“… అనంతరం దారం తెగిపోకుండా ఇలా నేర్పుగా లాగి పట్టి…”
*********
చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ భారత్ పర్యటనలో ఉండగానే చైనా-ఇండియా సరిహద్దులో లడఖ్ లో చైనా సైన్యం రెండు చోట్ల చొరబడిందని, కనీసం 500 మీటర్ల మేర చొచ్చుకు వచ్చి వెనక్కి వెళ్లబోమని భీష్మించ్చిందని వార్తలు వెలువడ్డాయి. భారత దేశంలో పత్రికలు, ఛానెళ్లలో పతాక శీర్షికలకు ఎక్కిన ఈ వార్తలు సహజంగానే ప్రధాని మోడీకి అగ్ని పరీక్షగా మారాయి.
కాదా మరి! ప్రతిపక్షంలో ఉన్నంత కాలం ఒక్క మోడీయే కాకుండా, భారతీయ జనతా పార్టీ నేతలంతా పాక్, చైనాలతో భారత్ సంబంధాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఎంత వీలవుతుందో అంతా ఆడుకున్నారు. భారత్ ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న చైనాతో మిత్రత్వమా అని ప్రశ్నించేవారు. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా చొరబడినా ఏమీ చేయలేని దద్దమ్మలని నిందించారు.
పాక్ తో క్రికెట్ దౌత్యాన్ని ఎగతాళి చేశారు. పాక్ హాకీ క్రీడాకారులను తన్ని తగలేసేదాకా నిద్ర పోలేదు. మొన్నటికి మొన్న కాశ్మీర్ వేర్పాటువాద నాయకులను పాక్ రాయబారి కలిసి మాట్లాడారన్న కారణంతో పాక్ తో కార్యదర్శి చర్చలను రద్దు చేసేశారు.
అలాంటిది ఏకంగా చైనా అధ్యక్షుడు ఇండియాలో ఉండగానే చైనా సైనికులు భారత భూభాగంలో చొరబడితే ప్రధాని మోడి ఎలా స్పందించాలి. న్యాయంగానైతే గ్జి జిన్ పింగ్ పర్యటనను బహిష్కరించాలి. పత్రికలు, ఛానెళ్ల ముందే చైనా దుందుడుకు వైఖరిని కడిగి పారేయ్యాలి.
కానీ విచిత్రంగా అదేమీ జరగలేదు. గ్జి జిన్ పింగ్ పర్యటన నిర్విఘ్నంగా కొనసాగుతోంది. డజనుకు పైగా ఒప్పందాలు జరిగిపోయాయి. ఐదేళ్లలో లక్ష కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని చెప్పారు. రైళ్లు, స్మార్ట్ సిటీలు, విద్యుత్ ఫ్యాక్టరీలు, అణు ఫ్యాక్టరీలు…. ఇలా అనేక రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
చైనా సైనిక చొరబాటు గురించి మాత్రం బలహీన ప్రకటనలతోనే సరిపెట్టారు. చొరబాట్లపై మోడి చైనా అధ్యక్షుడిని గట్టిగా నిలదీశారని పత్రికలు చెప్పడమే గానీ మోడి ప్రసంగంలో అదేమీ కనపడలేదు. చైనా-ఇండియాల మధ్య సరిహద్దులు ఇంకా నిర్ణయం కాకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయని చైనా అధ్యక్షుడి సహాయకులు ప్రకటించారు తప్ప అధ్యక్షుడు ఏమీ వివరణ ఇవ్వలేదు.
సరిగ్గా ఈ కారణాన్నే పలువురు పెద్దలు, ప్రముఖులు, పరిశీలకులు, మేలు కోరేవారు అనేక యేళ్లుగా చెబుతున్నారు. మొదట సామరస్య పూర్వకంగా చర్చలు జరుపుకుని సరిహద్దులు నిర్ణయిస్తే ఆ తర్వాత చొరబాట్లకు అవకాశమే ఉండదు. అసలు సరిహద్దులే నిర్ణయం కానప్పుడు ఎవరిది చొరబాటు అనాలి, ఎవరిని బాధితులు అనాలి? కానీ ఈ తరహా పెద్దల వివేకవంతమైన సూచనలను నెత్తికి ఎక్కించుకున్నవారే లేరు. బి.జె.పి విషయం చెప్పనే అవసరం లేదు.
ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోడి గారికి చైనా అధ్యక్షుడి పర్యటనలో తలెత్తిన చొరబాటు సమస్యను తన సహజ దూకుడు ధోరణిలో కాకుండా, ‘నేర్పుగా’ డీల్ చేయవలసిన పరిస్ధితి తప్పలేదని ఈ కార్టూన్ సూచిస్తోంది.
ఈ జిన్ పింగ్ పేరు (Xi-jinping ) పేరును దూరదర్శన్ న్యూస్ రీడర్ ( Xi ) పదకొండవ జిన్ పింగ్ గా చదివినందుకు ఉద్యోగంలోంచి తీసేశారట పాపం….
పింగ్‌బ్యాక్: జిన్ పింగ్: మోడి దౌత్యం నేర్పుగా…. -కార్టూన్ | Sreedhar Madichetty
@చందు తులసి గారు : తీసేసే ఉండొచ్చులెండి. చైనా ప్రస్తుతం (అనగా ఎన్నికల తరువాత) మనకు మిత్రదేశం కదా. మరి మిత్ర దేశపు అధ్యక్షుడి పేరుని జాతీయఛానెళ్ళవారు గౌరవించకపోవడం మన అధ్యక్షులవారికి ఎంత నామర్ధా!
నాకొకటి అర్ధం కావడంలేదు. ఇలాగే చైనాతో స్నేహ హస్తం చాచినందుకు నెహ్రూను ఆడిపోసుకొనే మన ‘దేశభక్తులు’, ‘దేశభక్త బ్లాగర్లు’ మోదీగారిని మాత్రం ఎందుకు సమర్ధిస్తున్నారో చెబుతారా? ఇప్పుడు మనం చాస్తున్న ఎంతహస్తం ఎంత పొడుగైనదంటే, టిబెటన్ల స్వాతంత్ర్య కాంక్షలు కనబడకుండా మనకళ్ళను మూసేసేంత. త్వరలోనే బహుశా భారతదేశం టిబెట్ విషయంలో మాటమార్చబోతున్నదనుకుంటున్నాను.