శ్వేతాబసు మీ సాఫ్ట్ టార్గెట్! -సాక్షి తన్వర్ బహిరంగ లేఖ


Shweta and Sakshi

(కొద్ది రోజుల క్రితం పత్రికలు, ఛానెళ్లు ఓ వార్తను సంచలనం చేస్తూ ప్రచురించాయి. ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ సినీ నటి శ్వేతా బసు పట్టుబడిందని ఆ వార్త సారాంశం. ఈ వార్త ప్రచురిస్తూ కొన్ని పత్రికలు అదేదో భ్రహ్మాండమైన నేరాన్ని వెలికి తీసినట్లు ఫోజు పెట్టాయి. సంవత్సరాల తరబడి భద్రతా వ్యవస్ధలకు అంతు చిక్కని నేర పరిశోధన తామే చేసినట్లు బిల్డప్ ఇచ్చాయి. ఈమె పైన గతంలో ఆరోపణలు వచ్చినా ఆమె ఖండించారని చెబుతూ “చూసారా, ఆమె బండారం బైట పెట్టాం” అన్నట్లుగా సంచలన హెడ్డింగులు పెట్టి మరీ ప్రకటించాయి.

ఇంతకీ ఈ అపరాధ పరిశోధనోత్తములు ఆమెతో దొరికిపోయిన బడా వ్యాపారి ఎవరో బైటపెట్టే దమ్ము ప్రదర్శించ లేకపోయారు. ‘5 లక్షలు డిమాండ్ చేస్తుందిట’ అంటూ వెకిలి రాతలు రాయడమే గానీ అసలు 5 లక్షల రూపాయలను ఒక రాత్రికి ఇచ్చిపారేసే ఆ ఉత్తముడు ఎవరన్నది అనవసరం అన్నట్లుగా వ్యవహరించాయి. ఒకటి, రెండు కాదు, దాదాపు ప్రతి పత్రికా ఈ వార్తను సంచలనం చేసి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించాయి. ఒక పత్రికయితే ఇలా వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సినీ నటుల జాబితాను పాఠకులకు అందించేందుకు చాలా శ్రమ పడింది.

ఈ పత్రికలకు నిజంగా నీతి ఉంటే నిజంగా ఏం చేసి ఉండేవో తెలియజేస్తూ టి.వి నటి సాక్షి తన్వర్ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. పేరు పొందిన హిందీ సీరియల్ ‘కహానీ ఘర్ ఘర్ కీ’ లో ఆమె ప్రధాన పాత్రధారి. అదే సీరియల్ లో బాలనటిగా ఓ పాత్ర పోషించిన శ్వేతా బసుకు తల్లిగా సాక్షి తన్వర్ నటించారు. తన బహిరంగ లేఖ ద్వారా ఆమె మీడియా ద్వంద్వ ప్రమాణాలను కడిగిపారేశారు. బాలీవుడ్ లైఫ్ వెబ్ సైట్ లో ప్రచురించబడిన సాక్షి లేఖకు ఇది యధా తధ అనువాదం. -విశేఖర్)

*********

ఆమె నా బుల్లి తెర కుమార్తె…

దాదాపు 14 సం.ల క్రితం నేను ఒక టి.వి షోకు షూటింగ్ ప్రారంభించాను. కొన్ని ఎపిసోడ్ల తర్వాత సీరియల్ లో నా కుమార్తెగా నటిస్తున్న పాప స్ధానంలో మరొక చక్కటి, ప్రతిభ కలిగిన 9 సం.ల పాపను తెచ్చారు. ఆ పాత్ర తనకోసమే సృష్టించారా అన్నంత గొప్పగా ఆ పాప నటించింది. అనంతరం మా మధ్య బంధం ఎంత గాఢంగా మారిందంటే అప్పటి నుండి గత 13 సంవత్సరాలుగా ప్రతి యేడూ ‘తల్లుల రోజు’న ఆమె నాకు అభినందనలు చెప్పేది. తద్వారా ఆమె వెలిబుచ్చిన తీయనైన వెచ్చని అనుబంధం ఒక విషయం అయితే, ఆమె పెరిగిన విలువల వాతావరణానికి అది ప్రతిబింబం కూడా. నేను తన చదువు గురించి, పని గురించీ అడిగేదాన్ని. ఆమె ఎల్లప్పుడూ చాలా విశ్వాసంతో, నమ్మకంతో అంతా బాగుందని చెప్పేది.

