విజయ్ మాల్యా ఎగవేసింది నీటి బొట్టంత! -మాజీ కాగ్


Vinod Rai

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, యునైటెడ్ బ్రూవరీస్… తదితర కంపెనీల అధినేత విజయ్ మాల్యా ఇప్పుడు భారత దేశంలోని అప్పు ఎగవేతదారులకు సింబల్! యునైటేడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యు.బి.ఐ), ఆయనను ఉద్దేశ్యపూర్వక పన్ను ఎగవేతదారు (Wilful defaulter) గా ప్రకటించినప్పటి నుండి ఆయనకు ఆ కీర్తి దక్కింది. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఈ బిరుదు దక్కించుకున్న ఏకైక/మొట్టమొదటి పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాయే కావచ్చు.

అయితే ఇంతటి కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్న విజయ్ మాల్యా, బ్యాంకులకు ఎగవేసిన రుణాల మొత్తం కేవలం సముద్రంలో నీటి బొట్టు మాత్రమేనని మాజీ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ స్పష్టం చేయడం విశేషం. “జాతి ఆత్మచేతన కాపలాదారు యొక్క డైరీ: ఒక అకౌంటెంట్ మాత్రమే కాదు” (The Diary of the Nation’s Conscience Keeper: NOT JUST AN ACCOUNTANT) పేరుతో ఆయన రాసిన పుస్తకంలో ఈ సంగతి వెల్లడించారని ది హిందు తెలిపింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వం లోని 17 బ్యాంకుల కన్సార్టియంకు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్ధ 7,000 కోట్ల రుణాన్ని చెల్లించకుండా వాయిదా వేస్తోంది. కన్సార్టియంలో మరో ప్రభుత్వ రంగ బ్యాంకు యు.బి.ఐ కూడా భాగస్వామి. దరిమిలా యు.పి.ఐ విజయ్ మాల్యాను ఉద్దేశ్యపూర్వకంగా రుణాలు ఎగవేసే వ్యక్తిగా ముద్ర వేసింది. ఆర్.బి.ఐ జారీ చేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారమే ఇది జరిగింది.

భూషణ్ స్టీల్ అనే మరో కంపెనీ ప్రస్తుతం బ్యాంకుల పరిశీలనలో ఉంది. ఈ కంపెనీ బ్యాంకుల కన్సార్టియంకు రు. 40,000 కోట్ల రుణం బాకీ పడింది. ఈ బాకీ వసూలయ్యే పరిస్ధితి కనపడకపోవడంతో బ్యాంకులు భూషణ్ స్టీల్ కంపెనీ అకౌంట్ పుస్తకాలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపడానికి నిశ్చయించుకున్నాయి. ఉద్దేశ్య పూర్వకంగా అంకెలు తారుమారు చేయడం, ఆస్తులను ఎక్కువ చేసి చూపడం, ఆస్తులను అనధికారికంగా బదిలీ చేయడం తదితర అక్రమ కార్యకలాపాలు ఫోరెన్సిక్ ఆడిట్ లో వెల్లడి అవుతాయి. అకౌంట్ పుస్తకాలను చట్టబద్ధంగా, సక్రమంగా నిర్వహిస్తున్నదీ లేనిదీ ఫోరెన్సిక్ ఆడిట్ లో పరిశీలిస్తారు. ఆడిట్ ఫలితాలను అవసరం అయినప్పుడు కోర్టు కేసులో వినియోగిస్తారు.

రు. 40,000 కోట్ల మొత్తం అంటే 2012-13 ఆర్ధిక సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం, ప్రభుత్వ రంగ కంపెనీలలో వాటాల అమ్మకం ద్వారా సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్న మొత్తం. ఖజానాలో సరిపోయినంత డబ్బు జమ కావడం లేదని, ప్రణాళికా బద్ధ పెట్టుబడులకు డబ్బు అందుబాటులో లేదని, ఫిస్కల్ లోటు ఎక్కువగా ఉన్నదని…. ఇలా వివిధ కారణాలు చెబుతూ భారత ప్రభుత్వాలు ప్రతి యేడూ ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాలను అమ్మేస్తూ స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీల పరం చేస్తున్నాయి. సరిగ్గా అదే ప్రైవేటు కంపెనీలలో ఒకటి ప్రభుత్వం తన సొంత ఆస్తుల అమ్మకం ద్వారా ఆర్జించదలిచిన మొత్తాన్ని ప్రభుత్వరంగ బ్యాంకులకు ఎగవేయడం బట్టి ఏం తెలుస్తోంది? (సమాధానం ఇవ్వడం లేదు.)

