బాలికపై శివసేన నేత అత్యాచారం!


భారత దేశంలో గొప్ప హిందూ సంస్కృతి అలరారుతోందని చెప్పుకునే హిందూ సంస్కృతీ పరిరక్షకులకు దేశంలో కొదవలేదు.

వాస్తవంలో దేశ రాజధాని ‘రేప్ కేపిటల్’ గా పేరు తెచ్చుకోగా, తమను తాము సంస్కృతీ పరిరక్షక చాంపియన్లుగా ప్రమోట్ చేసుకుంటూ సమాజంపై అడ్డదిడ్డమైన దాడులకు పాల్పడే స్వయం ప్రకటిత సైనికులకు దేశ వాణిజ్య రాజధాని ముంబై అడ్డాగా మారింది.

అదిగో అలాంటి సైనికుల నాయకుడొకరు సిగ్గు విడిచి, అతి నీచ కీచక పర్వానికి దిగడంతో అభం శుభం తెలియని ఓ బాలిక గర్భం ధరించింది.

వినడానికే అత్యంత జుగుప్స కలిగిస్తున్న ఈ నీచకార్యానికి ఒడిగట్టింది శివసేన పార్టీకి చెందిన నాయకుడు. ఆయన వయసు కూడా అంత ఎక్కువేమీ కాదు. కేవలం 61 సంవత్సరాలు మాత్రమే. ఆయన పేరు వాసుదేవ్ నంబియార్.

ఈ సన్నాసి దివ్య రూపం తెలియని బాలిక వాడు నడుపుతున్న స్కూల్ లోనే 9వ తరగతి చదువుతోంది. నంబియార్, అమ్మాయిని అనేకసార్లు తనతో తీసుకెళ్ళేవాడట. అలా తీసుకెళ్లడానికి ఈ త్రాష్టుడు చెప్పిన కారణం ఏమిటో తెలుసా? “దైవదర్శనానికి” అని. తాను తలపెట్టిన అతి నీచ కృత్యానికి కూడా ఇతగాడికి దేవుడే కావలసి వచ్చాడు. కానీ ఆ దేవుడు ఎక్కడున్నాడో గానీ (తప్పలేదు మరి!) బాలికకు సాయం చేయలేకపోయాడు.

మహారాష్ట్రలో ధానే పట్టణంలోని కాశిమిరా అనే టౌన్ షిప్ లో ఈ హిందూ నాయకుడికి ఒక దేవాలయం కూడా ఉందిట. జిల్లా శివసేన పార్టీకి ఉపాధ్యక్షుడుగా పని చేస్తున్న నంబియార్ తన గుడిలోనే దేవుడిని దర్శించుకుందాం రమ్మని చెబుతూ గత ఫిబ్రవరి నెలలో పలుమార్లు బాలికను వెంట తీసుకెళ్ళాడు.

అలా తీసుకెళ్లి సమీపంలోని మీరా అనే గ్రామంలో అత్యాచారం జరిపేవాడని పోలీసులు చెప్పారు. జరుగుతున్న విషయాన్ని ఎవరికన్నా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బాలికను బెదిరించడంతో, పాపం, ఆ బాలిక కుక్కిన పేనులా ఉండిపోయింది. ఫలితంగా ఆమె గర్భం ధరించింది. ఈ వారం నెలలు నిండని శిశువును ప్రసవించింది.

బాలికకు వైద్య చికిత్స చేసిన డాక్టర్లు జరిగిన ఘోరాన్ని కాశిమిరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం (ఆగస్టు 4) నాడు నంబియార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం ఆయన్ని అరెస్టు చేసి కోర్టు ముందు ఉంచారు. స్ధానిక మేజిస్ట్రేటు నంబియార్ కి సెప్టెంబర్ 11 వరకూ పోలీసు కస్టడీ విధించారు.

నంబియార్ పైన ఐ.పి.సి సెక్షన్ 376 (అత్యాచారం), సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపు) ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. పసిపిల్లలపై అత్యాచారాల నిరోధక చట్టం (పోక్సో) లోని సెక్షన్ 4 కింద కూడా కేసు పెట్టామని వారు తెలిపారు.

శివసేన నాయకుడు గనుక ముంబై పోలీసుల్లో ఆ పార్టీకి పలుకుబడి జాస్తి కనుక కేసు ఏ రూపం ధరిస్తుందో చెప్పలేము. ఉన్నత న్యాయ స్ధానాలు జోక్యం చేసుకుని తగిన న్యాయం జరిగేటట్లు చూస్తే తప్ప ఇలాంటి కేసులను నీరు గార్చడంలో పోలీసులు సిద్ధహస్తులు.

బాలిక గర్భం ధరించి, శిశువుని కూడా కన్నందున బహుశా నీరు గార్చడానికి అవకాశం లేకపోవచ్చు. కానీ ఈ నికృష్ట దుష్టుడికి తగిన శిక్ష పడాలంటే బాలిక, ఆమె తల్లి దండ్రులు ఎన్నో అవమానాలకు, పరీక్షలకు ఎదురొడ్డి నిలబడవలసిన అవసరం రావచ్చు.