ఎలా జరిగి ఉండాలి…

కొద్ది రోజుల క్రితం ఆ చిన్ని ఆరాధ్యనీయమైన పిల్ల, నా తెరమీది కుమార్తె, తప్పుడు కారణాలతో పతాక శీర్షికలకు ఎక్కింది. అప్పటి నుండి ‘మీ తెరమీది కుమార్తె’ గురించి మీరు చదువుతున్నారా లేదా అని అడుగుతూ నాకు అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మెసేజ్ లు వస్తున్నాయి.

నా సమాధానం ఏమిటంటే: “అవును. నేను ఆమె వార్తలు చదువుతున్నాను. ఎందుకంటే ఆ వార్తలన్నీ ఆమె గురించే రాస్తున్నాయి. వాళ్ళు గనక ఈ వ్యవహారంలో క్లయింటుగా ఉన్న ఉన్నత స్ధాయి ‘వ్యాపారవేత్తల’ గురించి కూడా రాసి ఉంటే వారి గురించి కూడా నేను చదివి ఉండేదాన్ని. నిజాయితీగా చెప్పాలంటే మీడియా నివేదికలన్నీ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుని ఈ గొప్ప వ్యక్తుల పేర్లను, ఐడెంటిటీని కాపాడాయి. దిగజారిపోయిన ఆ ‘వ్యాపారవేత్తల’ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి నాకేమీ లేదు. కానీ వారి పేర్లుకూడా ప్రముఖంగా ముందుకు వచ్చి ఉంటే నేను చాలా సంతోషించేదాన్ని. తద్వారా వారి కుటుంబాలు -వారి తల్లులు, కూతుళ్ళు, సోదరిమణులు, భార్యలు- వారి మనోల్లాసపు  అలవాట్ల గురించి తెలుసుకునే అవకాశం దక్కి ఉండేది.

ఈ అంశం పట్ల మీడియా వ్యవహరించిన తీరు చూసి నేను చాలా దిగాలు పడ్డాను. మనం, జనం, ఆమె పైన సోషల్ మీడియాలో తీర్పులు ఇచ్చేయడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికీ చాలా ఆతృతగా ఉన్నాం. కానీ మనలో ఎవరమూ ఆమె చెప్పుల్లో కాళ్ళు దూర్చి ఆమె నడిచిన కఠినమైన దారిన నడవలేకపోయాం… కనుక, ఆమెపై తీర్పు ప్రకటించడానికి మనకు నిజంగా హక్కు ఉన్నట్లేనా?

ఆమె కారణాలు ఏమిటో, సమస్యలు ఏమిటో నాకు తెలియదు. వాటికి పరిష్కారాలు ఏమిటో కూడా నాకు తెలియదు… నాకు తెలిసిందల్లా ఆమెను ఒక రిమాండ్ హోమ్ లో ఉంచారని, తన చర్య నిజమేనని అంగీకరిస్తూ ఆమె ఒక ప్రకటన ఇచ్చిందని. కనీసం  తన చర్య నిజమేనని అంగీకరించే ధైర్యం అన్నా ఆమెకు ఉంది (పత్రికల ప్రకారం). ఈ కాస్త రాయాలని నేను ఈ వార్త తెలిసినప్పటి నుండీ అనుకుంటున్నాను. అయితే మొదట ఆమెతో మాట్లాడి ఆ తర్వాత రాయాలని అనుకున్నాను. కానీ నాకా అవకాశం దొరకలేదు. ఈ రోజు ఆమె నిజజీవితంలోని తల్లితో మాత్రం మాట్లాడగలిగాను.

రిమాండ్ హోమ్ లో ఉన్న ఆమెను కలవడానికి ఆమె తల్లికి ఇప్పటివరకూ అనుమతి దొరకలేదన్న సంగతి మనలో ఎంతమందికి తెలుసు? ఆమె సంగీతం గురించీ, జీవితం గురించీ రిమాండ్ హోమ్ లో ఉన్న పిల్లలతోనూ, ఇతర మహిళలతోనూ చర్చిస్తూ వారిని ఉత్సాహపరుస్తోందని జడ్జి ఆమె తల్లికి చెప్పిన సంగతి ఎంతమందికి తెలుసు? ఆమె తల్లి తాను దోచుకోబడ్డానని భావిస్తోంది. తీవ్ర వ్యాకులతకు లోనై ఉంది. తాను ఓడించబడ్డానని కుమిలిపోతోంది… మనం అర్ధం చేసుకోగిందే.

