చెక్ చేసుకోండి! 5 మిలి. జీమెయిల్ పాస్ వర్డ్ లు లీక్


GOOGLE

యాపిల్ అయింది, ఇప్పుడు జీ మెయిల్ వంతు వచ్చింది. యాపిల్ కంపెనీకి చెందిన ఐ క్లౌడ్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు పలువురు సెలబ్రిటీల (పశ్చిమ దేశాలకు చెందినవారు) నగ్న చిత్రాలను దొంగిలించి ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన ఉదంతం మరువక ముందే, జీ మెయిల్ కు చెందిన 5 మిలియన్ల వినియోగదారుల యూజర్ నేమ్ లు, పాస్ వర్డ్ లను హ్యాకర్లు సంపాదించి ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు.

బిట్ కాయిన్ సంస్ధ నిర్వహించే ఒక ఫోరం (btcsec.com) లో హ్యాకర్లు తాము దొంగిలించిన జీ మెయిల్ సమాచారాన్ని పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. Tvskit పేరు గల యూజర్ ఈ పోస్ట్ కు బాధ్యులని ది హిందు తెలిపింది. ఒకే ఒక గూగుల్ మెయిల్ ఖాతా ద్వారా గూగుల్ అందజేసే వివిధ సేవలన్నీ పొందే సదుపాయం ఉండడంతో ఈ వినియోగదారుల వ్యక్తిగత వివరాలు బహిర్గతం అయ్యే ప్రమాదం నెలకొంది. ఒకే మెయిల్ ఖాతాతో జీమెయిల్, యూ ట్యూబ్, హ్యాంగ్ఔట్స్, డ్రైవ్, మ్యాప్స్… తదితర సేవలను గూగుల్ అందిస్తుంది.

జీ మెయిల్ ఖాతాలు హ్యాకింగ్ కి గురయిన విషయాన్ని గూగుల్ అంగీకరించింది. అయితే హ్యాకర్ లీక్ చేసిన ఖాతాల్లో కేవలం 2 శాతం మాత్రమే పని చేస్తాయని తెలిపింది. హ్యాకర్ మాత్రం 60 శాతం వివరాలు ఇప్పటికీ పని చేస్తాయని తెలిపాడు.

తాము హైజాకింగ్ వ్యతిరేక వ్యవస్ధలను తమ సర్వర్లలో నెలకొల్పామని అందువల్ల ఒకవేళ సరైన యూజర్ నేమ్, పాస్ వర్డ్ లను వినియోగించినా ప్రవేశం దొరక్కపోవచ్చని తెలిపింది. అయితే ఖాతా సొంత దారులు తమ పాస్ వర్డ్ లను మరోసారి మార్చుకోవాలని సలహా ఇచ్చింది. “మేము లీక్ అయిన ఖాతాలకు రక్షణ కల్పించాము. అయితే, యూజర్లు తమ పాస్ వర్డ్ లను రీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది” అని గూగుల్ తెలిపింది.

తమ గూగుల్ ఖాతాలు లీక్ అయింది లేనిది తెలుసుకునేందుకు రష్యన్ కంప్యూటర్ యాంటీ-వైరస్ బధ్రతా సంస్ధ కాస్పరస్కీ అవకాశం కల్పించింది. కింద ఇవ్వబడిన లింక్ లోకి వెళ్ళి తమ జీ మెయిల్ పూర్తి భాగాన్ని టైప్ చేసి తమ ఖాతా లీక్ అయింది లేనిదీ తనిఖీ చేసుకోవచ్చు.

