ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటుపై మళ్ళీ కదలిక మొదలు కావడంతో ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ కు పెద్ద చిక్కొచ్చిపడింది. తమ ఎమ్మెల్యేలను కాపలా కాసే కాపరిగా ఆయనకు కొత్త బాధ్యతలు వచ్చిపడ్డాయి.
శాసనసభలో అతి పెద్ద పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి సఫారసు చేస్తూ అందుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో ఎఎపి నేతకు ఈ అదనపు బాధ్యతలు వచ్చిపడ్డాయి.
ఈ కార్టూన్ కి రెండు అర్ధాలు చెప్పుకోవచ్చు.
ఒకటి: తోడేలు రావడం గమనించిన మేకల కాపరి చుట్టుపక్కల వారిని హెచ్చరించడానికి, తన మేకను ఎత్తుకుపోవడానికి తోడేలు వచ్చిందని వారికి తెలియజేయడానికి ‘తోడేలు, తోడేలు’ అని కాపరి అరుస్తున్నాడు. బి.జె.పి పార్టీ తోడేలు అయితే ఎఎపి ఎమ్మేల్యేలు మేకలు అన్నట్లు. తోడేలు వస్తే ఆ సంగతి అరిచి చెప్పడం న్యాయమే.
రెండు: కాపరికి తోడేలు వస్తుందన్న భయం పట్టుకుంది. అందుకని ఏ చిన్న కదలిక కనపడ్డా తోడేలు వచ్చిందని అరవడం మొదలు పెట్టాడు. నిజంగా తోడేలు వచ్చిందీ లేనిదీ అనుమానం అన్నమాట. బి.జె.పి నేతలు ఎఎపి ఎం.ఎల్.ఎ లను కొనేందుకు ప్రయత్నించకపోయినా అలా ప్రయత్నిస్తారేమోనన్న ఆందోళనతో ముందుగానే కొనేస్తున్నారు అని అరవింద్ అరవడం మరో అర్ధం.
అరవింద్ కేజ్రీవాల్ వీడియో సాక్ష్యం బైటపెట్టారు కనుక తోడేలు వచ్చిందా లేదా అన్న అనుమానం ఇక అనవసరమేనేమో. వీడియో ఫేక్ కావచ్చని, బేరం ఆడేందుకు బి.జె.పి ఢిల్లీ రాష్ట్ర ఉపాధ్యక్షుడికి అధికారం లేదని బి.జె.పి వాదిస్తున్నందున తోడేలు రాకపై అనుమానాలు ఉన్నాయని చెప్పేవారూ ఉన్నారు.
ఎవరికి కావలసిన అర్ధం వారు తీసుకోవచ్చు.
కార్టూనిస్టు మాత్రం రెండో అర్ధాన్నే సూచిస్తున్నట్లు కనిపిస్తోంది.