పీతల్ని ఒక పాత్రలో వేసి పెడితే అవి తప్పించుకోకుండా ఉండడానికి ప్రత్యేకంగా మూత పెట్టనవసరం లేదట. ఒకటి ఎలాగో సందు చూసుకుని అంచు దాటి పోయేలోపు మరో పీత ఆ పైకి వెళ్ళిన పీత ఆధారంగా తానూ పైకి వెళ్ళే ప్రయత్నంలో మొదటి పీతను కిందకు లాగేస్తుంది. మొత్తం మీద ఏ పీతా తప్పించుకోకుండా తమకు తామే కిందకు లాగేస్తూ యజమానికి సహాయం చేస్తాయి.
మహారాష్ట్రలో బి.జె.పి, శివ సేన పార్టీల తగవులాట కూడా పీతలాటను తలపిస్తోంది. 15 సంవత్సరాల పాటు ఏక ధాటిగా రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్-ఎన్.సి.పి కూటమి ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టవచ్చో అన్ని రకాలుగానూ భ్రస్టు పట్టాయి. అవినీతి, బంధు ప్రీతి, కుమ్ములాటలు, యాంటీ-ఇంకుంబెన్సీ… ఇలా అనేక కారణాల రీత్యా అధికారాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి బి.జె.పి కూటమికి అప్పగించడానికి ఏర్పాట్లు చేసింది.
అధికారం దక్కడం ఖాయం కావడంతో బి.జె.పి, శివసేనల మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ మొదలయింది. తానే ముఖ్యమంత్రిని అని సేన నేత ఉద్ధవ్ ధాకరే ప్రకటించేశారు. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీకే సి.ఎం పదవి అని బి.జె.పి తిప్పికొడుతోంది. ముఖ్యమంత్రి పదవి మీద కన్ను పడడంతో సీట్ల పంపకంలోనే ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని ఇరు పార్టీలు ఎత్తులు పైయెత్తులు వేస్తున్నాయి. మిత్రా పక్షాలకు ఇచ్చిన సీట్లు పోనూ చెరి సమానంగా సీట్లు పంచుకోవాలని బి.జె.పి కోరుతుంటే, తమకు ఎక్కువ సీట్లు కావాలని శివసేన పంతం పట్టింది. దానితో చర్చలు స్తంభించాయని పత్రికలు చెబుతున్నమాట.
మిత్రపక్షాలకు ఇవ్వగా 270 సీట్లు తమకు మిగులుతాయని బి.జె.పి, సేనలు అంచనా వేస్తున్నాయి. వీటిని చెరి 135 పంచుకోవాలని బి.జె.పి వాదన. తమకు 150 సీట్లు ఇవ్వాలని శివ సేన పంతం. 2009 ఎన్నికల్లో తాము 169 సీట్లలో పోటీ చేశామని వాటిని తగ్గించుకున్నామని శివసేన వాదిస్తోంది. ఈ మధ్యలో తమ బలం పెరిగిందని, లోక్ సభ ఎన్నికల్లో శివ సేన కంటే తమకు 5 సీట్లు ఎక్కువ రావడమే దానికి తార్కాణం అని బి.జె.పి వాదిస్తోంది. ఎవరి మాటపై వారు నిలబడడంతో చర్చలు స్తంభించాయని బి.జె.పి వర్గాలు చెబుతుండగా, అబ్బే చర్చలు సాగుతున్నాయని సేన చెబుతోంది.
కుర్చీ కోసం తగువులాట వల్ల మళ్ళీ నాలుగోసారి కూడా కాంగ్రెస్ కూటమికి అధికారం అప్పగిస్తారా? లోక్ సభ ఎన్నికలకు ఇప్పటికీ మధ్య కాంగ్రెస్ కొంత కోలుకుందని తాజా ఉప ఎన్నికల ఫలితాల్లో తెలుస్తోంది. అయితే మహా రాష్ట్ర కాంగ్రెస్-ఎన్.సి.పి ప్రభుత్వం కోల్పోయిన ప్రతిష్టను బట్టి చూస్తే కాషాయ కూటమికి అధికారం దక్కడం దాదాపు ఖాయమే కావచ్చు. కానీ కార్టూన్ లో చూపించిన పరిస్ధితే వాస్తవంగా ఉంటే చెప్పలేము.