(బి.జె.పికి) సంకేతాత్మక హెచ్చరిక -ది హిందు ఎడిటోరియల్


Congress celebrates

Congress celebrates

(A Note of Caution శీర్షికన ఈ రోజు (సెప్టెంబర్ 17) ది హిందూ ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధా తధ అనువాదం -విశేఖర్)

ఉల్లాసం వెనువెంటే నిరాశ రావడం చాలా అరుదుగా జరుగుతుంది: భారత దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో తన చరిత్రలోనే అత్యంత మెరుగైన ఎన్నికల ఫలితాలను రికార్డు చేసిన భారతీయ జనతా పార్టీ నాలుగు నెలల్లోనే ఆ రాష్ట్రంలో తన సాంప్రదాయక పునాది కలిగిన చోట కూడా పెనుగులాడుతున్నట్లు కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో 80 స్ధానాలకు గాను 71 స్ధానాలను కైవసం చేసుకున్న పార్టీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 11 స్ధానాల్లో మూడింటిని మాత్రమే గెలుచుకోగలిగింది. లోక్ సభ ఎన్నికల్లో పోల్చితే ఘోరమైన ప్రదర్శన ఇవ్వడమే కాదు, 2012 నాటి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినా కూడా హీనమైన ఫలితాలను ప్రదర్శించింది. (2012 అసెంబ్లీ ఎన్నికల్లో) సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల తర్వాత మూడో స్ధానంలో పార్టీ నిలిచింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలను పునఃప్రదర్శన చేయడం మాట అటుంచి, సాంప్రదాయకంగా తనకు గట్టి పట్టు ఉన్న ప్రాంతాల్లోనూ సమాజ్ వాదీ పార్టీకి తన పునాదులను బి.జె.పి అప్పజెపుతోంది. లోక్ సభ ఎన్నికల్లో చావు దెబ్బలు తిని నిలువెల్లా గాయాలతో తేలిన ఎస్.పి ఈ సారి 8 సీట్లు గెలుచుకుంది. తద్వారా బి.జె.పి ఒడ్డి ఓడిన ఫణం నుండి లబ్ది పొందింది.

రాజస్ధాన్ నుండి వెలువడిన ఫలితాలు కూడా బి.జె.పికి సంతోషాన్ని మిగల్చలేదు. నాలుగింటిలో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. మూడింటిని కైవశం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, మే ఎన్నికల్లో ఉత్త చేతుల్లో మిగిలిన రాజస్ధాన్ లోనే పునర్వైభవం సాధించే మార్గంలో ఉన్నానని గట్టిగా నమ్మగల పరిస్ధితిలో ఉన్నది. గుజరాత్ లో తొమ్మిదింటిలో ఆరు సీట్లను బి.జె.పి గెలిచింది. కానీ 2013 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే గనక ఆ పార్టీ తన బలంలో మూడు సీట్లు కోల్పోయినట్లు. నరేంద్ర మోడి సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా పుంజుకునే క్రమంలోనే ఉన్నప్పటికీ ఆనవాళ్ళు స్పష్టంగానే ఉన్నాయి: మిగిలిన భారత దేశం అంతటికీ సుపరిపాలనకు నమూనాగా ప్రదర్శించబడిన గుజరాత్ లో బి.జె.పి కిందికి జారిపోతోంది.

Yogi Adityanath

Yogi Adityanath

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడి ప్రభుత్వం పట్ల గానీ, ఒక పార్టీగా బి.జె.పి పట్ల గానీ దేశవ్యాపితంగా ప్రజలు అకస్మాత్తుగా భ్రమలు కోల్పోవడం ప్రారంభం అయిందని చెప్పడానికి ఈ ఫలితాలే రుజువని ఎవరూ చెప్పజాలరు. కానీ లోక్ సభ ఎన్నికల అనంతరం ఉత్తర ప్రదేశ్ లో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. మత మార్పిడులకు వ్యతిరేకంగానూ, హిందూ మహిళలను ముస్లిం పురుషులు ప్రేమ, పెళ్లి ద్వారా మతమార్పిడి చేస్తారని చెప్పే లవ్ జిహాద్ కు వ్యతిరేకంగానూ మధ్య స్ధాయి నాయకత్వంలో ఉన్న కొందరు బి.జె.పి నేతలు మళ్ళీ కేంద్రీకరించడం ఈ పరిణామాల్లో ఒకటి. లోక్ సభ ఎన్నికల్లో బి.జె.పికి పడిన ఓటు మార్పు కోసం, మెరుగైన పాలన కోసం, అభివృద్ధి కోసం పడింది. ఆ పార్టీ తిరిగి (మత)ఆకర్షక రాజకీయాల వైపుకి మళ్లుతుందని ప్రజలు ఆశించలేదు.

బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో బలహీన ప్రదర్శన కనబరిచిన అనంతరం వెలువడిన ఈ ఫలితాలు, మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు ఇవ్వడంలో ప్రత్యేకత సాధించిన యోగి ఆదిత్యనాధ్ లాంటి వారిని ప్రయోగించడానికి వ్యతిరేకంగా బి.జె.పి నాయకత్వానికి నిశ్చయాత్మకంగా అందిన హెచ్చరిక సంకేతంగా గుర్తించాలి. ఈసారి జరిగిన ఉప ఎన్నికల్లో అందిన పెద్ద సందేశం ఏమిటంటే, ప్రజల సమ్మతి నిర్ధారణగా తమకే అని బి.జె.పి భావించడానికి వీలు లేదని. (జి.డి.పి) వృద్ధి, అభివృద్ధిలను అందిస్తానన్న మోడి హామీ వెనుక ప్రజలు త్వరగా సమీకృతులయ్యారు. కానీ, ఆయన తన హామీని నెరవేర్చకపోయినా లేదా ఆయన పార్టీ తిరిగి మతాకర్షక రాజకీయాలవైపుకి మళ్లినా వారు అంతే త్వరగా దూరంగా వెళ్ళడం ఖాయం.

