మంగళయానం విజయవంతం


భారత పత్రికల ప్రకారం భారత దేశం చరిత్ర లిఖించింది. భారత ప్రధాని నరేంద్ర మోడి ప్రకారం మొట్ట మొదటి ప్రయత్నంలోనే ఒక ఉపగ్రహాన్ని అంగారకుడి చుట్టూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మొట్ట మొదటి దేశంగా భారత దేశం చరిత్రపుటలకు ఎక్కింది.

11 నెలల క్రితం నవంబర్ 5 తేదీన పి.ఎస్.ఎల్.వి -సి25 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగించిన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ (MOM) అనే ఉపగ్రహం ఈ రోజు (సెప్టెంబర్ 24, 2014) విజవంతంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. బెంగుళూరులోని ఇస్రో కేంద్రం నుండి ఈ ప్రయోగాన్ని మన శాస్త్రవేత్తలు విజవంతం కావించారు. పత్రికలు, ప్రధాని చెప్పిన చరిత్ర లేఖనకు కారణం ఇదే. భారత దేశం తలపెట్టిన మంగళయానం (అంగారక యాత్ర) విజయవంతం కావడం నిస్సందేహంగా ఒక విజయ గాధ.

మొదటి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యను చేరిన ఖ్యాతి ఇప్పటికే ఇ.యు ఖాతాలో ఉంది. ఈ సంగతి మన ప్రధానికి ఎవరూ చెప్పినట్లు లేదు. అమెరికా, రష్యా, చైనా, జపాన్ లు మాత్రం మొదటి ప్రయత్నంలో అంగారక కక్ష్యలో తమ తమ ఉపగ్రహాలను ప్రవేశపెట్టడంలో విఫలం అయ్యాయి. అందువల్ల వారు ప్రయోగించిన అంగారక ఉపగ్రహాలు వృధా అయ్యాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా రెండో సారి విజయవంతం కాగా రష్యా మూడోసారి విజయవంతం అయింది.

తాజా ప్రయోగంతో ఇండియా, అమెరికా, ఇ.యు, రష్యాల సరసన నిలిచింది. మొట్టమొదటి ప్రయత్నంలోనే అంగారకుని చేరడంలో సఫలం అయిన దేశాల్లో ఇ.యు తర్వాత స్ధానాన్ని ఇండియా ఆక్రమించింది. కానీ ఇ.యు ఒకే దేశం కాదు. అది 28 దేశాల కూటమి. జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, హాలండ్ లాంటి అత్యంత సాంకేతిక అభివృద్ధి సాధించిన దేశాలు ఆ కూటమిలో సభ్యులు. ఆ విధంగా చూస్తే మొదటి ప్రయత్నంలో అంగారక కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన ‘దేశం’ ఇండియాయే అవుతుంది. బహుశా ప్రధాని మోడి ఈ సంగతే చెప్పి ఉంటారు.

మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM -మామ్) ప్రయోగం వరకూ భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ఇస్రో కేవలం ఒక అంతరిక్ష రవాణా సాధనంగానే ఉనికిలో ఉంది తప్ప నికరమైన అంతరిక్ష పరిశోధన సంస్ధగా ఉనికిలో లేదు. అనగా భారత ఉపగ్రహాలతో పాటుగా ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను భూ కక్ష్యలో ప్రవేశపెట్టే సంస్ధగానే ఇస్రో మనుగడలో ఉంది. ఇప్పటివరకూ 25 ప్రయోగాల ద్వారా పి.ఎస్.ఎల్.వి 65 ఉపగ్రహాలను భూ కక్ష్యలో ప్రవేశపెట్టింది. వాణిజ్య ప్రయోజనాలను నెరవేర్చుకోగల స్ధాయికి ఇండియా అభివృద్ధి చెందిందని చెప్పుకుని సంతృప్తి పడుతూ వచ్చాము. మామ్ విజయంతో ఇస్రో ప్రతిష్ట కాస్త పెరిగింది.

