‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు బహిరంగ లేఖ -ది హిందూ


deepika

(బాలీవుడ్ నటి దీపికా పడుకోనె కేంద్రంగా ఆంగ్ల పత్రికల మధ్య ఒక యుద్ధం లాంటిది కొద్ది రోజులుగా నడుస్తోంది. ఎప్పుడో సంవత్సరాల క్రితం నాటి వీడియోను వెలికి తీస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా (టి.ఓ.ఐ) పత్రిక విలేఖరి ఒక సంచలన శీర్షిక పెట్టి ట్వీట్ చేశారు. ఇది నచ్చని దీపిక టి.ఓ.ఐ  ఘాటుగా స్పందించారు. ఆమె స్పందనతోనైనా తన తప్పు సవరించుకోని టి.ఓ.ఐ మరిన్ని దీపిక ఫోటోలను ప్రచురించి ‘నీదే తప్పు’ అన్నట్లుగా ఒక ఆర్టికల్ ప్రచురించింది. పైగా అందరూ చేసేదే తానూ చేస్తున్నానని నిస్సంకోచంగా చాటింది. ఆమెను అప్రతిష్టపాలు చేసేందుకు గతం తవ్వేందుకు ప్రయత్నించింది. ఈ ధోరణిపై ఇతర పత్రికలు విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా డి.ఎన్.ఏ, ఫస్ట్ పోస్ట్ పత్రికలు టి.ఓ.ఐ విలువల లేమిని ఎండగట్టాయి. ఈ వరుసలో సోమవారం ది హిందూ పత్రిక బ్లాగ్ ‘బై ద వే’ లో రాధికా శంతనం రాసిన ఆర్టికల్ ప్రచురించింది. సదరు ఆర్టికల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)

*********

డియర్ టైమ్స్ ఆఫ్ ఇండియా,

ఎవరికైనా నోరు మూసుకుని గమ్మున ఉండాల్సిన సమయాలు కొన్ని ఉంటాయి. ఆన్ లైన్ ప్రపంచంలో అత్యధికులు నిన్ను పడతిట్టిపోస్తున్నపుడు, నువ్వు చేసింది సరైందే అని నువ్వు నమ్ముతున్నప్పటికీ, కాస్త నీకు నువ్వు అంతర్మధనం చేసుకోవడం వల్లా, జనం నిన్ను అంతలా తిట్టిపోస్తున్నారెందుకని ప్రశ్నించుకోవడం వల్ల నష్టం ఏమీ జరగదు. దీపికా పడుకోనే పై ప్రచురించిన మీ ఆర్టికల్ పై ఆమె ఆగ్రహంతో చేసిన ట్వీట్ కూ, ఫేస్ బుక్ లో రాసిన పోస్ట్ కూ మీ ప్రతిస్పందన, ప్రత్యేకంగా ఆమె వక్షంపై, దిగ్భ్రాంతికరంగానూ, అనూహ్యంగానూ ఉంది. మీరు ఆపాలజీ చెప్పి ఉండాల్సింది. లేదా ఏమీ మాట్లాడకుండా గమ్మున ఊరుకునైనా ఉండాల్సింది. ఈ రెండింటిలో ఏమీ చేయకపోగా మొత్తం అంశాన్నే దురవగాహన చేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు గోతిలోకి మరింత లోతుగా దింపుకున్నారు.

బోంబే టైమ్స్ లో మీరు ఆర్టికల్ (Dear Deepika, our point of view, sept. 21) ప్రచురిస్తూ ఇలా అన్నారు, “ప్రింట్, టి.వి, రేడియో మరియు ఆన్ లైన్ రంగాల్లో శాఖలు కలిగి ఉండి ప్రపంచంలోనే అత్యంత పెద్ద మీడియా హౌస్ గా వినుతికెక్కిన సంస్ధగా మేము ప్రతి మీడియం లోనూ దేనికదే ప్రత్యేకమైన పద్ధతిని, మా శ్రోతలకు/పాఠకులకు మల్లేనే,  అవలంబిస్తాము. వార్తాంశాల (content) పంపిణీని తీసుకున్నా, వినియోగం తీసుకున్నా, వివిధ మీడియాలు అన్నింటికీ సరిపోయే ఫార్ములా అనేదేమీ లేదు”

