మంగళయానం: చైనా ప్రశంసల జల్లు


PM Modi at ISTRAC

అంగారక ప్రయాణాన్ని విజయవంతం చేసినందుకు ఇండియాపై చైనా ప్రశంసల వర్షం కురిపించింది. రష్యా కూడా ఇండియాను అభినందించింది. మంగళయానం విజయవంతం కావడం ఒక్క ఇండియాకు మాత్రమే గర్వకారణం కాదని ఆసియా ఖండానికి అంతటికీ గర్వకారణం అనీ చైనా ప్రశంసించడం విశేషం.

మంగళయానం విజయం ద్వారా ఇండియా, చైనాకు అంతరిక్ష యానాంలో గట్టి పోటీదారుగా అవతరించిందని భారత పత్రికలు వ్యాఖ్యానించాయి. అయితే చైనా మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించింది. ఇండియా విజయం తన ఆసియా సహోదరుడి విజయం కనుక తమకూ విజయమే అని అభివర్ణించింది.

“ఇది ఇండియాకు గర్వ కారణం. ఆసియాకు కూడా గర్వ కారణమే. అంతరిక్ష అన్వేషణలోనూ అభివృద్ధి లోనూ మానవ జాతి సాధించిన ప్రగతిలో ఇది మైలు రాయి వంటిది. కనుక ఇండియాకు శుభాకాంక్షలు” అని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్ యింగ్ ప్రకటించారు.

చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ ఇండియా సందర్శించిన అనంతరం ఇరు దేశాలూ ఉమ్మడి అవగాహనకు వచ్చాయని చైనా ప్రచారం చేస్తున్న నేపధ్యంలో తాజాగా వెలువడిన చైనా ప్రశంసలు అదే ఒరవడిలోనివే. భవిష్యత్తులో ఇండియాతో సహా ఇతర దేశాలతో తాము అంతరిక్ష ప్రయోగాల విషయంలో సహకారం అందించుకుంటామని చైనా తెలిపింది.

“అంతరిక్షంను శాంతియుతంగా అభివృద్ధి చేసేందుకు మేము ప్రపంచంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. తద్వారా అంతరిక్ష రంగంలో స్ధిరమైన అభివృద్ధి సాధించడానికి మా వంతు సహకారం అందజేస్తాము. దీర్ఘకాలికంగా శాంతియుత అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తాము” అని చైనా విదేశీ శాఖ ప్రతినిధి చున్ యింగ్ తెలిపారు.

చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక పీపుల్స్ డెయిలీ సైతం తమ వెబ్ సైట్ లో ఇండియా మంగళయానం విజయవంతం కావడంపై నివేదిక ప్రచురించింది. ఇండియా ఘనతను గుర్తిస్తూ వ్యాఖ్యానం చేసింది. “తన మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహం చేరడం ద్వారా ఇండియా చరిత్ర సృష్టించింది” అని పత్రిక పేర్కొంది.

ప్రధాన మంత్రి ప్రసంగాన్ని పీపుల్స్ డెయిలీ పత్రిక ఉటంకించింది. “అసాధ్యాలను సుసాధ్యం చేయడం మనం అలవాటుగా మార్చుకున్నాం. మనకు తెలియని చోట్లకు మనం భారీ అంగలు వేయకుండా మానవ జాతి ఇంతటి ప్రగతి సాధించి ఉండేది కాదు. అంతరిక్షం మనకు తెలియని అలాంటి చోటుల్లో అతి పెద్దది” అని భారత ప్రధాని మోడి అన్నారని పత్రిక తెలిపింది.

రష్యా టుడే (ఆర్.టి) పత్రిక ప్రకారం 2020 నాటికల్లా ఒక రోవర్ ను అంగారకుడిపై దించడానికి చైనా పధక రచన చేస్తోంది. మరో దశాబ్దం అనంతరం అంగారకుడి నేల నుండి వివిధ పదార్ధాల నమూనాలను సేకరించి భూమి పైకి తేవాలని కూడా చైనా లక్ష్యంగా పెట్టుకుని కృషి చేస్తోందని ఆర్.టి తెలిపింది.

షరతులతో అభినందనలు

పశ్చిమ పత్రికలు షరతులతో కూడిన అభినందనలను ప్రచురించాయి. ది గార్డియన్, బి.బి.సి, న్యూ యార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, ఫోర్బ్స్ తదితర పత్రికలు మంగళయానంపై వ్యాఖ్యానం చేశాయి. ఒక పక్క అభినందిస్తూనే మరో పక్క దరిద్రంలో ప్రజలు కునారిల్లుతుంటే ‘మంగళయానం అవసరమా?’ అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారని రాశాయి. ఆ విమర్శకులు ఎవరో చెప్పడం మరిచాయి.

నవంబర్ 5, 2013 తేదీన పి.ఎస్.ఎల్.వి -సి25 ర్యాకెట్ మంగళయానం (మామ్) ఉపగ్రహాన్ని ప్రయోగించినప్పుడు కూడా పశ్చిమ పత్రికలు కొన్ని విమర్శలు చేశాయి. బ్రిటిష్ ప్రభుత్వం ఇస్తున్న సహాయంతోనే ఇండియా మంగళయానం చేపట్టిందని డెయిలీ మెయిల్ పత్రిక నిస్సిగ్గుగా రాసుకుంది. 450 కోట్ల రూపాయలు వృధా చేశారని ఆ పత్రిక అభిప్రాయం. అక్కడికి బ్రిటన్ లో దరిద్రం ఆనవాళ్లే లేనట్లు!