4 thoughts on “(బి.జె.పికి) సంకేతాత్మక హెచ్చరిక -ది హిందు ఎడిటోరియల్

 1. తాము కులమతాలకి అతీతం అని హిందీ చానెల్‌లలో ప్రచారం చేసుకుని నరేంద్ర మోదీని గెలిపించారు కదా బిజెపివాళ్ళు. గెలిచిన తరువాత మళ్ళీ మత ఘర్షణలు రెచ్చగొట్టారు.

  బిజెపికి చెందిన ముస్లిం నాయకులు ముఖ్తార్ అబ్బాస్ నక్వీ & షానవాజ్ హుస్సేన్‌లు హిందూ స్త్రీలని పెళ్ళి చేసుకున్నారు. మరి వాళ్ళు చేసినది లవ్ జిహాద్ కాదా? ఆ పార్తీకి చెందిన మరో ఇద్దరు నాయకుల భార్యలు హిందువులు కాదు. బిజెపి నాయకులు తమ వ్యక్తిగత జీవితాల్లో సెక్యులర్‌గా ఉంటారు కానీ జనాన్ని మాత్రం మత కట్టుబాట్లని నమ్మమంటారు.

 2. సర్,ఈ ఫలితాలను ఎలా అర్ధంచేసుకోవాలి? ఈ సారి ప్రజలలో భావొద్వేగాలను రెచ్చగొట్టడానికి సరైన కారణం లేకపోవడంవలన బి.జె.పి తన సిట్టింగ్ స్థానాలలో మెజారిటీ స్థానాలు కోల్పోయిందనికోవాలా? ఒక్కోరాస్థ్రంలో ఆయా స్థానిక పరిస్థితులను బట్టి ఈ ఫలితాలున్నాయని అనుకోవాలా? లేకా ప్రజలను అన్నివేళళా మోసగించడం సాధ్యం కాదనుకోవాలా? లేక భారత ప్రజలు సహజంగా లౌకికవాదులు(ఎన్నో ఏళ్ళుగా భిన్నత్వాన్ని కలిగిఉండడమ్మూలాన) కావడం చేత ఈ సారి బి.జే.పి పాచికలు పారలేదనుకోవాలా? లేక ప్రజలను తీవ్రస్థాయిలో బ్రభావితం చేయలేక పోవడం(బి.జె.పి అసమర్ధ ప్రచారం) చే ప్రథ్యర్ధులు వాటిని సొమ్ముచేసుకోవడమా?
  వీలైతే, వివరించగలరు!

 3. Copied from Facebook:

  భారత ముస్లింలు దేశ భక్తులన్న మోడీ….By Prof Kasanagottu Nageshwar
  భారతీయ ముస్లింలు దేశభక్తులు ఈ దేశం కొరకు జీవిస్తారు. ఈ దేశం కొరకు మరణిస్తారు. భారతదేశానికి నష్టం వచ్చే ఏ పనినీ వారు చేయరు. అల్ ఖైదా లాంటి సంస్థలు తమ మాటలకు భారతీయ ముస్లింలు స్పందిస్తారనుకుంటే వారికి తీవ్ర నిరాశ తప్పదు. ఇది భారత ప్రధాని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుడూ నరేంద్ర మోడీ అన్న మాటలునిజమే కొంతమంది ఉన్మాదులు చేసే వికృత చర్యలకు ఆ మతంలోని అందరినీ అనుమానించకూడదు. భారత ప్రధాని పంపిన ఈ బలమైన సందేశం దేశంలో లౌకిక తత్త్వాన్ని పెంపొందిస్తుంది. ఇందుకు నరేంద్ర మోడీని ప్రశంసించాలి. కానీ అదే సమయంలో ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.> తన పార్టీలోనూ, పరివారంలోనూ వున్న యోగి ఆధిత్యనాధ్ లాంటి వారు మాట్లాడిన దాన్నిమోడీ అంగీకరిస్తారా? అంగీకరించనట్లయితే వారిని ఎందుకు వారించలేదు. పార్టీ వారంతా ఉన్మాదులు తాను మాత్రం విశాల భావలున్న వ్యక్తిని అనే సందేశాన్ని మోడీ పంపించదలచుకున్నారా? >ఆయన ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే గుజరాత్ పాఠశాలల పాఠ్యపుస్తకాలలో ఇతర మతాలను కించపరిచే పాఠ్యాంశాలు చేర్చలేదా? ఇప్పుడు దీనిని దేశ వ్యాపితం చేయాలని ప్రయత్నించడం లేదా? గుజరాత్ లో మత మారణ హోమాన్ని ప్రపంచం మర్చిపోలేదు.మతం వేరు మతోన్మాదం వేరు ఏమతం లోనైనా ఉన్మాదాన్ని సహించకూడదు. అదే నిజమైన లౌకిక వాదం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s