వివిధ మీడియా సంస్ధలు ఒక్కో మీడియంనూ ఒక్కో పద్ధతిలో నిర్వహిస్తాయనే సంగతి నిజమే. కానీ సంపాదక విలువలు, నీతి సూత్రాలూ మాత్రం ఒకటే ఉంటాయి. ఆన్ లైన్ లో కూడా ఏది ముద్రించవచ్చు, ఏది కూడదు అనే అంశాల్లో ఇంకా కొన్ని పరిమితులు ఉన్నాయి. “ఆన్ లైన్ ప్రపంచం… ఆరాచకంగా, వ్యర్ధాలతో కూడి ఉంది – సంచలనాత్మక హెడ్ లైన్లు అసాధారణం ఏమీ కాదు” అని చెబుతూ అసలు సమస్యను పక్కకు ఉడ్చేయడం ద్వారా మీ తప్పుల పట్ల మీరు నిరపరాధపూర్వక ధోరణి ప్రదర్శించారు. మీ సందేశం సారాంశం ఏమిటంటే ‘అవునూ, ఇది సరైంది కాకపోవచ్చు, కానీ అన్నీ అలాగే ఉన్నాయి మరి. కాబట్టి మీరు దానికి అలవాటు పడక తప్పదు’ అని. నిజానికి ఆన్ లైన్ ప్రపంచం అరాచకంగా, వ్యర్ధాలతో నిండి ఉంది. కానీ మీతో పాటు ఏ మీడియా సంస్ధ అయినా ఒక అంశాన్ని పోస్ట్ చేసేప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసి రావడానికి కారణం అదే కదా. దానికి బదులు మీరు నిర్లజ్జగా ఒక మహిళను వస్తువుగా చూపడానికీ, సంచలనాత్మకం చేయడానికి మాత్రమే నిర్ణయించుకున్నారు.

మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్యల్లో ఒకటిగా కొనసాగుతున్న కాలంలో మీరు ఇలా చేయడం -పైగా ఏ పశ్చాత్తాపమూ చూపకపోవడం – వల్ల పరిస్ధితి మరింత ఘోరంగా తయారయింది. సెక్సిస్టు ధోరణులు తమను తాము భిన్న రూపాల్లో వ్యక్తం చేసుకుంటాయి -ఓర చూపులు, తేరిపార జూడడం, గాయపరిచే మాటలు రువ్వడం… ఇవన్నీ ఒక చివర ఉంటే అత్యాచారం లాంటి మహిళా వ్యతిరేక నేరాలు మరో చివర ఉన్నాయి. ఓ పక్క తీవ్ర రూపాల పట్ల గొంతు రాసిపోయేలా పెడబొబ్బలు పెడుతూ మరో పక్క మరింత సున్నిత రూపాల్లో స్వయంగా నిమగ్నం కావడంలో తప్పేమీ లేదని నమ్మడం తగదు. మీరు ‘హిపోక్రసీ’ అని వాపోవడం నేను విన్నట్లుందే?!

ఆ తర్వాత మీరు అడుగుతారు: “దీపికా హిపోక్రసీ పబ్లిసిటీ కోసమేనా?” అని. ఆ ప్రశ్న కింద (అది ప్రశ్న కాదనీ, ఆ నటి మిమ్మల్ని నిశితంగా విమర్శించడానికి అదే కారణమనీ మీరు చాలా గట్టిగా నమ్ముతున్నట్లే కనిపిస్తోంది) ఆమె ఫోటోలు కొన్నింటిని ముద్రించారు -నటి వక్షద్వయాన్ని చూపేవి, ఆమె క్లీవేజీని, ఆమె కాళ్ళను చూపే ఫోటోలవి. ఫోటో షూట్ ల కోసం, ఇంకా ఇతర సందర్భాల కోసం దీపిక ఉద్దేశ్యపూర్వకంగానే తన శరీరాన్ని ప్రదర్శిస్తోందని, కనుక మీరు అంత ఉదారంగా ఆమెకు ప్రశంసలు అందజేస్తుంటే ఆమె గాయపడవలసిన అవసరం ఏమిటని మీరు ఎత్తి చూపాలని ప్రయత్నిస్తున్నారు.