Vinod Rai bookఖజానాలో డబ్బు జమ కాకపోవడం అంటే పన్నుల వసూళ్లు అనుకున్నంత లేదని అర్ధం. భారత దేశంలో పన్నులు చెల్లించేది ప్రధానంగా ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలే. ఇతర ప్రజలు పరోక్షంగా సరుకుల కొనుగోళ్లలో భాగంగా పరోక్ష పన్నులు చెల్లిస్తారు. ఇలాంటి పన్నులను జమ చేయవలసింది మళ్ళీ వ్యాపారవర్గాలే. ఉద్యోగులు పన్నులు ఎగవేయడం సాధ్యం కాదు. మిగిలింది పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు. పన్నుల ఆదాయం పడిపోతే ప్రధాన బాధ్యులు వీరే. కానీ వీరి నుండి పన్నులను ముక్కు పిండి వసూలు చేయవలసింది మాని, తిరిగి పెట్టుబడులకు ప్రోత్సాహకాల పేరుతో వారికే అనేక పన్నుల రాయితీలు ప్రకటిస్తారు.

ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఇలాంటి మొండి బాకీలు (Non-Performing Assets -NPAs) ఎక్కువగా ఉండడానికి కారణం పారిశ్రామిక వేత్తలు తమ ‘కనెక్షన్స్’ ఉపయోగించుకుని రుణాలు తీసుకోవడమేనని వినోద్ రాయ్ వివరించారు. ప్రైవేటు బ్యాంకుల్లోనూ ఎన్.పి.ఏ లు ఉన్నప్పటికీ వాటిలో ఉన్న ఎన్.పి.ఏ ల మొత్తానికి రెట్టింపు ఎన్.పి.ఏ లు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పేరుకుపోయాయని ఆయన చెప్పారని పి.టి.ఐ తెలిపింది. ప్రభుత్వ బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవాలంటే తగిన రూల్స్ పాటించి తీసుకోవడం కాకుండా తమకు ఉన్న (రాజకీయ) సంబంధాల ద్వారా రుణాలు సాధిస్తారని, పబ్లిక్ బ్యాంకుల్లో ఎన్.పి.ఏ లు ఎక్కువగా ఉండడానికి ఇదే కారణమని రాయ్ తెలిపారు.

“పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఎన్.పి.ఏ లు అనేక రెట్లు పెరుగుతూ పోవడానికి ముఖ్య కారణం ఇదే. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, భూషణ్ స్టీల్ కంపెనీల కధలు ఇప్పుడు బొట్లు బొట్లుగానే బైటికి వస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీల రుణాల పునర్వ్యస్ధీకరణలో ఇంకిపోతున్న డబ్బును కూడా పరిగణిస్తే అదో పెద్ద గ్రంధం అవుతుంది. అందులో చాలా పెద్ద పెద్ద వారి పేర్లు ఉంటాయి” అని వినోద్ రాయ్ వెల్లడించారు. భారత దేశంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పేర్లు తెలియనివేమీ కావు. వారు తరచుగా ఆదర్శమూర్తులుగా కీర్తించబడుతూ ఉంటారు కూడా.

రుణం ఇచ్చినందుకు లంచం తీసుకున్న కేసులో సిండికేట్ బ్యాంకు ఛైర్మన్ ఎస్.కె జైన్ ను ఇటీవల సి.బి.ఐ అరెస్టు చేసింది. ఆయనను అరెస్టు చేసింది భూషణ్ స్టీల్ వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ సింఘాల్ కు అక్రమ రుణం ఇచ్చిన కేసులోనే. నీరజ్ సింఘాల్ ను కూడా సి.బి.ఐ అరెస్టు చేసింది. ఈ అరెస్టుల వల్లనే బ్యాంకుల కన్సార్టియం భూషణ్ స్టీల్ అకౌంట్ పుస్తకాలపై ఫోరెన్సిక్ ఆడిట్ కు ఆదేశించింది. కానీ ఈ కన్సార్టియంకు ఇప్పటివరకు భూషణ్ స్టీల్ వ్యవహారం తెలియదంటే నమ్మలేని విషయం. 40,000 కోట్లు ఋణ దాతలకు బాకీ పడిన భూషణ్ స్టీల్ వ్యవహారం సి.బి.ఐ అరెస్టులు జరిగేవరకు బ్యాంకులకు తెలియదంటే ఎలా నమ్మడం? అందునా సిండికేట్ బ్యాంకు చైర్మనే అరెస్టు అయ్యాక?

