అమెరికా గూఢచర్యంపై సాక్ష్యం ఇవ్వడానికి స్నోడెన్ తమ దేశం వస్తే ఆయనను అమెరికాకు అప్పగించకపోవచ్చని స్విట్జర్లాండ్ మీడియా కధనాలు ప్రచురిస్తోంది. ఈ మేరకు స్విట్జర్లాండ్ అటార్నీ జనరల్ స్విస్ ప్రభుత్వానికి ఒక పత్రం సమర్పించారని సోన్టాగ్స్ జీటంగ్ (స్విస్) పత్రికను ఉటంకిస్తూ రష్యా టుడే (ఆర్.టి) పత్రిక తెలిపింది. అయితే ప్రభుత్వంలో ఉన్నత స్ధాయిలో దానికి విరుద్ధంగా హామీ ఇస్తే చెప్పలేమని అటార్నీ జనరల్ చెప్పినట్లు తెలుస్తోంది. అనగా స్విస్ మీడియా అంచనాకు భిన్నంగా స్నోడెన్ రక్షణకు పూర్తి గ్యారంటీ లేకపోవచ్చు కూడా.
“ఎడ్వర్డ్ స్నోడెన్ ను స్విట్జర్లాండ్ కు తెచ్చి, అనంతరం అమెరికా నుండి extradition request (అప్పగింత విన్నపం) వస్తే ఏ నిబంధనలు పాటించాలి” అన్న శీర్షికతో స్విస్ అటార్నీ జనరల్ ఒక పత్రం రూపొందించాడట. ఈ పత్రాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా సంపాదించిన పత్రికలు తాజా అంశాన్ని వెలుగులోకి తెచ్చాయి.
స్విస్ చట్టాల ప్రకారం “అమెరికా పౌరుడి చర్యలు రాజకీయ నేరం కిందికి వచ్చినట్లయితే, అమెరికా ఎక్స్ ట్రడిషన్ రిక్వెస్ట్ రాజకీయ దురుద్దేశంతో కూడి ఉన్నదని నిర్ధారించబడితే” అలాంటి వ్యక్తిని అమెరికాకు అప్పగించరాదు. కనుక ఎడ్వర్డ్ స్నోడెన్ పై అమెరికా చేస్తున్న ఆరోపణలు రాజకీయ స్వభావం కలిగినవని స్విస్ ప్రభుత్వం నిర్ణయిస్తే ఆయనను స్విట్జర్లాండ్, అమెరికాకు అప్పగించకూడదని పత్రం పేర్కొంది.
కానీ అమెరికా విన్నపం రాజకీయ దురుద్దేశంతో కూడి లేదని గానీ, స్నోడెన్ పై ఆరోపణలు రాజకీయ స్వభావం తో కూడినవి కాదని గానీ స్విస్ ప్రభుత్వం నిర్ణయిస్తే ఏం జరుగుతుంది? ఈ అంశం జోలికి మాత్రం పత్రికలు వెళ్లకపోవడం విడ్డూరం. ఒకవైపు నుండి మాత్రమే చూసి ప్రమాదం లేదు గనక స్నోడెన్ స్విట్జర్లాండ్ వచ్చి అమెరికా గూఢచారానికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చేయాలని స్విస్ పత్రికల కోరిక. ఆశ!
స్విస్ అటార్నీ జనరల్ స్నోడెన్ భద్రతకు ఉన్న ఏకైక ఆటంకం కూడా చెప్పాడు. ప్రభుత్వంలో ఉన్నత స్ధాయిలో హామీలు (commitments) ఉన్నట్లయితే గనుక స్నోడెన్ భద్రతకు హామీ లేదని ఆయన చెప్పాడు. ఇలాంటి హామీలు ఉనికిలో లేకపోతేనే స్నోడెన్ ను పిలవనంపాలని ఆయన నిజాయితీగా చెప్పాడు.
అమెరికా (ఎన్.ఎస్.ఏ) ఇంటర్నెట్ గూఢచర్యం బాధిత దేశాల్లో స్విట్జర్లాండ్ ఒకటి. 2007-08 ఆర్ధిక సంక్షోభం దరిమిలా అమెరికా ధనికుల డబ్బుకు స్విస్ బ్యాంకులు రక్షణ కల్పిస్తున్నాయని ఆరోపిస్తూ తమ పౌరుల ఖాతాల వివరాలు ఇవ్వాలని అమెరికా స్విట్జర్లాండ్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఈ ఒత్తిడికి లొంగిన స్విట్జర్లాండ్ కొందరి ఖాతాల వివరాలను ఇచ్చింది కూడా. ఈ నేపధ్యంలో అమెరికా నుండి కొన్ని జరిమానాలను కూడా ఆ దేశం ఎదుర్కొంది.
బహుశా ఇందువల్లనే ఎడ్వర్డ్ స్నోడెన్ తమ దేశం వచ్చి సాక్ష్యం ఇవ్వాలని ఆ దేశం కోరుతుండవచ్చు. ఎడ్వర్డ్ స్నోడెన్ నుండి సాక్ష్యాలను సంపాదించి వాటి ద్వారా అమెరికా బ్లాక్ మెయిలింగ్ కు చెక్ పెట్టవచ్చని స్విస్ అధికారులు భావిస్తున్నారేమో తెలియదు. అయితే ఎడ్వర్డ్ స్నోడెన్ మాత్రం తనకు తగిన రక్షణ, గ్యారంటీ ఇచ్చినట్లయితే స్విస్ వచ్చి సాక్ష్యం ఇవ్వడానికి అభ్యంతరం లేదని గతంలో ప్రకటించాడు.
తీరా స్విట్జర్లాండ్ వెళ్ళాక స్నోడెన్ ను అమెరికాకు అప్పగించారని ఖచ్చితమైన గ్యారంటీ అయితే లేదు.