ఆమె తల్లి కొన్ని అర్ధవంతమైన ప్రశ్నలు మన ముందు ఉంచుతోంది -“నా కూతురేమీ క్రిమినల్ కాదు కదా, మరెందుకు ఆమె పేరును ఇలా అప్రతిష్టపాలు చేస్తున్నారు? ఆమె ఫోటోలతో సహా ప్రచురిస్తున్న బాధ్యతారహితమైన ఈ మీడియా రిపోర్టుల వల్ల ఆమెపై శాశ్వతంగా ప్రతికూల ప్రభావం పడవేస్తే ఏమిటి దారి? తన జీవితంలో మిగిలిన చేదు అవశేషాలను ఇక మోయలేనని భావిస్తూ తీవ్రమైన చర్యకు పాల్పడితే ఏమిటి గతి?- అలా జరగకుండా దైవం చూడుగాక…!”

ఎవరివద్దనైనా సమాధానం ఉందా?

ఆమె తల్లి, నాతో సహా ఇంకా అనేకమంది మహిళలు, మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలని కోరుతున్నారు. దాదాపు మీడియా అంతా (large section) కట్టగట్టుకుని ఎంపిక చేసుకుని మరీ ఆ అమ్మాయిని ఎందుకు హైలైట్ చేస్తోంది? అమ్మాయి ఫోటో మాదిరిగా ఆ వ్యాపారవేత్తల ఫోటోలను కూడా ఎందుకు అన్నింటా పరిచి, ప్రదర్శించి చూపరు? ఆ పురుషోత్తములకు ఏకాంత హక్కును గ్యారంటీ చేసి, అమ్మాయికి మాత్రం ఆ హక్కును ఎందుకు ఇవ్వరు? ఆమె ఒక నటి గనుక, బహిరంగ వ్యక్తి (public figure) గనుక ఆమె సాఫ్ట్ టార్గెట్ అయిపోతుందా? మన నైతిక పోలీసులు ఈ విషయంలో ఎందుకని మౌనంగా ఉన్నారు? రేపిస్టులు, హంతకులకు కూడా ఏకాంత హక్కు ఇవ్వబడే ఈ దేశంలో ‘ఆమె’ హక్కు మాత్రమే ఎందుకు ఉల్లంఘించబడుతోంది? ఆమె పట్ల ఈ మొరటు, బాధ్యతారహిత వైఖరి ఎందుకని?

*********

సాక్షి తన్వర్ అడిగిన ప్రశ్నలు, శ్వేతా బసు తల్లి అడిగిన ప్రశ్నలు అంత కష్టమైనవేమీ కావు. కాకపోతే చీకటి తెరల మాటున, పరువు ప్రతిష్టల మాటున మగ, పురుషోత్తములకు గ్యారంటీ చేయబడిన సామాజిక ఆధిపత్యం నిజం అని అంగీకరించే ధైర్యమే నేటి సమాజానికి లేదు. అందువల్లనే ఈ మహిళల ప్రశ్నలకు సమాధానం అంత తేలికగా లభించదు.

తన చర్య నిజమే అన్న ఒప్పుకోలు ద్వారా శ్వేతా బసు గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించిందని చెప్పక తప్పదు. ఆమె ఇచ్చిన సుఖాన్ని రు. 5 లక్షలు పెట్టి కొనుక్కున్న వ్యాపార ప్రముఖులకు ఆ ధైర్యం వీసమెత్తు కూడా లేకపోవడమే ఇక్కడ అసలు విషయం.

అయితే శ్వేతాబసు చేసింది కరెక్టేనా? అంటూ సంస్కృతీ కాపలాదారులు, సామాజిక విలువల ఛాంపియన్లు నిలదీయబోతారేమో! తరాల తరబడిన, యుగాల తరబడిన వివక్షతో, కట్టుదిట్టమైన ఆచారాలతో, సంస్కృతిని కాపాడవలసిన భారాన్నంతా ‘ఆమె’ పైనే మోపుతూ, ఆమెను ఒక ఆట వస్తువుగా మార్చుకున్న సమాజానికి విలువలపైనా, నైతికి వర్తన పైనా నీలదీసే హక్కు ఎక్కడినుండి వస్తుంది?