ఈ కేసులోని అతి ముఖ్యమైన అంశం హిందూ సంస్కృతీ పరిరక్షకులే, హిందూ సంస్కృతి సంగతి తర్వాత, అసలు కనీస మానవ సంస్కృతినే తుదముట్టించే పనిలో నిమగ్నమై ఉండడం. పబ్బులపై దాడులు చేస్తూ, పార్కులపై దాడులు చేసి ప్రేమికులకు దేహశుద్ధి చేస్తూ, కొండొకచో బలవంతంగా పెళ్లిళ్లు చేస్తూ హిందూ సంస్కృతిని మా గొప్పగా రక్షించేస్తున్నామని ఢంకా భజాయించేది ఈ బాపతే.

లేకపోతే దైవ దర్శనానికని తీసుకెళ్ళి మనవరాలి వయసు ఉన్న బాలిక పైన అత్యాచారం చేయడానికి ఎలా మనసొప్పుతుంది? ఒంట్లోని రక్తంలో గానీ, అలవాట్లలో గానీ, మాట్లాడే మాటల్లో గానీ, చేసే పనుల్లో గానీ ఏ కోశానా సంస్కృతి అనేది లేకపోతేనే ఇలాంటి పని చేయగలరు.

జనం చాచి కొట్టినట్టు చెప్పాలి…. ఇదే హిందూ సంస్కృతి అయితే అది మాకొద్దని! జనమే మొఖాన ఉమ్మేసి చెప్పాలి… ఇదే హిందూ సంస్కృతి అయితే, మా కొద్దు బాబోయ్, మామానాన మమ్మల్ని బతకనివ్వండి అని. జనమే కర్రుచ్చుకుని మరీ చెప్పాలి… మాకు మనిషి సంస్కృతి చాలు పొమ్మని!

5 thoughts on “బాలికపై శివసేన నేత అత్యాచారం!

  1. ఫ్యూడల్‌ సంస్కృతిలో ఒక నమ్మకముంది. చిన్న పిల్లలమీద అత్యాచారం చేస్తే తమకున్న ఎస్‌ టి డి లన్ని మాయ మై పోతాయని.ఆయుషు వృద్ది చెందుతుందని. నేను చెప్పేది ఒక ఏబై ,వంద ఏళ్ళ నాటి మాట. ఆనాటి సంస్కృతి నుండి నుండి ఈ మూర్ఖులు బైట పడలేదు కదా?

  2. సర్, గర్భం ధరిస్తే గర్భస్రావం జరిగేటట్టుగా ఔషధాలను వాడినా, అసలు గర్భమే రాకుండా పిల్స్ వేసుకున్నా దీనినుండి(పర్యవసానాలు) ఆ నంబియార్ బయటపడేవాడు కదా?
    ఆమే, గర్భంతో ఉన్నప్పుడైనా ఈ విషయం బయటికి రావచ్చును కదా!
    బిడ్డను కనేవరకు ఈ విషయం ఆ నంబియార్కు తెలియదా?
    ఇంతభయపెట్టినవాడు ఈ విషయాన్ని ఎంత తేలికగా తీసుకున్నాడా?

  3. మూల గారూ, మీరు విషయం వదిలి నంబియార్ బైటపడే మార్గం వెతుకుతున్నట్లున్నారు.

    ఏం చేసినా చెల్లుతుందనే దురహంకారం వాడి కళ్ళను కమ్మేసింది. అంత భయం ఉంటే ఆ నికృష్ట పనికి దిగేవాడేనా? వాడికి భయం లేదు. ఉన్మత్త పొరలు కమ్మినవాడికి విచక్షణ ఉంటుందా?

    అయినా మీ ప్రశ్నలు మనం చేయవలసిన ఆలోచన కాదు. మనం ఆలోచించవలసింది బాలిక భవిష్యత్తు గురించి.

  4. మూలం గారు. కామం నెత్తికెక్కినపుడు కళ్లు మూసుకుపోతాయి, ఐనా మనను అడిగే వాడు ఎవడులే అనుకుని ఉంటాడు. ఎంత స్థాయికి ఎదిగినా…(వాడిదో స్థాయి…!) ఎటువంటి బాధ్యతలో ఉన్నా, కనీసం వాటికైనా విలువ ఇవ్వకుండా, క్షణిక సుఖం కోసం దిగజారడం ఇవాళ కొత్త కాదు. తరతరాల నుంచి ఉన్నదే…

    అన్నట్లు తిరుపాలు గారు మీరు ఇచ్చిన వీడియో లింక్ చూశాను. పిల్లల ప్రదర్శన అద్భుతంగా ఉంది. మంచి వీడియో చూపించారు థాంక్స్…

వ్యాఖ్యానించండి