ఎమ్మెల్యేకు బి.జె.పి వెల రు. 4 కోట్లు -ఎఎపి వీడియో


Sher Singh Dagar

ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అనైతికం ఏమీ లెదంటూ ప్రకటించిన బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా అంతరార్ధం ఏమిటో ఎఎపి పార్టీ వెల్లడి చేసింది. తమ ఎం.ఎల్.ఎ లు ఇద్దరినీ కొనుగోలు చేసేందుకు బి.జె.పి ఢిల్లీ శాఖ ఉపాధ్యక్షుడు షేర్ సింగ్ దాగర్ ఒక్కొక్కరికి 4 కోట్లు ఇవ్వజూపారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సాక్ష్యంగా వీడియోను కూడా ఎఎపి విడుదల చేసింది.

ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నించడం గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ బి.జె.పి అధ్యక్షుడు తమ ప్రయత్నాలను సమర్ధించుకున్నారు. తమ పార్టీకి ఢిల్లీలో అత్యధిక సీట్లు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా ఢిల్లీ ప్రజలు తమకే మేండేట్ ఇచ్చారని అందువల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు తమకు ఉన్నదని ఆయన స్పష్టం చేశారు.

బి.జె.పి మాజీ అధ్యక్షుడు, హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కాస్త భిన్నంగా స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ తమను ఆహ్వానిస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కానీ తాము ‘హార్స్ ట్రేడింగ్’ కు మాత్రం దిగబోమని స్పష్టం చేశారు.

అత్యధిక సీట్లు దక్కిన పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, రాష్ట్రపతికి సిఫారసు చేసినట్లు వార్తలు వెలువడిన నేపధ్యంలో బి.జె.పి నేతలు ఈ విధంగా స్పందించారు.

కానీ అమిత్ షా చెప్పినట్లుగా ఢిల్లీ ప్రజలు బి.జె.పికి మేండేట్ ఇవ్వలేదు. ప్రభుత్వం ఏర్పాటుకు తగిన సీట్లు వారికి దక్కలేదు గనుక ప్రజల మేండేట్ తమకే ఉన్నదని చెప్పడం వీలు కాదు. నిజంగా అది మేండేట్ అయ్యే పనైతే మొదటిసారే ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు? ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎఎపి ని ఎందుకు డిమాండ్ చేశారు? లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మేండేట్ గా లెక్కించే పనైతే బి.జె.పి, బీహార్, యు.పి లలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయొద్దా?

రాజ్ నాధ్ సింగ్ హామీకి భిన్నంగా బి.జె.పి ప్రత్యర్ధి పార్టీల ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించడంతో బి.జె.పి ఎ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయనుందో వెల్లడి అయింది. ఎఎపి కి చెందిన ఇద్దరు ఎం.ఎల్.ఎ లను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ బి.జె.పి ఉపాధ్యక్షుడు షేర్ సింగ్ బేరాలు జరుపుతున్న వీడియోను ఎఎపి విడుదల చేసింది. సదరు వీడియోను కింద చూడవచ్చు.

 

సెప్టెంబర్ 7, ఆదివారం ఎఎపి ఈ వీడియోను తన వెబ్ సైట్ లోకి యూ ట్యూబ్ ద్వారా అప్ లోడ్ చేసింది. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు ప్రతిఫలంగా డబ్బు గానీ పదవి గానీ ఇస్తామని షేర్ సింగ్ ఆశ పెడుతున్న దృశ్యం వీడియోలో ఉన్నట్లుగా వార్తలు తెలిపాయి. డబ్బు కోరుకుంటే రు. కోట్లు ఇస్తామని బి.జె.పి నేత ఆశ చూపారని, తాము బి.జె.పి అసలు స్వభావం వెల్లడి చేసేందుకు గత నెల రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నామని ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించడం విశేషం.

బి.జె.పి నాయకుడు షేర్ సింగ్ నివాసంలోనే తాము వీడియో రికార్డు చేశామని అరవింద్ తెలిపారు. బహుశా తన ఇంట్లో అయితే ఎ భయమూ లేదని షేర్ సింగ్ భావించి ఉండవచ్చు. ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్నప్పుడూ కూడా అవినీతి అధికారులను పట్టివ్వడానికి స్టింగ్ ఆపరేషన్ లను ఎఎపి ఒక విధానంగా చేపట్టి అమలు చేసింది. ఇప్పుడు అదే విధానంతో బి.జె.పి ‘హార్స్ ట్రేడింగ్’ ను లోకానికి చూపింది. వీడియోను తాము సుప్రీం కోర్టుకు సమర్పిస్తామని అరవింద్ విలేఖరులకు తెలిపారు. 

బి.జె.పి నుండి ఈ వీడియోకు ఇంతవరకు స్పందన లేదు.

అప్ డేట్

బి.జె.పి స్పందించింది. రెండు విధాలుగా. అసలు వీడియో నిజమో కాదో అని అనుమానించింది. బి.జె.పి ఉపాధ్యక్షుడి ఇంట్లో రికార్డు చేసిన వీడియో నిజం కాదా? మరో ప్రశ్న: బి.జె.పి తరపున బేరం ఆడేందుకు షేర్ సింగ్ కి ఉన్న అధికారం ఏమిటని.ఒక రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడికి విలువ లేదని, అది అలంకార ప్రాయమేనని బి.జె.పి చెప్పదలిచిందా?

తన బేరసారాలకు హై కమాండ్ మద్దతుతో పాటు ఆర్.ఎస్.ఎస్ ఆమోదం కూడా ఉందని షేర్ సింగ్ పదేపదే వీడియోలో చెప్పారు. పైగా షేర్ సింగ్ బేరాల వల్ల లబ్ది పొందేదీ ఎవరు? బి.జె.పియే కదా. ఇక అనుమానం ఏముంది?

షేర్ సింగ్ రాణా తన పార్టీ తరపున వేసిన ఎత్తుగడ ‘హార్స్ ట్రేడింగ్’  సంప్రదాయాలకు భిన్నంగా ఉండడం విశేషం. ఆయన ప్రతిపాదన ప్రకారం ఎఎపి ఎమ్మెల్యే దినేష్ మొహానియా తన కింద ఉన్న నలుగురైదుగురు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలి. దానితో సభలో బలం తగ్గిపోతుంది. దరిమిలా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బి.జె.పికి కావలసిన మెజారిటీ సంఖ్య కూడా తగ్గిపోతుంది. అప్పుడిక ప్రభుత్వం ఏర్పాటు చేయడం బి.జె.పికి సులువవుతుంది.

ఆ విధంగా హార్స్ ట్రేడింగ్ కి పాల్పడని ఖ్యాతి కూడా దక్కుతుంది.’హార్స్ ట్రేడింగ్’ కి పాల్పడబోమని హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ గట్టి హామీ ఇచ్చింది ఇందుకన్నమాట!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s