ముంచుకొచ్చే ఎన్నికలు, ప్రభుత్వాల చర్యలకు అనివార్యంగా రంగు పులుముతాయి. ఉత్తర ప్రదేశ్ లో 11 అసెంబ్లీ స్ధానాలకు, ఒక పార్లమెంటరీ స్ధానానికి ఉప ఎన్నికలు జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పై విద్వేష ప్రసంగం చేసినందుకు అభియోగ పత్రం నమోదు చేయడానికి తీసుకున్న నిర్ణయం రాజకీయ లక్ష్యంతోనే జరిగిందా అన్నది చర్చనీయమైన ప్రశ్న. అమిత్ షా పై దాఖలు చేసిన ఛార్జీ షీటును కోర్టు పోలీసులకు వెనక్కి ఇచ్చేయడంతో, ఉప ఎన్నికల్లో పాలక సమాజ్ వాదీ పార్టీ ఓటమిని ఎదుర్కొనున్నందునే అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఈ వ్యవహారానికి తెరతీసిందన్న బి.జె.పి ఆరోపణకు బలం చేకూరినట్లయింది. అయితే, షా కు వ్యతిరేకంగా ఈ కేసు లేవనెత్తిన ప్రశ్నలు తక్షణం జరగనున్న ఎన్నికలకు అతీతంగా ఉండడం గమనార్హం. భావ ప్రకటనా స్వేచ్ఛ, హింసను రెచ్చగొట్టడం, సున్నితమైన మతభావనలు, దుశ్చర్యలు (corrupt practices)… ఈ అంశాలన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి.
గత ఏప్రిల్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ, అమిత్ షా, ముజఫర్ నగర్ అల్లర్లకు ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపు ఇచ్చారు. దానితో ఎన్నికల కమిషన్ ఆయనను ప్రచారం నుండి నిషేదించింది. ఇది హింసను రెచ్చగొట్టడానికి కాదని, అల్లర్లకు బ్యాలట్ ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని చేసిన విజ్ఞప్తి మాత్రమేనని బి.జె.పి నొక్కి చెబుతోంది. ఈ అర్ధంలో చూసినా, అల్లర్లకు ప్రతీకారం తీర్చుకోవాలని అమిత్ షా పిలుపు ఇవ్వడం అంటే బి.జె.పికి ఓటు వేయడం అంటే అల్లర్లలో హిందూ బాధితుల తరపున ప్రతీకారం తీర్చుకున్నట్లే కాగలదని చెప్పినట్లే. మతం ప్రాతిపదికన వివిధ సమూహాల మధ్య శతృత్వం ప్రేరేపించడం, మతపర భావోద్వేగాలను గాయపరిచే దుశ్చర్యలకు పాల్పడడం, ప్రజా శాంతికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో అబద్ధపు ప్రకటనలు ప్రచారం చేయడం… మున్నగు సెక్షన్ల కింద మోపిన అభియోగాలు న్యాయ పరీక్షకు నిలబడతాయా లేదా అన్నది ఇంకా తేలవలసి ఉంది. కానీ అమిత్ షా, ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజకీయ మర్యాదను స్పష్టంగా ఉల్లంఘించారు. మతం ప్రాతిపదికన ఒక వ్యక్తికి ఓటు వేయాలని కోరడాన్ని దుశ్చర్యగా నిర్వచించే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఒక సెక్షన్ ను బి.జె.పి నేతకు వర్తింపజేయడానికి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
విచారం ప్రకటించిన దరిమిలా అమిత్ షా పై నిషేధాన్ని ఎన్నికల కమిషన్ సరిగ్గానే వెనక్కి తీసుకుంది. కానీ, ఉత్తర ప్రదేశ్ లో మరోసారి రాజకీయ వేడి పెరగడంతో ఈ కేసు చుట్టూ రెండో దుమారం వచ్చి చేరడం ఆశ్చర్య జనకం ఏమీ కాదు. సరిగ్గా ఉప ఎన్నికలతో ఏకీభవించే విధంగా సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం ఛార్జీ షీటు నమోదు చేస్తే, బి.జె.పి తన పార్లమెంటు సభ్యుడు యోగి ఆదిత్యనాధ్ చేత రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు ఇప్పిస్తోంది. ఈ ప్రకటనలు అమిత్ షా కు అసౌకర్యంగా మారవచ్చు. జిల్లా ప్రభుత్వం ఆయన సభకు అనుమతి నిరాకరించినప్పటికీ, మతపరంగా సున్నితమైన ప్రాంతంలో ర్యాలీ నిర్వహించడాన్ని ఆయన మానుకోలేదు. అమిత్ షా వ్యాఖ్యలకు బి.జె.పి ఇచ్చే సమర్ధన ఎలా ఉన్నప్పటికీ ఉత్తర ప్రదేశ్ లో రెచ్చగొట్టుడు రాజకీయాలను అనుసరించడమే ఆ పార్టీ ఉద్దేశ్యం అన్నది స్పష్టం అవుతోంది. మత విభేదాల ప్రాతిపదికన ప్రజలను ఆకర్షించడం వలన స్వల్పకాలిక రాజకీయ లబ్ది పొందవచ్చేమోగానీ అది సామాజిక అల్లికకు తీవ్రమైన హానీ చేస్తుంది.
బిజెపి ఏమీ దేశభక్తుల పార్తీ కాదు. కశ్మీర్ పాకిస్తాన్‌లో ఉన్నట్టు వికీపీదియాలో ఇందియాకి సంబంధించిన పేజ్‌లలోనే చూపిస్తోన్నా బిజెపికి చీమ కుట్టినట్టైనా లేదు. “వికీపీదియా వ్యాపారం కోసం అలా చేస్తోంది, దాని గురించి మనం పట్టించుకోకూడదు” అని బిజెపి అభిమానులు సమాధానం చెప్పగలరు. ఒక అమెరికన్ వెబ్‌సైత్‌లో ఇందియాని ఎలా చూపించినా వీళ్ళు పట్టించుకోరు కానీ ఇందియాలో ఉంటున్నవాళ్ళ మధ్య పాము-ముంగిస శతృత్వం పెడతారు.