(ఈ రోజు ది హిందు పత్రికలో ‘Uneven recovery‘ శీర్షికన ప్రచురితం అయిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)
ద్రవ్యోల్బణం, పారిశ్రామిక వృద్ధి, వాణిజ్యం… ఈ అంశాలపై విడుదలయిన తాజా ఆర్ధిక గణాంకాల వివరాల నుండి స్పష్టంగా తెలుస్తున్న సంకేతం ఏదన్నా ఉంటే, అది: స్వస్ధత (రికవరీ) ప్రక్రియ ప్రారంభం అయింది కానీ అది ఎగుడు దిగుడుగా, ఇంకా మొదటి గేరులోనే ఉంది. ఆగస్టు నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం గత 5 యేళ్లలో తక్కువగా 3.7 శాతం వద్ద నిలిచింది. కానీ రిజర్వ్ బ్యాంకుకు ముఖ్య ప్రమాణం అయిన చిల్లర ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఇంకా పై స్ధాయిలోనే -7.8 శాతం- అంటిపెట్టుకుని ఉంది. జూన్ నెలలో 3.9 శాతం వృద్ధి రేటు నమోదు చేసిన పారిశ్రామిక ఉత్పత్తి జులై నెలలో దాదాపు నేలబారుగా 0.5 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదు చేసింది. ఆగస్టు నెలలో ఎగుమతుల వృద్ధి రేటు 5 నెలల తక్కువ స్ధాయి, 2.35 శాతానికి పడిపోయింది. పారిశ్రామిక ఉత్పత్తిలోని ఈ సీ-సా బల్ల తరహా కదలికలు, ముఖ్యంగా వినియోగ సరుకులు మరియు పెట్టుబడి సరుకుల విషయంలో, స్వస్ధత క్రమం ఇంకా సంశయాత్మకంగానే ఉందని సూచిస్తున్నాయి.
కీలకమైన ఆటోమొబైల్ రంగం సానుకూల మలుపు తిరిగిందని గట్టి సంకేతాలు ఇస్తూ పాసింజర్ కార్ల తయారీ డిమాండ్ దశకు చేరడం వాస్తవమే. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆటో మొబైల్ రంగం 5 శాతం వృద్ధి నమోదు చేస్తుందనీ, తమ కంపెనీ అయితే 10 శాతం వృద్ధి చెందుతుందనీ చెప్పడం ద్వారా మారుతి ఛైర్మన్ ఆర్.సి.భార్గవ అధికారిక పుటలకు ఎక్కారు కూడా. ఆటో పరిశ్రమ నుండి వస్తున్న సానుకూల ఉరవడి ఉత్సాహకరం అవుతాయి. ఎందుకంటే తన దిగువ స్ధాయి పరిశ్రమలపై అది హెచ్చింపు ప్రభావం పడవేస్తుంది. ఉదాహరణకి వేలాది ఉద్యోగాలు కల్పించగల ఆటోమోబైల్ అనుబంధ పరిశ్రమలు వర్ధిల్లుతాయి. అయినప్పటికీ, పెట్టుబడి సరుకుల పరిశ్రమ తన భాగ్యరేఖలో నమ్మకమైన మార్పులను చవిచూడకపోవడం ఆందోళనకరం. సంకేతం ఏదన్నా ఉన్నదంటే, కంపెనీలు ఇప్పటికీ తమ తాజా సామర్ధ్యాలకు తగినట్లుగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా లేవని ఇది సూచిస్తోంది.
బ్యాంకుల నుండి ఋణ స్వీకరణ ఇంకా చప్పగానే ఉండడం కూడా ఈ వాస్తవాన్నే చెబుతోంది. గత కొద్ది నెలల్లో చట్టబద్ధ ద్రవ్యతా నిష్పత్తి (Statutory Liquidity Ratio) కి రెండు సార్లు కోత పెట్టడం ద్వారా ఆర్.బి.ఐ, (బ్యాంకుల) నిధులకు స్వేచ్ఛ కల్పించినప్పటికీ బ్యాంకుల నుండి రుణాల వితరణ పెద్దగా జరగలేదు. కొద్ది వారాల క్రితం ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ కూడా ఈ విషయాన్నే సూచనప్రాయంగా ప్రస్తావించారు. విశ్వాసం ప్రోది చేస్తున్నవి రెండు అంశాలే – ఉత్తర అర్ధ భాగంలో ఋతుపవనాలు సానుకూల ఫలితాలు ఇవ్వడం, ప్రపంచ సరుకుల ధరలు, ముఖ్యంగా క్రూడాయిల్ ధరలు, కింది చూపు చూస్తుండడం. రెండవది ద్రవ్యోల్బణం పైనా, కోశాగార లోటు పైనా సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉదాహరణకి డీజెల్ సబ్సిడీ ఇప్పటికే తుడిచిపెట్టుకుపోయింది.
ఆర్.బి.ఐ తదుపరి విత్త విధాన ప్రకటన సమీపంలోనే ఉన్నందున సెంట్రల్ బ్యాంకు తన దూకుడు ధోరణికి కళ్ళెం వేయాలని ఒత్తిడి పెరుగుతోంది. జనవరి 2015 నాటికల్లా తన ప్రామాణిక చిల్లర ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 8 శాతానికి చేర్చాలన్న లక్ష్యం కూడా అప్పుడే చేరుకున్నామని వారు మద్దతు తెచ్చుకుంటున్నారు. అయితే, ఆర్.బి.ఐ గవర్నర్ డాక్టర్ రాజన్, ఆయన రెండు రోజుల క్రితం చెప్పిన మాటలను బట్టి, ఆ ఒత్తిళ్లకు లోంగేటట్లు లేరు. అదే సరైంది కూడా. ద్రవ్యోల్బణంలో తగ్గుబాటు ధోరణి స్పష్టంగా నిర్ధారణ అయ్యేవరకూ వడ్డీ రేటును ముట్టుకోవడంలో అర్ధం లేదు. అలాంటి నిర్ధారణ ఇంతవరకూ ద్యోతకం కాలేదు. పారిశ్రామిక వృద్ధికి రానున్న పండగ సీజన్ కీలకం కానుంది. ఎందుకంటే (దీర్ఘకాలిక) వినియోగ సరుకులు, ఆటోమొబైళ్ళ కొనుగోళ్ళు సాధారణంగా ఈ సీజన్ లోనే పుంజుకుంటాయి. ప్రస్తుతం కొనసాగుతోందని భావిస్తున్న ఆర్ధిక స్వస్ధత యొక్క దృఢత్వం ఏపాటిదో అప్పుడే తేలుతుంది.