అతి తక్కువ ఖర్చుతో అంగారకుడిని చేరిన ఖ్యాతి కూడా ఇండియాకు దక్కింది. ఇండియా కేవలం 74 మిలియన్ డాలర్ల ఖర్చుతో అంగారకుడి కక్ష్యను చేరగా, అమెరికా 670 మిలియన్లు ఖర్చు పెట్టిగాని ఇటీవలి MAVEN ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతం చేయలేదు. మామ్ ప్రయోగించిన కొద్ది రోజుల తర్వాత అమెరికా తన MAVEN ఉపగ్రహాన్ని ప్రయోగించింది. కానీ మామ్ కంటే ముందుగానే సెప్టెంబర్ 21 తేదీన అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అంతరిక్షాన్ని పరిశోధించే లక్ష్యంతో MAVEN ని ప్రయోగించారు. MAVEN, MOM లకు కొన్ని ఉమ్మడి లక్ష్యాలు కూడా ఉన్నాయని గతంలోనూ, ఇప్పుడూ చెప్పారు. అవేమిటన్నదీ తెలియడం లేదు.

మామ్ విజయంతో చైనా అంతరిక్ష విజయాలకు ఇండియా గట్టి పోటీ ఇచ్చినట్లయిందని కొన్ని పత్రికలు వ్యాఖ్యానించాయి. ది హిందూ పత్రిక కూడా అందులో ఒకటి. కానీ శాస్త్ర ప్రగతి లక్ష్యం పొరుగు దేశాలతో పోటీ కాజాలదు. శాస్త్ర ప్రయోగాల విజయం, అది భూమి పైన కావచ్చు లేదా అంతరిక్షలో కావచ్చు, అంతిమంగా మనిషి మాత్రమే కావాలి. అంతకంటే ముఖ్యంగా భారతీయ పౌరుడు లక్ష్యం కావాలి. ఈ లక్ష్యం లేకుండా ఎన్ని దేశాల సరసన నిలబడ్డా అది వృధా అవుతుంది.

మామ్ ప్రయోగం విజయవంతం అయిన ప్రయోజనం భారత ప్రజలకు ప్రస్తుతానికి నేరుగా లేదు. అయితే అంతరిక్ష పరిశోధనల్లో మామ్ సఫలత ఒక మైలు రాయి. అంగారకుడిపై కొన్ని పరిశోధనలు చేయడానికి అని చెబుతున్న లక్ష్యాలు నామ మాత్రమే. మన వాళ్ళు పెట్టుకున్న వాస్తవ లక్ష్యం అంగారకుడి చుట్టూ ఒక ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టడం. తద్వారా భూ కక్ష్యకు అతీతంగా మరింత దూరంలో కూడా తాము ఉపగ్రహాలు ప్రయోగించగలమని ప్రపంచానికి చాటి చెప్పడం.

MOM ప్రయోగంపై మరిన్ని వివరాల కోసం గతంలో ప్రచురించిన ఆర్టికల్ ను కింది లింక్ లో చూడగలరు.

అంగారక ప్రయాణంలో ఒక దశ విజయవంతం

ఈ రోజు ఉదయం నుండి ఇస్రో శాస్త్రవేత్తలు MOM ను అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టే పనిలో నిమగ్నం అయ్యారు. నవంబర్ 5 తేదీన భూ కక్ష్యలో ప్రవేశించిన మామ్ అప్పటి నుండి తన భూ కక్ష్య పరిమాణాన్ని పెంచుకుంటూ పోయింది. డిసెంబర్ 1 తేదీన భూ కక్ష్యను వీడి అంతరిక్షంలో ప్రయాణం మొదలు పెట్టింది. దాదాపు 65 కోట్ల కిలో మీటర్ల దూరం అంతరిక్షంలో ప్రయాణం చేసిన అనంతరం ఈ రోజు ఉదయానికి అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించి ఘడియలకు దగ్గరయింది.