https://isleaked.com/en.php

గత వారం యాపిల్ కంపెనీ ఇదే పరిస్ధితి ఎదుర్కొంది. క్లౌడ్ సర్వీసెస్ పేరుతో ఐ.టి కంపెనీలు తమ వినియోగదారుల సమస్త సమాచారాన్ని ఉచితంగా తమ సర్వర్లలో నిలవ ఉంచుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. “మీరు ఎక్కడికి వెళ్ళినా, ప్రయాణంలో ఉన్నా సరే, తేలికగా మీరు సృష్టించిన డాక్యుమెంట్ లను, ఫోటోలను, వీడియోలను డౌన్ లౌడ్ చేసి చూసుకోండి” అంటూ దాదాపు ప్రతి ఐ.టి కంపెనీ చెబుతోంది. గూగుల్, యాహూ, మైక్రో సాఫ్ట్, యాపిల్, అమెజాన్, యాక్రోబాట్, ఫేస్ బుక్, ట్విట్టర్… ఈ కంపెనీలు ఈ రేసులో ముందున్నాయి.

ఉచిత సేవలు అంటూ అందిస్తున్న క్లౌడ్ సర్వీసెస్ ద్వారా ఐ.టి కంపెనీలు ప్రపంచంలో ప్రతి ఒక్క వినియోగదారుడి సమాచారాన్ని సేకరించి తమ సర్వర్లలో నిల్వ చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. గతంలో కంప్యూటర్, మొబైల్ ఫోన్ తదితర డివైజ్ లు ఉన్నవారు తమ సమాచారాన్ని తమ సొంత ఎక్సటర్నల్ హార్డ్ డిస్క్ లో బ్యాకప్ తీసుకోవాలని ఈ కంపెనీలు ప్రోత్సహించేవి. ఇప్పుడు ఆ ప్రోత్సాహాన్ని మానుకుని ‘మేమే నిల్వ చేస్తాం. ఇవ్వండి’ అంటున్నాయి.

ఈ విధంగా సమాచారం సేకరించాక శాశ్వతంగా నిల్వ చేసే సదుపాయాలను ఐ.టి కంపెనీలు అభివృద్ధి చేసుకున్నాయి. భారీ గోడౌన్లలో భారీ సర్వర్లను స్ధాపించి నిల్వ చేసిన సమాచారాన్ని వినియోగదారులు కోరితే తమ సర్వర్ల నుండి తొలగిస్తామని, సమాచారాన్ని తగిన ఉచిత సేవలు అందించడానికి తప్ప దేనికీ ఉపయోగించబోమని, ‘మీ సమాచారం మా వద్ద భద్రం’ అనీ హామీ ఇస్తున్నాయి. కానీ ఇవన్నీ అబద్ధాలేనని వివిధ స్వతంత్ర పరిశోధకులు సాక్ష్యాలతో సహా వెల్లడి చేశారు.

తమ వద్ద నిల్వ చేసిన సమాచారాన్ని ఐ.టి కంపెనీలు తమ సొంత వ్యాపార ప్రయోజనాలకు వినియోగిస్తున్నాయి. ఉదాహరణకి యాండ్రాయిడ్ ఫోన్లలో ఒక అప్లికేషన్ కొన్నట్లయితే ఆ అప్లికేషన్ తయారు చేసినవారికి సదరు ఫోన్ సొంతదారు వివరాలన్నింటినీ గూగుల్ ఇచ్చేస్తోంది. ఇలా ఇచ్చేయడం యాప్ తయారీదారుకు, గూగుల్ కంపెనీకి మధ్య ఉన్న కాంట్రాక్టులో భాగం. తమ మధ్య ఉన్న వ్యాపార సంబంధాలకు వినియోగదారుల సమాచారాన్ని వినియోగిస్తూ, అమ్ముకుంటూ వినియోగదారులను మోసం చేస్తున్నాయి. ఇది కొన్నిసార్లు ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తోంది.

ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ సమస్త ఎన్ క్రిప్షన్ బధ్రతలను ఛేదించే సాఫ్ట్ వేర్ ను సి.ఐ.ఏ అభివృద్ధి చేసుకుంది. హ్యాకర్ల సంగతి చెప్పనే అవసరం లేదు. వీరు ఐ.టి కంపెనీల సర్వర్లను హ్యాక్ చేసి వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించే సదుపాయం కలుగుతోంది. యాపిల్ అందించే ఐ కౌడ్ సేవల సర్వర్ల నుండి సెలబ్రిటీల నగ్న చిత్రాలను దొంగిలించి ఇంటర్నెట్ లో పెట్టడం ద్వారా హ్యాకర్లు తమ శక్తి ఏమిటో నిరూపించారు.