లేదు, టి.ఓ.ఐ. ఒక మహిళ క్లీవేజీలోకి జూమ్ చేసి అందునుండి ‘OMG! Deepika’s Cleavage Show’ అన్న శీర్షికతో ఒక స్టోరీని తయారు చేయడానికీ, ఆమె స్వయంగా ఫోజు ఇచ్చిన ఫోటోలను పోస్ట్ చేయడానికి మధ్య తేడా ఉంది. మొదటిది ఏకాంతంలోకి పచ్చిగా చొరబడడం కాగా రెండవది ఆమె ఎంపిక. స్పెయిన్ లో రణధీర్ కపూర్ తో బికినీలో ఉండగా తీసిన ఫోటోలను పత్రికలన్నీ పరిచి ప్రచురించినపుడు సరిగ్గా ఈ కారణంతోనే కత్రినా కైఫ్ ఆగ్రహం చెందారు. ఆమె బికినీలో ఉన్న ఫోటోను ప్రచురించినందుకు కాదు ఆమెకు కోపం వచ్చింది; ఆమెకు తెలియకుండా, ఆమె అనుమతి లేకుండా ఫోటోలు తీసి ప్రచురించినందుకే ఆమెకు ఆగ్రహం వచ్చింది. మీరు ఇక్కడ మిస్ అవుతున్న అంశం:  అనుమతి ఉండడం లేదా అనుమతి లేకపోవడం!

దీపిక శరీరం ఆమెకు మాత్రమే చెందినది – ఆమె తన శరీరంతో ఏమి చేసుకునేందుకైనా ఎంచుకోవచ్చు. ఆమె శరీర భాగాలపై ఫోకస్ చేసి, వాటిపై వ్యాఖ్యానం చేయడం ద్వారా, ఈ రోజు మహిళలు ఏ సమస్యకు వ్యతిరేకంగానైతే ప్రతిరోజూ పోరాడుతున్నారో అదే మీరు చేస్తున్నారు -వస్తువీకరణ (మహిళ శరీరాన్ని ఒక వస్తువుగా పరిగణించడం). ఆమె క్లీవేజీ పై మీ స్పందన, రోడ్డుపై నడుస్తున్న ఒక మహిళను చూసి -ఆమె పూర్తిగా వస్త్రాలు ధరించినా లేకున్నా – ఈల వేసే తుంటరి వెధవ కంటే, లేదా బస్సులో ప్రయాణిస్తున్న మహిళ పైట జారిపడ్డప్పుడు తేరిపారజూచే వెధవకన్నా భిన్నంగా ఏమీ లేదు. నిజంగా తేడా ఏమిటి చెప్పండి? వాళ్ళు తమ కళ్ళతో జూమ్ చేస్తుంటే మీరు మీ కెమెరాతో జూమ్ చేస్తున్నారు.

పురుషులను కూడా వస్తువీకరణ చేస్తున్నారంటూ మిమ్మల్ని మీరు సమర్ధించుకుంటున్నారు. షారూఖ్ ఖాన్ 8 ప్యాక్ ఆబ్ కి కూడా OMG స్పందనే వస్తుంది కదా, ఏమిటి తేడా అని మీ ప్రశ్న! ఇది అంత గొప్ప ఆత్మ రక్షణ కాదు సుమా. “మేము షా రూఖ్ ఖాన్ ను కూడా వస్తువీకరిస్తున్నాం… మేము అందరినీ వస్తువీకరిస్తున్నాం… కాబట్టి ఏమిటీ సొదంతా?” అని మీరు సీరియస్ గానే అడుగుతున్నారా?

ఇదంతా దీపికా పబ్లిసిటీ కోసమే చేస్తున్నట్లా? నాకు తెలియదు, కానీ జనం మిమ్మల్ని కూడా అదే ప్రశ్న అడుగుతున్నారని చెప్పడం కాస్త మర్యాదగా ఉంటుందేమో.