వినోద్ రాయ్ ప్రకారం ప్రభుత్వ బ్యాంకుల్లో ఎన్.పి.ఏ లు 2013 నాటికి 3.61 శాతానికి పెరిగాయని ఆర్.బి.ఐ నిర్ధారించింది. ఏ ప్రమాణాల ప్రకారం తీసుకున్నా ఇది చాలా చాలా ఎక్కువని వినోద్ చెప్పారు. “ప్రభుత్వ బ్యాంకులు కష్టకాలంలో అడ్వాన్స్ లు ఇస్తాయన్న వాదనను అంగీకరించినా, ప్రైవేటు రంగ బ్యాంకుల ఎన్.పి.ఏ లు ఇందులో సగం శాతమే ఉండడం ఎలా సాధ్యం? కారణాలు తెలుసుకోవడానికి పెద్దగా విశ్లేషణ జ్ఞానం ఏమీ అక్కర్లేదు” అని వినోద్ వ్యాఖ్యానించారు.

పబ్లిక్ రంగ బ్యాంకుల డైరెక్టర్లను ఇష్టానుసారం నియమించడం సమస్యలో ఒక భాగం అని వినోద్ వివరించారు. డైరెక్టర్ల నియామకం పద్ధతిని మార్చవలసి ఉందని, కానీ ఈ అంశంపై ఎవరూ దృష్టి సారించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. “(డైరెక్టర్ల) నియామక ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని పలువురు ఆందోళన ప్రకటిస్తుంటారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకు బోర్డుల్లో కూర్చునేవారి పేర్లు వారికి తెలుసు. సరైన ప్రమాణాల ప్రకారం వారి నియామకాలు జరగలేదని తెలుసు. అయినప్పటికీ పరిస్ధితిని సవరించడానికి ఎవరూ చర్యలు తీసుకోరు. ఎవరో ఒకరు, ఎక్కడో ఒక చోట ఆంబోతును దాని కొమ్ములు పట్టి లొంగదీయవలసిన అవసరం ఉంది. ఆ ప్రక్రియను ఒక్క రోజు కూడా వాయిదా వేయడం సాధ్యం కానీ పరిస్ధితి నెలకొని ఉంది” అని వినోద్ రాయ్ తన పుస్తకంలో రాశారని పి.టి.ఐ తెలిపింది.

వినోద్ రాయ్ ఎన్ని చెప్పినా, ఎన్ని రాసినా… ఆయన గొంగట్లో వెంట్రుకలు ఏరుతున్నారన్నది చేదు నిజం. గొంగడిని మార్చి శుభ్రమైన పళ్లెంలో భోంచేయడం జనం చేతిలోని పని. అంతవరకు ఎన్ని వెంట్రుకలు ఏరినా ఫలితం ఉండదు.

 

8 thoughts on “విజయ్ మాల్యా ఎగవేసింది నీటి బొట్టంత! -మాజీ కాగ్

 1. నష్టాల్లో ఉన్న Global Trust Bankని కావాలని Oriental Bank అనే ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో విలీనం చేసినప్పుడే మన పాలకులని గట్టిగా అడిగి ఉండాల్సింది.

 2. విజయ్ మాల్యాకి పెట్టుబడిదారీ ఆర్థిక శాస్త్రం తెలియదు. తన పేరు గొప్ప కోసం అతను విమానయాన వ్యాపారంలోకి దిగాడు. ఏ పెట్టుబడిదారుడైనా వస్తువుని సాధ్యమైనంత ఎక్కువ ధరకి అమ్మి లాభాలు సంపాదించాలనుకుంటాడు. వినియోగదారుడు సాధ్యమైనంత తక్కువ ధరకి వస్తువుని కొని ఎక్కువ సంతృప్తి పొందాలనుకుంటాడు. విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో చాలా ఖరీదైన సౌకర్యాలు కల్పించడం వల్ల అతనికి ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. మైక్రోఇకనామిక్స్ తెలియనివాళ్ళు తమ పేరు గొప్ప కోసం చేసే వ్యాపారాలకి లోన్‌లు ఇచ్చి బ్యాంక్‌లు బలి అవుతున్నాయి.

  బ్యాంక్‌లని కావాలని మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మన రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి కాలంలో చాలా మంది సెజ్‌లు పెడతామని చెప్పి ప్రభుత్వం దగ్గర భూములు తీసుకున్నారు. అవి పట్టణాలకి దగ్గరలోనో, హైవేల పక్కనో ఉంటాయి. అక్కడ సెజ్ గానీ ఫాక్తరీ గానీ పెట్టకుండా ఆ భూమిని బ్యాంక్‌లో తనఖా పెట్టి లోన్ తీసుకుంటారు. అది కూడా ఆ భూమి విలువని ఎక్కువగా చూపి లోన్ తీసుకుంటారు. పరిశ్రమలు పెట్టకుండా ఆ లోన్ డబ్బులతోనే బతికేస్తారు.

