
A labourer works inside a steel factory on the outskirts of Jammu January 2, 2014. REUTERS/Mukesh Gupta/Files
జులై నెలలో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. గత నాలుగు నెలల్లో అతి తక్కువ పెరుగుదల శాతం (0.5 శాతం) నమోదయింది. 2014-15 మొదటి త్రైమాసిక సంవత్సరంలో జి.డి.పి వృద్ధి రేటు 5.7 శాతం నమోదు కావడానికి కారణం మేమంటే మేమేనని తగవులాడుకున్న మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం, ప్రస్తుత పట్టణ మంత్రి వెంకయ్య నాయుడు గార్లు తాజా ఫలితానికి కూడా క్రెడిట్/డెబిట్ తీసుకుంటారా?
మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి పడిపోవడం, వినియోగ సరుకులు తక్కువగా అమ్ముడుబోవడం వల్ల పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయిందని ది హిందూ పత్రిక తెలిపింది. రాయిటర్స్ పత్రిక పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుదలకు కాస్త మసాలా కూర్చిన కారణాలు చూపింది. గనులు, యుటిలిటీ రంగం (విద్యుత్, గ్యాస్, నీరు), ఫ్యాక్టరీల ఉత్పత్తి పెరుగుదల తగ్గిపోవడం వల్ల పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయిందని, అధిక ద్రవ్యోల్బణం ఈ కారణాలకు జత కలిసిందని రాయిటర్స్ తెలిపింది.
చిల్లర ధరల ద్రవ్యోల్బణం స్వల్పంగా 7.96 శాతం నుండి 7.8 శాతానికి తగ్గిందని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. ప్రధానంగా ఇంధనం ధరల పెరుగుదల రేటు తగ్గడంవల్ల ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గిందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. ఆర్.బి.ఐ తన వడ్డీ రేటును నిర్ణయించేటప్పుడు చిల్లర ద్రవ్యోల్బణంను దృష్టిలో ఉంచుకుంటుంది. యుటిలిటీల రంగం ఉత్పత్తి మరియు లాభాలు ఆర్.బి.ఐ వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటాయి. ఆ విధంగా అధిక ద్రవ్యోల్బణం పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపింది.
బలహీన పారిశ్రామిక వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం మోడి ప్రభుత్వ జి.డి.పి ఆశలపై నీళ్ళు చల్లుతున్నాయని రాయిటర్స్ విశ్లేషించింది. 2016 నాటికల్లా చిల్లర ద్రవ్యోల్బణం 6 శాతానికి తగ్గించాలని ఆర్.బి.ఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపధ్యంలో అధిక చిల్లర ద్రవ్యోల్బణం కొనసాగుతున్న దృష్ట్యా ఈ ఆర్ధిక సంవత్సరం అంతా వడ్డీ రేట్లను ఆర్.బి.ఐ ముట్టుకోదని ఇప్పుడున్న వడ్డీ రేటునే కొనసాగిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గత కొద్ది వారాలుగా ఋతుపవన వర్షాలు పెరగడం, ప్రపంచ క్రూడాయిల్ ధరలు తగ్గడం, కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడం… మొదలైన కారణాల వల్ల ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ వడ్డీ రేట్లను మాత్రం ఆర్.బి.ఐ ప్రస్తుత స్ధాయిలో కొనసాగిస్తుందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
జూన్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 3.4 శాతం పెరిగిందని గతంలో అంచనా వేయగా, సవరించిన అంచనాలలో అది 3.9 శాతంగా తేలింది. కానీ జులై నెలలో కేవలం 0.5 శాతం వృద్ధినే పారిశ్రామిక రంగం నమోదు చేసింది. ఏప్రిల్-జులై నాలుగు నెలల కాలంలో పారిశ్రామిక వృద్ధి రేటు 3.3 శాతం నమోదు అయింది.
పారిశ్రామిక ఉత్పత్తిలో తయారీ రంగం (మాన్యుఫాక్చరింగ్) 75 శాతం వాటా కలిగి ఉంది. ప్రధానంగా ఈ రంగమే పారిశ్రామిక ఉత్పత్తిని కిందకు లాగింది. జులై నెలలో ఈ రంగం వృద్ధి చెందడానికి బదులు 1 శాతం మేర సంకోచించింది. ఈ ప్రభావం పారిశ్రామిక ఉత్పత్తిపై పడింది. ఏప్రిల్-జులై కాలంలో అయితే మాన్యుఫాక్చరింగ్ రంగం 4.5 శాతం కుచించుకుపోయింది.
ఏప్రిల్-జూన్ జి.డి.పి వృద్ధి రెండున్నర యేళ్లలో అత్యధికంగా 5.7 శాతం నమోదు అయినందుకు క్రెడిట్ తీసుకోవడానికి పోటీ పడిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు, జులై పారిశ్రామిక వృద్ధి క్షీణతకు బాధ్యత ఎవరిదో చెబితే బాగుంటుంది.
బి.జె.పి అధికారంలోకి రావడం వల్ల దేశంలో మూడ్ మారిపోయిందని, పార్లమెంటు పని చేసిందని, బిల్లులు పాస్ అయ్యాయని, ప్రభుత్వం వేగంగా పని చేసిందని వెంకయ్య నాయుడు గారు చెప్పారు. అందుకే ముదటి త్రైమాసికంలో జి.డి.పి వృద్ధి మెరుగ్గా ఉన్నదని చెప్పారు. ఇవన్నీ జులై నెలలో ఎందుకు పని చేయలేదో కేంద్ర మంత్రి చెప్పాల్సి ఉంది.
సేవా రంగం (IT, Tourism, Transport etc) వల్ల వచ్చే ఆదాయం కోసం పాలకులు కావాలని ఉత్పత్తి రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మన దేశం నుంచి ఎగుమతులు పెరిగి, దిగుమతులు తగ్గడం వల్ల మన కరెన్సీ విలువ పెరిగి అది అమెరికన్ దాలర్‌తో సమానమైందనుకుందాం. Off-shore projects మీదే ఆధారపడిన భారతీయ call centers అన్నీ అప్పుడు మూతపడి వాటి యజమానులు ఉప్పూ, చింతపండూ అమ్ముకోవాల్సి వస్తుంది. సామ్రాజ్యవాదులు పడేసే చిల్లర ఏరుకునే భారతీయ పాలకులు ఇందియాని పారిశ్రామికంగా ఎదగనివ్వరు.
సానుకూలమైన అంశాలును తమ ఖాతాలో వేసుకోవడం,ప్రతికూలాంశాలు ప్రథ్యర్ధులపైకి(ఇతరాంశాలు) నెట్టివేయడం సామాన్యులు చేసేపనే! ఈ సామాన్యులలో హోదాతో సంభందంలేకుండా అందరూ,అన్నివర్గాలవాళ్ళూ వస్తారు!
ఈకోవలోనివారే రాజకీయనాయకులుకూడానూ!