ఎలా జరిగిందో ఇంకా నిర్ధారణ కాలేదు గానీ జూ పార్క్ లో ఒక యువకుడు తెల్ల పులి ఉన్న ఆవరణలోకి దూకేసాడు. రెండు సార్లు యువకుడిని సమీపించి ఏమీ చేయకుండా వదిలిపెట్టిన పులి మూడో సారి మాత్రం యువకుడి మెడపై ముంగాలి పంజా విసిరింది. ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడని పత్రికలు తెలిపాయి. యువకుడి విగత దేహాన్ని బైటికి తెచ్చే పనిలో నిర్వాహకులు, పోలీసులు ఇంకా సఫలం కానట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లోని నేషనల్ జూలాజికల్ పార్క్ లో జరిగిందీ దుర్ఘటన. మృతుడిని 19 సం.ల వయసు గల మక్సూద్ గా గుర్తించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో మక్సూద్ పులి ఎన్ క్లోజర్ కూ సందర్శకులకూ మధ్య ఉండే ఎత్తైన ఇనుప తడికెను ఎక్కి లోపలికి దూకాడని జూ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే యువకుడు పులిని ఫోటోలు తీస్తూ, దగ్గరి నుండి తీసే ప్రయత్నంలో లోపలికి పడిపోయాడని సందర్శకుల్లో కొందరు చెబుతున్నట్లు తెలుస్తోంది.
“మక్సూద్, బీట్ నెంబర్ 8 వద్ద తెల్లపులి ఎన్ క్లోజర్ చుట్టూ ఉన్న అడ్డంకిని దాటి లోపలికి దూకేసాడు. అక్కడ కాపలాగా ఉన్న గార్డు ప్రవీణ్, జూ అధికారులను అప్రమత్తం చేశాడు. తమ సూపర్ వైజర్ కు ఇతర సిబ్బందికి వైర్ లెస్ లో ఫోన్ చేసి చెప్పాడు. ప్రవీణ్, ఇతర సిబ్బంది పులి దృష్టి మరల్చడానికి తీవ్రంగా ప్రయత్నించారు గానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు” అని జూ పార్క్ డైరెక్టర్ అమితాబ్ అగ్నిహోత్రి చెప్పారని పత్రికలు (ది హిందు) తెలిపాయి.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ప్రకారం యువకుడికి సరిగ్గా మతి స్ధిమితం లేదని అతని తల్లిదండ్రులు చెప్పారు. గత 4 సం.లుగా వైద్య చికిత్స తీసుకుంటున్నాడని చెప్పారు. ఆయన పులిని ఫోటోలు తీస్తున్నాడనీ, ఆ ప్రయత్నంలో లోపలకు పడిపోయాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక తెలిపింది. “యువకుడు లోపలికి పడిపోవడంతో అతనిపై పులి దాడి చేసింది. అతని మెడపై పంజా విసిరి చంపేసింది” అని ప్రత్యక్ష సాక్షులను ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఉటంకించింది.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే పులి వద్ద రక్షణ ఏర్పాట్లు చేశామని జూ పార్క్ అధికారులు చెబుతున్నారు. తద్వారా తమ తప్పేమీ లేదని చెప్పేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. దుర్ఘటనపై విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. విచారణ పూర్తయితే తప్ప వాస్తవంగా ఏమి జరిగిందీ తెలియకపోవచ్చు. కానీ విచారణ నిస్పాక్షికంగా జరగాలి కదా!
ఇండియా టి.వి న్యూస్ వెబ్ సైట్ మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. దాని ప్రకారం సదరు యువకుడు పులి తన వెనుక భాగాన ఉండేట్లుగా సెల్ఫీ ఫోటో తీసే ప్రయత్నంలో ఎన్ క్లోజర్ లోకి పడిపోయాడు. అయితే అతను పడిపోయిన వెంటనే పులి అతనిపైకి దాడి చేయలేదు. పులి దాడి చేస్తుందేమో అన్న భయంతో యువకుడు పులి పైకి రాళ్ళు విసిరాడట. అప్పుడు మాత్రమే పులి అతనిపై దాడి చేసిందట. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని ఇండియా టి.వి న్యూస్ తెలిపింది. సెల్ఫీల పిచ్చి ఇలాంటి ఘోరాలకు కూడా దారి తీయవచ్చన్నమాట!
క్రింది ఫొటోల్లో చివరి ఫోటో మృతుడి శరీరంపై వస్త్రం కప్పి ఉన్నప్పటిది. టి.వి కవరేజి వీడియో నుండి దీన్ని సంగ్రహించారు.