కాశ్మీర్ వరదలు గ్లోబల్ వార్మింగ్ పుణ్యమే -ఫోటోలు


కనీవినీ ఎరుగని భారీ వర్షాలు తెరిపిడి పడినా, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రాన్ని కష్టాలు వీడలేదు. ఆకాశం భళ్ళున బద్దలయినట్లు కురిసిన వర్షపు నీరు కొండలనుండి కాశ్మీరు లోయలోకి దొర్లిపడుతూ పెను వరదలను సృష్టించింది. అనేక గ్రామాలు ఇంకా నీట మునిగి ఉన్నాయి. తాము ఇప్పటివరకూ 50,000 మందిని రక్షించామని సైన్యం ప్రకటించింది. అనేక వేలమంది ఇంకా  వరదల్లో చిక్కుకుని ఉన్నారు. అనేకమంది ఇళ్లపైనా, చెట్లపైనా నిలబడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారని బైటపడ్డవారు తెలియజేస్తున్నారు.

మరణాల సంఖ్య 220 అని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. అయితే వరద నీరు పూర్తిగా వెనక్కి తగ్గకుండా అప్పుడే మరణాల సంఖ్య తేల్చలేమని సైన్యం చెబుతోంది. జీలం, తావి నదుల్లో వరద నీరు మెల్లమెల్లగా తగ్గు ముఖం పడుతోందని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్ధితి అందుకు భిన్నంగా ఉన్నదని ప్రజల ద్వారా తెలుస్తోంది. సైన్యం సహాయంతో బైటపడ్డవారు, తమకు తామే ఏదో ఒక దారి చూసుకుని బైటపడినవారు తాము ఎదుర్కొన్న దారుణ పరిస్ధితులను కధలు కధలుగా వివరించి చెబుతున్నారు. పలువురు మహిళలు, వృద్ధులు తమ వారిని కాపాడాలని సైన్యాన్ని వేడుకుంటున్న దృశ్యాలు టి.వి ఛానెళ్లు ప్రసారం చేస్తున్నాయి.

జమ్ము & కాశ్మీరు వరదలు గత 60 యేళ్లలో ఎన్నడూ చూడలేదని పెద్దవారు చెబుతున్నారు. ప్రభుత్వ సమాచారం కూడా దీనిని ధ్రువపరుస్తోంది. మున్నేన్నడూ ఎరుగని తీవ్రమైన వాన, నిర్వహణా లోపం, పధకం ప్రకారం జరగని పట్టణీకరణ, ప్రకృతి ప్రకోపానికి తగిన విధంగా సిద్ధపడి లేకపోవడం… అన్నీ కలిసి కాశ్మీరు ప్రజలకు నరకాన్ని చవిచూపాయని ఢిల్లీలోని స్వచ్ఛంద వాతావరణ సంస్ధ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సి.ఎస్.ఇ) డైరెక్టర్ జనరల్ సునీత నారాయణ్ వివరించారు.

కాశ్మీర్ వరదలు వాతావరణ మార్పుల ఫలితమే అని సి.ఎస్.ఇ విశ్లేషణలో తేలిందని సునీత వివరించారు. భారత దేశంలో వర్షాలు కురిసే తీరులో క్రమంగా మార్పులు వస్తున్నాయనీ, 2005-13 మధ్య సంభవించిన తీవ్ర వాతావరణ ఘటనలన్నీ ఇందులో భాగమేనని సి.ఎస్.ఇ విశ్లేషణ తెలిపింది. 2005 నాటి ముంబై వరదల నుండి ఇప్పటి కాశ్మీర్ వరదల వరకు 4 ముఖ్యమైన తీవ్ర వాతావరణ సంబంధిత ఘటనలను తాము అధ్యయనం చేశామని సి.ఎస్.ఇ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చంద్ర భూషణ్ తెలిపారు.

