ఆమ్ ఆద్మీ పార్టీ/అరవింద్ కేజ్రీవాల్ పరిస్ధితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు జరిపించాలన్న లక్ష్యంతో తాము వేసిన పిటిషన్ చివరికి బి.జె.పి ప్రభుత్వం ఏర్పాటుకు దారితీయబోతోంది. అరవింద్ వెల్లడి చేసిన వీడియో దృష్ట్యా ఢిల్లీలో ఎంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అంత మంచిదని సుప్రీం కోర్టు ఈ రోజు వ్యాఖ్యానించింది. దానితో పిటిషన్ వేసిన లక్ష్యం నెరవేరకుండా పోతోంది.
తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.డి.ఏ ప్రభుత్వం ఆమోదించిన జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని పంచసభ్య రాజ్యాంగ ధర్మాసనం ఈ రోజు (సెప్టెంబర్ 9) మరోసారి పిటిషన్ పై విచారణ జరిపింది. అరవింద్ సమర్పించిన వీడియో ఆయన అనుకున్న లక్ష్యానికి వ్యతిరేకంగా కోర్టు వ్యాఖ్యానం చేయడానికి దారి తీసింది.
ఎఎపి ఎం.ఎల్.ఎ లను కొనుగోలు చేసేందుకు బి.జె.పి తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించిన ఎఎపి అందుకు సాక్ష్యంగా తాను వెల్లడి చేసిన వీడియోను సుప్రీం కోర్టుకు సమర్పించాడు. బి.జె.పి ఢిల్లీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేర్ సింగ్ తన నివాసంలో ఎఎపి ఎమ్మేల్యేలు రాజీనామా చేయడానికి బేరం ఆడిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. రాజీనామా వల్ల సభ్యుల సంఖ్య తగ్గిన సభలో మెజారిటీ రుజువు చేసుకోవడం తేలిక అవుతుందని బి.జె.పి ఎత్తు వేసినట్లుగా వీడియోను బట్టి పత్రికలు వ్యాఖ్యానించాయి.
అయితే సుప్రీం కోర్టు ఈ వీడియోను అంత సీరియస్ గా పట్టించుకున్నట్లు లేదు. ప్రభుత్వం త్వరగా ఏర్పాటు చేయకపోతే ఇలాంటి హార్స్ ట్రేడింగ్ ఇంకా కొనసాగుతుందని కాబట్టి చేయదలుచుకున్న పని త్వరగా చేయడం మేలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
“చేయాల్సిన పనులు ఎంత త్వరగా చేస్తే అంత మంచింది. లేకపోతే ఇలాంటి హార్స్ ట్రేడింగు ఇంకా కొనసాగుతుంది” అని రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న హెచ్.ఎల్.దత్తు కేంద్రం న్యాయవాది (అడిషనల్ సొలిసిటర్ జనరల్) పి.ఎస్.నరసింహ తో చెప్పారు.
ఈ సందర్భంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, రాష్ట్రపతికి రాసిన లేఖను ఎ.ఎస్.జి ధర్మాసనానికి చూపారు. అతి పెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బి.జె.పిని ఆహ్వానించడానికి అనుమతి కోరుతూ గవర్నర్ రాసిన లేఖ అది. ప్రభుత్వ ప్రక్రియ శాసన సంబంధమైనది కనుక ఇందులో కోర్టు జోక్యం చేసుకోరాదని ఎ.ఎస్.జి వాదించారు.
ఈ వాదనకు స్పందించిన జస్టిస్ హెచ్.ఎల్.దత్తు తమ ఉద్దేశ్యం కేవలం త్వరగా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా చూడాలన్నదే అని స్పష్టం చేశారు. దానికి ఎ.ఎస్.జి శాసన సంబంధ ప్రక్రియ నడవడానికి సమయం పడుతుందని కనీసం అక్టోబర్ నెలాఖరు వరకు సమయం కావాలని కోరారు. దీనికి “చాలా ఎక్కువ సమయం” అంటూ కోర్టు నిరాకరించింది.
అక్టోబర్ 10 తేదీకి ఈ విషయంపై కేంద్రం అవగాహన ఏమిటో చెప్పాలని ధర్మాసనం తదుపరి హియరింగ్ ను ఆ తేదీకి వాయిదా వేసింది.