 3. ప్రవీన్‌ గారు,
  విజయ మాల్యాకేంటి, సత్యం రకమ లింగ రాజుకూడా పెట్టుబడి దారి ఆర్ధిక శాస్త్రం తెలియదు పాపం! మీరు వారికి ఎకనామిక్‌ అడ్వయిజరుగా పోతే బాగుండి ఉండు! 🙂

 4. ఇందియాలో విమానం ఎక్కేంత డబ్బున్నవాళ్ళే తక్కువ. ఇక విమానంలో మసాజ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తే అది చూసి ఎవరు ఎక్కుతారు? అందుకే విజయ్ మాల్యాకి ఆర్థిక శాస్త్రం తెలియదన్నాను. పెట్టుబడిదారులందరూ B.A. Economics చదివినవాళ్ళు కాదు. వాళ్ళలో తండ్రి సంపాదించిన ఆస్తుల మీద బతికేవాళ్ళే ఎక్కువ.

 5. B.A. మొదటి సంవత్సర ఇకనామిక్స్ పుస్తకంలోనే elasticity of cost గురించి వ్రాసి ఉంటుంది. బస్సు చార్జిలు పెరిగితే బస్సు ఎక్కేవాళ్ళ సంఖ్య తగ్గి రైలు ఎక్కేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది, అలాగే రైలు చార్జిలు పెరిగితే రైలు ఎక్కేవాళ్ళ సంఖ్య తగ్గి బస్సు ఎక్కేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. బస్సూ, రైలూ ఒకదానికి ఒకటి substitutes. కానీ విమానం ఈ రెంటికీ substitute కాదు. వైజాగ్ నుంచి హైదరాబాద్‌కి బస్సు చార్జి 750 రూ… అయితే విమాన చార్జి 3,000 రూ…. విమాన చార్జి 1,500 రూ..కి తగ్గినా బస్సు ఎక్కేవాళ్ళు ఎవరూ విమానం ఎక్కరు. బస్సుకీ, విమానానికీ మధ్య ఉన్నది zero elasticity of demand. ఆర్థిక శాస్త్రం గురించి తెలిసినవానికి పెట్టుబడిదారుని దగ్గర అద్వైజర్ ఉద్యోగం కూడా దొరకదు కానీ దాని గురించి ఏమీ తెలియని పెట్టుబడిదారునికి bailout ఇవ్వడానికి పాలక వర్గాలు ఉంటాయి.

 6. విజయ్‌ మాల్యా, రామలింగ రాజు మీరనుకున్నంత తెలివితక్కువ వారు కాదు. కాదు కాబట్టె పెట్టుబడి దారులకే అర్ధం కానీ టక్కు టమారాలన్ని ప్రదర్శించారు. వారికి బి.ఏ. ఆర్ధకశాస్త్రం తెలియకపోయినా, వారి వెనక నుండి నడిపే వాళ్లు అంతకంటె టక్కు టమారుగాళ్లు! వ్యాపారం లో లాభాలు సంపాదించడానికి ఆర్ధిక శాస్త్రం చదవడానికి సంబందంలేదు పెట్టు బడి పెట్టడానికి డబ్బుంటే అన్నీ వనరులు వాటికవే సమకూరుతాయి.

 7. నేని ఇది వరకే బ్లాగుల్లో వ్రాసాను “మనం ఉద్యోగానికి ఇంతర్వ్యూకి వెళ్ళే వి.వి.గిరి ఇంటి పేరు, ఇందిరా గాంధీ పుట్టిన రోజు లాంటి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతారు” అని. కానీ అవసరమైన జ్ఞానం కూడా లేనివాడు తండ్రి సంపాదించిన డబ్బు ఉంటే వ్యాపారం పెట్టుకోగలడు. మసాజ్ లాంటి సౌకర్యాలు చూసి జనం విమానం ఎక్కుతారని విజయ్ మాల్యా అనుకోవడం నాకు విచిత్రమనిపించింది.

  రామలింగరాజు కూడా తెలివితక్కువవాడే. తన సంస్థకి ఆదాయం ఎక్కువ ఉన్నట్టు దొంగ లెక్కలు వ్రాసి, ఆదాయపు పన్ని కూడా ఎక్కువ కట్టి, అలా షేర్ హోల్దర్‌లని ఆకర్షించి డబ్బులు వసూలు చేసాడు. షేర్ విలువ 100 రూ…, దివిదెంద్ 10 రూ…, షేర్ హోల్దర్ ఎప్పుడైనా తన షేర్ డబ్బులు తిరిగి తీసుకోవచ్చు అనుకుందాం. అప్పుడు కంపెనీ లాభం వందకి నూట ఇరవై అయినా ఉండాలి. సత్యం కంపెనీ అదేమీ లేక మొదటి నుంచి తప్పుడు లెక్కలతోనే నడిచేది. తండ్రి సంపాదించిన ఆస్తులు ఉన్నా అప్పులు చేసేవాడి బిహేవియర్ రామలింగరాజుది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s