.

తన అమెరికా సందర్శన అమెరికా-ఇండియా సంబంధాలను ఒక మలుపు తిప్పబోతోందని ప్రధాని మోడి ఇక్కడ చెప్పారు. మోడి రాకకోసం ఎదురు చూస్తూ తమ కళ్ళు కాయలు కాసి పండిపోవడం కూడా జరిగిపోయిందని, మోడి గారు వస్తే ఇక సహకారమే సహకారం అని అక్కడ ఒబామా కూడా ప్రకటించేశారు. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలలో ప్రసంగించడంతో పాటు పలు వ్యాపార వర్గ సమావేశాల్లోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ మోడి పాల్గొనబోతున్నారు. ఇండియాపై ఒత్తిడి తెచ్చి తమ పనులు చక్కబెట్టుకోవడానికి ఇదే సరైన సమయం అని అమెరికా కంపెనీలు భావిస్తున్నాయి. అనుకున్నదే తడవుగా తమ డిమాండ్ల జాబితాను, మోడిపై తమ అనుమానాలను, అనుమానాలకు గల కారణాలను వారు లేఖ రూపంలో అధ్యక్షుడు ఒబామాకు అందజేశారు.

ఒబామాకు లేఖ రాసిన వ్యాపార కంపెనీల సంఘాల్లో అనేక రంగాల కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ రంగం, సినిమా నిర్మాణం, ఔషధ రంగం, టెలికాం… మొదలైన అనేక రంగాలకు చెందిన వ్యాపార సంఘాలు ఈ లేఖపై సంతకాలు చేశాయని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ఈ సంఘాల ప్రతినిధులు స్వయంగా ఒబామాను కలిసి లేఖ ఇచ్చారని, వ్యాపార ఆటంకాలు తొలగించాల్సిందిగా మోడిపై ఒత్తిడి తేవాలని కోరారని పత్రిక తెలిపింది.

“అధికారం చేపట్టాక ప్రధాని నరేంద్ర మోడి భారత దేశం ‘వ్యాపారాలకు బహిరంగ ప్రదేశం’ అని ప్రకటించారు. విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం, ప్రోత్సాహకాలు ఇస్తామని బాస చేశారు. భారత దేశంతో వ్యాపారం చేయడానికీ, భారత దేశంలో ఉత్పత్తులు చేయడానికీ ప్రపంచానికి సానుకూల అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకూ నూతన ప్రభుత్వ పాలన చూస్తే తన సొంత విధానాలతో మరిన్ని సమస్యలు సృష్టించడం తప్ప చేసిందేమీ లేదు. ఈ చర్యలు గ్లోబల్ మార్కెట్ లో భారత్ పాత్ర గురించి మరింత కలవరపాటుకు గురి చేసే నూతన వైరుద్యపూరిత సంకేతాలను పంపుతున్నాయి” అని అలయన్స్ ఫర్ ఫెయిర్ ట్రేడ్ విత్ ఇండియా పేరుతో ఒబామాకు సమర్పించిన లేఖలో అమెరికా కంపెనీలు పేర్కొన్నాయి.

ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యూ.టి.ఓ) ఆధ్వర్యంలో జరుగుతున్న దోహా రౌండ్ చర్చలలో భాగంగా గత సంవత్సరం బాలి (ఇండోనేషియా) లో కుదిరిన వాణిజ్య సౌకర్యీకరణ ఒప్పందం (ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్) ను కొత్త ప్రభుత్వం నేతృత్వంలోని ఇండియా అడ్డుకోవడాన్ని అమెరికా వ్యాపార సంస్ధలు ఒక ముఖ్యమైన అంశంగా లేఖలో ప్రస్తావించారు. బాలి ఒప్పందంపై సంతకానికి ఇండియా నిరాకరించడంతో జులై 30 – ఆగస్టు 1 తేదీల్లో అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ జరిపిన ఇండియా పర్యటన వృధా అయిందని అమెరికా బహుళజాతి కంపెనీల అభిప్రాయంగా తెలుస్తోంది.

అమెరికా కంపెనీల అధిపతులు చేసిన మరో ఫిర్యాదు ఇండియా సుంకాలు పెంచడం గురించి. కొన్ని విదేశీ దిగుమతులపై ఇండియా సుంకాలు పెంచిందని వాటిని తగ్గించేలా చూడాలని కంపెనీలు ఒబామాను కోరాయి. అలాగే సమాచార మరియు ప్రసార సాంకేతిక పరిజ్ఞానంకు సంబంధించిన ఉత్పత్తులను దిగుమతి చేసుకునేముందు నూతన పరీక్షలకు ఇండియా గురిచేస్తున్నదని, ఈ పరీక్షలు తమకు భారంగా మారాయని కంపెనీలు ఫిర్యాదు చేశాయి.