ఇప్పటి సమాజానికి తన అసలు స్వరూపాన్ని అద్దంలో చూసుకోగల ధైర్యం ఏ కోశానా ఉండదు. అందుకే శ్వేతాబసు లాంటివారిని పతాక శీర్షికలకు ఎక్కించి తన ధైర్యం ఎక్కడికీ పోలేదని తనకు తాను సర్ది చెప్పుకుంటుంది. శ్వేతాబసు లాంటి నిర్బందిత వ్యక్తిత్వాలపై వేలెత్తి చూపడం ద్వారా తన పిరికితనాన్ని కప్పి పుచ్చుకోవడం ఇప్పటి సమాజ లక్షణం. అంతే తప్ప అసలు శ్వేతాబసు చుట్టూ ఆ పరిస్ధితులు ఎందుకు ఉన్నాయన్న ఆత్మ శోధన మన కాపలాదారులకు లేదు.

కనుమరుగవుతున్న విలువలను పునరుద్ధరించడం అంటే శ్వేతా బసులను పతాక శీర్షికలకు ఎక్కించడం కాదని, ఒక రాత్రి సుఖం కోసం రు. 5 లక్షల రూపాయలను అలవోకగా విసిరిపారవేయగల వ్యాపారవేత్తలను నిర్మూలించడమేననీ సమాజానికి ఎప్పటికీ తెలిసేను?

8 thoughts on “శ్వేతాబసు మీ సాఫ్ట్ టార్గెట్! -సాక్షి తన్వర్ బహిరంగ లేఖ

 1. ఈ ఉదంతము కొత్తేమీ కానప్పటీకీ, మీడీయా చూపుతున్న ద్వంద్వవైఖరులను వేలేత్తి చూపిన తన్వీర్ గారు ప్రసంసనీయులు?
  ప్రశ్నించేతత్వం మీడియాకు కాదు,అభ్యుదయవాదులకు వన్నెతెస్తుంది!మాలాంటి వాళ్ళ దృక్పధాలను మార్చివేస్తుంధి!

 2. గత కొన్ని రోజులు గా ఇదే ఆలోచన నాకు .
  సమాజం కుళ్ళు కడిగి పారేస్తాం అని విర్ర వీగే ఈ జర్నలిస్ట్ లు / ఛానళ్ళు / పత్రికలు ఒక రాత్రికి అయిదు లక్షలు ఇచ్చి అమ్మాయిలు తో గడిపే ఆ బడా బాబు పేరు రాయడానికి వణికిపోయారు అంటే వీళ్ళ మాటలు, చేతలు అన్ని ప్రగల్భాలు తప్ప ఏమి కాదు అని అర్ధం అవుతుంది .
  ఈ మాత్రం దానికి ప్రతీ ఛానల్ కి ఒక కాప్షన్ , పత్రికల్లో / బ్లాగుల్లో మేము జర్నలిస్ట్ లు అని చెప్పుకుంటూ సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఫోజులు .

 3. ఈ వార్త బయటకి వచ్చినప్పటినుంచి ప్రతీరోజూ అసలు విషయానికి అల్లికలు , మసాలాలు జోడిస్తూ , మధ్య మద్యలో ఆ నటిమీద కొంచెం కృత్రిమమైన జాలి ప్రకటిస్తూ మన మీడియా ముఖ్యంగా వెబ్-మీడియా తమలోని శాడిస్టిక్ మనస్తత్వాన్ని బయటపెట్టుకుంది. చాలారోజుల క్రితం కొత్తగా ప్రారంభమైన ఒక తెలుగు 24గంటల చానల్ (నిజంగానే పేరు గుర్తులేదు లేకపోతే రాసేవాడిని) తమ ఉనికిని ప్రకటించడానికి స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది. అందులో ఈ నటి దొరికింది. ఇంక వాళ్ళ శాడిజం చూపించడం మొదలుపెట్టారు. డబ్బుకోసం శరీరాన్ని అమ్ముకుంటున్న ఈ నటిచీకటి జీవితాన్ని బయటపెట్టడం మా ఉద్దేశ్యం కాదంటూనే (మొహం కనపడకుండా బ్లర్ చేశారులెండి) వీడియోలో ఆమెకనిపించినప్పుడల్లా వెనుకనుంచీ ఆమేనటించిన సినిమాలోని కొన్ని ఫేమస్ డైలాగులు వినిపిస్తూ ఆమే ఎవరో చెప్పకనే చెప్తూ తమ వికృత మనస్తత్వాన్ని చూపించారు. రాజ్-భవన్ లో గవర్నరుగారు శృంగారం (సామాన్యులుచేస్తే వ్యభిచారం అనాలి) చేస్తూ దొరికినప్పుడు ఎదోకొంచెం సేపు హడవుడి తప్ప ధైర్యంగా ఆ విషయాన్ని రాసే/ప్రసారం చేసే గట్స్ వీళ్లకి లేకపోయాయి.

