ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖమెరగదు అంటారు. సుఖం మాట ఎలా ఉన్నా నిద్రాదేవికి పేద గొప్ప తేడాలతో పని లేని మాట నిజం. ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి వ్యక్తిని ఆదరించి జోకొట్టే సుగుణవతి నిద్రాదేవి. ఆ మాటకొస్తే సృష్టిలో నిద్రపోని జీవి అంటూ లేదు.
అలసి సొలసిన శరీరాలను తన ఒడిలో చేర్చుకుని, సేదదీర్చి, తిరిగి నూతన జవసత్వాలను నింపే నిద్రమాత ప్రసన్నం కోసం మనిషి ‘నిద్ర మాత్ర’ ను కూడా కనిపెట్టాడు.
నిద్ర లేమి (ఇన్సోమ్నియా) వ్యాధి పీడితులు మాత్రమే తన దగ్గరకు రానీయని నిద్రామతల్లి (అనొచ్చా?) ఆనుపానులు కనిపెట్టడానికి మనిషి చేసిన ప్రయత్నాలు పూర్తిగా సఫలం కాలేదంటే నమ్మలేము గానీ అది నిజం. నిద్రకు సంబంధించి మరింత జ్ఞానం సంపాదించడానికి శాస్త్రవేత్తలు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
నిద్ర అంటే మనకు తెలిసింది రెండే. ఒకటి కలత నిద్ర, రెండు దీర్ఘ నిద్ర. మాగన్ను (nap) అని మరొకటి తెలుసు గానీ దాన్ని నిద్రగా పరిగణించం.
అయితే సైన్స్ ప్రకారం నిద్రలో ప్రాధమికంగా రెండు దశలు ఉంటాయి. రెండో దశలో మళ్ళీ మూడు ఉపదశలు ఉంటాయి. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి గనుక మొత్తం మీద నిద్రలో 4 దశలు ఉంటాయని చెప్పుకోవచ్చు.
శాస్త్రవేత్తల మొదటి విభజన REM మరియు Non-REM. REM అంటే Rapid Eye Movement అని అర్ధం.
Non-REM దశలతోనే నిద్ర మొదలవుతుంది. ఇందులోని మూడు దశలను N1, N2, N3 లుగా పేరు పెట్టారు.
N1లో మనిషి అప్పుడే నిద్రలోకి జారుకుంటూ ఉంటాడు. కానీ మెలకువగా కూడా ఉంటాడు. ఈ దశలో నరాలు చురుకుగానే ఉంటాయి. కనుగుడ్లు మెల్లగా అటూ ఇటూ తిరుగుతుంటే రెప్పలు కూడా మెల్లగా మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంటాయి. మెదడు నుండి ఆల్ఫా తరంగాలు వెలువడతాయి.
N2 లో మెదడు నుండి EEG (ఎలక్ట్రో ఎన్సెఫెలోగ్రఫీ) తరంగాలు వెలువడుతాయి. ఈ దశలో ఉన్న మనిషిని నిద్ర లేపడం కాస్త కష్టం అవుతుంది. EEG తరంగాలను బట్టి నిద్రపోతున్న వ్యక్తి రెండో దశ నిద్రలో ఉన్నాడని గ్రహించవచ్చు. ఈ దశలో ఆల్ఫా తరంగాలు వెలువడడం ఒక్కసారిగా ఆగిపోతుంది.
N3 దశను మెదడులో ‘హైపో ధాలమస్’ అని పిలువబడే భాగం ప్రేరేపిస్తుంది. ఈ దశను స్లో-వేవ్-స్లీప్ అని కూడా అంటారు. ఈ దశలో మనిషి పరిసరాలకు స్పందించడం బాగా తగ్గిపోతుంది. శరీరంలో పరిసరాలకు స్పందించే భాగాలు చురుకుదనం కోల్పోతాయి.
తర్వాత REM దశ ప్రవేశిస్తుంది. ఈ దశలో కనుగుడ్లు వేగంగా కదులుతాయి. శరీరంలోని నరాలలో అత్యధికం స్తంభించిపోతాయి. ఈ దశలోని మనిషి చేసే కొన్ని కదలికలు ఆ వ్యక్తి మెలకువగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మిగతా ఏ యితర దశలో కంటే ఈ దశ నిద్రలో ఉన్న వ్యక్తిని మేల్కొలపడం ఎక్కువ కష్టం. మెదడు ఆక్సిజన్ వినియోగం మెలకువలో ఉన్నప్పటి కంటే ఎక్కువగా ఉంటుంది.
పెద్దవారు తమ నిద్రలో ప్రతి 90 నిమిషాలకు ఒకసారి REM దశలో ప్రవేశిస్తారని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక రాత్రిలో కనీసం నాలుగు లేదా ఐదు సార్లు ఇలా REM దశలోకి పెద్దవారి నిద్ర వెళ్తుంది. అనగా మనం నిద్రలోకి జారుకున్న తర్వాత రాత్రంతా ఒకే స్ధితిలో ఉండమన్నమాట! దీర్ఘ నిద్రలోకి వెళ్తూ, వస్తూ ఉంటాము. REM దశ శరీరంలో ఏయే విధుల నిర్వర్తనకు ఉద్దేశించబడిందో శాస్త్రవేత్తలకు ఇంకా తెలియదు. అది తెలిస్తే నిద్రలేమి వ్యాధులకు పరిష్కారం కనుగొనడం సులభం కావచ్చు.
