కులాలవారి శ్మశానవాటికలు కోర్టుకు కొత్తేనట!


Shed for Bagad Brahman Samaj in Chandpole. Dalits are not allowed here.

Shed for Bagad Brahman Samaj in Chandpole. Dalits are not allowed here.

“ఇటా…, అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు…”

అని ‘శ్మశాన వాటి’ కావ్యంలో గుర్రం జాషువా గారు ప్రస్తావిస్తారు. జాషువా జీవించినప్పటి పరిస్ధితి ఏమిటో గానీ ఇప్పుడైతే ఈ పరిశీలనలో వాస్తవం లేదు. దాదాపు ప్రతి ఊరిలోనూ కులాల వారీగా (బ్రాడ్ గా) శ్మశాన వాటికలు ఇప్పటికీ ఉన్నాయి. అగ్ర కులాలకు ఉమ్మడి ఒక శ్మశాన వాటిక ఉండవచ్చునేమో గానీ నిమ్న కులాలకు మాత్రం అందులో ప్రవేశం ఉండదు.

రాజస్ధాన్ లో ఇలాంటి విషయం ఒకటి కోర్టు దృష్టికి వచ్చింది. కింది కులాల శవాల దహనానికి అగ్రకులాలకు రిజర్వ్ చేసిన చోట స్ధానం లేదని తెలుసుకుని రాజస్ధాన్ హైకోర్టు ఆశ్చర్యం ప్రకటించడమే ఒక ఆశ్చర్యం.

జైపూర్ నగరం నడిబొడ్డున చాంద్ పోల్ అనే పేరుతో శ్మశానం ఉంది. అక్కడ ఒక్కో కులానికి ఒక్కో రేకుల షెడ్ ఉంటుంది. వివిధ కులాల వాళ్ళు తమకు కేటాయించబడిన షెడ్ లోనే తమ మృత బంధువులను దహనం చేయాలి.

ఒకవేళ ఏ రోజన్నా ఒక కులంలో శవాలు ఎక్కువగా ఉండి రద్దీ వల్ల పక్క షెడ్ లో దహనం చేద్దామనుకున్నా, అందుకు ఒప్పుకోరు. జైపూర్ మునిసిపాలిటీ నిర్వహిస్తున్న శ్మశాన వాటికల్లో కూడా ఇలా కులాల వారీగా షెడ్ లు నిర్వహించడం జైపూర్ హై కోర్టు ధర్మాసనానికి ఆశ్చర్యం కలిగించిందిట!

రాజ్యాంగం పౌరులు అందరికీ సమానత్వం గ్యారంటీ చేసిందని కాబట్టి ఈ విధంగా కులాల వారీగా దహన వాటికలు నిర్వహించడం బంద్ చేయాలని రాజస్ధాన్ హై కోర్టు జైపూర్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

హై కోర్టు లాయర్ రామచంద్ర మాచ్వాల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దరిమిలా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆయనా, ఆయన కుటుంబ సభ్యులూ తమ బంధువు ఒకరు చనిపోతే దహనం చేయడానికి చాంద్ పోల్ శ్మశాన వాటికకు వెళ్లారు.

దళిత కులానికి చెందిన మాచ్వాల్, బంధువులు వెళ్ళేసరికి దళితులకు కేటాయించిన షెడ్ రద్దీగా ఉంది. దానితో వారు పక్క షెడ్ లో దహనం చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఇతర షెడ్ ల వారు ఎవరూ అందుకు ఒప్పుకోలేదు. ఫలితంగా దళితులు గంటల తరబడి ఎదురుచూడవలసి వచ్చింది. ఈ నేపధ్యంలో మాచ్వాల్ కోర్టు మెట్లు ఎక్కారు. కులాల వారీగా తగిలించిన బోర్డులను తొలగించాలని కోర్టు ఆదేశించింది. అక్కడ ఉన్న షెడ్ లు అన్నీ, కులాలకు అతీతంగా దహనం నిర్వహించాలని ఆదేశించింది.