 4. మనమెంత dual lives జీవిస్తుంటామో ఈ విషయం చక్కగా చెబుతుంది.

  (అందిరికీకాదుకానీ ఎనభైనుండి తొంభైశాతమ్మందికి) మనకు నటుల్లో కావాల్సింది కులము, నటీమణుల్లోకావాల్సింది అందమూనూ. కాబట్టే ప్రియామణీలాంటి జాతీయ బహుమతి గ్రహీతనీ, మమతా మోహన్ దాస్ లాంటి బహుముఖ ప్రజ్ఞాశీలినీ మనం అందాలబొమ్మలుగానే తెరపైచూడ్డానికి ఇష్టపడ్డాం (బ్లాగుల్లో మాత్రం మన సంస్కృతిలో స్త్రీలను ఎంతలా పూజిస్తామో చెబుతూ సంస్కృత శ్లోకాలు గుప్పిస్తుంటాం). కొన్నాళక్రిందట శ్వేతాబసు నటించిన ఇక్బాల్‌చూసి ముగ్దుణ్ణయ్యాను. ఈమెనుకూడా మనం కేవలం తెరపై అందాలబొమ్మగానే చూశాం తప్ప, ఆమెలోని నటకౌశలాన్ని తెలుగుతెరపై ఆవిష్కరించలేకపోయాం. అదే అందం ఆమెనుండిదూరమవగానే ఆమెను ప్రక్కనపెట్టేశాం.

  సరే జరిగిందేదో జరిగిపోయింది. ఆమెచేసిన పనిని ముమ్మారు వార్తలకెక్కించి, మనందరమూ పవిత్రులమని సర్దిచెప్పుకొని సంతృప్తిచెందాం. ‘ప్రజలపక్షం వహించే’, ‘దమ్మున్న’, ‘నిజాన్ని నిర్భయంగా వెల్లడిచేసే’ ఛానళ్ళదీ, వెబ్సైటులదీ అంతా ఆమెదేహంపైన నాలుగుడబ్బులు చేసుకోవాలన్న ‘కుతి’తప్ప మరొకటికాదు. రేప్పొద్దున ఆమె అఘాయిత్యం చేసుకుంటే ఇదే ఛానళ్ళు, వెబ్సైటులూ ఆమెలోని మానవీయకోణన్నో, మరోకోణాన్నో ప్రముఖంగా చూపించి, ఒకింత జాలి ఒలకబోసి మళ్ళీ డబ్బులేరుకోవడానికి సిధ్ధమైపోతాయి. ఆ సిగ్గులేని తంతునుచూడ్డానికి ఎప్పటిలా మనమూ సిగ్గులేకుండా తయారైపోతాం.

  ఇంత దమ్మున్న, ఇన్నేసి గుండెలున్న ఛానళ్ళకి ఆమెతోపాటుగా దొరికిన పారిశ్రామికవేత్త పేరురాసేన్ని గుండెలులేకపోవడం, దాన్ని మనం లోకరీతిగా అంగీకరించెయ్యడం చాలా నీఛమైన విషయం.

  The whole incident is nothing but an epitome vicarious voyeurism sponsored by our spineless media which didn’t have the balls to deal with equal vehemence and vigor when it comes to the influential persons.

 5. కొళాయిల దగ్గర నీటి టాంకర్ల దగ్గర (ఇప్పుడు బావులు లేవులెండి) ఊసు పోక కబుర్లు చెప్పుకొనే ఆడవాళ్ళ స్థాయికి దిగజారి పోయింది మీడియా (ఇక్కడ ఆడవాళ్ళను చిన్నబుచ్చుతున్నట్లు అనుకునేరు! ఎందుకంటే ఈ ఆడవాళ్ళ మనస్తత్వానికి పోత పోసింది కూడా ఈ భూస్వామ్య సమాజమే. తమ ఆడాళ్ళ పవిత్రతకు కళ్ళెం వేసేటందుకు). అదేదో వ్యభిచారాన్ని మొదటిసారి కనిపెట్టినట్లు చెలరేగిపోవడమే విచిత్రం! యువతను రెచ్చగొట్టటానికి కాబోలు!