N3 దశ అనంతరం మనిషి ఒకసారి మళ్ళీ N2 దశలోకి వచ్చి అనంతరం REM దశలోకి వెళ్తారని శాస్త్రవేత్తల ప్రయోగాల్లో వెల్లడి అయింది. అనగా నిద్రకు సంబంధించిన వలయం కింది విధంగా ఉంటుంది.
N1 –> N2 –> N3 –> N2 –> REM
కలల విషయానికి వస్తే ఎక్కువ కలలు REM దశలోనే వస్తాయి. NREM దశల్లో కలలు రావడం తక్కువ. కలలు కేవలం అందులోని పాత్రలకే పరిమితం కానవసరం లేదు. కల కంటున్నప్పుడే పరిసరాల జ్ఞానాన్ని గ్రహించే స్ధితి ఉన్నట్లయితే అప్పుడు పరిసరాలు కూడా కలలోకి ప్రవేశించవచ్చు. ఉదాహరణకి ఓ వ్యక్తి నిద్ర పోతుండగా ‘ఫలానా ఇంట్లో దొంగలు పడ్డారు’ అన్న పక్కవారి సంభాషణ విన్నాడనుకుందాం. అప్పుడు ఆ వ్యక్తి కల మలుపు తిరిగి అందులోకి దొంగలు ప్రవేశించవచ్చు.
ఈ లక్షణం వల్లనే తెల్లవారు ఝామున వచ్చే కలలు నిజం అవుతాయన్న (మూఢ) నమ్మకం వాడుకలోకి వచ్చింది. ఎలాగంటే, ఉదాహరణకి:
కాసేపట్లో తెల్లవారబోతోంది. ఓ వ్యక్తి నిద్ర లేచే సమయం అయింది. దీర్ఘ నిద్ర వదిలి పరిసరాల జ్ఞానం కొద్దిగా తెలుస్తోంది. కానీ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. ఆ సమయంలో వాళ్ళ అబ్బాయి పట్నం నుండి వచ్చాడు. అప్పటికే నిద్ర లేచిన అతని భార్య ‘ఏరా విజయ్, ఇప్పుడేనా రావడం’ అంటూ ఎదురేగి ఆహ్వానిస్తుంది. తల్లీ కొడుకుల సంభాషణ నిద్రలో ఉన్న తండ్రి చెవుల్లో పడుతుంది. అప్పటికి ఆయన ఓ కల కంటూ ఉంటే గనక ‘అబ్బాయ్ విజయ్’ కూడా ఏదో విధంగా కలలో దూరిపోయి సంభాషణ మొదలెడతాడు.
మరో రెండు నిమిషాలకు ఆయన భార్య వచ్చి తన భర్తను నిద్ర లేపుతుంది ‘అబ్బాయ్ వచ్చాడండీ’ అంటూ. ఆయన నిజంగానే నిద్ర లేచి కుశలు ప్రశ్నలు వేస్తుండగా గుర్తుకొస్తుంది తనకు కల వచ్చిందని, అందులో తన కొడుకూ ఉన్నాడని. ఆ విషయాన్ని భార్యకి, కొడుక్కి చెప్పాక ముగ్గురూ అనుకుంటారు ‘తెల్లవారు ఝామున వచ్చే కలలు నిజమవుతాయంటారు, ఇందుకేనేమో’ అని.
ఆ విధంగా తెల్లవారు ఝామున వచ్చే కలలు నిజమవుతాయని జనానికి తెలిసొచ్చింది.
మళ్ళీ నిద్రలోకి వస్తే, మనం పోయే నిద్రలో కేవలం పావు భాగం మాత్రమే దీర్ఘ (REM) నిద్ర. మిగిలినది అంతా వివిధ దశల్లో ఉండే Non-REM నిద్రే. REM దశ ఎంత దీర్ఘంగా ఉంటే శరీరం అంగాలు అంత విశ్రాంతి పొందుతాయి. శరీర అంగాలు విశ్రాంతిలో ఉంటాయి గనుకనే వాటి బాధ్యతను కూడా మెదడు నెత్తిమీద వేసుకుని కాపలా కాస్తుంది. అందువల్ల ఆ దశలో మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది.
ఈ క్రింది ఫోటోలను బోస్టన్ గ్లోబ్ పత్రిక అందించింది. ప్రపంచంలో వివిధ చోట్ల నుండి సేకరించిన ఈ ఫోటోలు నిద్ర గురించి అనేక విషయాలు చెబుతున్నాయి. నిద్ర అందరినీ సమాదరిస్తుందని, అలసిన శరీరాలకు నిద్ర తప్పనిసరి అవసరమని, శ్రమ జీవుల నిద్ర స్ధల సంస్కారం ఎరుగదని, అనాధల నిద్రకు ఆకాశమే గొడుగు పడుతుందని, ఓ వ్యక్తి నిద్రకూ అతని పనికీ అవినాభావ సంబంధం ఉంటుందని, కొన్ని నిద్రలు తోడు కోరితే మరికొన్ని నిద్రలకు తోడు అడిగినా దొరకదని, తల్లి చెంత ఉంటే సైకిల్ మీదికి కూడా నిద్ర ఎగిరి వస్తుందనీ
… ఇలా.
సర్,వేకువ జామున వచ్చే కలలు ఎందుకు చాలామంది నమ్ముతారో,వాటిని ఎందుకు పట్టించుకోనక్కరలేదో బాగా చెప్పారు.