అంతరిక్ష ప్రయాణాన్ని వీడి అంగారకుని కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం క్లిష్టమైన దశ. అంతరిక్ష ప్రయాణంలో ఉపగ్ర వేగాన్ని తగ్గించడం, సరిగ్గా ఉద్దేశించిన సమయానికి, ఉద్దేశించిన కక్ష్యలోకి ప్రవేశించేలా ఇంధనాలను మండించడం, ఉపగ్రహంలోని ఇంజన్లు అన్నీ అనుకున్నట్లుగా పని చేసేలా చూడడం…. ఇవన్నీ కొద్ది నిమిషాల వ్యవధిలో జాగ్రత్తగా ఒక వరుసలో నిర్వహించాల్సిన చర్యలు. మన శాస్త్రవేత్తల ఈ చర్యలు (maneuvers) విజయవంతంగా పూర్తి చేయడమే అసలు విషయం. అయితే మనవారి చర్యలు విజవంతం అయింది లేనిదీ దశల వారీగా నాసా చెబితే తప్ప తెలియలేదు.

ప్రయోగం జరుగుతున్న నేపధ్యంలో ప్రధాని మోడి బెంగుళూరు లోని ఇస్రో కేంద్రం (ISTRAC) లో రెండు గంటల సేపు గడిపారు. ప్రయోగం సక్సెస్ అయ్యాక ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

ఇస్రో ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రారంభంలో MOM, అంగారకుడి చుట్టూ తిరుగుతున్న దీర్ఘ వృత్తాకార కక్ష్య దగ్గరి దూరం 427 కి.మీ కాగా గరిష్ట దూరం 78,500 కి.మీ. 1.1 మీ/సెకన్ వేగాన్ని లక్ష్యంగా పెట్టుకోగా మన వాళ్ళు సాధించిన వేగం 1.09 మీ/సెకన్. ఈ అంకెలు ఇంకా స్ధిరీకరణ చెందవలసి ఉంది. స్ధిరీకరణ అనంతరం అంకెల్లో మార్పులు ఉంటాయి.

 

 

5 thoughts on “మంగళయానం విజయవంతం

 1. first of all thanks to all scientists for such great achievement with less amount almost 10% of expenditure. i talked with a scientist who actively in this mission. he explained in detailed about the work they took up. for 7 to 8 months they worked in the project up to early hours 3.00 and after having a nap for four to five hours again they started the work at morning 9.00 a.m. because, on the prescribed date they have to launch MOM. the sad part is that UPA government sanctioned it at last moment because to get the credibility in election (that is his personal opinion, not to hurt any party or politician or any government). so thanks to general elections first. but politicians should avoid to take up all the activities only for election point of view.

 2. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ఈ విజయం గురించి సాధారణ జనానికి, స్కూలు పిల్లలకు విస్తృతంగా ప్రచారం చేయాలి. భారత క్రికెట్ జట్టు ఏ పాకిస్తాన్ మీదో, బంగ్లాదేశ్ మీదో విజయం సాధిస్తే సంబరాలు చేసుకునే మన జనం, యువతకు ఇటువంటి విజయాల గురించి కనీసమైనా అవగాహన కలిగించాలి.
  ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కుజదోషం గురించి. మన దేశంలో కుజుని గురించి అనేక భయాలు సందేహాలు ఉన్నాయి. కుజుని కారణంగా పెళ్లిళ్లు ఆగిపోతాయని అనుకుంటారు. మన దేశంలో కుజదోషం పేరుతో లక్షల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఐశ్వర్యరాయ్ తనకు కుజదోషం ఉందని అనేక గుళ్ల చుట్టూ తిరిగి పూజలు చేసింది…
  మరి ఇప్పుడు మన శాస్త్రవేత్తలు కుజుని గురించి అనేక విషయాలు తెలియజేస్తారు. వాటిని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది.

 3. శాస్త్రవేత్తల్‌ ఈ సాంకేతిక పరిజ్నాన్ని సాధించినందుకు సంతోష పడతారు గానీ, కుజదోషం వల్ల పెళ్లిల్లు ఆగి పోవడానికి మంగళ యానానికి సంబంద లేదని చెపుతారు. వీళ్ల ప్రకారం సైన్స్‌ ను సాంకేతికానికి ఉపయోగించ వచ్చుకానీ, సామాజిక శాస్త్రాల పేరుతో సమాజంలో చొచ్చుక ఫొవడం వారికి ఇష్టం ఉండదు. అందు వల్ల దానికి ప్రచారం లభించడం కల్ల. మన దేశంలో ఫిజిక్స్‌ శాస్త్ర వేత్తలు ఒక్క రోజు గుడికి వల్లకుండా వారికి తియరీ ముంద్కు కదలదు!

