సెప్టెంబర్ 18 తేదీన జరిగిన రిఫరెండంలో యు.కెలో భాగంగా ఉండడానికే మెజార్టీ స్కాట్లండ్ ప్రజలు (55%)నిర్ణయించారు. రిఫరెండంలో విడిపోవడానికే స్కాట్ లు నిర్ణయిస్తారని భయపడిన యు.కె రాజకీయ పార్టీలు ఫలితాలతో ఊపిరి పీల్చుకున్నారు. యు.కెలో కొనసాగడానికే స్కాట్ ప్రజలు నిర్ణయించుకున్నప్పటికీ యునైటెడ్ కింగ్ డమ్ స్కాట్లండ్ భారం కొనసాగుతూనే ఉందని కార్టూన్ సూచిస్తోంది.
అది నిజమే. ఎందుకంటే స్కాట్లండ్ రిఫరెండం దగ్గరపడే కొద్దీ స్కాట్లండ్ స్వతంత్రానికి ఆదరణ పెరుగుతూ పోయింది. చివరి రోజుల్లో ఇరు పక్షాలు సమాన బలంతో ఉన్నట్లు వివిధ సర్వేలు చెప్పడంతో బ్రిటన్ రాజకీయ పార్టీలు అన్నీ కట్టగట్టుకుని స్కాట్లండ్ మీదికి దండు వెళ్ళాయి. కలిసి ఉండేపనైతే మరింత స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని వాగ్దానం చేశాయి. మరిన్ని రాజకీయ అధికారాలు ఇస్తామని హామీ ఇచ్చాయి.
అలా చివరి రోజుల్లో ఇచ్చిన హామీలే ఇప్పుడు యు.కె/బ్రిటన్ కు భారంగా పరిణమించాయి. వాస్తవానికైతే అవి భారం ఏమీ కాదు. స్కాట్ ప్రజల వాటా వారిది వారికి ఇవ్వడం భారం ఎందుకవుతుంది? అయితే పెట్టుబడిదారీ వ్యవస్ధల్లో కేంద్ర స్ధానంలో పెత్తనం చెలాయించే కంపెనీల హవాయే ప్రధానంగా నడుస్తుంది. ఇతర ప్రాంతాలు, జాతులలోని సంపన్న వర్గాల అధికారానికి, ఆధిపత్యానికి పరిమితులు విధించబడతాయి.
స్కాట్లండ్ రిఫరెండం దాని ఫలితమే. తీరా రిఫరెండం పూర్తయ్యాక ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం బ్రిటన్ ఆధిపత్య వర్గాలకు ఇష్టం లేకపోయింది. గతంలో పెట్టని షరతులను తాజాగా ప్రకటిస్తూ స్కాట్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు తూట్లు పొడిచే ప్రయత్నాలను బ్రిటిష్ ప్రధాని కామెరాన్ ప్రారంభించాడు.
కామెరాన్ ధోరణి గమనించిన స్కాటిష్ నేషనల్ పార్టీ (స్వతంత్రం కావాలని డిమాండ్ చేసిన ప్రధాన పార్టీ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మరిన్ని అధికారాలు ఇవ్వడంలో వెనక్కి తగ్గినట్లయితే మరోసారి రిఫరెండం జరిపించడానికి తాము వెనుదీయమని ఆ పార్టీ హెచ్చరించింది. ప్రజల తీర్పును తాము గౌరవిస్తామని కానీ చివరి రోజుల్లో కట్టగట్టుకుని వచ్చి ఇచ్చిన హామీల వల్లనే స్కాట్ ప్రజలు పునరాలోచనలో పడ్డారని, అలాంటి హామీలు నెరవేర్చకపోతే రిఫరెండం ఫలితానికి అర్ధం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. హామీలు నెరవేర్చే ఉద్దేశ్యం లేకపోతే స్వతంత్రాన్నే ప్రజలు కోరుకుని ఉండేవారని ఎస్.ఎన్.పి ఎత్తి చూపింది.
స్కాట్లండ్ రిఫరెండంలో స్వతంత్ర వ్యతిరేక శక్తులు రిగ్గింగ్ కు పాల్పడ్డాయని ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ తీర్పుకు కట్టుబడి ఉంటామని యెస్ పార్టీలు ప్రకటించాయి. కానీ బ్రిటన్ ప్రభుత్వం మాత్రం యేరు దాటాక తెప్ప తగలేయడానికే నిశ్చయించుకుంది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా జాతుల స్వతంత్ర ఆకాంక్షలు ఇలాగే తప్పుడు హామీలతో మోసగించబడతాయి. బ్రిటన్/యు.కె అందుకు మినహాయింపేమీ కాదు. కార్టూన్ లో యు.కె ప్రభుత్వానికి స్కాట్లండ్ భారం అని చూపారు గానీ నిజానికి స్కాట్ ప్రజలకే యు.కె భారం.