హాలీవుడ్ సినిమా ‘ట్రాయ్’ చూసారా? అందులో గ్రీకులు ట్రాయ్ ద్వీప రాజ్యాన్ని ఒక చెక్క గుర్రం సహాయంతో వశం చేసుకుంటారు. ట్రాయ్ కధ పుక్కిటి పురాణం అని కొట్టివేసేవారు ఎంతమంది ఉన్నారో, నిజమే అని నమ్మేవారు అంత మంది ఉన్నారు.
ట్రాయ్ వాసులను ట్రోజన్లు అంటారు. నగర ద్వీప రాజ్యమైన ట్రాయ్ ని జయించడానికి పదేళ్ళ పాటు చుట్టుముట్టినా గ్రీకుల వల్ల కాదు. ట్రాయ్ కోట శత్రు ధుర్భేద్యం కావడం, ట్రోజన్లు మహా వీరులు కావడంతో కోటలోకి చొరబడడానికి వారికి కుదరదు. చివరికి వారు ఒక ఎత్తు వేస్తారు. ఒక భారీ చెక్క గుర్రాన్ని తయారు చేసి అందులో కొంతమంది సైనికులను ఉంచుతారు. దాన్ని అక్కడే ఉంచి తాము విసిగి వెనుదిరిగినట్లు నటిస్తూ వెనక్కి పోతారు.
గ్రీకులు వెనక్కి వెళ్లిపోయారని భావించిన ట్రోజన్లు చెక్క గుర్రాన్ని తమ విజయానికి గుర్తుగా కోటలోకి తెచ్చుకుంటారు. ఆ రాత్రి అందరూ సంబరాలు జరుపుకుని నిద్రలోకి జారుకున్న తర్వాత చెక్క గుర్రం నుంచి బైటికి వచ్చిన గ్రీకులు కోట గోడ తలుపులు తెరిచి వెనక్కి వచ్చిన తమ సైన్యానికి దారి ఇస్తారు. ఆ విధంగా ట్రాయ్ ను గ్రీకులు వశం చేసుకుంటారు.
ప్రస్తుతానికి వస్తే సిరియాను కబళించడానికి అమెరికా, ఐరోపా (ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్) రాజ్యాలు మూడున్నర సం.లుగా ప్రయత్నిస్తున్నాయి. లిబియా తరహాలో సిరియాలో కూడా కీలు బొమ్మ ప్రభుత్వాన్ని నిలబెడితే తద్వారా మధ్య ప్రాచ్యంలో ఇరాన్-హిజ్బోల్లా (లెబనాన్) ల నుండి ఎదురవుతున్న ప్రతిఘటనను లేకుండా చేసుకోవచ్చని వారి లక్ష్యం.
కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సిరియా దారికి రాలేదు. సౌదీ అరేబియా, కతార్, జోర్డాన్, టర్కీ తదితర దేశాలు అర్ధ, అంగ బలాన్ని సమకూర్చగా అమెరికా, ఐరోపా మిలట్రీ గూఢచారులు వందలమంది సిరియా పొరుగు దేశాల్లో తిష్ట వేసి ఆల్-ఖైదా, ఎఫ్.ఎస్.ఎ లాంటి టెర్రరిస్టు మూకలకు శిక్షణ ఇచ్చి సిరియాలోకి ప్రవేశపెట్టాయి. కొంత భూభాగాన్ని ఆక్రమించారు గానీ ప్రధాన అధికార స్ధానం డమాస్కస్ ను గానీ, అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ను గానీ పడగొట్టలేకపోయారు. అంతర్జాతీయంగా చైనా-రష్యా లు అందించిన అండదండలు సిరియాకు అక్కరకు వచ్చాయి.
ఈ నేపధ్యంలో పశ్చిమ సామ్రాజ్యవాదులు ఇస్లామిక్ స్టేట్ (పాత పేరు ఇసిస్) ను రంగంలోకి దించారు. ఆల్-ఖైదా కంటే వీరు పరమ పచ్చి నెత్తురు తాగే దుర్మార్గులు అని విపరీత ప్రచారం ఇచ్చారు. శాంపిల్ గా ఇద్దరు అమెరికన్ విలేఖరులను కెమెరా ముందే తల తెగ్గోసినట్లు వీడియోలు సృష్టించారు. (ఈ విలేఖరులు సి.ఐ.ఎ, ఎన్.ఐ.ఎ ల మనుషులన్నది గమనార్హం).
ఇప్పుడు అమెరికన్లకు ఇసిస్/ఐ.ఎస్ అంటే భయం వేస్తోందిట. బ్రిటన్, ఫ్రాన్స్ లకు కూడా. తమ దేశాల పౌరులు కొందరు ఇసిస్ లో చేరి పని చేస్తున్నారని వారు వెనక్కి వచ్చి తమ గడ్డ(ల)పై ఉగ్రవాద చర్యలకు పాల్పడతారని భయం వేస్తోందిట. అందుకని వారు రాక మునుపే ఇరాక్, సిరియాలపై దాడులు చేసి వారిని తుద ముట్టించాలట.
ఇప్పుడు ఎ పశ్చిమ పత్రిక వెబ్ సైట్ చూసినా ఇదే గొడవ. ఇసిస్ అంతానికి ఒబామా, కామెరాన్, ఒలాండేలు ప్రతిజ్ఞ చేయని రోజంటూ ఉండదు. పాకిస్తాన్ కి తెలియకుండా ఆ దేశంలో జొరబడి లాడెన్ చెంపినవారికి ఇసిస్ నేత ఆల్-బఘ్దాదిని చంపడం ఒక లెక్కా? నాసా అంతరిక్ష కేంద్రం నుండి భూమిపై కదలికలను పసిగట్టగల దేశాలకు ఇసిస్ ఒక భయమా?
అసలు విషయం ఏమిటన్నది ఈ కార్టూన్ చెబుతోంది. ఇసిస్ ను అంతం చేసేపేరుతో ఇరాక్ లో మళ్ళీ అమెరికా సైనికులు చొరబడ్డారు. దానికి అడ్డంగా ఉన్న ఆల్-మాలికి ప్రభుత్వాన్ని తప్పించారు. ఇక మిగిలింది సిరియా. పోయిన నెలలో సిరియా ప్రభుత్వం మళ్ళీ క్లోరిన్ వాయువు ప్రయోగించిందని పశ్చిమ దేశాలు మళ్ళీ గొడవ మొదలు పెట్టాయి. ఐరాస సంస్ధ చేతనే ఈ ఆరోపణలు చేయిస్తున్నారు. అంటే సిరియా పై దాడికి ఇప్పుడు రెండు కారణాలు దొరికాయి. ఒకటి: ఇసిస్, రెండు: రసాయన వాయు ప్రయోగం.
రసాయన వాయువులు ప్రయోగించారన్న సాకుతో సిరియాపై దాడికి గత సంవత్సరమే అమెరికా సిద్ధపడింది. కానీ అందుకు అమెరికా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇప్పుడు దుర్మార్గ టెర్రరిస్టు ఇసిస్ అంటూ చేసిన ప్రచారం వల్ల అమెరికా ప్రజల్లో దాడికి ఆమోదం పెరుగుతోందని పత్రికలు రాస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇరాక్ లో సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయని చెప్పి దాడి చేసిన మోసం గుర్తు తెచ్చుకుంటే చాలు.