హ్యాకర్ల హ్యాకింగ్ తక్షణ పరిశీలనలో మనకు కోపం తెప్పించవచ్చు. కానీ వారు వినియోగదారులకు ఒక మేలు చేస్తున్నారు. అదేమిటంటే వినియోగదారుల సమాచారం ఐ.టి కంపెనీల వద్ద భద్రంగా ఉండడం ఒట్టిమాటే అనీ వారు నిరూపిస్తున్నారు. తద్వారా భారీ ‘టర్మ్స్ & కండిషన్స్’ ద్వారా ఐ.టి కంపెనీలు ఇస్తున్న హామీలు నమ్మవద్దని వారు సూచిస్తున్నారు. ఈ మెయిల్ వాడకందారులు తమకు అవసరమైన సేవలకు విధాక్షణా రహితంగా ఐ.టి కంపెనీలపై ఆధారపడవద్దని వారు పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.

ఇప్పటి జీ మెయిల్ హ్యాకర్ల ఉద్దేశ్యం కూడా ఇలా హెచ్చరించడమే అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే స్వార్ధ ప్రయోజనాల కోసం హ్యాక్ చేసిన వారు తమ చర్యలను బహిర్గతం చెయ్యరు. బహిర్గతం చేశారంటే తద్వారా వారు బహిరంగంగా ఒక ‘పరోక్ష ప్రకటన’ చేస్తున్నట్లు అర్ధం.

కాబట్టి ఐ.టి కంపెనీల మోసపూరిత హామీలను నమ్మి వ్యక్తిగత సమాచారాన్ని విచక్షణారహితంగా ఇంటర్ నెట్ లో పెట్టకపోవడమే ఉత్తమం. ఒకసారి సమాచారం (ఒక ఫోటో, ఒక అసలు పేరు, ఒక ఊరు, ఒక ప్రొఫైల్, ఒక అలవాటు…. ఇలా ఏదైనా) అంటూ ఐ.టి కంపెనీకి ఇస్తే అది శాశ్వతంగా వారి వద్ద ఉండిపోతుంది. వినియోగదారులు కోరితే తొలగిస్తామని చెప్పడం ఒట్టిమాట. (కావాలంటే మీ ఫేస్ బుక్ ఖాతాను శాశ్వతంగా రద్దు చేయాలని అడిగి చూడండి! రద్దు చేశాం అని చెబుతారు. కొంత సమయం కూడా ఇస్తారు. ఆ సమయం గడిచినా మీ ఫేస్ బుక్ ఖాతా రద్దు కాదు.)

తమ వ్యాపారం కోసం వినియోగదారుల సమాచారాన్ని ఐ.టి కంపెనీలు వినియోగించడం సమస్యలో ఒక కోణం మాత్రమే. మరొక ముఖ్యమైన కోణం ఏమిటంటే సదరు సమాచారాన్ని వివిధ దేశాల రాజ్య వ్యవస్ధలకు కంపెనీలు అందుబాటులో ఉంచడం. ఎడ్వర్డ్ స్నోడెన్ బైట పెట్టింది ఇదే. రాజ్యం అనేది పౌరుల వ్యక్తిగత ఏకాంత హక్కులను గుర్తించి అమలు చేయాలి. కానీ రాజ్యం ఎప్పుడూ ప్రజలపై ఒక కన్నేసి ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నాలను ఐ.టి కంపెనీలు ఇప్పుడు సులభతరం చేశాయి.

తస్మాత్, జాగ్రత్త!

 

One thought on “చెక్ చేసుకోండి! 5 మిలి. జీమెయిల్ పాస్ వర్డ్ లు లీక్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s