మీకు సెన్సార్ బోర్డ్ అవసరం లేదు టి.ఓ.ఐ, కానీ అవును, అటువంటి స్టోరీలు ముద్రించేటప్పుడు కాసిన్ని సంపాదక చర్చలు జరపడం చెడ్డ ఆలోచనేమీ కాదు కదా. నేడు వెలువడుతున్న ఆగ్రహావేశాలు మీకు తప్పి ఉండేవి. దయచేసి అర్ధం చేసుకోండి! ‘సొంతదారుతనం’ (ownership) -ఒక వ్యక్తిని మరో వ్యక్తికి చెందిన వస్తువుగా పరిగణించడం- అనేది వస్తువీకరణ యొక్క లక్షణాల్లో ఒకటి కాగా, ‘ఆత్మాశ్రయ నిరాకరణ’ (denial of subjectivity) లేదా ఆ వ్యక్తికి కొన్ని భావాలు ఉంటాయన్న వాస్తవాన్ని పరిగణించకపోవడం మరొక అంశం. ఇక్కడ చర్చలోకి వచ్చిన అంశం మీ పోస్టు వల్లా, మీ ప్రారంభ స్పందన వల్లా మరుగునపడిపోయింది. ఆమె ఆత్మాశ్రయత (ఆమె అంతర్గత భావాలు) నిరాకరించబడిందని చాలా చక్కగా స్పష్టం అయింది. మీరు చేసి ఉండవలసిందల్లా ఆమె స్పందనను, భావాలను పరిగణనలోకి తీసుకోవడం, విచారం వ్యక్తం చెయ్యడం. లేదా నిజంగానే, గమ్మున ఉండిపోవడం.

యువర్స్ ట్రూలీ

ఒక ఆదివారం ఉదయాన చిరాకుకు గురయిన ఓ మహిళ

*********

ఏం జరిగింది?

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక విలేఖరి ఒకరు ఓ పాత వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ‘OMG! Deepika’s Cleavage Show’ అని ట్వీట్ చేశారు. దీపిక పడుకోనే ఈ ట్వీట్ కు ఒకింత ఆగ్రహం జోడించి స్పందించారు “YES! I am a Woman. I have breasts AND a cleavage! You got a problem!!??” అని. దీనికి శోబా దే (ఫెమినిస్టుగా చెప్పబడే ఓ కాలమిస్టు), పూజా బేడీ (నటి) స్పందిస్తూ పత్రికకు మద్దతుగా వచ్చారు. షారూఖ్ ఖాన్ 8 ప్యాక్ ఆబ్ ను ప్రదర్శించి చూపడం లేదా అలాగే ఇదీనూ! అన్నది వారి స్పందన సారాంశం.

Sunday article in Bombay Times (Wing of TOI)

Sunday article in Bombay Times (Wing of TOI)

దీపికా పడుకునే దీనికి కూడా స్పందించారు, ఇలా: “Yes we marvel, envy and drool over a male actors 8pack abs in a film, but do we zoom in on the mans ‘crotch’ when he makes a public appearance and make that ‘cheap headlines’??!!”

ఈ స్పందనకు ప్రతిగా టి.ఓ.ఐ భారీ ఆర్టికల్ ఒకటి ఆదివారం (సెప్టెంబర్ 21) ప్రచురించింది. ఆర్టికల్ తో పాటుగా దీపికకు సంబంధించి పలు ఫోటోల్ని ప్రచురించింది. ఇప్పటి ప్రమాణాల ప్రకారం చూస్తే అవి అసలు వల్గర్ కానే కాదు. అయినా వాటిలో టి.ఓ.ఐ తప్పులు వెతుకుతూ అసభ్య వ్యాఖ్యలు చేసింది. ఆమె కెరీర్ ఒక క్యాలండర్ గరల్ గానూ, మద్యం కంపెనీ ప్రచారం చేసిన మోడల్ గానూ ప్రారంభం అయిందని గుర్తు చేసింది. అలాంటి కెరీర్ ఉన్న నటి, మోడల్ ఇలాంటి అసభ్య ప్రచారానికి తగునన్నట్లుగా కుతర్క పాండిత్యం ప్రదర్శించింది.