అయితే ఎఎపి వేసిన పిటిషన్ ఉద్దేశ్యం ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపించాలని. సభలో మెజారిటీ ఉన్న తమ ప్రభుత్వం సభ రద్దుకు సిఫారసు చేసిందని, దానికి బదులుగా అసెంబ్లీని షుప్త చేతనావస్ధలో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని ఎఎపి వాదించింది. ఈ చర్య ద్వారా ఢిల్లీ ప్రజలు ప్రభుత్వం కలిగి ఉండే హక్కును కోల్పోయారని వాదించింది.
సరిగ్గా ఈ అంశం పైనే సుప్రీం కోర్టు ధర్మాసనం కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న సభకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగిన సమయం ఇంకా ఉంది. ఎఎపి పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూలిపోయింది/రద్దయింది గనుక మరొక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. అయితే ఆ ప్రభుత్వం సభలో మెజారిటీ నిరూపించుకోవాలి.
ఈ మెజారిటీ నిరూపణ కోసమే బి.జె.పి ‘హార్స్ ట్రేడింగ్’ జోలికి పోకుండా (ఇతర పార్టీల ఎం.ఎల్.ఎ లను తమవైపు ఆకర్షించే అర్ధంలో) ఎఎపి ఎమ్మెల్యేల రాజీనామా ఎత్తుగడను పన్నింది. కానీ ఎఎపి ఎం.ఎల్.ఎ ల అప్రమత్తతతో అది బెడిసికొట్టింది.
ఇప్పుడిక సభను రద్దు చేయక తప్పని పరిస్ధితి బి.జె.పి కి కూడా వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్ లేదా ఎఎపి సభ్యులు మద్దతు ఇవ్వాలి. అలా జరిగితే ప్రజల్లో పలచన కావడం తధ్యం. అలాగని ప్రభుత్వం ఏర్పాటు చేసి బల నిరూపణ చేసుకోలేకపోతే అప్పుడూ జనంలో పలచన కావలసి ఉంటుంది. కనుక సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సిఫారసు చేయాల్సిన పరిస్ధితి కేంద్ర ప్రభుత్వానికి రావచ్చు.
ఈ విధంగా చూస్తే ఎఎపి పన్నిన వీడియో వల పారినట్లే అవుతుంది. వీడియో వల్లనే ప్రభుత్వం త్వరగా ఏర్పాటు చేయాలని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కోరింది. అందుకు ఎక్కువ సమయం ఇవ్వడానికి నిరాకరించింది. చివరికి ఎఎపి పంతమే నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదో విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కంటే, ఎలాగూ లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ ఇచ్చారు గనుక, అసెంబ్లీకి కూడా జనం మెజారిటీ ఇస్తారన్న ధైర్యంతో ఎన్నికలకు కేంద్రంలోని బి.జె.పి ప్రభుత్వం సిఫారసు చేయవచ్చు.
కానీ అనుకున్నట్లుగా బి.జె.పి కాకుండా మళ్ళీ ఎఎపి పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే అది దేశంలోని అత్యంత ధనిక కుటుంబానికి ఇష్టం ఉండదు. 49 రోజుల ప్రభుత్వం లోనే రిలయన్స్ బ్రదర్స్ కు చెమటలు పుట్టించిన అరవింద్ ఈసారి పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పరిస్తే ఇంకేమన్నా ఉందా? అది అంతిమంగా దేశ రాజకీయాలను మరో మలుపు తిప్పే కీలక రాజకీయ ఘటనలకు కూడా దారి తీయవచ్చు. కనుక ఎన్నికలు జరిగితే ఎఎపి ని ఓడించడానికి బడా పార్టీలు లోపాయకారిగా ఏకమైనా ఆశ్చర్యం లేదు.
కనుక అక్టోబర్ 10 దేశ రాజకీయాలకు కీలకమైన రోజు కావచ్చు. ఆ తేదీ కాకపోతే ఈ కేసు తేలే తేదీ కీలకం అవుతుంది. చూద్దాం, ఏమవుతుందో?!