భూగోళం పశ్చిమ భాగంలో అపభ్రంశం కావించబడిన వాతావరణ పరిస్ధితులు, ఋతుపవన వ్యవస్ధ మార్పులకు లోనుకావడం, అతి భారీ వర్షాలు… ఇలా వివిధ కారణాలే తాము అధ్యయనం చేసిన ఘటనలకు కారణాలుగా ప్రభుత్వాలు చెప్పాయనీ కానీ ఎన్నడూ వాతావరణ మార్పులకూ ఘటనలకు సంబంధం ఉందన్న సంగతిని గుర్తించలేదని సి.ఎస్.ఇ చెప్పడం విశేషం. కేంద్ర పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ వరుసగా సంభావిస్తున్న తీవ్ర వాతావరణ ఘటనలపై ఎలాంటి అభిప్రాయమూ వ్యక్తం చేయలేదని, ఈ మార్పులకూ, వాతావరణ మార్పులకూ (గ్లోబల్ వార్మింగ్) ఉన్న సంబంధం పట్ల పూర్తిగా మౌనం పాటిస్తోందని సి.ఎస్.ఇ ఎత్తిచూపింది.

అడవి పుత్రులయిన గిరిజనులను ఒక పద్ధతి ప్రకారం అడవుల నుండి తరిమివేసి అక్కడి ఖనిజ సంపదలను స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పగించడంలో మాత్రం కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎనలేని ఆసక్తి ఉంటుంది. అటవీ హక్కుల చట్టాన్ని చేసి తాము గిరిజనుల హక్కులను కాపాడతామని చెప్పి, ఇప్పుడు ఆ చట్టాన్ని ఏ విధంగా బలహీనపరచాలా అని ప్రభుత్వాలు చూస్తున్నాయి. అటవీ హక్కుల చట్టం, భూసేకరణ చట్టం అభివృద్ధికి ఆటంకంగా మారాయని కొత్త ప్రభుత్వంలోని పెద్దలు చెప్పడం ఇటీవల ఎక్కువయింది. దేశంలో కనీసం మూడవ వంతు అడవులను పెంచితే మనిషి అత్యాశ ఫలితాలను కనీస మాత్రంగా తగ్గించడానికి వీలవుతుంది. కానీ అటు వాతావరణాన్ని నాశనం చేసే వాయువులను వెదజల్లుతూ ఇటు ఆ ప్రభావాన్ని తగ్గించే అడవులను కూడా కూల్చివేస్తుండంతో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం మరింత పెరుగుతోంది.

భూగోళంపై వాతావరణ మార్పులను అధ్యయనం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి అంతర్ ప్రభుత్వ కమిటీని (Intergovernmental Panel on Climate Change -IPCC) చాన్నాళ్ల క్రితమే ఏర్పాటు చేశాయి. పర్యావరణ మార్పుల వలన భారత ఉపఖండంలో తీవ్ర స్ధాయి వాతావరణ ఘటనలు సంభవించడం పెరుగుతుందని ఈ కమిటీ 2007 లో విడుదల చేసిన 4వ నిర్ధారణ నివేదికలో చెప్పింది. ముఖ్యంగా ఇండియాలో వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందని కమిటీ విడుదల చేసిన 5వ నిర్ధారణ నివేదిక తెలిపింది.

ఐ.పి.సి.సి అధ్యయనంలోనే కాకుండా భారత వాతావరణ సంస్ధల అధ్యయనాల్లోనూ భారత దేశంలో వాతావరణ మార్పుల గురించి హెచ్చరికలు అందాయి. ఉదాహరణకి భారత ఉష్ణ వాతావరణ సంస్ధ (Indian Institute of Tropical Meteorology) 2006లో ఒక అధ్యయన నివేదిక వెలువరించింది. ఈ సంస్ధలోని నిపుణులు బి.ఎన్.గోస్వామి ఈ నివేదిక రూపొందించారు. నివేదిక ప్రకారం దేశవ్యాపితంగా వర్షపాతంలో తీవ్ర మార్పులు వస్తాయి. ముఖ్యంగా హిమాలయాల ప్రాంతంలో ఈ మార్పులు ఇంకా తీవ్ర స్ధాయిలో ఉంటాయని తెలిపింది. పశ్చిమ కోస్తా, మధ్య భారత రాష్ట్రాలపై ఈ ప్రభావం విస్తరిస్తుందని, హిమాలయాలకు అనుకుని ఉన్న రాష్ట్రాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపింది.

