జిప్సీలు అన్న పేరు మనం తరచుగా వినం గానీ ఐరోపా దేశాల్లో ఇది చిరపరితం. వారిని ‘రోమా’లు అని కూడా పిలుస్తారు. ఐరోపా సంపన్న దేశాలు వారి పట్ల చాలా క్రూరంగా, అవమానకరంగా వ్యవహరిస్తాయి. జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు మరింత ఘోరంగా వ్యవహరిస్తాయి.
రెండేళ్ల క్రితం అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ రోమాలకు వ్యతిరేకంగా ఒక విధాన నిర్ణయం తీసుకుని వారిని దేశం నుండి తరిమి తరిమి వేధించాడు. వాళ్ళు అందించే చౌక శ్రమతో సిరులు పండించుకుంటారు గానీ వారికి కాస్త జాగా ఇవ్వాలంటే మాత్రం చచ్చినా ఒప్పుకోరు. సంపన్న వర్గాల పట్ల తనకున్న ప్రేమను దాచుకోని సర్కోజీ రోమాల భూములను, ఆస్తులను లాక్కోవడానికి వారిని సెటిలర్లుగా, అవాంఛనీయ తెగగా ముద్ర వేసి దేశంలో నీడ లేకుండా చేశాడు.
జిప్సీలు అన్న పేరుతో ప్రసిద్ధి చెందిన రోమాలు ప్రధానంగా దేశ ద్రిమ్మరులు. వారి గత చరిత్ర ఏదైనా వారిని ఎక్కడా ఒకచోట స్ధిరంగా ఉండనివ్వకపోవడం వల్లనే వారు అలా మారవలసి వచ్చిందని సామాజిక పరిశీలకులు చెప్పేమాట. చరిత్ర నిండా వీరు అనేక ఘోరాలకు, అన్యాయాలకు గురయ్యారు. హిట్లర్ పాలనలో కనీసం 1.5 మిలియన్ల మంది జిప్సీలను చంపారని తెలుస్తోంది. ఇప్పటికీ వీరిపై వివక్ష కొనసాగుతోంది.
రొమేనియా దేశానికి చెందినవారు గనుక వారిని రోమాలని పిలుస్తారు. కానీ రోమాలు/జిప్సీలు కేవలం రొమేనియా దేశానికి మాత్రమే చెందినవారు అనడానికి ఆధారాలు లేవు. వారు దాదాపు ఐరోపా దేశాలన్నింటా విస్తరించి ఉన్నారు. ఐరోపా దేశాలన్నీ కలిపి మొత్తం 1.2 కోట్ల మంది రోమా ప్రజలు ఉంటారని అంచనా. తమను తాము నాగరీకులుగా చెప్పుకునే యూరోపియన్ల గొప్పల బండారాన్ని జిప్సీల పరిస్ధితి చక్కగా విప్పి చెబుతుంది. బహుశా అందుకే వారిని తరిమికొడుతుండవచ్చు.
రోమాలు కూడా క్రైస్తవులే. రోమన్ కేధలిక్ మతాన్ని వారు అనుసరిస్తారు. కానీ ప్రధాన స్రవంతి రోమన్ కేధలిక్కు సంప్రదాయాలకు కొన్ని భిన్నమైన సాంప్రదాయాలను పాటిస్తారు. వారికి ఇష్టమైన పండుగ మేరీ పుట్టిన రోజు. మేరీ తమ రక్షకురాలని జిప్సీలు భావిస్తారు.
కన్యక మేరీ బొందితో స్వర్గానికి వెల్లిందని వారి నమ్మకం. ఆమె అలా స్వర్గానికి వెళ్ళిన రోజును Assumption Day గా వారు జరుపుతారు. విందు రోజుగా ఇతర క్రైస్తవ శాఖల వారు కూడా ఈ దినాన్ని ఆచరిస్తారట. సాధారణంగా ఆగస్టు 15 తేదీని Assumption Day/Saint Mary’s Day గా జరుపుతారు.
రొమేనియా దేశంలోని రోమా తెగ ప్రజలు వర్జిన్ మేరీ పుట్టిన రోజు సెప్టెంబర్ 8 తేదీన జరుపుకుంటున్న పండగ సంబరాల దృశ్యాలే ఈ ఫోటోలు. కొస్టెస్టి పట్నం సమీపంలో ఉండే కొండల దగ్గరకు వెళ్ళి మేరీ పుట్టిన రోజు పండుగను వారు ఆచరిస్తారు. సమీపంలోని మోనాస్టరీలో ప్రార్ధనలు నిర్వహించి అనంతరం కానుకలు పంచుకుంటూ ఆట, పాటలతో మునిగి తేలుతారు.
రోమా/జిప్సీ తెగ ప్రజల పండగ సంబరాల దృశ్యాలను బోస్టన్ పత్రిక అందించింది.
Photos: Boston, Business Insider