సైనిక స్ధావరం: జపాన్ లో అమెరికాకు ఎదురు దెబ్బ


ఒకినావాలో రెండో అమెరికా సైనిక స్ధావరం నెలకొల్పడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగింది. ఫుటెన్మా లోని అమెరికా సైనిక స్ధావరాన్ని ఒకినావాకు తరలించాలని అమెరికా, జపాన్ ప్రభుత్వాలు భావిస్తుండగా స్ధానిక ప్రజలు దానిని వ్యతిరేకిస్తున్నారు. నూతన స్ధావరం ఏర్పాటు చేయాలని భావించిన నాగో పట్టణ ప్రభుత్వంలో స్ధావరం వ్యతిరేకులు మెజారిటీ పొందడంతో అమెరికా ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు మార్గం సుగమం అయింది.

జపాన్ లో 50,000 కుపైగా అమెరికా సైనికులు తిష్ట వేసుకుని ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమికి గురి కావడంతో అనేక విషమ షరతులను జపాన్ పై పశ్చిమ దేశాలు రుద్దాయి. రెండు అణు బాంబులను జారవిడిచి లక్షలాది జపనీయులను బలిగొన్న అమెరికాయే జపాన్ రక్షణ కోసం అని చెబుతూ సైనిక స్ధావరాన్ని జపాన్ పై బలవంతంగా రుద్దింది. అప్పటి నుండీ అమెరికా సైనిక స్ధావరాలు జపాన్ లో కొనసాగుతున్నాయి.

జపాన్ దక్షిణ భాగంలో చివరి రాష్ట్రం (మరియు ద్వీపం) అయిన ఒకినావాలో అమెరికా స్ధావరాలు ఉన్నాయి. రెండు భారీ స్ధావరాల్లో ఒకటి ఫుటెన్మా లో ఉండగా మరొకటి నాగోలో నెలకొల్పారు. ఫుటెన్మా లోని స్ధావరాన్ని ఖాళీ చేసి దాన్ని కూడా ఒకినావాలోని నాగో పట్టణంలోకి తరలించాని జపాన్, అమెరికాలు పలు సంవత్సరాలుగా పధకం వేశాయి. కానీ స్ధానిక ప్రజల ప్రతిఘటనతో అది వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ లోపు ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా జరిగాయని తెలుస్తోంది.

అమెరికా మిలట్రీ స్ధావరం వ్యతిరేకులకు నాగో పట్టణ ప్రభుత్వానికి ఆదివారం జరిగిన ఎన్నికల్లో మెజారిటీ లభించిందని రష్యా టుడే తెలిపింది. 27 మంది సభ్యులు గల సిటీ అసెంబ్లీలో 16 మంది స్ధావరాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎట్టిపరిస్ధితుల్లోనూ అమెరికా స్ధావారానికి ఒప్పుకునేది లేదని వీరు ఆదివారం మరోసారి ప్రతిజ్ఞ చేయడంతో స్ధావరం తరలింపుపై అనిశ్చితి మేఘాలు కమ్ముకున్నాయి. ఇది నాగో ప్రజల విజయం గానూ, అమెరికా, జపాన్ ప్రభుత్వాల అపజయం గానూ పత్రికలు వర్ణిస్తున్నాయి.

దక్షిణ ఒకినావాలో ఉన్న ఫుటెన్మాలో జనసమ్మర్దం అధికంగా ఉన్న ప్రాంతంలో ఉన్నందున దానిని చిన్న పట్టణం నాగోకు తరలిస్తున్నామని జపాన్ ప్రభుత్వం చెప్పే మాట. అయితే ఫుటెన్మా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం, స్ధావారానికి వ్యతిరేకంగా ప్రజల ఆందోళనలు తీవ్రం కావడమే స్ధావరం తరలింపుకు అసలు కారణం అని తెలుస్తోంది. జపాన్ లోని అమెరికా సైనికులు స్ధానిక ప్రజలపై పలుమార్లు అత్యాచారాలకు, దౌర్జన్యాలకు పాల్పడడంతో వ్యతిరేకత ప్రబలింది.

నాగో మేయర్ సుసుము ఇనమైన్ కూడా అమెరికా స్ధావరం తరలింపుకు బద్ధ వ్యతిరేకి. తమ పట్టణంలో అమెరికా మరో స్ధావరం పెట్టడానికి వీలు లేదని ఆయన తెగేసి చెబుతున్నాడు. చైనా వల్ల ప్రమాదం ఉందనీ, ఆ ప్రమాదాన్ని నివారించేందుకే అమెరికా స్ధావరం అవసరమని జపాన్ ప్రభుత్వాలు అనాదిగా చెపుతున్న మాట. అసలు జపాన్ రక్షణ భారం అంతా తమ పట్టణం పైనే ఎందుకు మోపుతున్నారని నాగో మేయర్ సుసుము ప్రశ్నిస్తున్నాడు.