  తమకు వూరూరికి ఒక ఉంపుడుకత్తె కావాలని ఒక ప్రత్యేక వ్యవస్థను (దేవదాసీలని, బోగం సానులని, వ్యభిచారులనీ రకరకాల పేర్లతో) ఏర్పరుచుకున్న ఈ ప్యూడల్‌ వెధవలకు ఇప్పుడే సిగ్గెట్టుకొచ్చిందా? అయిదులక్షలు అంటే విలువ తెలియని వాడికి మానవ విలువలంటే ఏమిటనికూడా తెలిసుండదు. అయిదు లక్షలు వాడు కష్టపడి చెమటోడిస్తే కదా, వాడికి వాటి విలువతెలవడానికి? అయిదు లక్షలు పడేసి అమ్మాయి వళ్ళు కొనుక్కునే దొంగవెదవకు లేని సిగ్గు, అలాంటి పరిస్ధితులు సృష్టించి పెట్టిన ఈ వ్యవస్ధకు లేని సిగ్గు, అందుకు మనసు చంపుకున్న ఆ అమ్మాయికే ఉండాలా?

  శ్వేతా బసు సెలబ్రిటి అయినందువల్ల వళ్ళమ్ముకుందా? ఏది ఏమైనా పవిత్రులైన దొంగవెధవల చేతుల్లోకి పోయింది. దొంగ తనానికి ప్రవిత్రత ముసుగు వేయగలరు. అమెరికా దగ్గర ట్యూషన్‌ నేర్చుకుంటున్నారు కదా?

 6. గత ఏడాది ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు, ఈ ఘటనకు ఎక్కడో పోలిక ఉన్నట్లు అనిపించింది నాకు.
  తమ బతుకులు తాము బతుకుతుంటే…అవకాశాల పేరిట, లేనిపోని మాయమాటలు చెప్పి రంగుల మాయలోకంలోకి తీసుకొస్తారు. ఆ తర్వాత ప్రతిభ ఉన్నా పట్టించుకోరు. తమ కులం వాడో, తమ మాట వినే హీరోయిన్ అయితే అందలం ఎక్కిస్తారు. లేదంటే నిర్దాక్షిణ్యంగా అణచివేస్తారు. కనీసం పలుకరించే నాథుడు కూడా ఉండరు. ఆ డిప్రెషన్ లో, ఒక్కోసారి తొందరపాటూ నిర్ణయాలు తీసుకుంటారు. ఉదయ్ కిరణ్ జీవితం మీదే ఆశపోగొట్టుకున్నాడు, ఈ నటి దేహం మీద మమకారం పోగొట్టుకుంది…..
  – ఇది చిత్రపరిశ్రమలో ఇవాళ కొత్త సంగతి కాదు. గతంలో అగ్రనటీమణులు సైతం పోలీసులకు పట్టుబడ్డారు. తర్వాత హాయిగా నటిస్తున్నారు కూడా.
  – గతంలో ఓ అగ్రహీరో ఓ నిర్మాతపై కాల్పులు జరిపి కూడా….చట్టం పరిధినుంచి బయటపడ్డాడు. పాపం ఈ నటికి వెనకా ముందు ఎవరు లేరు కాబట్టి….హోటల్లో అడ్డంగా పట్టుబడింది. నిజంగా పోలీసులు దోషులందరినీ పట్టుకుంటే…..ఇంకా చాలా మంది దొరుకుతారు.
  – ఇక మీడియా సంగతి చెప్పేదేముంది. మన రాష్ట్రంలో మీడియా ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయింది. ఈ కేసులో బయటికి రాని సంగతి ఏమిటంటే……ఆ నటితో పాటూ దొరికిన వ్యక్తి…ఓ టీవీ ఛానెల్ యజమాని బంధువని గుసగసలు వినిపిస్తున్నాయి. బహుశా మీడియా అందుకే అతని పేరు బయటపెట్టడం లేదనుకుంటా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s