స్టెర్లింగ్ చావుకొచ్చిన స్కాట్లండ్ సంబరం


‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అని సామెత. యునైటెడ్ కింగ్ డమ్ (గ్రేట్ బ్రిటన్) కరెన్సీ పరిస్ధితి ఇప్పుడు అలానే ఉంది. స్కాట్లండ్ స్వతంత్రం పట్ల స్కాటిష్ ప్రజల్లో ఆదరణ పెరిగేకొద్దీ బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ దిగజారుతోంది.

ఆదివారం జరిగిన అభిప్రాయ సేకరణలో స్కాట్లండ్ ప్రత్యేక దేశంగా విడిపోవడానికి ‘యెస్’ అంటున్న ఓటర్ల సంఖ్య మొదటిసారిగా మెజారిటీ సాధించినట్లు తేలింది. ఓటింగులో పాల్గొన్నవారిలో అటో, ఇటో చెప్పినవారిలో 51 శాతం మంది ‘యెస్’ అని చెప్పగా, 49 శాతం మంది ‘నో’ అని చెప్పారు.

ఫలితంగా యు.కె కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ 10 నెలల స్ధాయికి పడిపోయింది. యూరోల లోనూ, డాలర్ల లోనూ కూడా స్టెర్లింగ్ విలువ పడిపోయింది. డాలర్లలో ఒక పౌండ్ స్టెర్లింగ్ విలువ 1 శాతం పడిపోయి 1 పౌండ్ = 1.61 డాలర్లుగా తేలింది. యూరోలలో కూడా పౌండ్ విలువ 1 శాతం పడిపోయి 1 పౌండ్ = 1.25 యూరోలుగా తేలింది. గత 10 నెలల్లో ఇదే అతి తక్కువ విలువ అని బిజినెస్ పత్రికలు తెలిపాయి.

స్కాట్లండ్ ప్రజలు విడిపోవడానికే మొగ్గు చూపితే పౌండ్ స్టెర్లింగ్ విలువ ఇంకా పడిపోతుందని బ్రిటిష్ ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేవలం ఒపీనియన్ పోల్స్ వల్లనే స్టెర్లింగ్ విలువ ఇంత పడిపోతే అసలు విడిపోవడమే జరిగితే పరిస్ధితి తీవ్రంగా ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. విడిపోతే పౌండ్ స్టెర్లింగ్ ను స్కాట్లండ్ కరెన్సీగా ఉండబోదని నిర్ధారించి చెప్పాలని వారు సైతం ప్రధానిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

వివిధ యు.కె కంపెనీలు, బ్యాంకుల షేర్లు సైతం నష్టాల్లో నడుస్తున్నాయి. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లండ్ షేర్లు 3 శాతం పైగా పడిపోయింది. సదరన్ ఎలక్ట్రిసిటీ, స్టాండర్డ్ లైఫ్, లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ తదితర బహుళజాతి ద్రవ్య సంస్ధలు, మాన్యుఫాక్చరింగ్ కంపెనీల షేర్లు 2 శాతం నుండి 3 శాతం వరకు నష్టాలు ఎదుర్కొన్నాయి. 

తాజా పోలింగును సండే టైమ్స్ పత్రిక తరపున YouGov సంస్ధ నిర్వహించింది. ఎటూ తేల్చుకోనివారు ఇంకా ఉండడంతో బ్రిటిష్ ప్రభుత్వం పలు ఆశలు ప్రకటిస్తోంది. యు.కె వ్యాపార వర్గాలు, కంపెనీలు విడిపోతే పౌండ్ స్టెర్లింగ్ పరిస్ధితి ఏమిటో, అప్పుల విభజన ఎలా ఉంటుందో మరోసారి నిర్ధారించి చెప్పాలని ప్రధాని కామెరాన్ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. దానితో విభజనకు వ్యతిరేకంగా పలు హామీలు ఇవ్వడానికి ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా రంగంలోకి దిగుతున్నాయి.

సర్వే ఫలితాల పట్ల బ్రిటిష్ రాణి ఆందోళన ప్రకటించిందని, ఆమెతో ప్రధాని కామెరాన్ సమావేశమై చర్చించారని పత్రికలు వార్తలు ప్రచురించాయి.

