సగానికి పైగా అమెరికా రాష్ట్రాల్లో ఇప్పుడు దుర్భిక్షం తాండవిస్తోంది. సంవత్సరాల తరబడి కొనసాగుతోన్న వర్షపాత రాహిత్యం వల్ల పంటలు పండక కరువు, దరిద్రం సమస్యలు అమెరికన్లను పీడిస్తున్నాయి. దానితో పాటు వేడి వాతావరణం వ్యాపించడంతో పశ్చిమ, మధ్య పశ్చిమ రాష్ట్రాలు పొడిబారాయి. దరిమిలా కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాలు సున్నితంగా మారి ఏ మాత్రం చిన్న పొరబాటు జరిగినా భారీ దావానలాలకు దారి తీస్తోంది.
ప్రస్తుతం కాలిఫోర్నియా నిండా దావాలనాలు వ్యాపించాయి. పొడి వాతావరణం దావానలం వ్యాపించడానికి అనువుగా ఉండడంతో వేలాది ఫైర్ ఫైటర్లు శ్రమిస్తున్నా అవి అదుపులోకి రాకుండా ప్రభుత్వాల దుంప తెంచుతున్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలో మొత్తం 6 చోట్ల దావనలాలు రగులుతున్నాయి. ఈ ఆరింటిలో ‘రారాజు దావానలం’ (King Fire) గా పేరు పొందిన దావానలం ఎల్ డొరాడో నేషనల్ ఫారెస్ట్ అటవీ ప్రాంతాన్ని దహించివేస్తోంది.
విస్తారమైన అటవీ ప్రాంతంలో వ్యాపించి ఉండడంతో దీనిని కింగ్ ఫైర్ అని పిలుస్తున్నారు. సెప్టెంబర్ 17 తేదీన 70,000 ఎకరాల అటవీ ప్రాంతంలో విస్తరించిన ఈ రారాజు దావానలం సెప్టెంబర్ 22 తేదీకల్లా 87,500 ఎకరాలకు విస్తరించింది. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ప్రకారం ఇది అట్లాంటా, లాస్ వేగాస్, ఫిలడెల్ఫియా, పోర్ట్ లాండ్ నగరాల కంటే పెద్దది.
ఆరున్నర వేలమందికి పైగా అగ్నిమాపక సిబ్బంది దావనలాలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు. సెప్టెంబర్ 12 తేదీన ముట్టుకుని అతి వేగంగా వ్యాపించిన కింగ్ ఫైర్ లో కేవలం 18 శాతం మాత్రమే ఇప్పటికీ అదుపు చేయగలిగారు. వర్షాలు లేక గడ్డి, పచ్చిక ఎండి పోవడంతో మంటలు మరింత వేగంగా విస్తరిస్తున్నాయని కాలిఫోర్నియా ఫారెస్టు అధికారులు చెప్పారు. కింగ్ ఫైర్ వల్ల ఎల్ డోరాడో నేషనల్ ఫారెస్ట్ లో భారీ ఏరియా నాశనం అయినట్లు తెలుస్తోంది.
దావానలం విస్తరించే కొంది అది సమీపంలోని నగరాలకు అంటుకుంటోంది. ఇప్పటి వరకు 30కి పైగా భవనాలు మంటల్లో కాలిపోయాయని అధికారులు చెప్పారు. మరో 21,000 భవనాలు మంటల్లో కాలిపోయే ప్రమాదంలో ఉన్నాయి. సాక్రమేంటో లో 3,000 మందిని ఖాళీ చేయించారని పోస్ట్ తెలిపింది. మంటల అదుపుకు మానవ ప్రయత్నాల కంటే ప్రకృతిపైనే ఆశలు పెట్టుకున్నట్లు అధికారుల మాటల ద్వారా తెలుస్తున్నది. వాతావరణంలో తేమ కాస్త ఎక్కువగా ఉన్నవైపుకు మంటలు విస్తరిస్తున్నాయని, ఆ తేమ వల్ల మంటల వ్యాప్తి ఆగవచ్చని వారు చెబుతున్నారు. వాతావరణలో కూడా మార్పు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని, చల్లటి వాతావరణం ఏర్పడితే మంటలు అదుపులోకి వస్తాయని వారు ఆశిస్తున్నారు.
ఈ సంవత్సరం కాలిఫోర్నియాలో దావానలాలు సాధారణం కంటే ఎక్కువగా సంభవించాయని అమెరికా వాతావరణ నిపుణులు చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న వినాశకర కరువు పరిస్ధితి దానికి ప్రధాన కారణం అని కాలిఫోర్నియా అగ్నిమాపక విభాగం కాల్ ఫైర్ అధికారి జెర్రీ బ్రౌన్ చెప్పారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. సిస్కియు కౌంటీలో 500 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతాన్ని దహించిన దావానలాన్ని పూర్తిగా అదుపు చేశామని ఇంకా 5 దావానలాలు అదుపులోకి రావలసి ఉందని ఆయన చెప్పారు.
కింది ఫొటోల్లో మొదటిది నాసా అందించిన శాటిలైట్ చిత్రం. ఎర్ర రంగులో ఉన్న భాగం మంటలకు తగలబడిపోయిన అటవీ ప్రాంతం. మిగిలిన ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక అందించింది.
Photos: The Atlantic, NASA
సర్,మనదేశంలో ఇటువంటి దావానలాలు పెద్దగా సంభవించవు!కారణాలు తెలిస్తే చెప్పతలరు?(ఎవరైనా?)
అలాంటిదేమీ లేదు మూల గారు. నాకు తెలిసి మనదేశంలో కూడా దావానలాలు ఏర్పడుతూనే ఉంటాయి. తిరుమల అటవిలో మంటలు మనకు సర్వసాధారణమే కదా. ఇక మీరడగినదేమంటే పెద్ద పెద్ద దావానలాలు మనదగ్గర ఎందుకు ఏర్పడవని అనుకుంటా. అమెరికా, ఆస్ట్రేలియాల లాగా….మన దేశంలో మరీ అతి పెద్ద అటవీ ప్రాంతాలు కావు. కాబట్టి ఎక్కడైనా మంటలు అంటుకున్నా తక్కువ నష్టంతో బయటపడుతున్నాం. అదే అమెరికా, ఆస్ట్రేలియాల్లో అడవులు మనుషులు ఇంకా చేరని ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక అమెజాన్ అటవీ ప్రాంతం గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ.
దావానలాలు మన దగ్గర ఎందుకు ఎక్కువ రావంటే….మరీ ఎక్కువ దట్టమైన అటవీ ప్రాంతం లేదు కాబట్టి. మరిన్ని వివరాలకు కింది లింక్ చదవగలరు.
http://www.fire.uni-freiburg.de/photos/in/in.htm
చందుతులసి గారు,ఉపయోక్తకరమైన సమాచారమిచ్చినదుకు ధన్యవాదాలు.
నేనడిగింది పెద్దపెద్ద దావానాలు గురించే-వాటిగురించి మీరిచ్చిన లింక్ లో చూస్తే 1995లో యు.పి-హెచ్.పి లో ఏర్పడినదే తీవ్రమైన దావానలం అని తెలిసింది.అది నేనెప్పుడూ వినలేదు అప్పటికి నేను చాలా చిన్నవాడిని.