ఢిల్లీ అసెంబ్లీ: కాంగ్రెస్ కి షీలా షాక్!


షీలా దీక్షిత్ -ది హిందూ

షీలా దీక్షిత్ -ది హిందూ

కాంగ్రెస్ పార్టీ తరపున ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన షీలా దీక్షిత్ ఈ రోజు (సెప్టెంబర్ 11, 2014) రాజకీయ పరిశీలకులను, పత్రికలను, ఢిల్లీ ప్రజలను నిశ్చేష్టులను కావించారు. ఢిల్లీలో బి.జె.పి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది ఢిల్లీ ప్రజలకు మంచిదే అని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె ప్రకటనతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటించగా, కాంగ్రెస్-బి.జె.పి లకు అసలు తేడాయే లేదని చెప్పాం గదా! అని ఎఎపి వ్యాఖ్యానించింది.

“ప్రజాస్వామ్యంలో, ఎన్నికయిన ప్రభుత్వాలే ఎప్పటికయినా మంచిది. ఎందుకంటే అవి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయగల పరిస్ధితికి బి.జె.పి చేరుకుంటే అది ఢిల్లీకి మంచిదే” అని షీలా దీక్షిత్ బి.జె.పి ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు.

కేరళ గవర్నర్ గా రాజీనామా చేసిన షీలా దీక్షిత్ మళ్ళీ రాజకీయాల్లోకి దిగుతారని పత్రికలు ఊహిస్తూ వచ్చాయి (అదేదో గొప్ప అంచనా అయినట్టు!). పత్రికల అంచనాకు తగినట్లుగానే ఆమె తాజా ప్రకటన ద్వారా రాజకీయాల్లోకి వచ్చేసినట్టే అని పత్రికలు చెబుతున్నాయి. కానీ ఆమె ఈ విధంగా, పరోక్షంగా ఐనా సరే, బి.జె.పి వైపు నుండి రీ-ఎంట్రీ ఇవ్వడంతో విలేఖరులకు షాక్ తగిలిందని వ్యాఖ్యానం వినవస్తోంది.

1998, 2003, 2009 లలో మూడుసార్లు వరుసగా ఢిల్లీ పీఠాన్ని అధిష్టించడం ద్వారా షీలా దీక్షిత్ ఇటీవల వరకు ఒక ప్రముఖ వ్యక్తిగా వెలుగొందారు. 2014లో ఘోర పరాజయాన్ని కాంగ్రెస్ కు అప్పగించడంతో ఆమె ప్రభ ఒక్కసారిగా పడిపోయింది. అయినప్పటికీ సోనియా గాంధీ ప్రాపకంతో కేరళ గవర్నర్ గా ఆమె రాజకీయ ప్రవాసం ప్రారంభించారు. బి.జె.పి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆమెను ఆ పదవిలో కొనసాగనిచ్చే పరిస్ధితులు కనిపించనందున గవర్నర్ పదవికి ఆమె రాజీనామా చేశారని ప్రజలు, పత్రికలు భావించారు.

ఈ నేపధ్యంలో నేటి ఆమె ప్రకటన ఒక విధంగా అనూహ్యమే. కానీ ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్లుగా కాంగ్రెస్, బి.జె.పి లకు తేడా ఏమీ లేదు. ఆ రెండు పార్టీలు దేశంలోని ధనిక వర్గాలైన బడా పెట్టుబడిదారులకు, బడా భూస్వామ్య అధిపతులకు ప్రతినిధులే. కాకపోతే దేశంలోని సంపదలను పంచుకోవడంలో రెండు గ్రూపులుగా వీడిపోయిన ధనిక వర్గాలకు అవి చెరో పక్షం ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

ఈ ధనిక వర్గాలు ఎక్కడ తమకు ఎక్కువ వాటా వస్తుందనుకుంటే అటువైపు దూకేస్తారు. వాళ్ళకు గ్రూపుకు సంబంధించిన నిబద్ధత ఏమీ ఉండదు. గతంలో ధనిక వర్గాలు తమ తరపున ప్రతినిధులను చట్ట సభలకు పంపేవారు. ఇప్పుడు వారే చట్ట సభల్లో ప్రవేశిస్తున్నారు. ఈ కారణం వల్లనే ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నవారు, రేపు బి.జె.పి లో కనిపిస్తారు. మొన్న బి.జె.పి లో ఉన్నవారు ఈ రోజు టి.డి.పి లో కనిపిస్తున్నారు. నిన్న బి.జె.పి లో ఉన్నవారు ఈ రోజు బి.జె.పిలో కనిపిస్తున్నారు. ఈ పార్టీల మధ్య తేడా లేదని చెప్పేందుకు ఇంతకంటే దృష్టాంతం కావాలా?

రెండు గ్రూపులు అధికారం కోసం కొట్టుకునేప్పుడు ఇద్దరూ ఒకే మాట చెబితే జనం నమ్మరు. అందుకని వారు చెరో మాట చెబుతారు. మాట అంటే ఇక్కడ సిద్ధాంతం అని కూడా చెప్పుకోవచ్చు. చెరో సిద్ధాంతం చెబితే తప్ప ఇద్దరూ వేరు వేరు అని జనం నమ్మరు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ జాతీయ వాద మాస్క్ ని ధరిస్తే బి.జె.పి హిందూ జాతీయ వాద మాస్క్ ధరించింది.