 4. అదే దురదృష్టకరమైన పరిస్థితి తిరుపాలు గారు. శాస్త్రవేత్తలు వారి వ్యక్తిగత నమ్మకాల ప్రకారం ఎలా నడుచుకున్నా ఫరవాలేదు కానీ….ఉపగ్రహాలు , రాకెట్ లాంచర్ల ప్రతిమనలను కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి కాళ్ల వద్ద, మావుళ్లమమ్మ తల్లి పాదాల వద్ద పెట్టడం అభ్యంతరకరం. తమ సొంత వ్యవహారాలు ఎలా చేసుకున్నా ఫర్వాలేదు. కానీ రకరకాల మతాలు, సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వ సంస్థలు అధిపతులు, బాధ్యులు….అలా చేయడం అభ్యంతరకరం.ఎందుకంటే మనది లౌకిక దేశమని రాజ్యాంగంలో రాసుకున్నాం కదా. మరి ఆ ప్రకారమైన నడుచుకోవాలి కదా….
  మరో వైపు సైన్స్ ను పెంచాల్సిన వాళ్లే….మూఢనమ్మకాలు ఆచరించడం ఇంకా శోచనీయం.

 5. మాం ప్రయోగం విజయవంతమైందుకు మనమందరం సంతోషించాల్సిందే!(అంతరిక్ష శాస్త్ర పరిశోదనలు విజయవంతమవ్వడం మానవాళీకులకు ప్రయోజనకరం)

  మన దేశంలో ఫిజిక్స్‌ శాస్త్ర వేత్తలు ఒక్క రోజు గుడికి వల్లకుండా వారికి తియరీ ముంద్కు కదలదు!

  కానీ….ఉపగ్రహాలు , రాకెట్ లాంచర్ల ప్రతిమనలను కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి కాళ్ల వద్ద, మావుళ్లమమ్మ తల్లి పాదాల వద్ద పెట్టడం అభ్యంతరకరం. తమ సొంత వ్యవహారాలు ఎలా చేసుకున్నా ఫర్వాలేదు. కానీ రకరకాల మతాలు, సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వ సంస్థలు అధిపతులు, బాధ్యులు….అలా చేయడం అభ్యంతరకరం.

  మనదేశంలో చాలామంది అంతరిక్ష ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు(వీళ్ళళ్ళో చాలామంది సుద్ధ భౌతిక శాస్త్రవేత్తలు కారు,అప్ప్లైడ్ ఫిజిక్స్ ను అనుసరిస్తున్నవారు) సున్నిత,సంకుచిత స్వభావం కలవారు-ఎందుకంటే భౌతిక శాస్త్రలలోనే ఒక ముఖ్య విషయ-భౌతిక శాస్త్ర అధ్యయనం సైంటఫిక్ టెంపెర్ ని కలుగచేయాలని.

  దేవుడు అనేవాడి ఉనికినే ప్రశ్నించే భౌతిక శాస్త్రం,శాస్త్రవేత్తలు తమ సిద్ధాంతాలను,ప్రయోగ ఫలితాలను ఏ దేవుడిపాదాల ముందైనా ఎందుకు పెడతాడు?అలా పెట్టేవాడు తను భౌతిక శాస్త్రవేత్త అని చెప్పుకోడానికి అనర్హుడు!విశాల దృక్పధం లేనివాడు.

  ఏదేమైనప్పటికీ,మాం ప్రయోగం విజయవంతమవడం సంతొషాన్ని కలిగించే విషయం(ముఖ్యంగా,తక్కువ వ్యయంతో పూర్తవడం,మొదటి ప్రయోగంలోనే సఫలం అచడం)

  ఈ విజయం,దేశంలో కొంతమందైనా అంతరిక్ష పరిశోదనల వైపు అధ్యయనం చేయడానికి ఉసిగొలుపుతోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s