హై కోర్టు ఆదేశాలను శ్మశాన వాటికలు అమలు చేస్తాయా? అసలు జైపూర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేస్తారా? “నేను ఒక వారం రోజులు ఎదురు చూస్తాను. కులాల పేర్లతో తగిలించిన బోర్డులను తొలగిస్తారో లేదో పరిశీలిస్తాను. లేదంటే మళ్ళీ కోర్టుకు ఫిర్యాదు చేస్తాను” అని మాచ్వాల్ చెబుతున్నారు.

“జనానికి ఇది తెలిసిన విషయమే. ఇక్కడి కుటుంబాలు తరాల నుండి ఇక్కడ ఇలాగే దహనం నిర్వహిస్తున్నారు. ఏ కులానికి ఏ షెడ్ లో దహనం చేస్తారో వారికి తెలుసు. శవాన్ని నేరుగా తమకు కులానికి చెందిన షెడ్ కే తీసుకెళ్తారు. ఎవరికన్నా తెలియకపోతే బోర్డులు ఉన్నాయి” అని స్ధానికులు చెప్పారని ది హిందు తెలిపింది. ‘సైని సమాజ్’, ‘బగద్ బ్రాహ్మణ్ సమాజ్’…. ఇలా వివిధ బోర్డులు అక్కడ తగిలించి ఉన్నాయని తెలుస్తోంది.

“ఇక్కడ ఇది మామూలే. రాజస్ధాన్ సమాజంలో ఇది ఆమోదం పొందిన ప్రక్రియ. ప్రతి కులానికి తమకు కేటాయించబడిన దహన వాటిక, లేదా శ్మశాన వాటిక ఉంటాయి. సాధారణంగా అగ్ర కులాలు ఉమ్మడి స్ధలాన్ని వినియోగిస్తాయి. దళిత కులాల వారిని దూరంగా నెత్తివేస్తారు” అని సెంటర్ ఫర్ దళిట్ రైట్స్ సంస్ధ డైరెక్టర్ సతీష్ కుమార్ వివరించారు.

కోర్టు ఆదేశించినట్లు బోర్డులు తీసేయొచ్చు గానీ వాస్తవంగా అగ్రకులాల దహన వాటికల్లో దళితుల శవాల దహనానికి అనుమతి ఇవ్వడం మాత్రం జరగకపోవచ్చు. అది జరగాలంటే దళితులు మళ్ళీ పోరాటం చేయవలసి ఉంటుంది.

ఒక్క జైపూర్, రాజస్ధాన్ మాత్రమే కాదు. భారత దేశం అంతటా కులాల వారీగా శ్మశాన వాటికలు ఉన్నాయి. ముఖ్యంగా అగ్రకులాలకు కేటాయించిన శ్మశాన వాటికలకు సమస్త సదుపాయాలు కల్పించబడి ఉంటాయి. ప్రభుత్వం సదుపాయాలు కల్పించకపోతే అగ్రకులాల వాళ్ళు తామే ఒక ఛారిటీ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటారు.

ఒక పట్టణంలో ఉద్యోగం రీత్యా బైటి నుండి వచ్చినవారైతే అద్దె ఇళ్ల యజమానులు శవాలను అనుమతించరు. అలాంటి వారు అగ్రకులాల వారైతే వారికి సేవలు అందించడానికి కూడా సదుపాయాలు కల్పించబడతాయి. దళితులు స్వతహాగా పేదలు కనుక వారి తంటాలు వారు పడవలసిందే. ఈ విషయాలు తమకు తెలియవని కోర్టులు చెప్పడం అంటే ఏమిటి అర్ధం? వారు జనం మధ్య నివసించరా?

 

12 thoughts on “కులాలవారి శ్మశానవాటికలు కోర్టుకు కొత్తేనట!