టి.ఓ.ఐ నిస్సిగ్గు సమర్ధన ఇతర పత్రికలను రంగంలోకి దింపింది. డి.ఎన్.ఏ, ఫస్ట్ పోస్ట్, డెక్కన్ క్రానికల్ తదితర పత్రికలు టి.ఓ.ఐ ని తీవ్రంగా విమర్శిస్తూ ఆర్టికల్స్ ప్రచురించాయి. అయితే ఆ పత్రికల విమర్శలు సమస్య లోతుల్లోకి వెళ్లలేకపోయాయి. ది హిందూ ప్రచురించిన ఈ ఆర్టికల్ సమస్య మూలాలను కాస్త తడిమింది. సినీ పరిశ్రమలో హీరోయిన్లు, ఇతర మహిళా నటుల అంగ ప్రదర్శన చేస్తారు కాబట్టి వారు ఎలాంటి అసభ్య వర్తనకైనా, వ్యాఖ్యలకైనా అర్హులే అన్న చులకన భావాలు కలిగి ఉండడం ఎంతవరకు సబబు అన్నదీ ఈ ఆర్టికల్ ఒక అవగాహన కల్పిస్తుంది. అవగాహన కోసం అవగాహన అని కాకుండా నిత్య జీవితంలో ఈ అవగాహనను ఆచరించడం, స్నేహితులకు చెప్పడం, వారిని సరైన అవగాహన వైపుగా ప్రోత్సహించడం మనం చేయవలసిన పని. ఆ వైపుగా పాఠకులు ఆలోచించాలని ఆకాంక్షిస్తూ ఈ అనువాదం ప్రచురించడం జరుగుతోంది.

12 thoughts on “‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు బహిరంగ లేఖ -ది హిందూ

 1. T.O.I. (let) paper ఒక బూతు పత్రిక. దానికి యువకుల్లో ఉన్న సర్క్యులేషను పోనీ పాపులారిటీ page 3 వల్లే. విషయం క్యారెక్టర్ దాకా వచ్చింది కాబట్టి. దీపిక విషయంలో వ్యాఖ్యానించే నైతిక హక్కు TOIకి ఉందా? ఒకవేళ ప్రతిభారతీయ హీరోయినూ సంప్రదాయ వస్త్రాలుమాత్రమే ధరించి ఫోజులిస్తే, అప్పుడు నస్టం వారిక్కాదా? అప్పుడుమాత్రం TOI వాళ్ళకి ఈమాత్రం సర్క్యులేషనుండేదా? అప్పుడు TOI వాళ్ళు విదేశీ మోడళ్ళ బికినీ బొమ్మలు page 3 లో ప్రచురించకుండా ఉంటారా? ఈవ్యవహారమంతా ‘తిడితే తిడతారుగానీ పబ్లిసిటీ ఐతే వస్తుందికదా’ అన్న attitudeతో సాగుతోంది. తడికెల కన్నాల్లోంచి చూసే వాళ్ళకు ఇతరులకు నీతులుబోధించే నైతిక హక్కుంటుందా?

 2. ఓర్పుగా కూర్చుని ఆసాంతం చదివినా ఈ గొడవంతా దేని గురించో అర్థం కాలేదు. మళ్ళీ ఇందులో రేపులూ, వస్తూకరణ, ఫెమినిజమ్, సెక్సిజమ్ అంటూ సందర్భానికి అతకని పడికట్టు పదజాలాన్ని కలుపుకుని మరింత సంక్లిష్టంగా కొట్టేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. People resort to big vocabulary when they have little understanding. Deepika acts for money. TOI publishes for money. Whose side shall we take?

 3. దేపిక exposing woman empowerment ఎలా అవుతుందో అర్ధం కావడం లేదు .
  నాకు శరీరం ఉంది నా ఇష్టం , ఇక్కడ శరీరాన్ని ఒక వస్తువు గా చూసేది ఎవరు ?
  ఒకో ఫోటో సెషన్ కి ఇంత అని , కొంచెం ఎక్కువ expose చేయాలంటే కొంత ఎక్కువ ఇచ్చుకోవాలి అని ..
  ఇవన్ని వుమన్ empowerment గా ఎలా వస్తాయి .

 4. మహోజస్ గారు, మీకు అర్ధం కాలేదన్నారు బానే ఉంది. దేని గురించో అర్ధం కానప్పుడు మీరు ఉదహరించిన పదాలు సందర్భానికి అతకలేదని ఎలా అన్నారో నాకు అర్ధం కాలేదు.

  ఫెమినిజం గురించి ఆర్టికల్ లో ఎక్కడా లేదు. పత్రికకు మద్దతుగా వచ్చిన ఒక కాలమిస్టు ఫెమినిస్టుగా పేరుపడ్డారు అని నేను సూచించానంతే.

  విషయానికి వస్తే, మీ వ్యాఖ్యలో చివరి మూడు వాక్యాలున్నాయి చూసారూ, ఆ అంశాన్నే ఆర్టికల్ చర్చించింది.