1950-2000 సం.ల మధ్య కాలంలో వర్షపాత వివరాలను పరిశీలించగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే ఘటనలు పెరుగుతూ పోగా ఒక మాదిరి వర్షాలు కురవడం క్రమంగా తగ్గుతూ వస్తోందని అధ్యయనాలు తెలిపాయి.

జమ్మూ & కాశ్మీర్ విషయానికి వస్తే అక్కడ వరదలను ముందే హెచ్చరించే వ్యవస్ధ లేదని సి.ఎస్.ఇ తెలిపింది. కనీసం ప్రకృతి ఉత్పాతాలను నిర్వహించేందుకు ఒక ప్రత్యేక వ్యవస్ధను సైతం ఏర్పాటు చేయలేదని దానితో ఆ రాష్ట్రం ప్రకృతి వైపరీత్యాలకు సులభ లక్ష్యంగా మారిందని సంస్ధ ప్రతినిధులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో 55 శాతం తడి నేలలు, డ్రైనేజి కాలువలు, నీటి చెరువులు, కుంటలు, సరస్సులు విచక్షణా రహితంగా ఆక్రమణలకు గురయ్యాయని దాని ఫలితాన్ని రాష్ట్ర ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారని సి.ఎస్.ఏ డైరెక్టర్ సునీత తెలిపారు. సరస్సులు ఆక్రమణలకు గురి కావడం వల్ల నీరు నిలువ ఉండే ఏరియా తగ్గిపోయి వరదల తీవ్రత పెరగడానికి దోహదం అయిందని తెలిపారు. అసలు ఇల్లంటూ ఉండకూడని చోట కూడా ఇళ్లను నిర్మిస్తున్నారని వివరించారు.

అదేదో సినిమాలో హీరో గారు తొడగొట్టి మరీ ‘నీ నట్టింటికొచ్చా’ అని సవాలు విసిరినట్లు వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఇప్పుడు కళ్ల ముందరి వాస్తవం. పాలకులు కళ్ళు తెరిచేమాటే శాశ్వతంగా అవాస్తవమైపోయింది.

ఈ ఫోటోలలో కొన్ని కతార్ సుల్తాన్ పత్రిక ఆల్-జజీరా ప్రచురించింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్, మిర్రర్ పత్రికల నుండి సేకరించిన ఫోటోలూ ఇందులో ఉన్నాయి. కొన్ని ఫోటోలు పాక్ ఆక్రమిత కాశ్మీరు లోని వరద దృశ్యాలకు చెందినవి. మన ప్రధాని వరద పీడిత కాశ్మీర్ పర్యటించి వచ్చి పాకిస్ధాన్ కోరితే పాక్ ఆక్రమిత కాశ్మీరు కు కూడా సహాయం అందిస్తామని ప్రకటించగా, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో వరద పీడిత ప్రాంతాలు సందర్శించి ఇండియా కోరితే ఇవతలి కాశ్మీరుకు సహాయం అందజేస్తామని ప్రకటించేశారు.

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, చుట్టకు నిప్పు దొరికింది కదా అని మరొకడు సంతోషించాట్ట! దేశాధినేతలుగా వరద పీడితులను ఆదుకోవడం మాని వరదల్లో కూడా రాజకీయ చేపలు పట్టాలని చూడడం ఈ అధినేతలకు తగునా?

One thought on “కాశ్మీర్ వరదలు గ్లోబల్ వార్మింగ్ పుణ్యమే -ఫోటోలు

  1. we are responsible for our activities. NSS units trying to hand over one plant to one person on any occasion and its working out. may be its not great activity to control global warming but a start up. instead giving one gift to one person give one plant. accept one plant as gift then take care of it. you start loving it as you love your kid, pet. believe me.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s