 1. భారతదేశమనేది ఏదైతే ఉందో అది చాలా శాంతికాముకదేశం. బహుశా మానవేతర జీవులుకూడా జీవులేనని ముందుగా గుర్తెరిగిన దేశం. కనుకనే భారతీయులు గోవు ఆదిగాగల అనేక జంతువులలో దేవుణ్ణి చూస్తారు. అలాగే భారతదేశపు తత్వం ఏదైతే ఉందో అందులో ప్రతిమనిషిలోనూ దేవుణ్ణి చూడమని చెప్పారు. 99.999% మంది భారతీయులు అలానే అందరు మనుషుల్లోనూ దేవుణ్ణి చూసి తరిస్తుంటారు. ఆ మిగిలిన 0.001%కూడా కేవలం ‘పాశ్చాత్య విషసంస్కృతి ప్రభావం’ వల్లనే పతనమై ఇలాంటి అసమానతలను పాటిస్తుంటారు. అలాగే మరి స్త్రీలు అనేవారు ఎవరైతే ఉన్నారో వారినికూడా భారతీయులు గౌరవించినంతగా ఇంకెవ్వరూ గౌరవించలేరు. జరుగుతున్న అఘాయిత్యాలన్నీ ‘పాశ్చాత్య విషసంస్కృతి ప్రభావం’ అని వేరే చెప్పఖ్ఖర్లేదనుకుంటాను.

  మీరు ఇంటర్నెట్లో ఎమాత్రం గాలించినా, భారతదేశపు సాంప్రదాయిక సాహిత్యాన్ని చదివినా, ‘దేశభక్త’ బ్లాగులు చదివినా తేలిక్కా దొరగ్గల పై పేరాలోని పాయింట్లను విస్మరించి, ఒక సంస్కృతినీ, అందులా ఒక పవిత్ర సంస్కృతిని, ఒక దేశ సాంప్రదాయాన్నీ, పవిత్రాచారాన్నీ చిన్నబుచ్చడం ఏమీ బాలేదు.

 2. విశేషజ్ఞ గారూ, చంపేశారు పొండి! ఇది రాసింది మీరేనా అనుకుంటూ చదివాను. ఎవరన్నా మీ పేరుతో రాసారా అన్న అనుమానమూ వచ్చింది. పూర్తిగా చదివాక గాని మనసు తేలికపడలేదు.

 3. మా ఊరిలో శ్మసానవాటికను ఆనుకొని(అత్యంత సమీపంలో) దలిత వాడలు ఉన్నాయి.అంతేకాకుండా మరోవైపు బి.సి(కులం)కి చెందినవారు కూడా ఉన్నారు. అందరూ అక్కడే దహన,పూడ్చివేత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
  ఇక్కడ చిన్నవిషయం చెప్పాలి నేను వెనుకబడిన కులానికి చెందినవాడను. ఈ కులానికి చెందినవారిని పూడ్చివేత కార్యక్రమాలకు 10 సం,, క్రితంవరకు ప్రత్యేక శ్మసానవాటిక ఉండేది.కానీ అది ఆక్రమనకు గురైంది!
  ప్రస్తుతం అందరం ఒకే శ్మసానవాటికను వాడుకొంటున్నాము.
  యముడు సమవర్తి అనీ,ఈ దేశంలో అసమనతలు లేని స్థలం శ్మసానవాటిక అని!నేనెప్పుడూ భావించలేదు.

 4. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ దేశ కులం భారతని!
  అంటూంటే ఒక భారతీయ న్యాయస్థానానికి ఆశ్చర్య మటా!? హతవిది!

 5. ఈ మధ్య నాక్కొంచెం వెటకారం ఎక్కువయ్యింది లెండి. serious criticismకు బదులుగా ridicule వాడుతున్నాను.