పలు పశ్చిమ దేశాల ఉపగ్రహాలను వాణిజ్య ప్రయోజనాలతో ప్రయోగించగల శక్తిని ఇండియా ఇప్పటికే సంతరించుకుందని ఫోర్బ్స్ పత్రిక ప్రస్తావించింది. బి.బి.సి, ద గార్డియన్ పత్రికలు అమెరికా అంగారక ఉపగ్రహం MAVEN, భారత ఉపగ్రహం MOM లను పోల్చుతూ ఎక్కువ తక్కువలను విశ్లేషించాయి. భారత ఉపగ్రహం అలంకార ప్రాయం కాగా అమెరికా ఉపగ్రహం ప్రయోజనకరమని చెప్పకుండా చెప్పాయి.

భారత మంగళయానం కేవలం చైనాతో పోటీ పడడానికే అని బి.బి.సి నిర్ధారించేసింది. చైనా ఇప్పటికే అనేక అంతరిక్ష రంగాల్లో ఇండియాను ఓడించిందని, అందుకే తామూ చైనాకు తీసిపోమని చెప్పడానికి ఇండియా ఈ ప్రయోగం నిర్వహించిందని చెప్పింది. ఈ అవగాహనను కొన్ని భారత పత్రికలు కూడా స్వీకరించడం ఒక విశేషం. పశ్చిమ కార్పొరేట్ పెట్టుబడులను ఇముడ్చుకున్న కొన్ని పత్రికలు తమ యజమానులు చెప్పినట్లు రాయడంలో వింత లేదేమో.

విచిత్రం ఏమిటంటే భారత ప్రభుత్వం చేసే ఇతర వృధా ఖర్చులను ఈ పత్రికలు ఎప్పుడూ ప్రశ్నించవు. ఉదాహరణకి ప్రపంచంలో అతి పెద్ద మొత్తంలో ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశం ఇండియా. ఈ దిగుమతులు ప్రధానంగా పశ్చిమ దేశాల నుండి చేసుకునేవే. కనుక ఈ ఖర్చుపై ప్రశ్నలు ఉండవు. కామన్ వెల్త్ గేమ్స్ కోసం 60 వేల కోట్లు ఖర్చు చేసింది ఇండియా. ఆ ఆటలు ఒకప్పటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గుర్తు చేస్తాయి గనుక అది వృధా ఖర్చు అని చెప్పలేవు. దివాళీ కోసం ఒక్క ముంబై నగరమే 600 కోట్లు ఖర్చు చేస్తుందని అంచనా. మతాబాలకు కావలసిన ముడి సరుకులను పశ్చిమ దేశాలే సరఫరా చేస్తాయి కనుక అది కూడా వృధా ఖర్చు కాదు. కానీ మంగళయానం చైనా సంగతి అటుంచి పశ్చిమ దేశాలకే పోటీ వస్తుంది. పొరబాటున మానవ నివాస యోగ్యమైన గ్రహం కనిపెడితే అక్కడ కాలనీలు అభివృద్ధి చేసేందుకు ఇండియా పోటీ వస్తుంది.ఈ దృష్ట్యా అంతరిక్ష ప్రయోగాల్లో పశ్చిమ దేశాలే ముందుండాలి. మరో దేశం అభివృద్ధి చెందడానికి వీలు లేదు.  అది చైనా అయినా సరే, ఇండియా అయినా సరే. అందుకే చైనా, పశ్చిమ దేశాల స్పందనల్లో ఈ తేడా!

ఒకే రంగంలో వివిధ సంస్ధలు లేదా దేశాలు పని చేస్తున్నప్పుడు పోటీ లేకపోయినా పోటీని చొప్పించడం పరిశీలకుల సహజ ధోరణి. ఆ పరిశీలకులు పత్రికలయితే ఇక చెప్పనవసరం లేదు. ఇష్టం లేని పరిశీలకులు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. భారత మంగళయానం విజయం పశ్చిమ దేశాలకు కంటగింపుగా ఉన్న సంగతి ఒక వాస్తవం.

2 thoughts on “మంగళయానం: చైనా ప్రశంసల జల్లు

  1. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రున్ని చేరుకుంటే…..ప్రపంచ మానవాళి మొత్తం సంబరాలు చేసుకుంది. దాన్ని మనిషి సాధించిన విజయంగా భావిస్తారు తప్ప కేవలం అమెరికన్ల ఘనతగా భావించరు. అలాంటిది ఒక దేశం అంగారకుని అన్వేషణలో ఎంతో కొంత ముందడుగు వే్స్తే….సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని కోరాలి తప్ప…పాశ్చాత్య మీడియా ఇలా కళ్లల్లో నిప్పుులు పోసుకోవడమేమిటి…?

  2. మన విజయం,మన కన్నా తోటివారు గుర్తించినప్పుడే దానిని మరంత ఆస్వాదించగలుగుతం.
    పశ్చిమపత్రికలు తమ అసూయని వెల్లగక్కినప్పుడు మనం ఎటువంటి విజయాన్ని సాధించామో అవిచెప్పకనే చెపుతున్నాయి,కనీసం మాం ప్రయోగం విజయవంతమవడాన్నికూడా అవి ఆస్వాదించలేకపోవడం వాటి పక్షవాత బుద్ధికి నిదర్శనం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s