జమ్ము & కాశ్మీర్ రాష్ట్రం గత వారం రోజులుగా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయింది. రాష్ట్ర ప్రజలు 120 మందికి పైగా ఈ వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో ఎక్కువమంది కొండచరియలు విరిగిపడడం, ఇళ్ళు కూలిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయినవారే. సైన్యం అపూర్వ సాహసంతో రక్షణ చర్యలు చేపట్టారని చెబుతున్నప్పటికీ ప్రాణ నష్టం అధికంగానే ఉంది.
వరదలు ఎంత తీవ్ర స్ధాయిలో వెల్లువెత్తాయంటే సరిహద్దు భద్రతా దళాలను సైతం అక్కడి నుండి ఖాళీ చేయవలసి వచ్చింది. 108 మంది బోర్డర్ సెక్యూరిటీ బలగాలను సరిహద్దులో నెలకొల్పిన ఔట్ పోస్టులు, ఫార్వర్డ్ పోస్టుల నుండి ఖాళీ చేశామని సైనికాధికారులు శనివారం తెలిపారు. 2,000 మంది వరకు వరదల్లో చిక్కుకున్న ప్రజలను హెలికాప్టర్ల ద్వారా సైనికులు రక్షించినట్లు తెలుస్తోంది. ఒక్క శనివారం రోజే 564 మందిని రక్షించామని అధికారులు తెలిపారు.
అత్యంత ప్రతికూల వాతావరణం నెలకొని ఉన్నప్పటికీ సైన్యం ఎదురోడ్డి రక్షణ కార్యకలాపాలు నిర్వహించినట్లు పత్రికలు తెలిపాయి. ఈ క్రమంలో వాయు బలగాలు తమ సామర్ధ్యాన్ని పూర్తి స్ధాయిలో వినియోగించారని, అత్యంత ధైర్య సాహసాలను వారు ప్రదర్శించారని పత్రికలు తెలిపాయి.
వాతావరణ శాఖ ప్రకారం ఆదివారం నుండి వాతావరణం తెరిపిడి పడవచ్చు. శనివారం వరకూ 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసాయని ఫలితంగా వాగులు, వంకలు, నదులు పరిమితికి ప్రవహించి గ్రామాలను, పట్టణాలను ఏకం చేశాయి. నిరంతర వర్షానికి కొండ చరియలు నాని ఇళ్లపైనా, రోడ్లపైనా విరిగి పడ్డాయి. అనేక ఇళ్ళు కూలిపోయాయి. రోడ్లు, పొలాల జాడ లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీరులోనూ ఇదే పరిస్ధితి నెలకొనడంతో అక్కడా 110 మంది వరకు మరణించారు.
ప్రధాని నరేంద్ర మోడి, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాలు వరద పరిస్ధితిని చర్చించారు. శనివారం హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ముఖ్యమంత్రితో శ్రీనగర్ లో సమావేశమై వరద నష్టాలను, వాతావరణ పరిస్ధితుల ప్రభావాన్ని సమీక్షించారు. గత ఆరు దశాబ్దాలలో ఈ స్ధాయి వరదలు ఎన్నడూ సంభవించలేదని అధికార వర్గాలు తెలిపాయి. రాజధాని శ్రీనగర్ సైతం భారీ వర్షాలకు మునిగిపోవడంతో హోమ్ మంత్రిని నగరంలో తిప్పి చూపించినట్లు పత్రికలు తెలిపాయి. అనంతరం హోమ్ మంత్రి కాశ్మీరు లోయ, జమ్మూలలో రెండు మార్లు ఏరియల్ సర్వే నిర్వహించారు.
రాష్ట్రంలోని నదులన్నీ ప్రమాద స్ధాయిని మించి ప్రవహిస్తున్నాయి. జీలం నదిలో మీటర్ కొలవగల అత్యధిక స్ధాయి 34 అడుగులు కాగా ప్రవాహ మీటరే కనపడకుండాపోయింది. ఎన్నడూ 27 అడుగులు దాటి ప్రవహించని జీలం నది 34 అడుగులు కూడా దాటి ప్రవహిస్తోంది. ఫలితంగా దక్షిణ కాశ్మీరు అంతా నీట మునిగింది. పుల్వామా, అనంతనాగ్, కుల్గామ్ జిల్లాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. షోపియన్ జిలాలో రాంబియారా నదిలో ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. రాజౌరి, రీశి, ఉద్ధంపూర్ జిల్లాల్లో వరద పరిస్ధితి విషమించింది. రాజౌరీలో ఓ బస్సు వరదల్లో కొట్టుకుని పోవడంతో అందులో ప్రయాణిస్తున్న పెళ్లి బృందంలో 63 మంది కొట్టుకుపోయారు. వారిలో 25 మంది శవాలు లభించాయి.
గత 5 రోజులుగా ది హిందూ, హిందూస్ధాన్ టైమ్స్, రీడిఫ్ న్యూస్ పత్రికలు ప్రచురించిన జమ్ము&కాశ్మీర్ వరద ఫొటోలివి.
Photos: The Hindu, Hindusthan Times, Rediff News
గత అరవై ఏళ్లలో కాశ్మీర్ లో ఇంతగా ఎన్నడూ వరదలు రాలేదట. నిజమే కదా. కాశ్మీర్ ఎప్పుడూ ఉగ్రవాదులు, పాక్ చర్చలతోనే వార్తలతో ఉంటుంది తప్ప….వరదలు రావడం తక్కువే.
@ శేఖర్ గారు….గత ఏడాది ఉత్తరాఖండ్ వరదలకు మాదిరే….ఈ వరదల వెనక కూడా పర్యావరణ విధ్వంసం లాంటి కారణాలేమైనా ఉన్నాయంటారా….? పైకి కనపడడం లేదు కానీ భారత్ (ప్రపంచంలో కూడా) పర్యావరణంలో రకరకాల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అటు వరదలు, ఇటు కరవులు….
-ఒకప్పుడు వరదలు వచ్చిన చోటు ఇప్పుడు కరవులు, ఏడాదంతా వర్షం లేని చోట ఒక్కోసారి హఠాత్తుగా వర్షాలు…..
చూడబోతుండే భవిష్యత్తులో రాజస్థాన్ లో కూడా వరదలు వచ్చి జనం కొట్టుకుపోయారనే వార్తలు చదవాల్సి వస్తుందేమో….!
చందు తులసి గారు,
ఈ భూ వాతావరణ అనిచ్చితినే ‘ ఎల్ నినో గా ‘ పేర్కొంటున్నారు గదా!
నిజమే తిరుపాలు గారు…మీరు సమయానికి గుర్తు చేశారు. వాస్తవానికి ఈ ఏడు ఎల్ నినో కారణంగా…..భారత్ లో కరవు పరిస్థితులు వచ్చే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. బహుశా ఆర్థిక వృద్ధి కూడా మందిగిస్తుందని అన్నారు. తీరా చూస్తే…..కాశ్మీర్ నుంచి కారంచేడు దాకా వరదలు…నిన్న బీహార్ లోకూడా భయంకరమైన వరదలు……
ప్రాణం పోకడ తెలుస్తోంది గానీ….ఈ వాన రాకడే ఇంకా అంతుచిక్కడం లేదు.