  ఎలాగూ సంస్కృతీ పరిరక్షకులు మన సంస్కృతిలోని మానవీయతను, విశిష్టతనూ, ఉన్నత విలువలనూ ఇంకా… కులవ్యవస్థ అవశ్యకతనూ వివరించి, దాని భ్రష్టుపట్టించింది బ్రిటీషువారేనని వివిధ శ్లోకాలు, కల్పితగాధలూ ‘ఆధారంగా'(!!) చూపుతూ వక్కాణిస్తారు కదాని ఆపని నేనే చేసేశాను 🙂

 6. పింగ్‌బ్యాక్: కులాలవారి శ్మశానవాటికలు కోర్టుకు కొత్తేనట! | ugiridharaprasad

 7. “ఒక పట్టణంలో ఉద్యోగం రీత్యా బైటి నుండి వచ్చినవారైతే అద్దె ఇళ్ల యజమానులు శవాలను అనుమతించరు.”
  ఈ మాట అక్షరసత్యం. ఇటువంటి ఒక స్వానుభవంతోనే చెబుతున్నాను సత్యమే నని. 1975లో మా నాన్నగారు పరమపదం చేరుకొన్నప్పుడు మాకుటుంబం రాజోలు (తూగోజి) వచ్చి కేవలం ఆరు నెలలే ఐన సంగతి. నేను హైదరాబాదుకు ఉద్యోగరీత్యా క్రొత్తగా వలసపోయి యేడాదిచిలుకు. నేను రాజోలు చేరుకున్నాక అక్కడి పరిస్థితి ఎంతగా అక్షేపణీయంగా ఉందంటే అప్పటికప్పుడు మమ్మల్ని రాజోలు వదలి మా స్వగ్రామం పొమ్మని ఒకటే పోరు – ఇంటివారినుండీ వారి బంధుమిత్రవర్గం నుండి. అది సౌకర్యం కాదని తిరస్కరించటంతో ఆ ఇంటి వారు మేము కర్మకాండల నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు మా వాటాకు తాళం కూడా వేసారు! జ్ఞాతిశ్చేదనలేన కిం అన్నట్లుగా మా బంధువర్గంలోని వారు కొందరు కూడా అమానుషంగా ప్రవర్తించిన ఆ ఇంటివారి పక్షానే మాట్లాడారు. తమాషా ఏమిటంటే ఆ యింటివారు ఒకానొక బాబావారి పరమభక్తులు. ఎంతో‌ మంచివారట.

  దైవానుగ్రహంగా నాకు మిత్రుడైన ఒక బ్యాంక్ ఉద్యోగి అక్కడ కనిపించారు. అతని తండ్రిగారే అక్కడి తహసీల్దారు. ఆయనను కలిసి విన్నవించుకొంటే ఆయన వాళ్ళకు తీవ్రంగా హెచ్చరికలు చేసేదాకా పరిస్థితి చక్కబడలేదు.

  ఈ అపరకర్మల విషయంలో కూడా అనేక మూఢ విశ్వాసాలు నెలకొని ఉన్నాయి సమాజంలో. నలభై యేళ్ళ క్రిందటి సంగతి చెప్పాను కానీ, ఈ నాటికీ పెద్దగా పరిస్థితి మారి ఉండకపోవచ్చును.

 8. అవును శ్యామలరావు గారూ ఈనాటికీ పరిస్ధితి మారలేదు.

  మా కొలీగ్ ఫ్రెండ్ తల్లిగారు ఈ మధ్యనే చనిపోయారు. ఇలాగే శవాన్ని అతని ఇంటి ఓనర్ అనుమతించలేదు. మా మిత్రుడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుల కోసం ప్రత్యేక సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వారి కోసం కర్మకాండల నిమిత్తం మూడు నాలుగు సత్రాలు పని చేస్తున్నాయి. పేరుకి సత్రమే గాని అక్కడ బ్రాహ్మణులకే ప్రవేశం ఉంటుంది. అద్దె ఇళ్ళలో ఉంటున్నవారు సమస్త కర్మకాండలు అక్కడ నిర్వహించుకోవచ్చు. వచ్చిన బంధువులకు గదులు కూడా ఇస్తారు. నామమాత్ర ఫీజుకి ఈ సౌకర్యాలు ఇవ్వబడుతున్నాయి.

