“అబ్బే, కోమా (అచేతనం), సెమీ కాన్షియస్ (అర్ధ చేతనం) కాదండీ బాబూ, ఆమె చెప్పేది దౌత్యంలో కామాలు, సెమీ కోలన్లు మాత్రమే ఉంటాయని”
*********
గుడ్ జోక్!
మూడు రోజుల క్రితం భారత విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ మొదటిసారి పూర్తి స్ధాయి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
ఈ సందర్భంగా పాక్ తో చర్చల రద్దు సంగతి ప్రసక్తి వచ్చింది. పాకిస్ధాన్ తో దౌత్యం కొనసాగుతుందా లేదా అన్న ప్రశ్నకు ఆమె “దౌత్యంలో ఫుల్ స్టాప్ లు అంటూ ఏమీ ఉండవు. ఉంటే కామాలు లేదా సెమీ కోలన్ లు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత అంతా ముందుకు వెళ్తారు. దౌత్య ప్రయాణంలో ఫుల్ స్టాప్ లు ఉండవు” అని చెప్పారు.
వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య కాస్త అర్ధవంతమైన చర్చలు జరిగాయి. ఆ తర్వాత అవి ఎప్పుడూ స్ధిరంగా జరిగింది లేదు. ముంబై దాడులకు సంబంధించిన భావోద్వేగాలు చల్లబడ్డాక కూడా ఏదో ఒక కారణంతో చర్చలు మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతూ, రద్దు అవుతూ వచ్చాయి. ఈ నేపధ్యంలో భారత్ పాక్ చర్చలు అర్ధచేతనానికి అచేతనానికి గురయ్యాయని కార్టూనిస్టు చేస్తున్న సూచన చాలా అర్ధం వంతంగా ఉంది.
విదేశీ మంత్రి గారు చెప్పిన మాటల్లోని స్ఫూర్తి ఆచరణలో ఏదో ఒక సాకుతో మాయం అవుతోంది. స్వయంగా రెచ్చగొట్టి పెట్టిన అర్ధం లేని భావోద్వేగాలు ప్రధాన ఆటంకం కాగా, దేశంలోని పార్టీల రాజకీయ స్వార్ధ ప్రయోజనాలు తమ పాత్ర తాము పోషిస్తున్నాయి.