(విజిల్ బ్లోయర్) పేరు వెల్లడి వల్ల ప్రమాదాలు -ది హిందు ఎడిటోరియల్


Ranjit-Sinha

(ఒకపక్క 2జి, బొగ్గు కుంభకోణాల కేసుల్లో సుప్రీం కోర్టు కేంద్రీకరించి పని చేస్తుంటే మరో పక్క ఆ కేసుల్లోని నిందితులు తరచుగా సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఇంటిని సందర్శిస్తున్న సంగతిని ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్’ సంస్ధ సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చింది. భారీ కుంభకోణాల లోని నిందితులతో దేశంలోని అత్యున్నత విచారణ సంస్ధ అధిపతే చెట్టాపట్టాలు వేసుకుంటే విచారణలో పాల్గొంటున్న అధికారులపై ప్రతికూల ఒత్తిడి ఉంటుందని కనుక రంజిత్ సిన్హాను సి.బి.ఐ డైరెక్టర్ పదవి నుండి తప్పించాలని CPIL కోర్టులో పిటిషన్ వేసింది. పేరు పొందిన మాజీ సుప్రీం కోర్టు న్యాయాధీశులతో సహా అనేకమంది ప్రముఖ న్యాయవాదులు కలిసి ఏర్పాటు చేసిన CPIL వల్లనే 2జి కేసులో అక్రమ స్పెక్ట్రమ్ లైసెన్స్ లను కోర్టు రద్దు చేసింది. బొగ్గు కుంభకోణం కేసులో 1993 నుండి 2009 వరకు జరిగిన గనుల కేటాయింపుల్లో 4 మినహా మిగిలిన 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను సుప్రీం కోర్టు కొద్ది రోజుల క్రితం రద్దు చేయడంలోనూ CPIL సంస్ధదే ప్రధాన పాత్ర. ఈ సంస్ధ తనకు సి.బి.ఐ డైరెక్టర్ ఇంటి సందర్శకుల జాబితాను అందజేసిన విజిల్ బ్లోయర్ పేరును వెల్లడి చేయడానికి నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దానివల్ల విజిల్ బ్లోయర్ కు రక్షణ ఉండదని తేల్చి చెప్పింది. దానితో సుప్రీం కోర్టు విజిల్ బ్లోయర్ పేరు వెల్లడి చేయాలన్న తన ఆదేశాలపై పునరాలోచనలో పడింది. ఈ అంశంపై ఈ రోజు ది హిందూ ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం. -విశేఖర్)

*********

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఇంటి సందర్శకుల జాబితాను అందజేసిన వ్యక్తి గుర్తింపును వెల్లడి చేయాలన్న నిర్ణయాన్ని పునఃసమీక్ష చేసేందుకు సుప్రీం కోర్టు సుముఖంగా ఉండడం దానికదే ఆహ్వానించదగిన పరిణామం. అంతకు మునుపు సాక్ష్యంగా వినియోగించడానికి వీలుగా సమాచారం అందజేతకు నిర్ధారిత ప్రక్రియలను కారణంగా చూపిస్తూ, విజిల్ బ్లోయర్ పేరును సీల్డ్ కవర్ లో పెట్టి తనకు అందించాలని కోర్టు కోరింది. తద్వారా విజిల్ బ్లోయర్ కు హాని కలిగే అవకాశం ఉందన్న భయాందోళనలను రేకెత్తించింది. ఈ కేసులో పిటిషనర్ అయిన సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్, పేరు వెల్లడి వల్ల విజిల్ బ్లోయర్ కు శారీరక హాని జరగవచ్చని లేదా వేధింపులు ఎదురు కావచ్చని కారణంగా చూపుతూ పేరు చెప్పడానికి నిరాకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. దరిమిలా పేరు వెల్లడి చేయాలని ఒత్తిడి చేయాలన్న నిర్ణయం సరైనదా కాదా అన్న విషయంలో కోర్టు పునరాలోచనలో పడ్డట్లు కనిపిస్తోంది.

2జి స్పెక్ట్రమ్ అవినీతి కేసు నిందితులను తన ఇంటివద్ద (సి.బి.ఐ) డైరెక్టర్ తరచుగా కలిశారన్న ఆరోపణల తీవ్ర స్వభావం దృష్ట్యా, కోర్టు ఇతర మెటీరీయల్ సాక్ష్యాలను పరిశీలించవచ్చు. కోర్టు ముందు ఉంచబడిన మెటీరీయల్ లోని కొన్ని భాగాలు నిజమే అని నిర్ధారణ అయినందున సిన్హా నిజంగానే 2జి కేసు నిందితులను తన ఇంటివద్ద కలిశారా, ఒకవేళ కలిస్తే అలా కలవడానికి ఆయనకు ఉన్న కారణాలు ఏమిటి అన్న అంశాలపై తదుపరి విచారణకు అది ప్రాతిపదిక కాగలదు. అధికారము, పలుకుబడి కలిగిన వ్యక్తుల భాగస్వామ్యం ఉన్న అత్యంత తీవ్రమైన, సున్నితమైన కేసుల్లో తమ పేరు బహిరంగం అయితే ప్రమాదం ఎదురుకావచ్చని ఫిర్యాదుదారులు భావించవచ్చు. కోర్టుకు అందజేసిన సీల్డ్ కవర్లను కూడా జడ్జిలు కాని వ్యక్తులు చూసే అవకాశం ఉంది. కనుక రహస్యం కాపాడబడుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు.

విజిల్ బ్లోయర్స్ రక్షణ చట్టం, విజిల్ బ్లోయర్లకు వేధింపుల నుండి రక్షణ కల్పిస్తుంది గానీ పూర్తి స్ధాయి గోప్యతను ఇవ్వదు. ఈ చట్టం ప్రకారం ఫిర్యాదుదారు గుర్తింపు వెల్లడి కానట్లయితే ఆ ఫిర్యాదు ఆధారంగా ఎటువంటి చర్య తీసుకోనవసరం లేదు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఫిర్యాదు చేసే ఫిర్యాదుదారు గుర్తింపును కప్పి ఉంచే బాధ్యత చట్టం ప్రకారం అధికారులపై ఉన్నప్పటికీ ఫిర్యాదుదారు పూర్తిగా రహస్యంగా ఉండగల వ్యవస్ధను చట్టం ఊహించదు. ఈ పరిస్ధితి వల్ల ఏ కారణం చేతనైనా పరిశోధన ప్రక్రియలో భాగం వహించడానికి ఇష్టపడని వ్యక్తులు ప్రజా ప్రయోజనాల రీత్యా ముఖ్యమైన విషయాలను వెల్లడి చేయాలని భావిస్తే అలాంటివారు నిరుత్సాహానికి గురవుతారు.

నిజమే, దురుద్దేశ్యంతో చేసే ఫిర్యాదుల చుట్టూ తిరిగే స్ధాయికి దిద్దుబాటు వ్యవస్ధలు కుదించబడకుండా ఉండాలంటే ఫిర్యాదుదారు తనను తాను బహిర్గతం చేసుకుంటే ప్రయోజనం ఉంటుందన్న వాదనలో యోగ్యత లేకపోలేదు. అయితే అసాధారణమైన కేసుల్లో ఎల్లప్పుడూ అసాధారణ నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. సిన్హా ఇంటివద్ద ఉన్న సందర్శకుల జాబితా వెల్లడి అటువంటి అసాధారణ వెల్లడిలలో ఒకటి. కనుక అత్యంత తీవ్రతతో ఈ కేసును పరిశీలించవలసి ఉంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s