‘బెటర్ టుగెదర్’ బ్యానర్ కింద విభజనకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్న బ్రిటిష్ పార్టీలు కలిసి ఉంటే స్కాట్లండ్ కు మరిన్ని ఆర్ధిక హక్కులు, స్వయం నిర్ణయాల హక్కులు కల్పిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. మరిన్ని పన్నుల హక్కులు, మరిన్ని వ్యయం చేసే హక్కులు, సంక్షేమ రాజ్యంపై మరిన్ని హక్కులు కల్పిస్తామని బ్రిటిష్ ఛాన్సలర్ (ఆర్ధిక మంత్రి) జార్జ్ ఒస్బోర్న్ ఆశలు చూపుతున్నారు.

అయితే ఈ ఆశలు ‘యెస్’ శిబిరం కొట్టిపారేస్తోంది. చివరి నిమిషంలో స్కాట్ ప్రజలకు ఇవ్వజూపుతున్న లంచం అని నిందిస్తోంది. ఇన్నాళ్లూ గమ్మున ఊరుకుని ఇప్పుడు స్వతంత్రతకు మెజారిటీ వచ్చేసరికి పరుగుపెడుతున్నారని ఆరోపించారు. నిజంగా స్కాట్లండ్ ప్రజల సమస్యలు పట్టించుకునేవారే అయితే ఇవన్నీ ముందే ఎందుకు చెప్పలేదని ‘యెస్’ పక్షంవారు నిలదీస్తున్నారు.

నెల రోజుల క్రితం ‘నో’ శిబిరం 22 శాతం మెజారిటీతో ఉండగా ఇప్పుడది పూర్తిగా హరించుకుపోయింది. ‘యెస్’ శిబిరమే 1 శాతం మెజారిటీ సాధించింది. ఓటింగుకు మరో 10 రోజులు ఉన్నందున ఈ కాలంలో ‘యెస్’ శిబిరం మరింత మెజారిటీ సాధిస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

సెప్టెంబర్ 18 తేదీన జరగనున్న రిఫరెండంలో స్కాట్లు స్వతంత్రం వైపే మొగ్గు చూపితే 300 యేళ్ళ నాటి యూనియన్ బద్దలై గ్రేట్ బ్రిటన్ కాస్తా ఒట్టి ఇంగ్లాండ్ గా మిగిలిపోతుంది. యు.కె భూభాగం మూడో వంతు కోల్పోయి రెండు వంతులే మిగులుతుంది. అంతర్జాతీయ రాజకీయాల్లో యు.కె ప్రభావం మరింత అడుగంటుతుంది.

విభజన జరిగితే స్కాట్లండ్ ఆర్ధిక వ్యవస్ధకు సొంత ఉనికి కష్టం అవుతుందని యు.కె ప్రభుత్వం ఇన్నాళ్ళు వాదిస్తూ వచ్చింది. కేవలం ఉత్తర సముద్రంలోని గ్యాస్ నిల్వలపై ఆధారపడి స్కాటిష్ ఆర్ధిక వ్యవస్ధ మనలేదని దెప్పి పొడిచింది. అయితే కొద్ది వారాల క్రితం స్కాట్లండ్ దక్షిణ తీరంలో భారీ గ్యాస్, చమురు నిల్వలు ఉన్నట్లు కనుగొనడంతో ఈ వాదన బెడిసి కొట్టింది. దాదాపు 1 ట్రిలియన్ బ్యారళ్ళ చమురు, గ్యాస్ నిల్వల వల్ల కనీసం మరో 100 సం.ల వరకు స్కాట్లండ్ కు ఢోకా ఉండబోదు. ఫలితంగా స్కాట్ ప్రజల్లో ‘యెస్’ శిబిరం పట్ల ఆదరణ అమాంతం పెరిగిపోయింది.

‘ఓడలు బండ్లగును, బండ్లు ఓడలగును’ అంటే ఇదే కావచ్చు. ‘రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం’ అంటూ వలస దోపిడీలతో, దురాక్రమణలతో ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రజలకు వారి సంపదలను దూరం చేసిన బ్రిటన్ కు తగిన శాస్తి జరుగుతోందని పాత బ్రిటిష్ వలస దేశాల ప్రజలు శపిస్తూ ఉండవచ్చు. అసలు ఓటింగ్ పూర్తయితే తప్ప ఈ శాపాలు ఆచరణ రూపం ధరించవు. 

One thought on “స్టెర్లింగ్ చావుకొచ్చిన స్కాట్లండ్ సంబరం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s