గాలిలో దుమ్ము మెల్ల మెల్లగా సర్దుకునే కొద్దీ అసలు చిత్రం ఏమిటో క్రమ క్రమంగా స్పష్టం అవుతోంది. విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక స్ధితి కనాకష్టంగా ఏమీ ఉండదని ఆలోచనాపరులు లెక్కలు వేసి చెప్పినా సమైక్యవాదులు చెవిన ఎక్కించుకోలేదు. వారు చెప్పిన అంశాలు ఎంత నిజమో ఇప్పుడు తెలిసి వస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్ నగరం ఉనికి ఆగిపోయినప్పటి నుండి హైద్రాబాద్ నగర పన్ను పునాది భారీ మొత్తంలో తుడిచిపెట్టుకుపోనుంది. నిజానికి ఇప్పటికే అనేక కంపెనీలు తమ కేంద్ర కార్యాలయాలను తెలంగాణ/హైద్రాబాద్ నుండి ఎ.పి కి తరలిస్తున్నారు. 3,000 కు పైగా వ్యాపారాలు, డీలర్లు, వాణిజ్య సంస్ధలు ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చేశాయి. ఫలితంగా హైద్రాబాద్ ఆదాయంలో తేడా కనిపిస్తోంది.
14వ ఫైనాన్స్ కమిషన్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలో తాజా వివరాలు వెల్లడి అయ్యాయి. ఈ నివేదిక ప్రకారం పన్నుల ఆదాయంలో తెలంగాణ వాటా 42 శాతం నుండి 44 శాతం వరకూ పడిపోతుంది. రోజులు గడిచేకొద్దీ ఆంధ్రకు తరలివెళ్తున్న కంపెనీలు, వ్యాపారాల సంఖ్య పెరుగుతోంది.
ఇప్పటివరకూ వీరు తమ అమ్మకాలను హైద్రాబాద్ లో చూపించడం వలన హైద్రాబాద్ పన్ను ఆదాయం ఎక్కువ మొత్తంలో కనిపించింది. ఆంధ్ర కంపెనీలు, వ్యాపారాలు తమ కార్యకలాపాల హెడ్ క్వార్టర్స్ ను కొత్త రాజధానికి గానీ, ఎ.పి లోని ఇతర జిల్లాలకు గానీ తరలిస్తున్నందున వారి అమ్మకాల పన్ను ఆదాయం హైద్రాబాద్ నుండి ఎ.పి రాజధానికి లేదా ఇతర నగరాలకు బదిలీ అవుతోంది. ఫలితంగా తెలంగాణ పన్ను పునాది తగ్గిపోతుండగా ఆంధ్ర ప్రదేశ్ పన్ను పునాది విస్తరిస్తోంది.
వ్యాట్ (వాల్యూ యాడెడ్ ట్యాక్స్) పన్ను లోనే కాకుండా ఇతర ప్రధాన ఆదాయ మార్గాలలో కూడా తెలంగాణ ఆదాయం ఆంధ్ర ప్రదేశ్ కు తరలి వస్తుంది. ముఖ్యంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మోటారు వాహనాల పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ సుంకాలు కూడా తెలంగాణ నుండి ఆంధ్ర ప్రదేశ్ కు తరలి వస్తున్నాయి. దానితో భారీగా కనపడిన హైద్రాబాద్ ఆదాయం చిన్నబోయి ఆ మేరకు ఆంధ్ర ఆదాయం పెరగనుంది.
ఈ నేపధ్యంలో చూసినప్పుడు హైద్రాబాద్ ఉమ్మడి రాజధానిగా ఎంత ఎక్కువ కాలం కొనసాగితే ఆంధ్ర ప్రదేశ్ కు అంత నష్టం మరియు తెలంగాణకు అంత లాభం. ఎ.పి రాజధానిగా విజయవాడను ప్రకటించినందున కంపెనీలు, వ్యాపారాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు సైతం వీలయినంత త్వరగా విజయవాడకు తరలించగలిగితే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధకు బోలెడు ప్రయోజనం.