భారత ప్రభుత్వ కంప్యూటర్ సమాచార వ్యవస్ధలపై హ్యాకర్ల దాడులు పెరగడంతో ప్రభుత్వం వినియోగిస్తున్న సమాచార, ప్రసార సాంకేతిక పరికరాలపై ఇండియా దృష్టి సారించింది. యాంటెన్నాలు, బ్రాడ్ బాండ్ మోడెంలు మొదలుకొని భారీ సమాచార ప్రసార ఉత్పత్తుల వరకు విదేశీ గూఢచర్యానికి, హ్యాకింగ్ కు అనువుగా దేశీయ వ్యవస్ధలు మారాయని భారత ప్రభుత్వం అనుమానించింది. ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడించిన ఇంటర్నెట్ గూఢచర్యం పత్రాలతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.

ఈ నేపధ్యంలో పలు చైనా తయారీ ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై ఆంక్షలు విధించింది. పశ్చిమ దేశాల దిగుమతులపై కూడా వివిధ పరీక్షలు నిర్వహించడానికి నిర్ణయించింది. దేశ భద్రత రీత్యా ఇది అత్యవసరం. ఇలాంటి పరీక్షలు లేకుండా నేరుగా దిగుమతులు చేసేసుకోవాలని అమెరికా బహుళజాతి కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. చైనా తయారీ పరికరాలు అనేకం పశ్చిమ బహుళజాతి కంపెనీల ఉత్పత్తులే. అందువలన చైనా పరికరాలపై ఆంక్షలు కూడా పశ్చిమ, అమెరికా కంపెనీల సరుకులపై ప్రభావం చూపుతోందని అర్ధం అవుతోంది.

చైనా కంపెనీల పరికరాల దిగుమతులపై ఇండియా ఆంక్షలు విధించినప్పుడు పశ్చిమ పత్రికలు సంబరం చేసుకున్నాయి. అదో పెద్ద వార్తగా చిలవలు పలవలు రాసుకుని సంతోషించాయి. కానీ తమ కంపెనీల పరికరాలను కూడా పరీక్షలకు గురి చేస్తున్న సంగతిని మింగలేక కక్కలేక దాచిపెట్టాయి. మోడి పర్యటనతోనన్నా ఈ వ్యవహారానికి ముగింపు పలికించాలని అమెరికా కంపెనీలు భావిస్తున్నాయని వారి ఫిర్యాదు ద్వారా అర్ధం అవుతోంది.

అమెరికా కంపెనీల ఫిర్యాదుకు ఒబామా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు రాయిటర్స్ తెలిపింది. ముఖ్యంగా డబ్ల్యూ.టి.ఓ వేదికపై రూపొందించిన ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ ను ఆటంకపరచడం మానుకోవాలని, ఒప్పందాన్ని అంగీకరించాలని మోడి పర్యటనలో ఒత్తిడి తేవడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. బహుశా మోడి పర్యటనలో ఇదే ప్రధాన అంశంగా మారినా ఆశ్చర్యం లేదు. అమెరికా ఒత్తిడికి ప్రధాని మోడి తల ఒగ్గినట్లయితే భారత పార్లమెంటు ఆమోదించిన ఆహార భద్రతా చట్టం అటకెక్కినట్లే. ఈ చట్టాన్ని అమలు చేయాలంటే ఆహార గింజలను కేంద్రం పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ఒప్పందం ప్రకారం దేశంలో పండే గింజల్లో 10 శాతం మాత్రమే నిల్వ చేసుకోవాలి. తమ ఆహార భద్రతా చట్టానికి అనువుగా బాలి ఒప్పందంలో తగిన స్ధానం కల్పిస్తేనే ఒప్పందాన్ని అంగీకరిస్తామని చెబుతూ ఇండియా సంతకం చేయకుండా వెనక్కి తగ్గింది.