అంత మాత్రాన కాంగ్రెస్ లో గానీ, బి.జె.పిలో గానీ తమ సిద్ధాంతాలను గట్టిగా నమ్మేవారు అసలు లేరని కాదు. కొంతమంది ఉండవచ్చు. కానీ వారి స్వరం అన్నివేళలా గట్టిగా వినపడదు. తమ తమ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన పార్టీ అని జనానికి చెప్పుకోవలసిన అవసరం వస్తే వారిని ముందుకు నెడతారు. ఆ అవసరం తీరాక మళ్ళీ వెనక్కి లాగేస్తారు.

అయితే దేశంలో కొన్ని ప్రధాన వ్యాపార కుటుంబాలు ఉంటాయి. వారు ఇరు పక్షాలకీ నిధులు ఇస్తూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా, తమ పలుకుబడి కొనసాగేలా చేసుకుంటారు. అలాంటి వ్యాపారుల్లో ప్రస్తుతం అంబానీ కుటుంబం అగ్ర స్ధానంలో ఉంది. ఇక టాటా, బిర్లా, సింఘానియా, అదాని, ప్రేమ్ జీ, మూర్తి, జి.వి.కె… ఇత్యాది కుటుంబాల సంగతి సరేసరి.

చెప్పొచ్చేదేమిటంటే క్రితం ఆర్టికల్ లో చెప్పినట్లుగా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు బడా వ్యాపార కంపెనీలకు ఒక సంకటంగా మారింది. ఎన్నికలు జరిపితే మళ్ళీ ఎఎపి ప్రభుత్వం వస్తుందేమోనని భయం. బి.జె.పి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటేనేమో మెజారిటీ లేదు. ఎఎపి ఎం.ఎల్.ఎ లను ఆకర్షించే పధకం విఫలం అయింది. కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ లను కొనేయవచ్చు గానీ దాని వల్ల జనంలో బి.జె.పి పలచనవుతుంది.

ఈ లోపు సుప్రీం కోర్టు తాకిడి మామూలుగా లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా, లేదా అని నిలదీస్తోంది. అక్టోబర్ 10 లోపు ఎ సంగతి తేల్చాలని తాఖీదు ఇచ్చింది. ఆ లోపు ప్రభుత్వం ఏర్పడకపోతే అసెంబ్లీ రద్దుకు కోర్టు నిర్ణయించవచ్చు. అనగా పిటిషన్ దారు ఎఎపి కి కోర్టులో విజయం దక్కవచ్చు. అదే జరిగితే ఎఎపి పలుకుబడి పెరగడం ఖాయం.

బహుశా ఈ సంకట పరిస్ధితుల్లోనే తెర వెనుక ఏయే శక్తులు కూడబలుక్కున్నాయో గానీ నిన్నటి ఢిల్లీ అధినేత్రి నేరుగా రంగంలోకి దిగారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రజా ప్రభుత్వాలే మంచిది అని చెబుతున్న షీలా దీక్షిత్ కి ఆ సంగతి రాష్ట్ర పతి పాలన విధిస్తున్నప్పుడు తెలియదా? రాష్ట్రపతి పాలనా లక్ష్యమూ, ఇప్పటి షీలా హఠాత్ రాయబార లక్ష్యమూ ఒక్కటే, ఎఎపి ని అధికారం నుండి దూరంగా ఉంచడం.

బహుశా షీలా స్ఫూర్తితో కొందరు కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ లు మరొక గ్రూపు ఏర్పాటు చేసి బి.జె.పి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తారేమో చూడాలి. “అది షీలా వ్యక్తిగత అభిప్రాయం. మాకు సంబంధం లేదు” అని కాంగ్రెస్ పైకి చెబుతోంది. కానీ వ్యాపార వర్గాలు, వారి మాస్టర్లయిన పశ్చిమ సామ్రాజ్యవాదులు ఆదేశిస్తే అంతర్గతంగా అడ్డు తప్పుకోవడానికి కాంగ్రెస్ కి అభ్యంతరం ఉండదు. ఎట్టి పరిస్ధితుల్లోనూ బి.జె.పి ప్రభుత్వం ఏర్పడనిచ్చేది లేదంటూనే ఉన్నత స్ధాయిలో తగిన సర్దుబాట్లు చేసుకోవచ్చు. అంతిమంగా బి.జె.పి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు.

అందుకోసమే ఢిల్లీ రాజకీయ చదరంగంలో ఓ వ్యూహాత్మక అడుగు పడింది. చదరంగంలో ఎత్తులు తక్షణ ఫలితాన్ని ఇవ్వవు. చదరంగం రారాజు గ్యారీ కాస్పరోవ్ 32 ఎత్తుల వరకూ ముందుగానే అంచనా వేయగలడని ప్రతీతి. దేశ, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధలను శాసించే రాజకీయ చదరంగం కూడా దాదాపు అదే విధంగా నడుస్తుంది. జనానికి కనపడేది ఒకటి, లోపల జరిగేది మరొకటి. రాజకీయ చదరంగంలో గడులు తెలుపు, నలుపు గడుల మధ్య తేడా క్రమంగా తగ్గిపోతుండడమే జనం గమనించవలసిన విషయం.

2 thoughts on “ఢిల్లీ అసెంబ్లీ: కాంగ్రెస్ కి షీలా షాక్!

  1. చదరంగం రారాజు గ్యారీ కాస్పరోవ్ 32 ఎత్తుల వరకూ ముందుగానే అంచనా వేయగలడని ప్రతీతి.కానీ,రాజకీయచదరంగంలో ఆయన విఫలం అయ్యాడు!
    కానీ, ఈదేశ, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధలను శాసించే రాజకీయ చదరంగనిష్ణాతులు విజయాలుసాధిస్తునే ఉన్నరు!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s