 5. @venkat

  దీపిక ఎక్స్ పోజింగ్ ని వుమెన్ ఎంపవర్ మెంట్ అని ఆర్టికల్ లో అన్నారా? లేదు కదా! అననప్పుడు మీకలా అర్ధం కావలసిన అగత్యం ఎందుకు వస్తుంది?

  మీరు అర్ధం తీసినట్లు దీపిక ‘నా శరీరం నా యిష్టం’ అని కూడా అనలేదు. ఆమె శరీరాన్ని ఏమైనా చేసుకునే హక్కు ఆమెకు ఉందని ఆర్టికల్ రచయిత్రి అన్నారు గాని దీపిక అనలేదు. ఆర్టికల్ లోనే ఒక చోట స్పష్టంగా ఇలా అన్నారు:

  “ఒక మహిళ క్లీవేజీలోకి జూమ్ చేసి అందునుండి ‘OMG! Deepika’s Cleavage Show’ అన్న శీర్షికతో ఒక స్టోరీని తయారు చేయడానికీ, ఆమె స్వయంగా ఫోజు ఇచ్చిన ఫోటోలను పోస్ట్ చేయడానికి మధ్య తేడా ఉంది. మొదటిది ఏకాంతంలోకి పచ్చిగా చొరబడడం కాగా రెండవది ఆమె ఎంపిక” అని.

  మీకు కావలసిన అర్ధాలు కాకుండా ఆర్టికల్ రచయిత్రి ఏ అర్ధంతో రాశారో తీసుకోవాలి. ఆ అర్ధంపైన విమర్శలు ఏమన్నా ఉంటే చేయాలి. లేని అర్ధాన్ని మనం ఆపాదించి దానిపైన విమర్శ చేస్తే అది విమర్శ అవదు.

  అర్ధం కాలేదని మీరు అన్నందున ఇది మీ సమాచారం కోసం.

 6. మీ దృష్టిలో వల్గారితీ అంటే ఏమిటి? ఇప్పుడు హీరోయిన్‌లందరూ బికినీలలో ఫోజ్‌లిస్తున్నారు కనుక ఇప్పటి ప్రమాణాల ప్రకారం మీరు ఆ ఫొతోలు వల్గర్ కాదంటారు. 1980ల నాటి తెలుగు సినిమాలలో రేప్ సీన్‌లు చాలా కామన్ కనుక చలపతిరావు నటించిన రేప్ సీన్‌లు కూడా ఆనాటి ప్రమాణాల ప్రకారం వల్గర్ కాదనుకోవాలా?

 7. ఆడదాని సహమతితో ఏది చేసినా తప్పు కాదనుకుంటే ఆమె సహమతితో బ్లూఫిలిం తియ్యడం కూడా తప్పు కాదనుకోవాలి. దీపిక కేవలం సినిమాలలో అవకాశాలు పెరగాలనే అంగాలు కనిపించే దుస్తులు వేసుకుంటోంది కానీ లేకపోతే ఆమె చీర కట్టుకునే ఉండేది.

 8. 20 ఏళ్ళ క్రితం నేను ఒక పత్రికలో చదివాను. పరువుగల కుటుంబాలకి చెందిన అమ్మాయిలకి మోదలింగ్‌లో అవకాశాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి నగ్న ఫొతోలు తీసేవాళ్ళు. వాళ్ళు నగ్నంగా ఫొతోలలోకి దిగిన తరువాత మోదలింగ్‌లో అవకాశాలు ఇప్పించకుండా, ఈ నగ్న ఫొతోలని గోడల మీద పోస్తర్లుగా అంటించి మీ కుటుంబ పరువు తీస్తాం అని భయపెట్టి డబ్బులు వసూలు చేసేవాళ్ళు. ఆ అమ్మాయిలు మోదలింగ్ కోసం పత్రికల్లో నగ్నంగా కనిపిస్తే పరువు పోదు కానీ తమ నగ్న ఫొతోలని ఎవరో వీధిలోని గోడల మీద అంటిస్తే పరువు పోతుందనుకున్నారా? లేదా డబ్బులు వస్తాయనుకుంటే పరువు గురించి పట్టించుకోనక్కరలేదు కానీ డబ్బులు రానప్పుడు పరువుగా బతకాలనుకున్నారా?