  ఇతర కులాల వారు మాత్రం తమ పెద్దలు చనిపోతే స్వగ్రామాలకు తీసుకెళ్లక తప్పదు.

 9. మన దేశంలో ప్రాచీన సంస్కృతిని పరిరక్షించుకోవడం అంటే ఏమిటో అనుకున్నా. అంటరానితనాన్ని పదిలంగా కాపాడుకుంటూనే వస్తున్నామన్నమాట. అక్కడెక్కడో అరబ్ దేశాల్లో ఇతర మతస్థుల శరీరాల్ని ఖననం చేయనివ్వరని తెలిసి ముక్కున వేలేసుకుంటాం. కానీ మన దగ్గరా…అన్య వర్ణాల వారిని తమతో సమానంగా….అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం లేకపోవడం అమానుషం.
  – మరీ విచిత్రం ఏమిటంటే…..ఓ గ్రామంలో ఓ దళిత వ్యక్తి, అగ్ర కుల వ్యక్తులు (ఆర్థిక అవసరాల రీత్యా) స్నేహితులైతే…
  టవునుకు వెళ్లి కలిసి హోటల్లో తింటారు, బార్ లో కలిసి తాగుతారు. కానీ తీరా తమ సొంత ఊళ్లోకి వెళితే మాత్రం….తిరిగి ఎప్పటిలాగే. అగ్ర కుల వ్యక్తి ఇంట్లోకి వెళ్లటం గగనం, ఇక తినడం, తాగడం జరిగేపని కాదు.
  టవున్లో అభ్యంతరం లేనిది…..తమ ఊళ్లోకి రాగానే ఎందుకో…..బహుశా ఇరుగు పొరుగు ఏమన్నా అనుకుంటారేమో అనా….?

 10. అవును తులసి గారు, ఇలా ద్వంద ప్రవృత్తి ఉన్న వారిని చాలానే చూస్తుంటాం. అదేమంటే తమ కులం వారికి దూరరంగా ఉండి బ్రతకలేరట! వీళ్లు పలానా వాల్లతో తిరుగుతున్నారంటే బందువులంతా దూరమౌతారట! ఆవిధంగ తమ వారు తమకు సపొర్ట్‌ లేకుండ గడవదట! ఆధునినిక కాలం లో ఎవరి బ్రతుకు వారు బ్రతుకుతున్నా మానసికంగా ఆ బందాలకు కట్టు బడక తప్పలేదట! ఆర్ధికంగా, సామాజికంగా ఒక దానికి ఒకటి ముడి వేసుక పోయిన కుల వ్యవస్థ మారటం అటుంచి అంతకంతకు పెన వేసుక పోతుంది. రంగనాయకమ్మ గారు చెప్పినట్టు దళిత సమస్య పరిష్కారానికి బుద్దుడు చాలడు, అంబెద్కర్‌ చాలడు మార్క్స్‌ తప్ప!

 11. నిజం తిరుపాలు గారు. శాస్త్ర విజ్ఞానం ఇంతగా పెరుగుతున్నా……కులం ( గజ్జి) రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఆఖరికి అమెరికా వెళ్లి కూడా కులం కూటములు పెడుతున్నారు. కులం సమస్యకు మార్క్సిజంలో తప్ప మరో చోట పరిష్కారం దొరకదు. ఆ మాటకొస్తే కులానికే కాదు…..అన్ని సమస్యలకు అందులో పరిష్కారం దొరుకుతుంది. ఒక్క దోపిడీదారుల దోచుకోవడానికి మార్గం తప్ప. అందుకే దోపిడిదారులు మార్క్సిజం రాకుండా అడ్డుకుంటున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s