ఇదిలా ఉండగా అమెరికా కాంగ్రెస్ లో వాణిజ్యం మరియు ఫైనాన్స్ వ్యవహారాలను పర్యవేక్షించే కమిటీ ఇండియా అనుసరిస్తున్న పక్షపాత వాణిజ్య విధానాలపై విచారణ చేయాలని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. మోడి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇండియా వాణిజ్య విధానాలలో మార్పులు వచ్చింది లేనిదీ విచారించాలని కమిషన్ ను కోరింది. సెప్టెంబర్ 24, 2015 తేదీ నాటికి విచారణ నివేదికను కాంగ్రెస్ కు సమర్పించాలని కమిటీ ఆదేశించింది. నోటితో నవ్వుతూ నొసటితో చిట్లించడం అంటే ఇదే.

మోడి అధికారంలోకి వచ్చాక అమెరికా బహుళజాతి కంపెనీలకు ప్రయోజనం కల్పించే చర్యలు తీసుకున్నారని కానీ అవి చాలవని అమెరికా వాణిజ్య విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రక్షణ రంగం, భీమా రంగం, రైల్వే రంగం లలో పలు నిబంధనలు, నియంత్రణలను మోడి సరళీకరించారని మెచ్చుకుంటూనే వాణిజ్యాన్ని అపభ్రంశం కావించే చర్యలు కూడా తీసుకున్నారని వారు ఆక్షేపిస్తున్నారు.

భారత ప్రభుత్వం, చట్ట సభలు ఆమోదించి అమలు చేస్తున్నామని చెబుతున్నా పర్యావరణ చట్టాలను, మేధో సంపత్తి హక్కుల చట్టాలను సవరిస్తామని మోడి ప్రభుత్వం పలుమార్లు హామీ ఇచ్చింది. ఈ హామీలకు సంతోషం ప్రకటించిన కంపెనీలు వాటిని ఇంకా అమలు చేయకపోవడం పట్ల అసంతృప్తి ప్రకటించారు. అమెరికాలో వివిధ రంగాల్లో పేరు మోసిన బడా బహుళజాతి కంపెనీల (గూగుల్, ఐ.బి.ఎం, జనరల్ ఎలక్ట్రిక్, గోల్డ్ మాన్ సాక్స్, బోయింగ్ మొ.వి) అధిపతులు ప్రధాని మోడీని కలిసి ఈ అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈ కంపెనీల గొంతెమ్మ కోర్కెలకు కనీస మాత్రపు ఆమోదం తెలిపినా భారత ప్రజల ప్రయోజనాలకు తీవ్ర నష్టం చేకూర్చడమే అవుతుంది.

అమెరికా కంపెనీల కోర్కెలు, డిమాండ్ల సారాంశం భారత దేశ వనరులను, సంపదలను మార్కెట్ ప్రయోజనాలను మొత్తంగా, సంపూర్తిగా వారి చేతుల్లో పెట్టడమే. అమెరికా ప్రభుత్వాన్ని దాదాపు ప్రైవేటు బహుళజాతి కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టినట్లే భారత ప్రభుత్వాన్ని కూడా వారి చేతుల్లో పెట్టాలన్నది వారి అప్రకటిత కోరిక.

అమెరికా పళ్లన్నీ చూపి నిండుగా నవ్వుతూ, చేతులు రెండూ అటూ ఇటూ విశాలంగా కౌగిలి కోసం చాచినప్పుడు ‘ఆహా ఏమీ ఈ ఆహ్వానం’ అని సంబరం కలిగితే కలగొచ్చు. కానీ అమెరికా నవ్వు విషపు నవ్వు. అమెరికా కౌగిలి దృతరాష్ట్ర కౌగిలి. ఆ సంగతి కౌగిలిలో చేరి ఆదమరిచి తిరిగి కళ్ళు తెరిచాకగానీ అర్ధం కాదు. ఆ కౌగిలిలో చేరి ఇప్పటికే అనేక దేశాలు దుంపనాశనం అయ్యాయి. పొరుగున ఉన్న పాకిస్తాన్ ని చూస్తూనే ఉన్నాం. అదే పరిస్ధితి భారత దేశానికి రాగూడదంటే అమెరికా దరిదాపులకు కూడా వెళ్లకపోవడం తప్ప మరో మార్గం లేదు. అమెరికా దాపులకు వెళ్లకపోవడమే కాదు, ఎదిరించి కూడా నిలవొచ్చని లాటిన్ అమెరికాలోని అతి చిన్న దేశాలు చక్కగా నిరూపిస్తున్నాయి. 120 కోట్ల మానవ సంపదతో పాటు అలవిమాలిన ప్రకృతి సంపదలు కలిగిన భారత దేశానికేం దుబ్బడాయి!

One thought on “అమెరికా వ్యాపారులకు మోడి మీద అనుమానాలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s