  దీపికా పడుకొణే కూడా తనకి పారితోషికం వస్తేనే నగ్న ప్రదర్శనలు ఇస్తుందనీ, అది లేకుండా ఆమె నగ్న ఫొతోలని ప్రచురించే హక్కు ఎవరికీ లేదనీ ఆమె సమర్థకుల అభిప్రాయం కాబోలు.

 9. నేను ఆ మధ్య దృశ్యం అనే సినిమా చూసాను. ఆ సినిమాలో ఒక మహిళా పోలీస్ అధికారి కొడుకు హీరో కూతురు బట్టలు మార్చుకుంటుండగా వీదియో తీస్తాడు. అతడు ఆ వీదియో చూపించి తన కోరిక తీర్చమని ఆమెని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. తన కోరిక తీర్చకపోతే ఆ వీదియోని యూత్యూబ్‌లో పెడతానంటాడు. కానీ ఆ అమ్మాయి అతన్ని హత్య చేస్తుంది. ఒక సారి బ్లాక్‌మెయిల్ చేసినవాడు పది సార్లు లేదా ఇరవై సార్లు బ్లాక్‌మెయిల్ చెయ్యడని చెప్పలేము. కనుక ఆ అమ్మాయి అతని కోరిక తీర్చకపోవడమే సరైనది. అతని కోరిక తీర్చకుండా తప్పించుకోవడానికి ఆమెకి అతన్ని హత్య చెయ్యడం తప్ప వేరే మార్గం దొరకలేదు. ఈ విషయం తెలిసిన హీరో తన కూతురు దొరకకూడదని తాను పోలీసుల చేతిలో దెబ్బలు కాస్తాడు. ఏ ఆడది తనకి దారిలో పరిచయమైన ఒక పర్యాటకునితో సెక్స్ చెయ్యాలనుకోదు (వేశ్య తప్ప). ఆ సినిమాలో హీరో కూతురు కూడా తనకి దారిలో పరిచయమైన పోలీస్ ఆఫీసర్ కొడుకుతో సెక్స్ చెయ్యడానికి నిరాకరించడం న్యాయమే. తనకి సమస్యలు సృష్టిస్తాడని భావించి ఆ పోలీస్ ఆఫీసర్ కొడుకుని ఆమె హత్య చెయ్యడం కూడా న్యాయమే.

  తన బతుకు తాను బతికే ఓ అమ్మాయి స్నానం చేస్తుండగా ఒక ఆకతాయి వీదియో తీసి దాన్ని యూత్యూబ్‌లో పెడితే ఆమెకి అన్యాయం జరిగిందనుకుంటాం. కానీ పత్రికలవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని బూతు ఫోజులు ఇచ్చే ఒక మోదల్‌కి ఒక పత్రికవాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఆమె బూతు ఫొతోని ప్రచురిస్తే అది కేవలం వ్యాపారంలో జరిగిన మోసం అవుతుంది కానీ దాని వల్ల ఆమె modesty పోయేదేమీ ఉండదు. నగ్న మోదలింగ్ వృత్తిలో modesty అనేది ఉండదు.

  వేశ్యావృత్తిని ఉర్దూలో ఇస్మత్ ఫరోషీ అంటారు. ఇస్మత్ అంటే modesty, ఫరోషీ అంటే వర్తకం. ఇస్మత్ ఫరోషీ అంటే modestyని అమ్ముకుని డబ్బులు సంపాదించడం. వేశ్య తన శరీరానికి గంటకి ఇంత అని వెల కడితే ఒక నగ్మ మోదల్ తన పావు నగ్నత్వానికి ఇంత, అర్థ నగ్నత్వానికి ఇంత అని వెల కడుతుంది. ఒక నగ్న మోదల్‌కి ఒక పత్రికవాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఆమె ఫొతోని ప్రచురిస్తే అది వ్యాపారంలో జరిగిన మోసమే అవుతుంది కానీ దాని వల్ల ఆ మోదల్ యొక్క modesty పోయేదేమీ ఉండదు.

  ఇది చదివి మీరు నన్ను కన్సర్వేతివ్ అనుకున్నా నాకు నష్టం లేదు. నాకు వ్యాపారానికీ, సైకాలజీకీ మధ్య తేడా తెలుసు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s