“మొత్తం జపాన్ భద్రతా భారాన్ని ఒక్క ఒకినావాయే ఎందుకు మోయాలి? అమెరికా సైనికుల ఉనికి వల్ల చైనా బెదిరిపోతున్నది కూడా ఏమీ లేదు. అయినా ఎందుకీ భారం?” అని సుసుము ప్రశ్నించడం గమనార్హం. చైనా నుండి జపాన్ లాక్కున్న దియోయు ద్వీపకల్పాన్ని తమకు తిరిగి అప్పగించాలని చైనా పలుసార్లు జపాన్ తో ఘర్షణ పడింది. ఇరు దేశాల సైనిక నౌకలు, విమానాలు అనేకసార్లు దాదాపు యుద్ధం చేసుకుంటారా అన్న స్ధాయికి వెళ్ళాయి. చైనాయే దూకుడు ప్రదర్శిస్తోందని జపాన్, అమెరికాలు ఆరోపించడం పరిపాటి. అమెరికా సైనిక స్ధావరం ఉన్నా చైనా దూకుడు ఆగకపోతే ఇక స్ధావరాలు ఎందుకన్నది సుసుము ప్రశ్న. నిజమే కదా.

ఆదివారం నాటి నాగో సిటీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 శాతం ప్రజలు ఓటింగులో పాల్గొన్నారు. సాధారణంగా ఓటింగులో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపని జపాన్ ప్రజలు అత్యధిక మొత్తంలో కదిలి ఓటు వేయడం బట్టే అమెరికా స్ధావరం పట్ల వారికి ఉన్న వ్యతిరేకతను అర్ధం చేసుకోవచ్చు.

అమెరికా స్ధావరాన్ని ఫుటెన్మా నుండి నాగోకు తరలించడానికి 8.6 బిలియన్ డాలర్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 3.1 బిలియన్లు జపాన్ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.

‘స్టేటస్ ఆఫ్ ఫోర్సెస్ అగ్రిమెంట్’ (సోఫా) ఒప్పందం కింద జపాన్ లో అమెరికా స్ధావరాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఒప్పందాన్ని విడతలు విడతలుగా పునరుద్ధరిస్తూ, కాలం పొడిగిస్తూ వస్తున్నారు. డెమొక్రాట్ పార్టీ మొదటి సారిగా 2009 ఎన్నికల్లో కేవలం అమెరికా స్ధావరాలను ఖాళీ చేయిస్తామన్న వాగ్దానంతో అధికారం చేపట్టింది. కానీ అధికారంలోకి వచ్చాక సదరు వాగ్దానాన్ని విస్మరించి సోఫా ఒప్పందాన్ని మరోసారి పొడిగించింది. దానితో ప్రభుత్వం 3 సం.లకే కుప్పకూలింది.

చైనాను నిలువరిస్తామన్న వాగ్దానంతో మరోసారి అధికారం చేపట్టిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ప్రపంచ యుద్ధం ముందరి జాతీయ సెంటిమెంట్లను రెచ్చగొట్టడంతోనే పొద్దు పుచ్చుతోంది. దానితో పాటు ఒకినావా స్ధావరాన్ని తరలించేందుకు షింజో అబే ప్రభుత్వం పలుమార్లు అమెరికాతో చర్చలు జరిపింది. దానితో నాగో ప్రజల్లో భయాందోళనలు రేకెత్తాయి. స్ధావరం నిర్మాణం వల్ల పర్యావరణం దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటామని, అమెరికా సైనికుల దుశ్చర్యలను కట్టడి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చినా నాగో ప్రజలు నమ్మలేదని ఎన్నికల ఫలితాలను రుజువు చేశాయి.

అమెరికా సైనికులతో జపాన్ ప్రజలకు ఇప్పటికీ చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఉదాహరణకి గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఒక జపాన్ మహిళపై అమెరికా సైనికులు అత్యాచారం చేశారు. ఈ అత్యాచారంపై స్ధానిక ప్రజలు ఆగ్రవేశాలతో తీవ్ర ఆందోళన నిర్వహించారు. ఆందోళనలను చల్లబరచడానికి నిందితులైన అమెరికా సైనికులను జపాన్ కోర్టులోనే విచారణ చేయవలసి వచ్చింది. విచారణలో ఒకరికి 10 యేళ్ళ జైలు శిక్ష మరొక అధికారికి 9 యేళ్ళ జైలు శిక్ష విధించారు.

ఒకినావాలో సైనిక స్ధావరం అమెరికాకు చాలా ముఖ్యం. ఇక్కడి నుండి పలు ఆసియా దేశాలను ఒక కంట కనిపెట్టడం అమెరికాకు సులువు. పలు ఆగ్నేయాసియా దేశాలతో పాటు చైనాకు చెక్ పెట్టడం ఈ స్ధావరాల లక్ష్యం. కావున జపాన్ ప్రజలకు అమెరికా సైనిక స్ధావరాల విషయంలో నిత్య సంకటం తప్పదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s