తెలంగాణ ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ కు సమర్పించిన నివేదిక ప్రకారం మొత్తం 10 జిల్లాల్లో రెవిన్యూ ఆదాయం సమకూర్చగల జిల్లాలు ప్రధానంగా రెండే. మిగిలిన 8 జిల్లాలలోనూ రెవిన్యూ ఆదాయం అంత గొప్పగా ఏమీ లేదు. అసలు రెవిన్యూ ఆదాయం విస్తరణకు పెద్ద అవకాశాలు లేవని కూడా నివేదిక తెలిపింది. అనగా తెలంగాణ ఆదాయంగా పెద్ద మొత్తంలో కనిపిస్తున్న ఆదాయం ప్రధానంగా హైద్రాబాద్, రంగా రెడ్డి జిల్లాలదే.
హైద్రాబాద్ ఆదాయం ఎందుకు భారీగా ఉంది? ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో వ్యాపార సంస్ధలు, కంపెనీలు అన్నీ రాజధానిలోనే రిజిష్టర్ చేసుకున్నాయి. కాబట్టి వాటి అమ్మకాలు వాస్తవంలో అన్ని జిల్లాల్లో ఉన్నప్పటికీ, ఆ అమ్మకాల తాలూకు పన్నులను మాత్రం హైద్రాబాద్ లోనే జమ చేస్తారు. హైద్రాబాద్ లో అమ్మకాలు చూపిన తర్వాత మాత్రమే ఇతర జిల్లాలకు పంపిణీ చేస్తారు. కనుక అమ్మకాల తాలూకు వివిధ పన్నులు హైద్రాబాద్ లో జమ అవుతూ నగర ఆదాయాన్ని భారీ మొత్తంలో కనిపించేలా చేశాయి. ఉదాహరణకు మద్యం సంస్ధ బేవరేజెస్ కార్పొరేషన్ 23 జిల్లాల అమ్మకాలను హైద్రాబాద్ లోనే చూపుతూ తాను చెల్లించే వ్యాట్ ను అక్కడ జమ చేస్తుంది. ఇలా ఇతర కంపెనీలు కూడా చేస్తాయి. ఫలితంగా వ్యాట్ ఆదాయంలో హైద్రాబాద్ వాటా 80 శాతం ఉండేది. ఇప్పుడు ఇందులో సగానికి పైగా (ఆంధ్రలో 13 జిల్లాలు ఉన్నందున) ఎ.పి కి తరలి రాక తప్పదు.
రాష్ట్రం విడిపోయింది గనుక ఎ.పి జిల్లాలలో అమ్మకాలు సాగించే కంపెనీలు, వ్యాపారాలు, వాణిజ్య సంస్ధలు అనివార్యంగా కొత్త ఆంధ్ర రాష్ట్రంలో రిజిష్టర్ చేసుకోవాలి. తద్వారా ఎ.పి జిల్లాల పన్ను ఆదాయం కొత్త రాజధానిలో జమ అవుతుంది. ఇది ఒకరి ఇష్టా ఇష్టాల ప్రకారం జరిగేది కాదు. ఆయా రాష్ట్ర, కేంద్ర చట్టాల మేరకు సహజంగా జరిగిపోయే ప్రక్రియ. కనుక రాజధాని కార్యకలాపాలు ఎంత త్వరగా విజయవాడకు తరలివస్తే ఆదాయం అంత త్వరగా పెరుగుతుంది.
తెలంగాణ ప్రభుత్వం నివేదికలోని మరో ముఖ్య అంశం జనాభా తరలింపు. రాష్ట్ర విభజన అనంతరం హైద్రాబాద్ కు వచ్చిపోయే జనాల సంఖ్య పడిపోతుందని టి.ఎస్ ప్రభుత్వం తెలిపింది. కనుక ఆ మేరకు పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు తగ్గిపోతాయి. ఇతర వాణిజ్య సరుకుల అమ్మకాలు కూడా పడిపోతాయి. దాదాపు సమస్త వినియోగ సరుకుల వ్యాపారాలు తమ అవసరాల రీత్యానే ఎ.పి లో మరో హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేస్తారు. అలా చేస్తేనే వారికి పన్నుల బాదుడు తగ్గుతుంది. పైగా కేంద్రం హామీ ఇచ్చినట్లు ఎ.పి కి ప్రత్యేక హోదా వస్తే కేంద్రం విధించే పన్నులు తగ్గుతాయి. అప్పుడు పలు కంపెనీలకు హైద్రాబాద్ కంటే ఎ.పియే ఎక్కువ ఆకర్షణ అవుతుంది.